కార్పొరేట్ ఉద్యోగం వదిలి కెమెరా నమ్ముకున్న ఇంజినీర్లు

ఉద్యోగం వదిలేసి కెమెరా పట్టుకున్న చంద్రు..సొంతగానే ఫొటోగ్రఫీ నేర్చుకున్న శరణ్‌రాజ్..ఫోజులిచ్చే తీయించుకోవడం కాదు..సహజమైన ఫీలింగ్స్‌ని క్లిక్ మనిపించడమే కాండిడ్ ఫొటోగ్రఫీ..

కార్పొరేట్ ఉద్యోగం వదిలి కెమెరా నమ్ముకున్న ఇంజినీర్లు

Sunday September 06, 2015,

4 min Read

నేను చిన్నపుడు బొమ్మలన్నిటినీ భాగాలుగా విడదీసేవాడిని. అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడంపై నాకు విపరీతమైన ఆసక్తి ఉండేది. మళ్లీ ఆ ముక్కలన్నిటినీ ఒక నిపుణుడి మాదిరిగా తిరిగి అమర్చడం నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. నా చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువు నాకు ఎంతో ఆసక్తిని కలిగించేది. అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటి వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటనే ప్రశ్నలు నాకు తరచుగా వచ్చేవ” ని చెబుతారు ఫోకజ్ స్టూడియోస్ ఫౌండర్ చంద్రు భారతీ

చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఈ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ స్టార్టప్‌ని... శరణ్‌రాజ్ అన్నామలైతో కలిపి ప్రారంభించారు చంద్రు. సాధారణంగా పెళ్లిళ్లలో ఫోజులిచ్చి తీసే ఫొటోలు కాకుండా... ఎవరి పనుల్లో వారున్నపుడు సహజమైన ఫీలింగ్స్‌ని కాప్చర్ చేసే కాండిడ్ ఫొటోగ్రఫీ... ఫోకజ్ స్టూడియోస్ ప్రత్యేకత.

ఈ తరహా కాండిడ్ ఫొటోగ్రఫీపై తమ ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉన్నాయనే విషయం అర్ధమయ్యాక.. ఈ వెంచర్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు శరణ్‌రాజ్, చంద్రులు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఈ తరహా ఫొటోలు చూడముచ్చటగా ఉంటాయి. మొదట్లో ఒకో పెళ్లికి రూ. 15 వేలు ఛార్జ్ చేసిన వీరు.. ఇప్పుడు రూ. 1.25 నుంచి రూ. 15 లక్షలు తీసుకుంటున్నారు. ఇంతగా ఎదగడంలో.. ఫోకజ్ స్టూడియోజ్‌కోసం వీరు పడిన కష్టం చాలా ఉంది. చెన్నైలోని అత్యుత్తమ కాండిడ్ ఫొటోగ్రాఫర్లుగా వీరిద్దరికి గుర్తింపు ఉంది.

కార్ మెకానిక్ కొడుకు

సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు చంద్రు. తండ్రి ప్రకాశం రాజు కార్ మెకానిక్ కాగా... తల్లి తెన్‌మోజీ గృహిణి. టెన్త్ క్లాస్ చదువుతున్నపుడు అడోబ్ ఫొటోషాప్ విపరీతంగా నచ్చేసింది చంద్రుకి.

“నాకు ఫొటోషాప్ ఎంతగా నచ్చిందంటే.. దానిపై ఓ బుక్ కొనుక్కొచ్చి చదివి బేసిక్స్ నేర్చుకున్నాను. డిజైనింగ్, ఎడిటింగ్ టెక్నిక్స్ సొంతగానే ట్రైనింగ్ పొందాను. ఓ స్నేహితుడు తన కంప్యూటర్ ఉపయోగించుకునేందుకు నాకు అనుమతినిచ్చాడు. రోజూ గంటలకొద్దీ ప్రాక్టీస్ చేయడంతో.. మంచి డిజైనర్‌గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేద”ని చెప్పారు చంద్రు.

