స్వచ్ఛందంగా ఇస్తే 50శాతం.. పట్టుబడితే 85 శాతం..!!  

కేంద్రం చెప్తున్న కొత్త ఆదాయపన్ను లెక్క..!!

0

నల్ల బాబుల భరతం పట్టేందుకు కేంద్రం తిరుగులేని ఐటీ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. పట్టుబడితే 15శాతం, స్వచ్ఛందంగా ఇస్తే 50శాతం తిరిగి ఇచ్చేలా చట్ట సవరణ చేయబోతోంది. ఆదాయ పన్ను చట్టానికి కేంద్రం మరింత పదును పెట్టిన కేంద్రం.. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించేలా చట్టానికి భారీ సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ముసాయిదా బిల్లును సభ ముందు ఉంచారు. వీలైనంత తొందరగా దీనికి చట్టరూపం కల్పించాలని కేంద్రం ధృడ నిశ్చయంతో ఉంది.

జైట్లీ ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం లెక్కచూపని ఆదాయంపై రెండు రకాల పన్నులు విధిస్తారు. నల్లధనం ఉన్నట్లు స్వచ్ఛందంగా ప్రకటించిన వారికి 50శాతం, ఐటీ సోదాల్లో పట్టుబడిన వారికి 85శాతం వరకు పన్ను విధించనున్నారు. నల్లధనం ఉన్నట్లు ప్రకటిస్తే లెక్క చూపని మొత్తంపై 30శాతం పన్ను, 10శాతం పెనాల్టీతో పాటు 30 శాతం పన్నురూపంలో వసూలు చేసే మొత్తంపై 33 శాతం సర్‌ఛార్జి విధిస్తారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి -లక్ష రూపాయల లెక్కచూపని ఆదాయం ఉన్నట్లు తనంటత తానే ప్రకటిస్తే.. ఆ సొమ్ముపై 30శాతం పన్ను అంటే 30వేలు, 10 శాతం పెనాల్టీ రూపంలో మరో 10వేలు వసూలు చేస్తారు. దీనికి అదనంగా 30శాతం పన్నురూపంలో ఏదైతే వసూలు చేశారో దానిపై మళ్లీ 33శాతం సర్‌ఛార్జ్‌ వసూలు చేస్తారు. అంటే 30 వేలపై 33శాతం అంటే- అదనంగా 10వేల రూపాయలు వసూలు చేస్తారన్నమాట. ఈ లెక్కన లక్ష రూపాయల బ్లాక్ మనీ ఉంటే చివరికి మిగిలేది రూ.50 వేలు.

ఈ 50వేలు కూడా చేతికి ఇచ్చే ప్రసక్తి లేదు. లెక్క చూపని ఆదాయంలో మరో 25శాతం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అంటే మిగిలిన రూ. 50 వేలలో రూ. 25 వేలను కేంద్రం వివిధ పథకాల అమలుకు వాడుకుంటుంది. నాలుగేళ్ల పాటు దాన్ని విత్‌ డ్రా చేసుకునే అవకాశం లేదు. ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ చెల్లించరు. ఇక మిగిలిన రూ. 25వేలు మాత్రమే విత్‌ డ్రా చేసుకునే వెసలుబాటు కల్పించారు. సింపుల్‌గా చెప్పాలంటే లక్ష రూపాయల లెక్కచూపని ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటిస్తే రూ. 25 వేలు తిరిగి చేతికొస్తాయి. రూ. 75వేలు కేంద్రం ఖాతాలోకి వెళ్తాయి.

ఇక ఐటీ సోదాల్లో పట్టుబడితే మాత్రం మ్యాగ్జిమం సమర్పించుకోవాల్సిందే. దాడుల్లో పట్టుబడ్డ ఆదాయంపై 75శాతం ట్యాక్సు, 10శాతం పెనాల్టీ రూపంలో కేంద్రానికి పోతుంది. మిగిలిన 15శాతం మాత్రమే చేతికొస్తుంది. అంటే లక్ష రూపాయలు ఐటీ రైడింగ్‌లో పట్టుబడితే రూ. 75వేలు పన్ను, రూ. 10వేలు పెనాల్టీ పోను.. రూ.15 వేలు మాత్రమే చేతిలో మిగులుతాయి.

ఈ కొత్త చట్ట సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పాస్ చేయించి, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలతో చర్చలు ప్రారంభించిన మోడీ సర్కార్... అతి త్వరలోనే కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది.

Related Stories

Stories by team ys telugu