బిట్స్,ఐఎస్‌బిలో చదువుపూర్తి చేసుకున్నా సంగీతంపై మమకారంఇళ్లు, ఉద్యోగాలు వదిలేసుకుని మరీ రాక్ బ్రాండ్ వైపుఇప్పుడు డివైన్ రాగా ఓ బ్రాండ్
సంగీతమే శ్వాసగా బతుకుతున్న కుర్రాళ్లంతా ఏకమైతే.. అది డివైన్ రాగా అవుతుంది. హిందీ జానపదంలో రాక్ బ్యాండ్‌ను జోడించి కొత్త ఒరవడి సృష్టిస్తోంది బెంగళూరుకు చెందిన డివైన్ రాగా బ్యాండ్. రాక్ మేళవింపుతో వీరు కూర్చిన సంగీతంలో సులువైన భాష సహా భావం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వారి సంగీతం కంటే బ్యాండ్ గురించి ఎన్నో విశేషాలున్నాయి. బ్యాండ్ సభ్యుల జీవితం, ఈ రంగంలోకి రావడం వెనుకున్న కారణం, భవిష్యత్ లక్ష్యం ఎంతో ఆసక్తికరం. బ్యాండ్ నిర్వహణ ఒక కంపెనీని నిర్వహించిన ట్టే. ఇక్కడా లాభాలు, అహం, విస్తరణ, బ్రాండింగ్, వినియోగదారు సంతృప్తి వంటి అంశాలు బ్యాండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. ఈ పరీక్షలో విజయవంతం అయ్యేవి కొన్ని మాత్రమే. అందులో డివైన్ రాగా ఒకటి.
ఎంఎస్ఆర్ఐటీలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో బుద్ద, ఆశ్రఫ్లకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2009 నుంచి లైవ్ కార్యక్రమాలను ఇవ్వసాగారు. ఆలోచన, సంగీతంపట్ల అవగాహన కారణంగా ఒక బ్యాండ్‌కు రూపకల్పన చేయాలని ఈ ద్వయం భావించారు. ఆన్లైన్లో వెతికి మృణాల్ అనే డ్రమ్మర్ను పట్టుకోగలిగారు. 2011లో కిషోర్, ఆశిష్, జై రాకతో టీం పూర్తి స్థాయి రూపాన్ని సంతరించుకుంది.
ఇతరుల సంగీతాన్ని ప్రదర్శించే బదులు సొంతంగా సంగీతాన్ని కూర్చడమే మాకు కావాలి. మా తొలి కార్యక్రమం కూడా సొంతంగా కూర్చిందే. మా సొంత సంగీతం కోసమే ఇక్కడున్నాం. ప్రేక్షకులతో అనుసంధానం కావాలంటే ఇదే అత్యుత్తమ విధానం అని అంటారు బుద్ద. మా ప్రేమనంతా సంగీతంపై కురిపిస్తాం. వ్యక్తిగత ఆర్జనేదీ లేదు. మేమంతా డివైన్ రాగా ప్రతినిధులం అని మృణాల్ చెబుతున్నారు.
దివ్యమైన బృందం..
బ్యాండ్ బృంద సభ్యులు సాధారణంగా రెండో తరం కళాకారులు, సంగీతకారులైఉంటారు. కొద్ది మంది మాత్రమే కుటుంబంలో మొదటగా సంగీతంతో పరిచయమైనవారు ఉంటారు. బుద్ద తల్లి సంగీత కళాకారిణి. ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నారు. ఆయన తండ్రి నాటక రంగ కళాకారుడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన బుద్ద తన గానంతో బ్యాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అశ్రఫ్ గిటార్ వాయించడం సొంతంగా నేర్చుకున్నారు.
డ్రమ్మర్ మృణాల్ కథ మరోలా ఉంది. ఆయన ముత్తాత భక్తి సంగీతం, తాత జానపద సంగీతం మధ్య ఇరుక్కుపోయారు. క్లాసికల్ సంగీతాన్ని తల్లి నుంచి నేర్చుకున్నారు. కానీ చాలామటుకు తాను బయటి ప్రపంచంలో చూసి నేర్చుకున్నదే. బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐఎస్బీలో ఎంబీఏ చేస్తున్నారు.
బాస్ గిటారిస్ట్ ఆశిష్‌కు సంగీతంలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏడేళ్ల క్రితం ప్రాక్టీస్ ప్రారంభించారు. ఉద్యోగాలే కాదు ఇంటినీ వదిలేశారీయన. ఎందుకంటే కుటుంబ సభ్యులకు ఈయన సంగీతాన్ని ఎంచుకోవడం ఇష్టం లేదు. ఆయన మంచితనంతో తిరిగి వారికి దగ్గరయ్యారు. అంతేకాదు తన తల్లి క్లాసికల్ సంగీతం నేర్చుకునేలా చేశారు.
