వాచ్ మన్ కొడుకుగా రవీంద్ర జడేజా ఎన్ని కష్టాలు పడ్డాడంటే..

వాచ్ మన్ కొడుకుగా రవీంద్ర జడేజా ఎన్ని కష్టాలు పడ్డాడంటే..

Wednesday March 29, 2017,

3 min Read

రవీంద్ర జడేజాని చూడగానే చెప్పొచ్చు. పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుర్రాడని. ఆ ముఖంలో శ్రీమంతుల ఛాయలేవీ కానరావు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే జడేజా నాన్న వాచ్ మన్. కటిక పేదరికంలో పుట్టి పెరిగాడు. బాల్యం చాలా భయంకరంగా గడిచింది. చిన్నప్పటి తాలూకు జ్ఞాపకాలేవీ చెప్పుకోదగ్గవి లేవు. పదేహేడేళ్లకే అమ్మ చనిపోయింది. చెల్లి పెళ్లి బాధ్యత భుజాలపై పడింది. లక్కీగా అమ్మ చేసే నర్స్ ఉద్యోగం ఆమెకి వచ్చింది.

రవీంద్ర అనిరుథ్ జడేజా. గుజరాత్ నవగామ్ ఘేడ్ లో 1988 డిసెంబర్ 6న జన్మించాడు. కుటుంబం సాదాసీదా మధ్యతరగతి నేపథ్యం. ఒక గది మాత్రమే ఉన్న ఇంట్లో నివసించేవారు. అమ్మ పేరు లత. ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. వాళ్లు ఇచ్చిన క్వార్టర్స్ లోనే ఉండేవారు. రాజ్ పుత్ ఫ్యామిలీలో వుండే సామాజిక కట్టుబాట్ల నేపథ్యంలో, జడేజా తల్లి ఉద్యోగం చేయడం అనేది ఆ రోజుల్లో గొప్ప విషయమనే చెప్పాలి. తండ్రి అనిరుథ్ జడేజా. కుటుంబాన్ని పోషించేందుకు ఆయన చేయని పనంటూ లేదు.

image


పదేళ్ల వయసులోనే జడేజాకి క్రికెట్ మీద మక్కువ ఏర్పడింది. స్కూల్ మానేస్తే ఆట ఎక్కడ మిస్ అవుతానేమో ఒక్కరోజు కూడా ఎగ్గొట్టేవాడు కాదు. కానీ తనకంటే పెద్ద పిల్లలు గ్రౌండులో సతాయించేవారు. బ్యాటింగ్ చాన్స్ ఇచ్చేవాళ్లు కాదు. బ్యాట్ పట్టుకునే అవకాశం రాలేదని ఏడవని రాత్రి లేదు.

ఆ క్రమంలోనే మహేందర్ సిన్హ్ చౌహాన్ అనే పోలీసాయన పరిచయమయ్యాడు. అతనే జడేజా జీవితాన్ని మార్చేసింది. అతనికి క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ బంగ్లా అనే టీంకి కోచ్ కూడా. చాలా స్ట్రిక్ట్ మనిషి. పిచ్ మధ్యలో నిలబడి స్పిన్ బౌలింగ్ లో మెళకువలు నేర్పేవాడు. బంతి అనుకున్నట్టు వేసే దాకా వదిలేవాడు కాదు. మొదట్లో జడేజా ఫాస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ కోచ్ సలహాతో స్పిన్ కి మారాడు. జడేజాకు నిద్రలో నడిచే అలవాటుంది. ఆ విషయంలో కోచ్ ఎన్నోసార్లు మందలించాడు. ఒకసారైతే ఈడ్చి కొట్టాడు కూడా. మ్యాచ్ లో అత్యధిక పరుగులిచ్చేవాడు.. కానీ చివరికి వచ్చేసరికి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకునేవాడు.

పదహారేళ్లప్పుడు టీమిండియా అండర్-19 జట్టులో చోటు దొరికింది. 2008లో అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకున్న టైంలో జడేజా జట్టుకి వైస్ కెప్టెన్. 2006-07లో దులీప్ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. రంజీలో సౌరాష్ట్ర తరుపున ఆడేవాడు. 2012లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసి డొమెస్టిక్ క్రికెట్ లో చరిత్ర క్రియేట్ చేశాడు. 23 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన 8వ భారతీయ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

2008-09 రంజీ సీజన్ లో మొత్తం 739 పరుగులు చేసి, 42 వికెట్లు తీశాడు. ఆ దెబ్బతో అంతర్జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో జడేజా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఆల్ రౌండర్ ప్రతిభతో టీమిండియా అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజా విలువైన ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఆ టోర్నీలో అతనే అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాడు. 12 వికెట్లతో టాప్ బౌలర్ గా నిలిచాడు. 2013 ఆగస్టులో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించింది జడేజానే.

2008 ఐపీఎల్ తొలి సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ టీం జడేజాని తీసుకుంది. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో జడేజా పెర్ఫామెన్స్ పీక్ లెవల్లో ఉంది. ఆ టైంలో జడేజాను తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ తో పోలుస్తూ సోషల్ మీడియా ఆకాశానికెత్తింది. టీమ్ మేట్స్ ధోనీ, రైనా, అశ్విన్ జడేజాను ఉద్దేశించి ఫన్నీ ట్వీట్లు కురిపించారు.

ఎవరు ఎన్ని రకాలుగా ప్రశంసించినా, విమర్శించినా అన్నీ చెప్పుకునే ఏకైక నేస్తం అతని సోదరి. ఏ విషయమైనా ఇప్పటికీ ఆమెతోనే షేర్ చేసుకుంటాడు. చెల్లి కోసం ఖరీదైన కానుకలు తీసుకెళ్తుంటాడు. నాన్న కోసం కూడా.

కోచ్ మహేంద్రసిన్హ్ ఆనాడు చెంప చెళ్లుమనిపించకపోతే ఈనాడు ఈ స్థాయిలో వుండేవాడిని కాదని జడేజా గర్వంతో చెప్తుంటాడు. ఆయన నేర్పిన క్రమశిక్షణే నన్ను ఇంతటివాడిని చేసిందని అంటాడు.