యాసిడ్ దాడి మొహాన్ని మాడ్చేయొచ్చు... కానీ మనసును మాత్రం రాటుదేల్చింది !

0

లక్ష్మి... ఓ యాసిడ్ దాడితో దారుణంగా హింసకు గురైన బాధితురాలు. పట్టుమని పదహారేళ్లు కూడా నిండని ఆ అమ్మాయిపై ఓ దుర్మార్గుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాసిడ్ దెబ్బకు ఈమె మొహమంతా కాలిపోయింది. ఆ మూర్ఖుడి నుంచి అప్పుడు ప్రాణాలతో బయటపడినా.. నిత్యం సమాజంతో ఆమె పోరాడాల్సి వచ్చింది. గుండెను రాయి చేసుకుని.. ధృడంగా నిలబడి ఎంతో మందికి స్ఫూర్తిదాయినిగా నిలిచింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆమె కలిగించిన చైతన్యం, చేసిన పోరాటం చూస్తే.. ఎవరైనా శభాష్ అనాల్సిందే. చివరకు పుట్టిన బిడ్డ.. తనను చూసి భయపడుతుందేమో, అసహ్యించుకుంటుందేమో.. అనే ఆందోళన మధ్య నలిగిన లక్ష్మి.. ఇప్పుడు ఎంతో హుందాగా మనందరి ముందూ నిలుచుంది.

లక్ష్మి.. ఓ యాసిడ్ ఎటాక్ సర్వైవర్. ఆ ఘటన నుంచి తేరుకుని.. తన కాళ్లపై తాను నిలబడింది. సమాజం ముందుకు రాకుండా.. లోలోపల కుమిలిపోయి.. ఎందుకు బతికాను రా .. భగవంతుడా.. అని ఆమె ఏనాడూ అనుకోలేదు. అంతటి దాడి జరిగిన తర్వాత కూడా తాను ఇంకా బతికి ఉన్నాను అంటే.. ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నమ్మే వ్యక్తి లక్ష్మి.

లక్ష్మి తన జీవన క్రమంలో అలోక్ దీక్షిత్ అనే సామాజిక కార్యకర్తతో ప్రేమలో పడింది. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేయడానికే మొగ్గుచూపారు. పెళ్లి చేసుకోకపోతే.. ఏమవుతుంది.. సమాజం ఏం అంటుంది... అనే మొండి ధైర్యం ఆమెలో కనిపించింది. వాళ్లకు ప్రేమకు ప్రతిరూపంగా ఏడు నెలల క్రితం ఓ అమ్మాయి పుట్టంది. ఆ పాపకు పిహు అని నామకరణం చేసుకున్నారు. పత్రిక అనే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను లక్ష్మి పంచుకున్నారు. కడుపుతో ఉన్నప్పుడు ఆమె పడిన వేదన వింటే.. ఎవరికైనా మనస్సు చివుక్కుమంటుంది. పుట్టిన బిడ్డ తనను చూసి దగ్గరకు వస్తుందా ? భయపడి ఏడుస్తుందా.. ? అనే ప్రశ్నలు.. నవమాసాలూ ఆ తల్లిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఇప్పుడు ఆ పడిన వేదనంతా పటాపంచలైపోయింది. తన తల్లి లక్ష్మిని చూడగానే.. పిహు.. కళ్లలో వెలుగు కనిపిస్తుంది. మొహం ఇంత పెద్దది చేసుకుని..చక్కగా నవ్వుతాడు. ఇది చాలు.. తల్లిగా.. లక్ష్మి కొండంత బలం ఇవ్వడానికి.

తనలా మరే ఆడపిల్లా.. క్షోభకు గురి కావొద్దని.. లక్ష్మి ఆనాడే నిర్ణయించుకుంది. బాధితురాలిలా.. ఇంట్లో కూర్చుని రోదిస్తూ.. ఉంటే ఏ మాత్రం ప్రయోజనం లేదని తెలుసుకుంది. ఓ ఆడపిల్ల జీవితంలో ఇంతకు మించిన నష్టం ఏం జరుగుతుందనే మొండి ధైర్యాన్ని తెచ్చుకుంది. తనలో ఉన్న శక్తినంతటినీ కూడగట్టుకుంది. యాసిడ్ దాడి చేసేవాళ్లపై.. అసలు యాసిడ్ అమ్మకంపైనే పోరాటం చేసింది.

యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్ దాఖలు చేసింది. 27000 మందితో సంతకాలు సేకరించింది. దీంతో కేసు విచారించిన సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాదు పార్లమెంటు కూడా ఈ విషయమై చర్చించింది. యాసిడ్ దాడి కేసులను సత్వరం పరిష్కరించేందుకు చట్టాలను సవరించింది. నిజంగా దీని వెనుక లక్ష్మి కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు.

2014లో అమెరికా ఫస్ట్ లేడీ మిషెల్లీ ఒబామా చేతుల మీదుగా ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును లక్ష్మి అందుకున్నారు. ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యారు.

ప్రస్తుతం లక్ష్మి చాలా బిజీగా ఉంది. లక్నోలో షీరోస్ కేఫ్ ప్రారంభించాలనుకుంటోంది. ఇందుకోసం పనులన్నింటినీ తానే చూసుకుంటూ.. హడావుడిగా ఉంది. పిహు ఆలనాపాలనా అంతా.. స్టాప్ యాసిడ్ అటాక్ సభ్యులు చూసుకుంటున్నారు. వీళ్లలో అధిక శాతం మంది యాసిడ్ దాడికి గురైన ప్రాణాలతో బయటపడిన వాళ్లే. అయితే తన తల్లితో పాటు ఎప్పుడూ ఆ బిడ్డ కూడా క్యాంపెయిన్ల కోసం టూర్లు తిరుగుతూ ఉంది. మూర్ఖులపై ఉక్కుపాదం ఎలా మోపాలో.. ఉగ్గుపాలప్పటి నుంచే నేర్చుకుంటోంది. ఈ సృష్టిలో తనంత అందమైన తల్లిదండ్రులు ఎవరూ లేరని.. రేపటి రోజున ఆ పాప అనుకున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. అందమనేది.. బాహ్యశరీరానికే పరిమితం కాదు.