కీబోర్డు ప్లేయర్ కిషోర్ చిన్న నాటి నుంచి ఈ ఉపకరణాన్ని ప్లే చేస్తున్నారు. కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఎన్ఐటీటీఐఈలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మరో ఇంజనీర్ రాహుల్ హిందుస్తానీ క్లాసికల్ మ్యూజిక్‌లో శిక్షణ తీసుకున్నారు. అయితే బిట్స్ పిలానీ గోవా క్యాంపస్‌లో చదువుతున్న రోజుల్లో మాత్రం గిటార్‌కు మళ్లారు. వాయిద్య బృందంలోనూ ఇప్పుడు అదేపని చేస్తున్నారు. బృందంలో వేణువుతో పృథ్విది ప్రత్యేక స్థానం. ఏడేళ్లుగా ఫ్లూట్‌ను నేర్చుకుంటున్నారు. ఇంజనీరింగ్, జిమ్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అతని గత చరిత్ర.
డివైన్ రాగా ఎందుకంటే..
మొదట్లో బృందం పేరు లేకుండానే కార్యక్రమాలను నిర్వహించింది. డివైన్ రాగా పేరుతో అభిమానులకు చేరువ కావడంతో అలాగే కొనసాగించారు. ఇంగ్లీషు, సంస్కతం నుంచి తీసుకున్న పదాలతో డివైన్ రాగా ఏర్పడింది. సంగీతంలో వారి కలయికను ఈ పేరు సంపూర్ణంగా వర్ణిస్తుంది. అలాగే ప్రకృతి సారూప్యతను వారి లోగో సూచిస్తుంది. డివైన్ రాగా పేరు వినడానికి ఇంపుగానూ ఉంటుందని అంటారు మృణాల్. పాశ్చాత్య సంగీతానికి రూపకల్పన చేస్తున్న సమయంలో ఈ పేరు ఖచ్చితంగా సరితూగుతుందని చెబుతారు.
అభిమానుల వరద..
భారతీయ క్లాసికల్, జానపద సంగీతంల మేళవింపుతో డివైన్ రాగా బృందం సంగీతాన్ని అందిస్తోంది. వేదికలపై ప్రదర్శన ఇచ్చేందుకు బృంద సభ్యులందరికీ అమితాసక్తి. వారి సంగీతానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. గత మూడేళ్లలో బెంగళూరు, పుణే, మంగళూరు, వెల్లూరులో ఈ బృందం 40కి పైగా ప్రదర్శనలు విజయవంతంగా ఇచ్చింది. ‘విజయగాధ నిర్మాణంలో ఉంది. ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అన్నది బృందం భావన.
చాలా బ్యాండ్స్ కళాశాల పోటీల్లో నిలిచి ప్రస్థానాన్ని ప్రారంభించినవే ఉంటాయి. డివైన్ రాగా అటువంటి కాదని అంటారు అశ్రఫ్. సంగీతం పోటీ కాదు. మాకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారాయన. హార్డ్‌రాక్ కేఫ్స్ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన గ్లోబల్ బాటిల్ ఆఫ్ బ్యాండ్స్‌లో డివైన్ రాగా పోటీ పడింది. అత్యధిక డౌన్‌లోడ్స్‌తో బెంగళూరు నుంచి వరుసగా రెండోసారి కూడా విజేతగా నిలిచింది. మొత్తంగా ప్రపంచంలో 30వ స్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్ బాటిల్ ఆఫ్ బ్యాండ్స్ టాప్-50లో హిందీ భాషకు సంబంధించిన బ్యాండ్ ఇదే కావడం గమనార్హం.
వేదిక, వీక్షకులే దీనికి కారణం. అటువంటి అవకాశం మాకు ఇప్పటి వరకు రాలేదు. నేర్చుకోవడానికి అనుభవంగా భావించి పోటీలో పాల్గొన్నాం. సంగీత అభిమానుల కోసం ప్రదర్శన ఇచ్చాం అని అంటారు బుద్ద. మేం దక్కించుకున్న స్నేహితులను చూసి, అలాగే ప్రదర్శనల్లో బ్యాండ్ పరిణతిపట్ల గర్వపడుతున్నామని చెబుతున్నారు. పాటలు రాసేప్పుడు అహం లేకుండా పనిచేస్తామని అంటున్నారు. సభ్యుల సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.
1. ఫైనాన్స్: డబ్బులు సమకూర్చుకోవడం, పెట్టుబడి, సంపాదన అత్యంత కీలకం. ప్రదర్శనలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాతి నుంచి సభ్యులు వారి జేబుల్లోంచి ఒక్కపైసా పెట్టుబడిగా పెట్టడం లేదు.
2. సరైన వేదిక పొందడం: కాలేజ్ ఫెస్టివల్స్ పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ప్రొఫెషనల్ స్థాయికి, టార్గెట్ ఆడియన్స్‌ను చేరడానికి ఇప్పటికీ సరైన వేదికల కొరత ఉంది.
