కరెంటు కూడా లేని కుగ్రామం నుంచి వచ్చాడు… సక్సెస్ ఫుల్ స్టార్టప్స్ పెట్టాడు..

కరెంటు కూడా లేని కుగ్రామం నుంచి వచ్చాడు… సక్సెస్ ఫుల్ స్టార్టప్స్ పెట్టాడు..

Monday April 11, 2016,

3 min Read


అంకుర్ మిశ్రా. నిజంగా సార్ధక నామధేయుడు. ఎందుకంటే- అంకుర పరిశ్రమలు స్థాపించి అనతి కాలంలోనే అజేయుడిగా నిలిచాడు. ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక కుగ్రామం. ఊరికి కరెంటు లేదు. రోడ్లు లేవు. స్కూలు కూడా సరిగా లేదు. ఆరో తరగతికి వస్తేగానీ ఏబీసీడీలు ఎలా వుంటాయో తెలియలేదు. అమ్మానాన్న చదువుకోలేదు. నిరుపేద కుటుంబం. ఊరికి ఒకవైపు అలవికాని నది. మరోవైపు అంతులేని పర్వత శ్రేణులు. బాహ్యప్రపంచానికి పెద్దగా తెలియని ఒక పచ్చి పల్లెటూరు. అలాంటి నేపథ్యంలో పెరిగిన ఒక పాతికేళ్ల యువకుడికి- స్టార్టప్ పెట్టాలనే ఆలోచన రావడమే అద్భుతం. అలాంటిది.. అందులో సక్సెస్ అయ్యాడంటే- అంతకంటే మహాద్భుతం మరోటి లేదు. 

చిత్తశుద్ధి. చేయగలనన్న నమ్మకం. సంకల్ప బలం. గుండెనిండా ధైర్యం. ఇందులో ఏ ఒక్క లక్షణం ఉన్నా సరే- లక్ష్యం ఎంత పెద్దదైనా ప్రయాణం ఎక్కడా ఆగదు. వెనుకడుగు పడదు. వేలమైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ సూత్రాన్ని బలంగా నమ్మాడు అంకుర్ మిశ్రా. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా, సోషల్ వర్కర్ గా, రచయితగా, కవిగా, ట్రావెలర్ గా తానేంటో నిరూపించుకుంటున్నాడు. 

image


తొలి అడుగులు

మంచైనా, చెడయినా పిల్లలు బడిలోనే మౌల్డ్ అవుతారు. మొక్కయి వంగనిది మానై వంగదు. వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడు మాత్రమే. అతనే పిల్లలపై ప్రభావం చూపుతాడు. కొడితే పిల్లల మనసులో చెడ్డవాడిగా ముద్రపడి పోతాడు. కొట్టకుంటే- ఈ టీచర్ వేస్టురా అని తీసిపారేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా బడుల్లో ఇదే సమస్య. దీనివల్ల పిల్లల నడక సరైన దారిలో వెళ్లదు. దండిస్తే బడికి రారు. పట్టించుకోపోతే చదువు రాదు. ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు ఇదో పెద్ద హెడేక్.

ఈ సమస్యను సాల్వ్ చేయాలనుకున్నాడు అంకుర్ మిశ్రా. ఇంటర్మీడియట్ లో ఉండగా వచ్చింది ఆలోచన. ఆ ఐడియా పేరు యునిక్ ఎడ్యుకేషనల్ గ్రూప్.

చాలా స్కూల్స్ ను సందర్శించాడు. హెడ్మాస్టర్లతో మాట్లాడాడు. అంకుర్ మిశ్రాకు లెక్కల సబ్జెక్టంటే ఇష్టం. అందుకే వీకెండ్స్ లో స్కూల్స్ లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులను పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలని డిసైడయ్యాడు. ఎంత క్లిష్టమైన లెక్కయినా సరే.. దాన్ని రకరకాల టెక్నిక్స్ ఉపయోగించి పిట్టకథల రూపంలో పిల్లలకు బోధించేవాడు. అసలు మ్యాథ్స్ ఎందుకు నేర్చుకోవాలో పిల్లలకు వివరించేవాడు. సబ్జెక్ట్ పై ఆసక్తి పెంచేవాడు.

