గూగుల్ కే గూగ్లీ !

వంద మిలియన్ డాలర్లు, మన కరెన్సీలో దాదాపు రూ.600 కోట్లు. ఇదేం చిన్న మొత్తం కాదు. ఒక స్టార్టప్ కంపెనీకి ఇంత మొత్తం చెల్లించిన గూగుల్ కొనిందంటే.. ఆ కంపెనీ ఉన్న వేల్యూ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 17 నెలల తర్వాత గూగుల్ నుంచి మళ్లీ తమ కంపెనీని చేజిక్కించుకున్న అన్నాదమ్ముల సాహసమే ఈ డైలీడీల్ కథనం. జీవితంలో ఎప్పుడూ లాభార్జనే కాదు అంతకుమించి కూడా ఆలోచించవచ్చని ప్రపంచానికి చాటిచెప్పారు హెయిలెమెన్ బ్రదర్స్.

0

బ్యాంకుల్లో కోటల రూపాయల బ్యాలెన్స్ మూలుగుతూ ఉంటే ఎవరుమాత్రం రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడ్తారు చెప్పండి.. ! అది కూడా 20 ప్లస్ వయస్సులో... ! కానీ ఫాబియన్ హెయిలెమెన్, ఫెర్రీ హెయిలెమెన్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. వారేంటో.. వాళ్ల గట్ ఫీలింగ్ ఏంటో.. గూగుల్ నుంచి కంపెనీని ఎందుకు కొన్నారో.. గూగుల్ ఎందుకు కంపెనీని అమ్మేసిందో చూడండి...! మీరు ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు తెలుస్తాయి.

114 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.680 కోట్లు) డైలీడీల్ సంస్థలను హెయిలెమెన్ సోదరులు అమ్మేశారు. కానీ అప్పటికే డిస్కౌంట్ కూపన్ల జోరు తగ్గింది. అన్నాదమ్ములు స్థాపించిన కంపెనీ కష్టాల్లో కూరుకుపోయింది. నష్టాలను భరించడం లేక కొత్త యాజమాన్యమైన గూగుల్ చేతులెత్తేసింది. డైలీడీల్ సిబ్బందిని తొలగిస్తూ, కంపెనీని మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తెలుసుకున్న అన్నాదమ్ములు ఎవరూ ఊహించినంత ధైర్యం చేశారు. గూగుల్ నుంచి తమ కంపెనీని వెనక్కితీసుకున్నారు. ఇక్కడ మనీ మ్యాటర్ కంటే మనసు మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేశారు.

ఏంటి స్టోరీ ?

పశ్చిమ జర్మనీకి చెందిన ఫాబియన్, ఫెర్రీ ఇద్దరూ అన్నాదమ్ములు. ఇద్దరూ ఏ-లెవెల్ విద్యను పూర్తిచేశారు. ఫెర్రీ ఆ తర్వాత జర్మనీలోని WHU ఒట్టో బెయిషం స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, బ్రిటన్ లోని నట్టింఘాం యూనివర్సిటీలో బిజినెస్ ఎకనమిక్స్ చదివేందుకు వెళ్లాడు. హాంబర్గ్ బుసీరియస్ లా స్కూల్, యూఎస్ లోని శాంతా క్లారా యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించాడు ఫ్యాబియన్. ఆ తర్వాత జర్మనీ హైడిల్ బర్గ్ నుంచి పిహెచ్.డి. కూడా పూర్తిచేశాడు.

చదువుతున్నప్పుడు, చదువు పూర్తైన తర్వాత బూజ్ అండ్ కంపెనీ వంటి ప్రముఖ కన్సల్టెన్నీ సంస్థల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేశారు. అయితే ఎంత కష్టపడినా ఏదో తెలియని వెలితి ఇద్దరినీ ఇబ్బందిపెట్టేది. అన్నీ చేసినా చివరకు నిర్ణయాధికారం తమకు లేదన్న భావనే కుదిపేసేది. ఇదే వారి సొంత వ్యాపారానికి బీజం వేసింది. తమ డ్రీమ్ కంపెనీ అయితే సొంత ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు, నచ్చిన ఉద్యోగులను ఎంపిక చేసి పనిచేయించుకునేందుకు అవకాశం ఉంటుందనేది ఫ్యాబియన్, ఫెర్రీ ఆలోచన. 2001లోనే ఈవెంట్-గ్యాస్ట్రోనమీ అనే సంస్థను స్థాపించి ఇద్దరూ ఎంతో కొంత అనుభవం సంపాదించారు. అదే వాళ్లకు ధైర్యం. కొండంత స్థైర్యం.