3. ప్రేక్షకుల తీరు: కార్యక్రమానికి డబ్బులు చెల్లించడం ద్వారా సంగీతకారులకు సహాయం చేసినట్టుగా చాలా మంది భావిస్తున్నారు. సంగీతం అనేది వినోదం. సేవల రంగంలో ఇతర సర్వీసుల మాదిరిగానే ఇది కూడా ఒకటి. కళాకారులు తమ రంగంలో ఎంతో సేవ చేస్తున్నారు.
4. సంగీతం ఉచితం కాదు: ఉచితంగా కార్యక్రమాన్ని చేయాల్సిందిగా చాలా బ్యాండ్స్‌ను ఎన్నో వేదికలపై కోరుతుంటారు. చాలా బ్యాండ్స్ అంగీకరిస్తాయి కూడా. అయితే ఆ వేదిక మాత్రం ఇతర సర్వీసుల ద్వారా డబ్బులు పొందుతుంది. మ్యూజిక్ బ్యాండ్‌కు మాత్రం చిల్లిగవ్వ కూడా రాదు. కళాకారుల సమాజానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి వ్యవహారాలను నిరుత్సాహపర్చాలి.
అయితే దాతృత్వ కార్యక్రమాల విషయంలో వేరు. వెల్లూర్ సీఎంసీలో జరిగిన ఒక కార్యక్రమంలో డివైన్ రాగా ప్రదర్శన ఇచ్చింది. ప్రదర్శన ద్వారా వచ్చిన రూ.50,000లను దానం చేసింది.
5. సంగీతం వైపునకు ఆకట్టుకోవడం: క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్‌తోపాటు ఇతర క్రీడలకు స్పాన్సర్స్ ఉంటారు. అలాగే బాలివుడ్ సంగీతకారులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బ్యాండ్స్‌ను ప్రోత్సహించాలి. కోక్ స్టూడియో ఈ కోవలోకే వస్తుంది. ఎదుగుతున్న కళాకారుల్లో సంప్రదాయం ఉందని డివైన్ రాగా విశ్వసిస్తోంది.
1. ఎదుగుదున్న బ్యాండ్స్‌కు గుర్తింపు ఇవ్వడం.
2. ఈవెంట్ సంస్థలు, మేనేజర్లు అంతర్జాతీయ కళాకారులకు బదులుగా స్థానిక కళాకారులు, బ్యాండ్స్‌కు అవకాశం ఇవ్వాలి.
3. కళాకారుల వృత్తిని గౌరవించాలి. ఉచిత కార్యక్రమాలను నిరుత్సాహపర్చాలి
‘కళాకారులు తమ ప్రదర్శన ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. కళాకారుడికి ప్రేక్షకులపైన నమ్మకం ఉంటుంది. దేశంలో ఎదుగుతున్న బ్యాండ్స్ భవిష్యత్ బాధ్యతగల వీక్షకుల చేతుల్లో ఉంది’ అని బుద్ద అంటారు.
తొలి ఆల్బమ్ ‘ఐయామ్ డివైన్ రాగా’..
ఈ ఏడాది జూన్‌లో తొలి ఆల్బమ్‌ను ‘ఐయామ్ డివైన్ రాగా’ పేరుతో ఈ బ్యాండ్ ఆవిష్కరించింది. సంగీత అభిమానుల నుంచి ఈ ఆల్బమ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఫోక్, సోల్, రాక్ల సమ్మేళనంతో ఆల్బమ్ రూపుదిద్దుకుంది. పూర్తిగా భారతీయ సంగీతాన్ని రాక్తో జోడించినట్టు కిశోర్ తెలిపారు. మెలోడీ విషయంలో రాజీలేకుండా పూర్తిగా భారతీయ మూలాలతో సంగీతాన్ని కూర్చామని బృంద సభ్యులు అంటున్నారు. రాక్‌ను సమకాళీన శైలితో మలిచామని వివరించారు. మొత్తం ఏడు పాటలు ఇందులో ఉన్నాయి. గత మూడేళ్లుగా ఈ పాటలను వివిధ ప్రదర్శనల్లో పాడుతూనే ఉన్నారు. ఒక పాటలో గొప్ప వాగ్గేయకారుడైన అర్షద్ ఖాన్ తన ఎస్రాజ్ను పలికించడం ఆల్బమ్‌కే హైలైట్.
డివైన్ రాగా చివరగా చె ప్పేది ఒకటే.. ‘సొంతంగానే సంగీతాన్ని కూర్చాలి. వెర్రిగా అనిపించిన శబ్దం కూడా ఇంపుగా మలిచే అవకాశం ఉంది. సంగీతాన్ని సృష్టించడాన్ని కొనసాగిద్దాం’.
Stories by team ys telugu