11ఏళ్లకే ఇంటర్ పూర్తిచేసిన హైదరాబాద్ పిల్లోడు

11ఏళ్లకే ఇంటర్ పూర్తిచేసిన హైదరాబాద్ పిల్లోడు

Monday April 17, 2017,

1 min Read

నైనా జైస్వాల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలమేథావి, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, ఎనిమిదేళ్లకే టెన్త్, పదేళ్లకు ఇంటర్, పద్నాలుగేళ్లకు పీజీ చేసిన అపమేధావి. ఆమె బాటలోనే నడుస్తున్నాడు తమ్ముడు అగస్త్య జైస్వాల్. అక్కను స్ఫూర్తిగా తీసుకుని తను కూడా 11ఏళ్లకే ఇంటర్ పూర్తి చేశాడు. మొన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సీఈసీలో 63 శాతం మార్కులతో సంచలనం సృష్టించాడు. 8 ఏళ్లకే పదోతరగతి పరీక్షలు అవలీలగా రాసి పాసైన అగస్త్య, ఇంటర్ కూడా అదే స్పీడుతో కంప్లీట్ చేశాడు.

image


హైదరాబాద్ కాచీగూడకు చెందిన అశ్విన్ కుమార్, భాగ్యలక్ష్మి తనయుడైన అగస్త్య- చిన్నప్పటి నుంచే అన్ని విషయాల్లో దిట్ట. పిట్టకొంచెం కూతఘనం అన్నట్టుగా రెండేళ్లకే 300పైచిలుకు ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఇటు నైనా గానీ, అగస్త్య కానీ ఏనాడూ స్కూలుకి వెళ్లలేదు. వాళ్లకు బడి వాతావరణమే తెలియదు. తల్లిదండ్రులే గురువులు. ఇల్లే పాఠశాల. ఓనమాల నుంచి కామర్స్ బ్యాలెన్స్ షీట్ వరకు అన్నీ పేరెంట్సే నేర్పించారు.

ఆరో తరగతి చదివే వయసుకే ఇంటర్ పూర్తిచే అగస్త్య జైస్వాల్ అక్క నైనా జైస్వాల్ స్ఫూర్తితో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేస్తానంటున్నాడు. ఐఏఎస్ కావాలన్నది తన లక్ష్యమని చెప్తున్నాడు. అక్క సహకారం, అమ్మానాన్న ప్రోత్సాహం ఇంతటి పేరు తెచ్చిపెట్టిందని అంటున్నాడు. ఇష్టపడి చదివితే కష్టమైనది ఏదీ లేదంటున్న అగస్త్య మాటల్లోనూ మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. టాలెంట్ అందరి పిల్లల్లో ఉంటుంది. దాన్ని వెలికితీయాల్సింది పేరెంట్సే అంటారు నైనా జైస్వాల్. తనలాగే తమ్ముడు కూడా పదకొండేళ్లకే ఇంటర్ పూర్తిచేయడం గర్వంగా ఉందంటోంది నైనా.

పదకొండేళ్ల అగస్త్యకు కంప్యూటర్ పరిజ్ఞానం అపారం. రెండు నుంచి మూడు సెకన్లలో కీబోర్డుపై అక్షరాలను ఏ టు జడ్ టైప్ చేస్తాడు.