ఏ వ్యాపారం చేయాలో అర్థంకాక ఇద్దరూ సతమతమయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 బిజినెస్ ఐడియాలు రూపొందించారు. వాటిల్లో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తూ చివరకు 'డీల్ ఆఫ్ ది డే' దగ్గర ఆలోచన ఆగింది.

యూరోప్ లో మొదటి డీల్ ఇదే !

DailyDeal.de పేరుతో డిసెంబర్ 2009లో బెర్లిన్ లో సైట్ ను ప్రారంభించారు. ఇదే మొదటి యూరోపియన్ పూర్తిస్థాయి సైట్ అంటూ చక్కగా మార్కెటింగ్ మొదలుపెట్టారు. ఫాబియన్, పెర్రీతో పాటు ఒక డెవలపర్ తో కంపెనీ ప్రారంభమైంది. కొత్త ఆలోచన కావడంతో కావడంతో అత్యంత వేగంగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. మూడు నెలల్లో కంపెనీ 100 మంది ఉద్యోగుల స్థాయికి చేరింది. ఆ తర్వాత మెల్లిగా ఒక్కో కంపెనీ మొదలుపెట్టారు. హెయిలెమెన్ బ్రదర్స్ ఇప్పుడు 125 మంది ఉద్యోగులతో నాలుగు కంపెనీలకు అధిపతులు.

అప్పట్లో జర్మనీలో మొదటి ఈకామర్స్ సైట్ ఇదే కావడంతో అక్కడి వ్యాపారులు తెగ ఉత్సాహం చూపించారు. రెస్టారెంట్లు, హోటల్స్, హెయిర్ డ్రెసర్స్, వెల్నెస్ సెలూన్స్, స్పా.. ఇలా అనేక చిన్న సంస్థలు ఈ డైలీ డీల్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాస్త తక్కువ ధరకు డీల్స్ అందించడం వల్ల కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు వ్యాపారం కూడా పెరుగుతుందని వర్తకులను ఒప్పించారు. నష్టపోకుండా తక్కువ లాభంలో ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో వివరించారు. ఇందుకోసం కంపెనీల నుంచి ప్రత్యేకించి ఎలాంటి సొమ్మూ తీసుకోలేదు. వాళ్లు ఇచ్చే సేవలకు గాను ఒక్కో కస్టమర్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునేవారు. పేమెంట్స్ విషయంలోనూ ఇబ్బందులు రాకుండా ఫాబియన్, ఫెర్రీ జాగ్రత్తపడ్డారు. ఇలా ఈ కొత్త కాన్సెప్ట్ జనసామాన్యంలోకి చొచ్చుకుపోవడంతో డైలీ డీల్ ఇక వెనుదిరిగిచూడలేదు.

ఇదే సమయంలో తమ పోటీదారు అయిన 'సిటీడీల్' సంస్థను మే 2010లో 'గ్రూపాన్' సంస్థ కొనుగోలు చేసింది. ఇక్కడే వీళ్ల దశ కూడా తిరిగింది. వీళ్ల ప్రమేయం లేకుండా కంపెనీ వెల్యుయేషన్ అమాంతం పెరిగింది. వీటన్నింటికీ తోడు డైలీ డీల్ లో యువరక్తం, ఇద్దరూ అన్నాదమ్ములే కావడం గూగుల్ ను కూడా ఆకర్షించింది.

డీల్ డన్ !

