ఐదు పదుల వయస్సులో స్టార్టప్ మొదలుపెట్టి సక్సెస్

ఐదు పదుల వయస్సులో స్టార్టప్ మొదలుపెట్టి సక్సెస్

Monday November 02, 2015,

3 min Read

20 ఏళ్ల వయసులోనే అరవైలలో ఉన్నట్టు ఫీలవుతారు కొందరు. కానీ 50 ఏళ్ల వయసులో, భర్త రిటైర్మెంట్ అవగా వచ్చిన డబ్బులతో తన కెరీర్ ను ప్రారంభించారో ధీర వనిత. తనకెంతో ఇష్టమైన ఫుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి అనతి కాలంలోనే పేరు సంపాదించారు తబస్సుమ్ హసన్. తన సోదరితో కలిసి ప్రారంభించిన బేకింగ్ ఇండస్ట్రీ ముచ్చటగా మూడు నెలల్లోనే మూతపడినా బెదరక, కూతురుతో కలిసి మరో రెస్టారెంట్ ను ప్రారంభించారామె. ముంబై ప్రజలకు తమ రుచులు నచ్చడంతో దేశవ్యాప్తంగా చైన్ స్టోర్స్‌ను ప్రారంభించే పనిలో పడ్డారు.

లేటుగా వచ్చినా లేటెస్టేనని నిరూపించుకున్నారు తబస్సుమ్ హసన్. ఐదుపదుల వయసులో సంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా పేరు సంపాదిస్తున్నారు. తనకెంతో ఇష్టమైన బేకింగ్ రంగంలోకి ఆలస్యంగా ప్రవేశించినా, అనుకున్నది మాత్రం సాధించారు. కూతురు షీబాతో కలిసి ముంబైలో గిల్టీ ట్రిప్ రెస్టారెంట్‌ను నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుటున్నారు.

తన భర్తకు రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బునంతా గిల్టీ ట్రిప్ స్టార్టప్ కంపెనీలో పెట్టి తబస్సుమ్ హసన్ చాలా పెద్ద రిస్క్ చేశారు. ఈ వెంచర్ లోకి తబస్సుమ్, ఆమె కూతురు షీబా 2012లో ప్రవేశించారు.

‘‘చాలా భయమేసింది. నేను తీసుకుంటన్నది చాలా పెద్ద రిస్క్ అని తెలుసు. మేం పెట్టిన ఔట్‌లెట్స్ లాంటివే, అదే ప్రాంతంలో అప్పటికే రెండున్నాయి. దీంతో పోటీ చాలా ఉందని ముందు గ్రహించాం’’ అని తబస్సుమ్ తెలిపారు. వీరి స్టోర్ ముంబైలోని ఖర్ ప్రాంతంలో ఉంది. రేసులో నెగ్గాలంటే మిగతా వారి కంటే భిన్నంగా వ్యాపారం చేయాలని ఆమె గుర్తించింది.

తబస్సుమ్, ఆమె కూతురు షీబా

తబస్సుమ్, ఆమె కూతురు షీబా


తమకు ఎంతో పట్టున్నదానిపై తబస్సుమ్ దృష్టిసారించారు. ఫ్రెంచ్ మాక్రాన్స్, కేక్ పాప్స్ ఆఫ్ అమెరికా వంటి కస్టమైజ్డ్ డెజర్ట్ బైట్స్ రుచులను వివిధ రకాల ఫ్లేవర్లలో తయారు చేశారు. తమ వెంచర్‌కు గిల్ట్ ట్రిప్‌గా పేరుపెట్టారు.

ఆలస్యం వెనుక కథ

తబస్సుమ్ ఓ మాస్టర్ బేకర్. బేకింగ్‌ను వృత్తిగా చేసుకోవాలని ఆమె ఎంతో ఆకాంక్షించారు. కాని పిల్లల చిన్నగా ఉండటంతో దాన్ని వృత్తిగా చేపట్టలేకపోయారు. ‘‘పెరుగుతున్న పిల్లల్ని జాగ్రత్తగా చూడాలని నా భర్త నన్ను ఆదేశించారు. ఆయన అప్పటికే వేరే వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ఏదైనా చేయాలనుకుంటే పిల్లలు పెద్దవారయ్యాకే అని నాకు తేల్చి చెప్పారు’’ అని తబస్సుమ్ వివరించారు. దీంతో పిల్లలు పెద్దవారయ్యేవరకు తబస్సుమ్ వేచి చూశారు.

తొలి ప్రయత్నం విఫలం

సరిగ్గా భర్త రిటైర్మెంట్‌కు ఏడాది ముందు తబస్సుమ్‌కు ఆమె సోదరి ఒక ఆఫర్‌ చేశారు. బేకింగ్ వెంచర్ ప్రారంభిద్దామని తబస్సుమ్‌కు చెప్పారు. సోదరి ఇష్టాఇష్టాల గురించి ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె తబస్సుమ్ ముందు ఆ ఆఫర్ ఉంచారు. ఈ ఆఫర్ విన్నవెంటనే తబస్సుమ్ ఎగిరి గంతేసినంత పనిచేశారు. 50 పర్సెంట్ స్టేక్‌ను తీసుకుని బేకరీని ప్రారంభించారు.

