'జర్నీ' - కెలాగ్ స్కూల్ టు జార్ఖండ్ జైల్

ఇదో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాను తలదన్నే స్టోరీ. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని ఆశ్చర్యపడేలాంటి కథ. ఎక్కడ కెలాగ్ యూనివర్సిటీ ఎంబిఏ.. ఎక్కడ జార్ఖండ్ జైలు. అంత పెద్ద చదువు చదివి చివరకు కటకటాలపాలై జీవితంలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిన ఓ వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ ఇది. అయితే జైలుతోనే ఆయన కథ కంచికి చేరితే మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేంలేదు. కానీ అదే ఇక్కడ స్పెషల్ ట్విస్ట్.

'జర్నీ' - కెలాగ్ స్కూల్ టు జార్ఖండ్ జైల్

Wednesday March 25, 2015,

3 min Read

ఏడెనిమిది అంకెల జీతం, అద్భుతమైన కార్పొరేట్ ఉద్యోగం. పేరెన్నికగల ప్రఖ్యాత కెలాగ్ యూనివర్సిటీలో ఏంబిఏ పట్టా, యూఎస్ రిటర్న్, బంగళాను తలపించే ఇల్లు, పడవల్లాంటి కార్లు, పండంటి భార్య, చూడగానే ముద్దాడాలని అనిపించే చంటిపిల్లలు. ఇదీ చేతన్ మహారాజ్ సింపుల్ పరిచయం. పేరుకు తగ్గట్టే మహారాజా జీవితం. ఇంతవరకూ స్టోరీ అంతా సినిమాలోని ఫస్ట్ హాఫ్ లా హ్యాపీగా సాగిపోతోంది. కానీ ఇంత చక్కని జీవితం చిటికెలో మాయమైంది. ఫ్రాడ్ చేశాడంటూ ఐపిసి సెక్షన్ 34,406,420 కింద అరెస్ట్ అయి జైల్లో మగ్గాల్సి వచ్చింది. ఇంతకీ ఇంటర్వెల్ సీన్... ! కట్ చేస్తే.. ఏమైంది.. ?

చేతన్ మహారాజ్, బ్యాడ్ బాయ్స్ ఆఫ్ బొకారో జైల్ పుస్తక రచయిత

చేతన్ మహారాజ్, బ్యాడ్ బాయ్స్ ఆఫ్ బొకారో జైల్ పుస్తక రచయిత


ప్రస్తుతం హెచ్.సి.ఎల్. లెర్నింగ్ సీఈఓగా చేతన్ మహారాజ్ పనిచేస్తున్నారు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 2012 సంవత్సరం. జెమ్స్ గ్రూపునకు చెందిన ఎవరాన్ సంస్థ నుంచి చేతన్ కు కళ్లుచెదిరే ఆఫర్ వచ్చింది. ఐఐటి ఎంట్రెన్స్ కు విద్యార్థులను తయారుచేసే 'టాపర్స్' సంస్థకు నిర్వాహణ బాధ్యతలు వహించాలి. అప్పటికే జార్ఖండ్ లోని బొకారోలో అదో మంచి పేరున్న సంస్థ. ఇక వెనుకాముందు చూసుకోకుండా ఉద్యోగంలో చేరాడు చేతన్. ముచ్చటగా మూడు నెలలు లైఫ్ అదుర్స్ అనిపించింది. ఒక రోజు ప్రత్యర్థి సంస్థకు దుర్భుద్ధి పుట్టింది. కంపెనీ మునిగిపోతోదని పుకార్లు పుట్టించారు. దీన్ని నమ్మిన తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. తాము కట్టిన కష్టార్జితమంతా వెనక్కి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఎవరూ మాటవినే పరిస్థితుల్లో లేరు. సమాచారం పోలీసులు, మీడియాకు చేరిపోయింది. అంతే అంతా అక్కడ వాలిపోయారు. డబ్బులు తిరిగి ఇచ్చే అధికారం నాకు లేదని, గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ హెడ్ ఆఫీస్ ప్రతినిధులతో మాట్లాడుతున్నామని చెప్పినా ఎవరూ వినలేదు. చివరకు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన చేతన్ మహారాజ్ ను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 24వ తేదీన బొకారో చాస్ మండల్ కారావాస్ (బొకారో జైలు)కు సీన్ మారింది.

రాల్ఫ్ లారెన్ జాకెట్, ఆల్టో షూస్ తో జైల్లోకి అడుగుపెట్టాడు చేతన్. (ఒక్క రోజులో బయటకు వచ్చేస్తాననే బలమైన నమ్మకం తనని అంతగా కుంగదీయలేదు). కానీ అది సెలవుల సమయం. రోజులు వారాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ ఇతని కేసు మాత్రం హియరింగ్ కు రాలేదు. అలా నెల రోజుల పాటు సాగిన ఈ సంఘర్షణనకు అతడు అక్షర రూపం ఇచ్చాడు. అదే 'ది బ్యాడ్ బాయ్స్ ఆఫ్ బొకారో జైల్'. తాజాగా పెంగ్విన్ ఇండియా సంస్థ ఆ పుస్తకాన్ని ప్రచురించింది !

కార్పొరేట్ కలీగ్స్ టు క్రిమినల్స్ !

కార్పొరేట్ ప్రపంచం నుంచి కటకటాల వెనక్కి వచ్చిన చేతన్ మహారాజ్ అచేతనుడయ్యాడు. మర్డర్ చేసిన వాళ్లు ఒకరు, మానభంగం చేసిన మృగాలు కొన్ని, అతికిరాతకంగా మనుషుల జీవితాలతో అడుకున్న క్రూరులు కొందరు. వీళ్లే ఇప్పుడు తన సహచరులు. అలాంటి వాతావరణమే అతనికి జీవిత పాఠాలు నేర్పింది. బతకడం ఒక్కటే కాదు.. ఎలా బతకాలో, ఎందుకు బతకాలో ఆ నెలరోజుల్లోనే ఒంటబట్టించుకున్నాడు. జీవిత పరమార్ధాన్ని జైలు గోడల మధ్య తెలుసుకున్నాడు.

"జైలు జీవితం ఎంతో నేర్పింది. ఎన్నో అనుభవాలను అతితక్కువ కాలంలో తెలుసుకున్నాను. చూసిన వెంటనే ఓ మనిషిపై ఒక అంచనాకు ఇప్పుడు రాను. గతచరిత్రేంటో తెలుసుకున్న తర్వాతే మనిషిని అర్థం చేసుకుంటాను. అంతే కాదు గతంలో కంటే కఠినమైన నిర్ణయాలనూ ఇప్పుడు తీసుకునే ధైర్యం వచ్చింది. ఒక్కో సందర్భంలో కొందరిని ఉద్యోగంలో ప్రమోట్ చేయలేకపోవచ్చు. కానీ జీవితం అంటే ఇదే అని వాళ్లూ తెలుసుకోవాలి. గతం కాదు.. ఈ రోజున నువ్వేంటో ప్రపంచానికి తెలియాలి. ఒక్కోసారి నువ్వే ఆధారం, కానీ మరోమారు నువ్వు అనవసరం" అంటూ తన అనుభవాలను యువర్ స్టోరీతో పంచుకున్నారు చేతన్ మహారాజ్.

జీవితంలో ఉద్యోగం పోగొట్టుకోవడం ఒక్కటే అతి ఘోరమైన పని అనుకోవడం అమాయకత్వం. ఊహించని విషాదాన్ని చూపించేదే జీవితం. అన్నింటికంటే ముఖ్యం కుటుంబం విలువేంటో అప్పుడే తెలిసొచ్చిందంటారు చేతన్. ఉబికివస్తున్న కన్నీటికి ఆపే ప్రయత్నం చేస్తున్నా.. అప్రయత్నంగా గుండెను తడిపేస్తూనే ఉన్నాయి. జైలు నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న సీన్ ఇప్పటికీ మరిచిపోలేడు. తల్లిదండ్రుల ఆనందం, కట్టుకున్న భార్య ఆప్యాయత ఏంటో అప్పుడే తెలిసొచ్చిందంటూ పశ్చాత్తాపపడ్తాడు.

జైల్లో ఉన్నవాళ్లంతా రాక్షసులు కాదు !

'రేపటి కోసమో, పదేళ్ల తర్వాతి కోసమో బతకొద్దు. ఈ రోజే నీ చేతిల్లో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే భవిష్యత్తుపై బెంగమాని, ప్రస్తుతాన్ని ప్రశాంతంగా బతకమంటూ' సలహా ఇస్తాడు చేతన్ మహారాజ్. తాను రాసిన పుస్తకంలో కథ, క్లైమాక్స్, స్టోరీ వంటివి ఏమీ ఉండవని, నెల రోజుల పాటు తాను చూసిన, అనుభవించిన ప్రతీ ఘటననూ అక్షర బద్ధం చేస్తేనే ఇది తయారైందని అంటారు.

జైల్లో ఉన్నవాళ్లంతా రాక్షసుల రక్తసంబంధీకులు కాదు, వాళ్లకు మనోభావం, జీవిత కాంక్ష ఉంటుంది. అంతేకాదూ వాళ్లకూ ఎంతో కొంత సత్తా ఉంది. ఆ మాటకు వస్తే అందరూ జైలు పక్షులే. మన చుట్టూ మనం గీసుకున్న,మనకు ఉండే పరిధులే కటకటాలు. జీవితం గురించి భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టిన రోజే మనమూ ఆ నాలుగు గోడల నుంచి బయటపడతాం ! అంటూ ముగిస్తున్నాడు చేతన్ మహారాజ్.

image


* ఇంతకీ హెచ్.సి.ఎల్. వాళ్లు మళ్లీ ఎలా ఉద్యోగమిచ్చారని అనుమానం అందరికీ ఉంటుంది. కోర్టు పూర్వాపరాలు అన్నీ పరిశీలించిన తర్వాత మార్చ్ 2013లో ఆయనపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసింది. చట్టపరమైన చిక్కులన్నీ వీడిన తర్వాత హెచ్.సి.ఎల్. బోర్డులో ఆయన సభ్యుడిగా చేరాడు.