ఆ తర్వాత సేలంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యసించారు చంద్రు. అనేక మల్టీ నేషనల్ కంపెనీల్లో అవకాశాలు వచ్చినా.. తాను సృజనాత్మక రంగంలోనే ఎక్కువగా రాణించగలలని, కార్పొరేట్ ప్రపంచంలో తాను నెగ్గుకురావడం అంత తేలికకాదనే విషయం ఇతనికి తెలుసు. అందుకే డిజిటల్ కంప్యూటర్ యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈయన చేసిన తొలి ఉద్యోగం ఓ ఫొటోగ్రఫీ స్టూడియోలో ఫొటోషాప్ డిజైనర్. ఈ ఉద్యోగం చేస్తూనే యానిమేషన్ కోర్స్ కూడా పూర్తి చేశారు చంద్రు. రిలయన్స్ మీడియా వర్క్స్‌లో సీజీ ఆర్టిస్ట్‌గా లభించిన ప్లేస్‌మెంట్... చంద్రుకు తొలి ఫుల్ టైం జాబ్.

“ఈ ఉద్యోగం వచ్చాక... అవసరమైనవన్నీ సర్దుకుని ముంబై వెళ్లిపోయాను. ఈ జాబ్ చేస్తూనే పలు ఆసక్తికర విషయాలు తెలుసుకోగలిగాను. ప్రతీనెలా ఖచ్చితమైన మొత్తం జీతం రూపంలో వచ్చేది. ఈ డబ్బులు నా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలునుంచి గట్టెక్కించడానికి ఉపయోగపడ్డాయి. ఈ సమయంలో ఫొటోగ్రఫీపై మక్కువ మరింతగా పెరిగింది” అన్నారు చంద్రు.

అప్పటికి తన లక్ష్యం ఏంటో తెలుసుకోగలిగారు చంద్రు. ఉద్యోగం వదిలేసి కాండిడ్ కం ఆర్టిస్టిక్ ఫొటోగ్రఫీలు నిర్వహించే స్టూడియో ప్రారంభించారు.

“ఉద్యోగాన్ని వదిలేసి సొంత వెంచర్ ప్రారంభించే ధైర్యాన్నిచ్చింది నాపై ఉన్న నాకున్న నమ్మకమే. అయితే వెంచర్ కోసం నేను పెట్టగలిగిన బడ్జెట్ అతి స్వల్పమైనదే”అన్నారు చంద్రు.

స్నేహితుడి పెళ్లిలో తీసిన ఫొటోలే ఇతని మొదటి ప్రాజెక్ట్. లైట్, కలర్స్, యాంగిల్స్ ఇలా అన్నిటిలోనూ ప్రయోగాలు చేసేందుకు తగిన అవకాశం కలిగింది ఈ ప్రాజెక్ట్ ద్వారా.

ఫోకజ్ స్టూడియోస్ టీం

ఫోకజ్ స్టూడియోస్ టీం


ఫొటోగ్రఫీతో శరణ్‌రాజ్ ప్రయాణం

ఫొటో స్టూడియో వరకూ చేరడంలో శరణ్‌రాజ్ ప్రయాణం కొంత భిన్నంగా ఉంటుంది. చదువు రీత్యా ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ అయిన ఈయన... ఓ స్నేహితుడు కొన్న డీఎస్ఎల్ఆర్ కేమెరా ద్వారా ఫొటోగ్రఫీ వైపు టర్న్ అయ్యారు.

“ఫొటోగ్రఫీపై నాకున్న ఆసక్తి చివరకు... ఓ వ్యాపకంగా మారిపోయింది. దీనికోసం ఫొటోలు తీయడంలో నాకు నేనే ట్రైనింగ్ ఇచ్చుకున్నాను. ఇందులో నాకెంతో ఆనందం కలిగేది. పలు రకాల కెమెరాల గురించి తెలుసుకున్నాను. అంతే కాదు.. ఫొటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ పొందాన”ని చెప్పారు శరణ్‌రాజ్.