ముందుగా రెండు స్కూల్స్ లో పాఠాలు చెప్పాడు. రెండేళ్లలో చుట్టుపక్కల గ్రామాల్లో పేరొచ్చింది. తర్వాత 17 గ్రామాల్లోని సుమారు వంద పాఠశాలల్లో బోధించడం మొదలుపెట్టాడు. పాకెట్ మనీ మొత్తం ఆ ఊరికీ ఈ ఊరికీ తిరగడానికే ఖర్చు పెట్టేవాడు. ఆ తర్వాత ఉన్నత చదువులకోసం అంకుర్ ఢిల్లీ వెళ్లిపోయాడు. గుర్గావ్ లో ఇలాంటిదే ఒక స్టార్టప్ స్థాపించాలనుకున్నాడు.

image


కంప్యూటర్ తో కుస్తీ

నమ్మండి నమ్మకపోండి. బీటెక్ లో చేరాకే మొదటిసారిగా కంప్యూటర్ చూశాడట అంకుర్. తర్వాత కంప్యూటరే అతని జీవితమైపోయింది. బీటెక్ పూర్తయ్యాక మైక్రోసాఫ్ట్ లాంటి బహుళజాతి సంస్థల్లో పనిచేశారు. కంప్యూటర్ ప్రోగ్రామర్ గా, సాఫ్ట్ వేర్ డెవలపర్ గా సేవలందించాడు. ఉద్యోగం చేస్తూనే- టెక్ గీక్ డమ్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. నాన్ టెకీలను టెకీలుగా మార్చడమే దాని లక్ష్యం. కంప్యూటర్ తో సంబంధం లేని చాలామందిని సాఫ్ట్ వేర్ డెవలపర్స్ గా తీర్చిదిద్దాడు అంకుర్. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా స్కీంను చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఫోరన్ టెక్ అనే మరో స్టార్టప్ ను ప్రారంభించాడు. దాన్ని స్టార్టప్ లకే స్టార్టప్ గా చెప్పుకోవచ్చు. స్టార్టప్స్ కు డిజైనింగ్, డెవలప్ మెంట్, మార్కెటింగ్ సేవలందిస్తున్నాడు.

ఫోరన్ టెక్ స్థాపించి ఏడాదే అయినా వందకుపైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాడు. వింగో, బనియాగిరీ లాంటి సంస్థలకు సాయపడిందా కంపెనీ. పలు ప్రభుత్వ అసైన్మెంట్లను విజయవంతంగా పూర్తి చేసింది.

టెక్నాలజీయే ప్రపంచం

స్కూల్స్ లో చదువుకునేటప్పటి నుంచే అంకుర్ మంచి స్టోరీ టెల్లర్. తనకన్నా తక్కువ తరగతులవారికి పాఠాలు చెప్పేవాడు. 16 ఏళ్లకే రచయితగా మారాడు. ఎంత టెకీ అయినా తనలోని రచయిత, కవిని మాత్రం అలాగే ఉన్నాడు. సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై పలు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నాడు. లవ్ స్టిల్ అండ్ ఐ ఫ్లిర్ట్ పేరుతో తొలి నవలను రాశాడు. క్షణిక్ కహానీయోన్ కి ఏక్ వరాసత్ అనేది అంకుర్ రెండో నవల. అది చాలా పాపులరయ్యింది. హిందీ పద్యాలు కూడా పబ్లిష్ అయ్యాయి. కవిశాల డాట్ ఇన్ పేరుతో ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ కవితలకు స్వాగతం పలుకుతున్నాడు. నెల రోజులక్రితమే స్థాపించిన ఈ సైట్ లో వంద మందికి పైగా కవులు తమ కవితలను పోస్ట్ చేశారు.

ఎంతో మందిలో స్ఫూర్తి

ఒకప్పుడు ఎన్నో కష్టాలుపడి కిరసనాయిల్ లాంతర్ల దగ్గర చదువుకున్న అంకుర్ ఇప్పుడు రచయితగా, ఇంజనీర్ గా, యువ పారిశ్రామికవేత్తగా ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నారు. పబ్లిక్ లో మాట్లాడటానికి ఎప్పుడూ తొణకలేదు బెణకలేదు. పాలిటిక్స్ నుంచి టెక్నాలజీ వరకు ఏ అంశంపైనైనా గడగడా మాట్లాడేస్తాడు. 25కు పైగా సెమినార్లలో మాట్లాడి అందరి మొప్పూ పొందారు. టెడెక్స్ పట్నా, ఇగ్నైట్ జైపూర్, మైక్రోసాఫ్ట్ టెక్ డేస్, యూఈఎన్ సమ్మిట్ పట్నా లాంటి సెమినార్లలో మాట్లాడితే ప్రశంసల జల్లు కురిసింది. బహుమతుల పంట పండింది.

25 ఏళ్ల ఈ కుర్రాడు జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నాడు. ఇవాళ డబ్బు సంపాదిస్తాను.. రేపు డబ్బు లేకపోయినా… ఏదైనా దీవిలోనైనా బతుకుతాను. మీరు అలా జీవించగలరా అంటూ అంకుర్ సవాల్ చేస్తున్నాడు.