డైలీ డీల్ ఏర్పాటు చేసిన కొత్తల్లో నిధుల కోసం అన్నాదమ్ములు విలవిలలాడేవారు. తీవ్రంగా ఉన్న పోటీయే వాళ్లకు అవకాశమైంది. అందరికంటే వేగంగా ముందుకు సాగాలనే ప్రయత్నం కొత్త ఆలోచనలకు తెరతీసింది. కానీ వాళ్లు అనుకున్న ఆ రోజు రానే వచ్చింది. సెప్టెంబర్ 2011లో డైలీ డీల్ ను గూగుల్ సొంతం చేసుకుంది. అప్పటికే 12000 మంది వ్యాపారుల నెట్వర్క్ తో విశేషమైన కస్టమర్ల సంఖ్య ఆ వెబ్ సైట్ సొంతం. ఆస్ట్రేలియాలో మొదటి స్థానం, జర్మనీలో రెండో స్థానం, స్విట్జర్లాండ్ లో మూడో స్థానంలో ఎదురులేని సంస్థగా ఎదిగిపోతూ వచ్చింది. పీక్ దశలో కంపెనీలో 250 మంది వరకూ పనిచేసేవారు.

బై బ్యాక్ ఆఫర్ !

2009 నుంచి 2013 వరకూ ఇద్దరూ కలిసి ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నింటినీ అన్నాదమ్ములు తిరిగి చేజిక్కించుకున్నారు. గూగుల్ నుంచి తమ కలల ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారు. తాము కష్టపడి పెంచిన వృక్షం పడిపోతూ ఉండే ఇద్దరూ చూస్తూ ఊరుకోలేకపోయారు. ఎంత బరువైనా మోసేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో అలాంటి నిర్ణయం సాహసోపేతమైంది. అప్పటికే చేతిలో ఫుల్ క్యాష్ లో తులతూగుతూ ఉన్నా కూడా చివరకు కంపెనీని నిలబెట్టేందుకే ఇద్దరూ మొగ్గుచూపారు. మెల్లిగా మళ్లీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ, కంపెనీని ఎక్కిస్తూ అడుగులువేశారు. అప్పటికే ఉన్న 15,000 వేల మంది క్లైంట్ నెట్వర్క్ తో పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. ఈ సారి తమ వ్యాపారాన్ని 'స్కై అండ్ శాండ్ గ్రూప్' కింద వివిధ రంగాలకు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఉన్న వనరులనే వివిధ కంపెనీలకు ఎలా వాడుకోవాలో ఔపోసన పట్టారు. డైలీ డీల్, హెయిలెమెన్ అండ్ కో, లోకలైజ్, పెప్పర్ బిల్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. కంపెనీలు వేరైనా.. వీటి టార్గెట్ గ్రూప్ మాత్రం ఒక్కటే...!

ప్రస్తుతం డైలీ డీల్ నిలదొక్కుకునే స్థాయిలో ఉంది. నష్టాలను సాధ్యమైనంతవరకూ తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లిద్దరి లెక్కలప్రకారం మళ్లీ కంపెనీ గాడిలో పడి, లాభాలు తెచ్చిపెట్టేందుకు ఎక్కువకాలం పట్టకపోవచ్చు. అన్నాదమ్ముల లక్ష్యమంతా ఒక్కటే.. స్కై అండ్ శాండ్ ను యూరోప్ లోనే లీడింగ్ కంపెనీగా తీర్చిదిద్దాలి. డిజిటల్ మీడియాను వాడుకుని ఎదగాలనుకునే చిన్నా, మధ్య తరహా కంపెనీలన్నింటికీ చేరువకావాలి. ఇందుకోసం అహర్నిశలూ కష్టపడేందుకు కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు.

''ఆలోచన కంటే దాన్ని ఆచరణలో పెట్టడమే ముఖ్యం. మొదట మార్కెటింగ్ చేసేందుకు అవకాశమున్న బిజినెస్ ఐడియా అయితే బాగుంటుంది. అయితే ఇందుకోసం ఫౌండర్లు చాలా సమయం కేటాయించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మనం నమ్మిన వాళ్లను, మనల్ని నమ్మిన వాళ్లతోనే వ్యాపారం చేయాలి'' అంటూ ఫాబియన్, ఫెర్రీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సలహా ఇస్తున్నారు.

ఫాబియన్, ఫెర్రీ వంటి వాళ్లు మనకు అరుదుగా కానీ కనిపించరు. కంపెనీ మొదలుపెట్టి ఆ తర్వాత అమ్మేయగానే తమ పనైపోయిందనుకునే రకం వీళ్లుకానేకాదు. డైలీ డీల్ కు పూర్వవైభవం సాధ్యమైనంత త్వరగా రావాలని, వీళ్లు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కాలని మనమూ కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫాబియన్ అండ్ ఫెర్రీ... !