ఓ స్నేహితుడి పెళ్లిలో తీసిన కాండిడ్ పిక్చర్స్ ద్వారా... ఈ తరహా ఫొటోగ్రఫీలో తాను రాణించగలను అనే విషయం శరణ్‌రాజ్‌కి అర్ధమైంది. తర్వాత చంద్రుతో పరిచయం కావడం.. ఫోకజ్ స్టూడియోస్ ప్రారంభించడం జరిగిపోయింది.

ఇప్పటివరకూ విభిన్న సంస్కృతులకు చెందిన వారి పెళ్లిళ్లలో షూటింగ్ చేశారు వీరిద్దరూ. విదేశాలకు వెళ్లి మరీ కొన్ని ప్రాజెక్టులను చేపట్టడం విశేషం. ఇలా పారిస్, లండన్, బ్యాంకాక్‌లను కూడా చుట్టేశారు ఈ కో ఫౌండర్స్.

“మా క్లయింట్లను సంతోషంగా ఉంచడమే మా లక్ష్యం, ఇందుకోసం ఫొటోల క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడేవారం కాదు. నిజానికి ఫొటోగ్రఫీ అనేది ఒక కళ. మేం చేసే ప్రయోగాలను మేం ఎంతో గౌరవిస్తాం” అని చెప్పారు చంద్రు.

ఫోకజ్ స్టూడియోస్ ప్రారంభం

ఫొటోగ్రఫీ వృత్తి అంటే.. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. అందుకే మార్కెట్లో అత్యుత్తమ ఫొటోగ్రాఫర్స్‌గా పేరు తెచ్చుకునేందుకు... ప్రతీ ప్రాజెక్ట్‌లోనూ తమ టాలెంట్‌ను ఉపయోగించేవారు. మార్కెట్లో లభ్యమయ్యే లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ నుంచీ.. ఆ తర్వాత ప్రాసెసింగ్ కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్ వరకూ.. ప్రతీ విషయంలో అత్యుత్తమమైనవే ఎంపిక చేసుకునేవారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండేవారు. ఎడిటింగ్ విషయంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందడం విశేషం.

“మేం ప్రాజెక్ట్ ప్రారంభించినవుడు మాకు సొంత వెబ్‌సైట్ కూడా లేదు. అయితే కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే మాకు అనేక ప్రాజెక్టులు వచ్చేవి. ఇలా మా ప్రయాణం చాలాకాలం పాటు కొనసాగింది. ప్రస్తుతం చెన్నైలో టాప్ 3 ఫొటోగ్రాఫర్లలో మేం కూడా ఉన్నాం. మాకు లభించిన ఫీడ్‌బ్యాక్, ప్రోత్సాహం మమ్మల్ని ఇంత దూరం నడిపించింది. కొత్త విధానాల్లో వ్యాపారం నిర్వహించేలా ప్రోత్సాహం లభించింద”ని చెప్పారు చంద్రు.
ఫోకజ్ స్టూడియోస్ తీసిన ఒక ఫొటో

ఫోకజ్ స్టూడియోస్ తీసిన ఒక ఫొటో


సవాళ్లు

వెంచర్ ప్రారంభించిన కొత్తలో.. ఫోజులిచ్చి తీసే ఫొటోలు కాకుండా... ఇలా కాండిడ్ ఫొటోగ్రఫీపై ప్రజలను ఒప్పించడానికి కొంత కష్టమైంది అంటారు చంద్రు, శరణ్‌రాజ్‌లు. మన దేశంలో ఈ కాన్సెప్ట్ కొత్తది కావడమే దీనికి కారణంగా చెప్పచ్చు. అయితే.. ఇప్పుడీ కాన్సెప్ట్ మాత్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

ప్రస్తుతం రోజులు మారాయి. ఇప్పటివరకూ 150 కిపైగా పెళ్లిళ్లకు పని చేశారు వీరు. “మా టీం చాలా చిన్నది. కేవలం 10మందితో కలిసి నిర్వహిస్తున్నా.. ప్రపంచస్థాయి అవుట్‌పుట్ ఇవ్వగలగడం మా ప్రత్యేకత” అంటూ గర్వంగా చెబ్తున్నారు చంద్రు.

వెబ్‌సైట్