తాను తయారు చేసిన కేక్స్‌తో తబస్సుమ్

తాను తయారు చేసిన కేక్స్‌తో తబస్సుమ్


ఏడాది తర్వాత అక్కాచెల్లెల్ల మధ్య విభేదాలు పొడచూపాయి. బేకింగ్ ఇండస్ట్రీలో జాయింట్ ప్రాజెక్ట్ సరికాదని వారు తెలుసుకున్నారు. సోదరితో వ్యాపార సంబంధాలను తెంచుకున్న తర్వాత, కూతురు షీబాతో కలిసి 2012లో ముంబైలోని ఖర్ ప్రాంతంలో గిల్ట్‌ట్రిప్‌ను తబస్సుమ్ ప్రారంభించారు. 50 ఏళ్ల వయసులో తబస్సుమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. ‘‘సంస్థను ప్రారంభించేందుకు వయసు ఏ విధంగానూ అడ్డుకాలేదు. సంస్థను ప్రారంభించాలన్న ఉత్సాహం నాకూ ఉండేది. మా ఇద్దరికి ఇదో పెద్ద సవాలు. ఎంతో ఉత్సాహంగా దాన్ని స్వీకరించాం’’ అని తబస్సుమ్ చెప్పారు. సంస్థను ప్రారంభించేముందు తన బేకింగ్ నైపుణ్యానికి మరింత పదునుపెట్టేందుకు తబస్సుమ్ సింగపూర్‌లో నెలపాటు కోర్సు చేసి వచ్చారు.

గోల్డెన్ షీబా

మార్కెటింగ్‌లో పీజీ పూర్తి చేసిన షీబా కొన్నాళ్లపాటు ఎన్డీటీవీ ఇమాజిన్, జీ టీవీలలో పనిచేశారు. ఐతే ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో వాటిని వదిలేశారు. ‘‘షీబాకు తన కెరీర్‌పై స్పష్టమైన అవగాహన ఉంది. నైన్ టు ఫైవ్ జాబ్ ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. అలాంటి ఉద్యోగానికి భిన్నంగా ఏమైనా చేయాలని ఆమె భావించారు’’ అని తన కూతురి గురించి తబస్సుమ్ వివరించారు. 30 ఏళ్ల షీబాకు ఇటీవలే వివాహమైంది. భర్త కూడా ముంబై వాసే అవడంతో తన తల్లితో కలిసి బిజినెస్‌ను కొనసాగిస్తున్నారామె.

image


దుబాయ్ ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కాలేజీలో ఎంబీఏ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన షీబా గిల్ట్‌ట్రిప్ టెక్నికల్ వ్యవహారాలు చూసుకుటున్నారు. తబస్సుమ్ మాత్రం కొత్త కొత్త రుచులు, ప్రయోగాలు చేస్తూ సెంట్రల్ కిచన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

గిల్ట్‌ట్రిప్ ప్రారంభమైన తర్వాత షీబా కూడా బేకింగ్‌లో కోర్స్ పూర్తిచేశారు. కొత్త తరహా 3డీ కేక్‌లను తయారు చేయడంలో ఆమె కూడా స్పెషలిస్ట్‌గా మారిపోయారు.

విస్తరణ

ముంబైలో మంచి ఫలితాలు సాధించడంతో గిల్ట్‌ట్రిప్‌ను మరింత విస్తరించాలన్న యోచనలో తల్లీకూతుళ్లున్నారు. దేశమొత్తం తమదైన డెజర్ట్ టేబుల్ కాన్సెప్ట్‌ను తీసుకురావాలనుకుంటున్నారు. హైదరాబాద్, ఇండోర్‌లలో ఇప్పటికే ఫ్రాంచైజీలు కుదుర్చుకున్న వీరిద్దరూ ముంబైలో మరో రెండు ఔట్‌లెట్స్‌ను తెరవాలనుకుంటున్నారు.

‘‘మా ఇద్దరికి చక్కగా కుదిరింది. ఒకరి బాధ్యతలు ఏమిటో మరొకరికి స్పష్టంగా తెలుసు. ఈ సంస్థకు సంబంధించి మా ఇద్దరి మధ్య ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు రాలేదు. దీంతో సంస్థను మరింతగా విస్తరించాలనుకుంటున్నాం’’ అని తబస్సుమ్ వివరించారు.

వ్యాపారం చేసేందుకు వయసు అడ్డుకాదని తబస్సమ్ నిరూపించారు. మహిళనని, వయసైపోయిందని ఇంట్లోనే కూర్చోక, తాను అనుకున్నది సాధించడమేకాదు, నలుగురికి ఉపాధి కూడా చూపిస్తున్న తబస్సుమ్‌ను చూసి మరింతమంది మహిళలు ముందుకు రావాలన్నదే యువర్‌స్టోరీ ప్రయత్నం. తబస్సుమ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.