సర్కారీ బడిలోనే చదవాలని ఈ ఊరి ప్రజల తీర్మానం అభినందనీయం

సర్కారీ బడిలోనే చదవాలని ఈ ఊరి ప్రజల తీర్మానం అభినందనీయం

Friday June 16, 2017,

2 min Read

మొన్న ఒక సర్కారీ టీచరమ్మ పిల్లల చదువు కోసం నగలు తాకట్టుపెట్టిన సంగతి తెలిసి మనసారా ఆమెను అభినందించాం. ఇది కూడా అలాంటి వార్తే. కాకపోతే ఇక్కడ గ్రామస్తులను మెచ్చుకోవాల్సిన విషయం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలల నీడ కూడా తాకరాదని ఆ ఊరి ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందరూ ఒకేమాట మీద ఉండి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపాలని నిర్ణయించారు. ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తే యాభైవేల వరకు జరిమానా కూడా విధిస్తామని సామూహిక కట్టుబాటు విధించుకున్నారు.

image


జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామం. పేరుకు చిన్న ఊరే అయినా ఈ గ్రామస్తులు మనసు ఆకాశమంత విశాలమైంది. ఈ రోజుల్లో పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు అమ్ముకుని, అవసరమైతే ఊరు విడిచి పట్నం వస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ ఊరి ప్రజలు తీసుకున్న నిర్ణయం పదిమందికి ఆదర్శప్రాయంగా మిగిలింది. ఆరు నూరైనా, ఎంత కష్టమైనా, తమ పిల్లలను మాత్రం సర్కారీ బడిలోనే చదివించాలని తీర్మానించారు. ఒకరుకాదు ఇద్దరు కాదు.. గ్రామంతా ఇదే మాటపై కట్టుబడి ఉంది. పిల్లల్లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న ఈ రోజుల్లో, గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది.

డ్రాపవుట్లు పెరిగి, ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న సంఘటనలు ఆ గ్రామంలోని పెద్దలను కదిలించింది. దీంతో వారంతా కలిసి ఒక తీర్మానం చేశారు. ప్రైవేట్ స్కూల్ వద్దు.. గవర్నమెంట్ స్కూల్ ముద్దు అనే నినాదంతో ముందుకు వచ్చారు. ఇకపై ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించారు. ఎవరైనా అతిక్రమిస్తే 50వేల జరిమానా కూడా విధించాలని తీర్మానించారు.

ఊరి ప్రజల తీర్మానంతో ఇప్పుడు పోతారం ప్రభుత్వ పాఠశాల పరిస్థితి మారింది. అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. పాఠశాల కోసం గ్రామస్తులు పడుతున్న తపన ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి రగిల్చింది. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులను గొప్ప పౌరులుగా తయారు చేస్తామంటున్నారు టీచర్లు.

ప్రతి ఒక్కరు కాన్వెంట్ చదువుల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో పోతారం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం.