మేం సామాగ్రి తెస్తాం..! మీరు పూజ చేసుకోండి..!!

మేం సామాగ్రి తెస్తాం..! మీరు పూజ చేసుకోండి..!!

Saturday February 20, 2016,

3 min Read

ఎంత బిజీ లైఫ్ అయినా దేవుడికి దీపం పెట్టిన తర్వాత గానీ ఇంటినుంచి బయల్దేరరు కొందరు. దారిలో గుడి కనిపిస్తే ఠక్కున ఆగటి మనసులో మొక్కుతారు. టైముంటే సాయంకాలం ఏ గుడికో వెళ్లి పాలరాతి మెట్ల మీద కూచుని కాసేపు మనశ్శాంతి అప్ లోడ్ చేసుకుని వస్తాం. ఇంకాస్త భక్తిభావం ఎక్కువ వున్నవాళ్లు ఇంటిదగ్గర వ్రతాలు పూజలు శాస్త్రోక్తంగా చేసుకుంటారు. అయినా సరే పూజావిధానంలో ఎక్కడో ఒకచోట లోపం కనిపిస్తుంది. తెలిసినవాళ్ల గురించి కాదుగానీ, తెలియని వాళ్లే పూజలో ఏదో ఒకటి మిస్సవుతుంటారు. ఉదాహరణకు వినాయక పూజా విధానమే తీసుకుందాం. పత్రపూజ కోసం హైదరాబాద్ లాంటి నగరంలో ఎన్ని ఆకులు సంపాదిస్తాం? మహా అంటే నాలుగైదు. మరి కావల్సినవి 21. మిగతావాటి సంగతేంటి? సపోజ్ ఇంట్లో వరలక్ష్మీ పూజ అనుకుందాం.. సమయానికి మందిరం అలంకరించడానికి ఒక్కోసారి మామిడాకే దొరకదు. దొరికినా అది నిగనిగలాడదు. మరి ఎలా? 

అందుకోసమే మేమున్నాం అంటోంది ఫెస్టివల్ టైం డాట్ ఇన్. పూజకు, వ్రతాలకు కావాల్సిన సామాను 24-48 గంటల్లో మీరు కోరిన చోటికి కోరిన ఐటెమ్ తెచ్చి మీ చేతుల్లో పెడతారు. ఎగ్జాంపుల్.. మీరు కొత్తింట్లోకి పోతున్నారనుకోండి. పూజా సామాగ్రికి టైం లేదు. లేదంటే ఈ సిటీకి కొత్త. ఏది ఎక్కడ దొరుకుతుందో ఐడియా కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఫెస్టివల్ టైం డాట్ ఇన్ మీద ఒక్క క్లిక్ చాలు.. జాకెట్ ముక్కల దగ్గర్నుంచి బెల్లం ముక్కల దాకా అన్నీ సంచీలో వేసుకుని వచ్చి ఇచ్చిపోతారు. మంగళగౌరీ వ్రతమైనా, సత్యనారాయణస్వామి వ్రతమైనా, వరలక్ష్మీ వ్రతమైనా. కుంకుమ దగ్గర్నుంచి శనగల దాకా పూజకు కావల్సిన ఐటెమ్స్ అన్నీ హాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. గణపతి పూజ నుంచి దుర్గా పూజ వరకు అన్ని సామాన్లు ఆన్ లైన్ లోనే ఆర్డరివ్వొచ్చు. 

ఒక్క పూజ సామానే కాదు.. బర్త్ డే అయినా సరే.. కేక్ ఆర్డరివ్వొచ్చు. ఎగ్ లేకుంటే ఎగ్ లెస్. కైట్స్, మాంజాలు కూడా దొరుకుతాయి. అన్నట్టు ఇండిపెండెన్స్ డే కోసం మువ్వన్నెల జెండాలు కూడా సైట్ లో ఉన్నాయి. 

image


కాలేజీ నుంచే స్టార్టప్ లోకి

 నిట్ లో చదువుతున్న రోజుల నుంచి స్వరూప్ స్టార్టప్ ల కోసం పనిచేశారు. కాలేజీ నుంచి బయటకు వచ్చాక హైదరాబాద్ లో ఉండగా బర్త్ డే కేక్ లను అందించారు. ఇది కిందటేడాది మాట. ఈ స్టార్టప్ ఐడియా ఇక్కడే ప్రారంభమైంది. మార్కెట్ పొటెన్షియల్ అప్పుడే అర్థమైంది. దేవుడి సెంటిమెంటు ఉన్నంత వరకు తమ వ్యాపారానికి ఢోకా లేదని దీమాగా చెబుతున్నారు స్వరూప్. 

