గ్రామాల ముంగిట్లో వెలుగుల గౌరి

గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరీ అగర్వాల్ప్రగతి బాటలు పరుస్తున్న స్కిల్డ్ సమారిటన్ సామాజిక సేవా సంస్థగ్రామాల్లో సామాజిక, ఆర్థిక , నాగరిక చైతన్యం, స్వయం సమృద్ధిసరికొత్త ప్రాజెక్ట్ లతో ముందుకెళుతున్న స్కిల్డ్ సమారిటన్

గ్రామాల ముంగిట్లో  వెలుగుల గౌరి

Wednesday June 24, 2015,

5 min Read

''స్కిల్డ్ సమారిటన్'' సామాజిక సేవ సంస్థ గ్రామాల ముంగిట్లో వెలుగులు నింపుతోంది. ‘ స్కిల్డ్ సమారిటన్ ’ అంటే ఫలితాన్ని ఆశించకుండా అభాగ్యులను ఆదుకునే నైపుణ్యమున్న ప్రదాత అని అర్థం. ప్రపంచంలో మన చుట్టూ , మారుమూల గ్రామాల్లో దుర్భరమైన జీవితాలుంటాయి. గత్యంతరం లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు ఎందరో వుంటారు . పగలు, రాత్రి తేడా తెలీని బతుకులుంటాయి. కరెంటు సౌకర్యం మాట దేవుడెరుగు.. కనీసం తినడానికి తిండి లేని కుటుంబాలూ ఎన్నో. ఇలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది గౌరీ అగర్వాల్. అందుకే చదువును, ఉద్యోగాన్నీ వదిలి సామాజిక సేవా సంస్థను ప్రారంభించింది. స్కిల్డ్ సమారిటన్ పేరుతో స్థాపించిన ఆ సంస్థ ఇప్పుడు ఎందరో గ్రామీణుల జీవితాలకు చేదోడువాదోడుగా మారింది.

గౌరీ అగర్వాల్ ఫైనాన్స్, ఎకనామిక్స్ స్టూడెంట్. బ్రిటన్‌లోని వార్ విక్ యూనివర్సిటీలో చదివింది. అందులో భాగంగా ఓ పరిశోధనా ప్రాజెక్ట్ కోసం స్వచ్ఛంద సంస్థతో కలిసి పెరూలోని ట్రుజిల్లోలో గడిపింది. ఏ ఆధారమూ లేకుండా మురికివాడల్లో ఒంటరిగా మిగిలిన మహిళలకు చిన్న మొత్తాలలో అప్పులివ్వడం, వారి భద్రతకు భరోసాగా నిలవడం ఆమె చేయాల్సిన విధి. మొదట్లో దేశానికి ఇలాంటిదే ఏదో ఒకటి చేయాలని అనుకుంది. కానీ... ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో చేరింది. కానీ అందులో సంతృప్తి కలగలేదు. సామాజిక అభివృద్ధి సాధించాలంటే మొదట తను చేస్తున్న ఉద్యోగానికి ఎలాంటి న్యాయం చేయలేదని భావించింది. అందుకే ఓ చేత్తో ఫారిన్ డిగ్రీ , మరో చేత్తో కొంత డబ్బును పట్టుకుని బయటకొచ్చింది.

సిరోహిలో  పిల్లలతో గౌరి

సిరోహిలో పిల్లలతో గౌరి


మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లో దుర్భరమైన జీవితాన్ని భరించలేక చేసుకునే ఆత్మహత్యలంటే పెద్దగా పట్టించుకునేది కాదు గౌరీ. తనకు తెలిసిన జీవితం ఒకటే. చేతిలో డబ్బున్నప్పుడు రివ్వున ఫారిన్ టూర్లకు ఎగిరిపోవడం. టోక్యో లాంటి విలాసవంతమైన నగరాలను చుట్టేయడం. ఇక చేసే పనైతే ఎంతో విసుగు కలిగించేది తనకు. ఫైల్స్ , ఎక్సెల్ షీట్లపై చేసే పని చాలా విసుగనిపించింది. అదే చివరకు అసహ్యమేసింది. అందుకే ఈ గందరగోళానికి గుడ్ బై చెప్పాలని చేస్తున్న ఉద్యోగం నుంచి తప్పుకుంది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ తను వెళ్లే దారి ఎక్కడికో తెలీదు. ఏం చేయాలో అస్సలు తెలీలేదు. ఎలాగైతేనేం తన సరికొత్త ప్రయాణంలో మొదటి మజిలీ ఎలాన్ అడ్వంచర్స్‌తో ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తో కలిసి ఆమె గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకం గురించి ప్రచారం నిర్వహించే కార్యక్రమాలు చేపట్టింది. ఈ గమనం.. గౌరీకి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని, భారత దేశంలో వాస్తవ గ్రామీణ పరిస్థితులను తెలిసొచ్చేలా చేసింది.

