సిక్సర పిడుగులా చెలరేగిన హర్మన్ ప్రీత్ కౌర్.. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా

0

అసలే వర్షం. ఆపై సెమీస్. ఏమవుతుందో అని గందరగోళం. చివరిదాకా వచ్చిన మ్యాచ్ నీళ్లపాలై పోతుందని అంతా అనుకున్నారు. కానీ వరుణుడు శాంతించాడు. 42 ఓవర్లకు మ్యాచ్ ఫైనల్ అయింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో పెద్దగా స్కోర్ ఉండదని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులయ్యాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సివంగిలా ప్రత్యర్ధి మీద విరుచుపడి అజేయ సెంచరీ సాధిస్తే.. ఆస్ట్రేలియా విజయలక్ష్యం ముందు చతికిల పడింది. మరపురాని విజయంతో టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది.

ఆస్ట్రేలియా బౌలర్ల ఊచకోత అంటే ఏంటో కౌర్ తన బ్యాట్ ద్వారా చెప్పింది. 42 ఓవర్ల సెమీ సమరంలో కౌర్ చూపించిన అలుపెరుగని పోరాటం టీమిండియాను విజయ తీరాన చేర్చాయి. కౌర్ కేవల్ 115 బంతుల్లో 171 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచారు. ఆమెకు వరల్డ్ కప్ లో మూడో అత్యధిక స్కోర్. ఐదో వ్యక్తిగత అత్యధిక స్కోర్ కూడా. 20 బౌండరీలు, ఏడు సిక్సర్లతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

ఒక దశలో 9 ఓవర్లో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ కౌర్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వచ్చీ రావడంతోనే కంగారూ బౌలర్లను కంగారెత్తించింది. సిక్సర పిడుగులా చెలరేగి ప్రతికూల పరిస్థితులన్నీ తనవైపు తిప్పుకుంది. 64 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే.. మరో యాభై పరుగులు చేయడానికి కేవలం 26 బంతులే ఆడింది. 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 281 చేసింది.

282 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా.. 43 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విజయం మీద ఆశలు పూర్తిగా వదులుకుంది. మిడిలార్డర్‌లో విలానీ 58 బంతుల్లో 75 పరుగులు చేసినా, చివర్లో బ్లాక్‌వెల్‌ 90 పరుగులతో రాణించినప్పటికీ అప్పటికే ఓటమి ఖరారైంది. 36 పరుగుల తేడాతో టీమిండియా విజయబావుటా ఎగురవేసింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, గోస్వామి, పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ ఆసిస్ పతనాన్నిశాసించారు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన కౌర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచారు. ఫైనల్లో ఇదే స్ఫూర్తి ప్రదర్శించి, ట్రోఫీతో తిరిగి వస్తారన్న విశ్వాసాన్ని పాదుగొల్పారు.  

Related Stories

Stories by team ys telugu