ఫెస్టివల్ టైమ్ పనితీరు

ఈ స్టార్టప్ ప్రారంభమై దాదాపు ఏడాది కావస్తోంది. ఫెస్టివల్స్ టైంలో బాగానే వ్యాపారం సాగుతోంది. మామూలు రోజుల్లో కూడా ఓ మోస్తరుగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇటీవల నోములు, వ్రతాలు పేరుతో ఓ సరికొత్త ప్యాకేజీని విడుదల చేశారు. దీనికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందట. వెబ్ సైట్ ప్రారంభించిన రోజు నుంచే యూజర్ ఎంగేజ్మెంట్ ఉంది. రోజుకి సరాసరి కనీసం ఒక పదిమందైనా రిజిస్టర్ అవుతున్నారు. రోజువారి వ్రతాలకోసం మా వెబ్ సైట్ విజిట్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. .

image


ఫెస్టివల్ టైం టీం

శక్తి స్వరూప్ ఈ స్టార్టప్ కి కో ఫౌండర్/ సీఈఓగా ఉన్నారు. బాల చిన్నం రాజు మరో కో ఫౌండర్. అతను ఆంధ్రాయునివర్సిటీ నుంచి జియో ఇన్ఫో డిగ్రీ పూర్తి చేశారు. నాగార్జున కూడా టీంలో కీ మెంబర్ కమ్ కో ఫౌండర్. ఈయనా నిట్ విద్యా ర్థే. ప్రస్తుతం సీటీఓగా ఉన్నారు. రామ్ సింగ్, ఓయూ నుంచి ట్రిపులీ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రాడక్ట్ డెవలప్ మెంట్, సేల్స్ వ్యవహారాలు చూసుకుంటాడు. చైతన్య శ్రీనివాస్ ఇండస్ట్రీ రిలేషన్స్ చూస్తున్నారు. కీర్తన సభ్యులుగా ఉన్నారు.

సవాళ్లు, పోటీదారులు

వీరి ప్రాడక్టుకు కావల్సిన ముడి సరుకు దొరికే ట్రేడర్లను అర్థం చేసుకోవడం పెద్ద సవాలే. సాధారణంగా ఈ ట్రేడర్లకు బిజినెస్ మోడల్ వివరించడం ప్రతి రోజూ సమస్యే. దీంతో పాటూ కంటిన్యూస్ గా మనీ జనరేషన్ మరో సవాల్. దీనికోసం ప్రచారం చేసి ప్రతిరోజు చేసే పూజలు, వ్రతాల లిస్టులను వివరించి ఆర్డర్లను పెంచుకుంటున్నామని శక్తి అంటున్నారు.

ఇక పోటీ దారుల విషయానికొస్తే, మల్టీ బిలియన్ కంపెనీల దగ్గర నుంచి ఆన్ లైన్ పూజ సామగ్రి అమ్మే స్టార్టప్ ల దాకా చాలానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ మోడల్ లో ఫెస్టివ్ కార్ట్ డాట్ కామ్ అనే మరో స్టార్టప్ ఉంది. ప్రసాద డాట్ కామ్ కూడా ప్రసాదాలను అందించే మరో స్టార్టప్. హైదరాబాద్ లో ట్రేడర్లను గ్రాబ్ చేసే సంస్థగా తాము మాత్రమే ఉన్నామని శక్తి అంటున్నారు.

image


భవిష్యత్ ప్లాన్

టెంపుల్ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ ని సరికొత్త ప్రాడక్టుగా తీసుకొస్తున్నారు. తొందరలోనే యాప్ మోడ్ లోకి వెళ్తున్నామన్నారు. ఫండింగ్ వస్తే ఈ సెక్టార్ లో మరింతగా విస్తరించాలనే ప్లాన్ లో ఉంది ఫెస్టివల్ టైం డాట్ ఇన్.