నీటమునిగిన క్వారీలే పర్యాటక కేంద్రాలు

తనకు తెలిసిన కొంతమంది స్నేహితులతో కలిసి హర్యానాలోని ఫరీదాబాద్ దగ్గర్లో వుండే గ్రామాలకు వెళ్లింది గౌరీ అగర్వాల్. కొంతమంది గ్రామస్తులను కలిసింది. అక్కడ సమర్థవంతులైన నాయకులు లేరు. స్వచ్ఛంద సంస్థల సాయం అస్సలు అందదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకుంది. అదే సిరోహీ గ్రామం. ఉమ్మడి కుటుంబాలు, చాలీచాలని సౌకర్యాలు, చిన్నా చితకా పనులతో నెట్టుకొచ్చే గ్రామస్తులు. పైగా ఆ ఊరికి సరైన రోడ్డు మార్గం, కరెంటు సౌకర్యం కూడా లేదంటే ఆ గ్రామ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2012 జులై మధ్యలో గౌరీ సిరోహీ గ్రామంతో మెల్లగా సంబంధ బాంధవ్యాలను పెంచుకుంది. అక్కడ స్థానికులు బాగా పరిచయమయ్యారు. సవాన్ అనే ఓ గ్రామస్థుడు తొలిసారి పరిచయమయ్యాడు. అందుకే ముందుగా ఆ కుటుంబాన్నే గౌరీ అగర్వాల్ దత్తత తీసుకుంది. సిరోహి గ్రామంలో మొత్తం 3 వేల 5 వందల మందికి పైగా జనాభా వుంటారు. సుమారు 366 ఇళ్లు వుంటాయి. అక్కడున్న 80 నుంచి 90 శాతం మంది ముస్లిం మతానికి చెందినవాళ్లు. గనుల తవ్వకాలపై జీవితం గడిపేవాళ్లు. క్వారీ పనులు లేనప్పుడు తక్కువ మొత్తాలకు నిలకడలేని ఉద్యోగాలను చేస్తూ వస్తుంటారు. ఆ క్వారీలు వర్షాకాలంలో నీళ్లతో నిండిపోయేవి. దీంతో అవన్నీ చెరువుల్లా కనిపించేవి. ఇవన్నీ చూడటానికి ఎంతో అందంగా కనిపించేవి. ఇదే తనలో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టేలా చేసింది. తను పనిచేస్తున్న పర్యాటక సంస్థ ద్వారా టూరిస్టుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఆ అందాలను ఎందుకు చూపించకూడదని అనుకుంది.

ఇదే విషయాన్ని గౌరి ఆ గ్రామస్తులకు చెప్పింది. అయితే ఆమె ఆలోచనకు మొదట్లో అనుమానాలే తోడయ్యాయి. కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామాల్లోకి పర్యాటకులు రావడమేంటని అనుకున్నారంతా. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన వారు, కొందరు కొత్త వారితో గౌరీ చిన్న పర్యాటక కార్యక్రమాన్నే ఏర్పాటు చేసింది. తెలిసిన వాళ్లు, తెలీని వాళ్లు ఇలా మొత్తం కలుపుకుంటే పదిమంది ముందుకొచ్చారు. ఢిల్లీకి దగ్గరగా వుండే సిరోహీ గ్రామానికి పర్యాటకులు రాగానే.. వారికి కావాల్సిన వసతులు, భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇలా ఒక్కొక్కరి నుంచి 15 వందల రూపాయలు వసూలు చేసింది. పర్యాటకంలో కొత్త అనుభూతిని అందించాలని వారికి సహజసిద్దమైన ఆహారం, నీరు అందించింది. అలా 2012 లో స్కిల్డ్ సమారిటన్ ఫౌండేషన్( Skilled Samaritan Foundation (SS) )స్థాపన జరిగింది.

గ్రామీణుల నైపుణ్యానికి అబ్బురపడింది

గ్రామీణులతో బంధం ఏర్పరుచుకున్నాక వాళ్ల జీవితాలను మార్చాలని అనుకుంది గౌరీ అగర్వాల్. తామూ సంపాదించగలమన్న ధీమా వాళ్లలో కనిపించేలా చేసింది. గ్రామీణ మహిళలు వ్యర్థపదార్థాలు, కర్రలతో అందమైన వస్తువులను తయారు చేయడం చూసింది. అప్పుడే ఇంటికి సంబంధించిన అలంకరణ వస్తువుల పై దృష్టి మళ్లింది. పర్యావరణ హితమైన వస్తువులతో అలంకరణ సామాగ్రిని తయారు చేయడమెలా అనే ఆలోచన పురుడు పోసుకుంది. వాటికి మరిన్ని మెరుగులు అద్ది ఫేస్ బుక్ ద్వారా అమ్మకాలు జరిపింది.

అలా వ్యాపారాన్ని సవాలుగా తీసుకుని కొన్ని జయాలను మరికొన్ని అపజయాలను సరిచూసింది.

సవాళ్లు వున్నప్పుడే ఎస్ఎస్( స్కిల్డ్ సమారిటన్ ) చిన్న చిన్న విజయాలను సొంతం చేసుకుంది. ఈ సామాజిక సంస్థ ద్వారా సాధించిన పెద్ద విజయం.. గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ను విజయవంతంగా అమలు చేయడం. ఒకప్పుడు కరెంటు కూడా లేని గ్రామంలో ఇప్పుడు సోలర్ వెలుగులు విరజిమ్మాయి. కొందరు ఇంజినీర్ల సహకారం, బెక్టెల్ కార్పొరేషన్, నేషనల్ ట్రైనింగ్ అండ్ పవర్ ఇన్‌స్టిట్యూట్ కు చెందిన విద్యార్థులతో ఎస్ఎస్ చేతులు కలిపింది. ఆరు నెలల వ్యవధిలో మూడు దశల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను సిరోహి గ్రామంలో అమలు చేసింది. తొలి దశలో 366 ఇళ్లకు గాను 50 గృహాలు విద్యుదీకరించారు. 2013 సెప్టెంబర్ వచ్చే నాటికి మిగిలిన 2316 గ్రామాలు కూడా విద్యుత్ వినియోగంతో కళకళలాడాయి. ఎస్ఎస్ సంస్థ ప్రతి ఇంటి నుంచి నెలకు 70 రూపాయలు వసూలు చేస్తోంది. అది అభివృద్ధి నిధిగా ఏర్పాటు చేసి .. సోలార్ పవర్ సిస్టమ్ సక్రమంగా అమలయ్యేందుకు ఆ డబ్బును ఖర్చు చేస్తోంది.

క్వారీ దగ్గర గ్రామీణ మహిళలతో  గౌరి

క్వారీ దగ్గర గ్రామీణ మహిళలతో గౌరి


ప్రస్తుతం స్కిల్డ్ సమారిటన్ ఫౌండేషన్ ద్వారా పర్యావరణ హితమైన కార్యక్రమాలను ఆదర్శవంతంగా వినియోగించడంలో సిరోహి గ్రామం ముందుంది. ప్రస్తుతం తను చదివిన వార్ విక్ యూనివర్సిటీతో కలిసి ఎస్ఎస్ ఫౌండేషన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపే ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందడుగు వేస్తోంది. ఇందులో భాంగంగానే మట్టి కుండలో కుండను పెట్టి రిఫ్రిజిరేటర్ సిస్టమ్‌ను రూపొందించారు. ఇది చిన్న సైజు ఫ్రిజ్ లా పనిచేస్తోంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇందులో నిల్వ చేసుకోవచ్చు. 1994 లో నైజీరియాకు చెందిన పాలిటెక్నిక్ అధ్యాపకుడు ఇలాంటి వస్తువును అభివృద్ధి చేశారు. దీన్ని జీర్‌గా పిలిచారు. ఇలా గ్రామీణుల్లో మనో ధైర్యాన్ని నింపి తనకున్న సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో వాళ్ల జీవితాలనే మార్చేందుకు ప్రయత్నిస్తోంది గౌరీ.

వచ్చే ఏడాది సిరోహీతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా స్వయం సమృద్ధి గల ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికల్ని సిద్ధం చేసింది. గౌరీ అగర్వాల్ కు కొన్ని సంస్థలు, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు అండదండగా నిలిచాయి. తన బృందంలోని కార్తీక్ శర్మ, తరుణ్ నందాలతో కలిసి బృహత్తరమైన సేవలను అందించాలని , గ్రామీణుల్లో సామాజిక , ఆర్థిక, నాగరిక చైతన్యాన్ని పెంపొందించేలా చేయాలని దృఢ నిశ్చయంతో వుంది. తన ఆలోచనల్ని అమలు పరిచేందుకు విద్యార్థులు, కార్పొరేట్ ఉద్యోగుల సాయాన్ని కూడా పొంది ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తోంది.