ఇప్పుడున్న కోహ్లీ సేన కంటే బెస్ట్ టీం మరోటి లేదు

ఆప్ నేత అశుతోష్ మనోగతం

ఇప్పుడున్న కోహ్లీ సేన కంటే బెస్ట్ టీం మరోటి లేదు

Saturday December 24, 2016,

4 min Read

ఈ దెబ్బతో విరాట్ కోహ్లీ టీంకి తిరుగులేదా..? ఉత్తమ కెప్టెన్ అని కితాబివ్వొచ్చా..? మళ్లీ టీమిండియాకి స్వర్ణయుగం మొదలైందని భావించొచ్చా? 70-80వ దశకంలో వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్‌ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినట్టుగా.. మనం కూడా దున్నిపారేస్తామా?

ఇంగ్లండ్‌ పై ఇండియా గెలిచిన తీరు చూస్తే అదే అనిపిస్తోంది. వారం రోజులుగా ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.

భారతజట్టుకు తిరుగులేదని చెప్పడానికి నేనేం వెనుకాడను. కచ్చితంగా 1983లో వరల్డ్ కప్ గెలుచుకున్న కపిల్ టీం కంటే ఇదే బెస్ట్ టీం. చెప్పాలంటే రెండు వరల్డ్ ట్రోఫీలు గెలుచుకున్న ధోనీ సేన కంటే పెద్ద విజయం. సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, లక్ష్మణ్, కుంబ్లే, భజ్జీలాంటి మేటి ఆటగాళ్లున్న గంగూలీ జట్టుకంటే ఉత్తమం.

నా అభిప్రాయంతో చాలామంది ఏకీభవించరని తెలుసు. విరాట్ టీం గురించి ఎక్కువ ఊహించుకుంటున్నాననీ అనుకోవచ్చు. మీ విమర్శలు ఎలా వున్నా నేను మాత్రం కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నా.

నాకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే పిచ్చి. అప్పట్లో టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకేం కాదు. పైగా అదంతా పక్కా టెస్ట్ క్రికెట్ కాలం. మెల్లిగా వన్డేలతో కలర్ డ్రస్సులు వచ్చాయి. ఆపై అనూహ్యంగా టీ-20 తెరమీదికి వచ్చింది.

image


70వ దశకంలో టీమిండియా స్పిన్నర్లదే హవా. చంద్రశేఖర్‌, బిషన్ సింగ్ బేడీ, ప్రసన్న, వెంకటరాఘవన్ వీళ్లంతా.. ప్రత్యర్ధులను తమ బంతులతో గింగిరాలు తిప్పించినవారే. భారత పిచ్ ల మీద ఒక ఆటాడుకునే మొనగాడిలాంటి బ్యాట్స్ మెన్లు కూడా మన స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడిపోయారు. ఇక బ్యాట్స్‌ మెన్ల విషయానికొస్తే సునీల్ గవాస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌ వరల్డ్ క్లాస్ ఆట కనబరిచారు. వీళ్ల కూర్పుతో ఉన్న మన జట్టు గ్రౌండులోకి దిగితే అవతలివారికి హడలే.

ఎప్పుడైతే కపిల్ దేవ్ వచ్చాడో స్పిన్నర్ల శకం ముగిసింది. ప్రతీ యువ ఆటగాడూ కపిల్ మేనియాలో పడ్డాడు. అతనిలా బౌలింగ్ చేయాలని, అతనిలా రన్నింగ్ స్టయిల్ అనుకరించాలని ప్రయత్నించేవారు. అయినా సరే, స్పిన్నర్ల కొరతను పేసర్లతో ఫిల్ చేయలేకపోయారు. నిజానికి మన పేస్ బౌలింగ్ అంత గొప్పదేం కాదు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పోల్చుకుంటే మన ప్లేస్ ఎక్కడో. మహ్మద్ నిస్సార్ ఉండేవాడు కానీ అంతగా రాణించలేదు. అది స్వాతంత్ర్యం పూర్వం సంగతి అది వేరే విషయం. గవాస్కర్ రిటైర్ అవడం.. సచిన్ రావడం.. ఆపై గంగూలీ తోడవడం.. వెరసి టీమిండియా గట్టిపోటీ ఇవ్వగలిగింది.

గంగూలీ మంచి బ్యాట్స్ మెన్ అందులో సందేహం లేదు. సమర్ధుడైన కెప్టెన్ ఒప్పుకుని తీరాలి. అతనికి దూకుడెక్కువ కాదనలేని సంగతి. గవాస్కర్, కపిల్ మాదిరి కాదు. గెలవాలన్న కసి కనిపించేది. అతని బ్యాచ్ లో మంచి బ్యాటింగ్ లైనప్ ఉండటం కూడా కలిసొచ్చింది. సెహ్వాగ్ లాంటి హార్డ్ హిట్టర్, సచిన్, లక్ష్మణ్, మూడో నెంబర్‌లో రాహుల్ ద్రవిడ్.. వారితో పాటు కుంబ్లే, హర్భన్ సింగ్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు, వాళ్లకు తోడు పేసర్‌ జవగళ్ శ్రీనాథ్‌, తర్వాత కాలంలో జహీర్ ఖాన్. దీన్ని మించిన తురుంఖాన్ టీం లేదనే చెప్పొచ్చు. స్టీవ్ వా, రికీ పాంటింగ్ ను కూడా కలుపుకుంటే వరల్డ్ క్రికెట్‌లోనే అదొక మొనగాని జట్టు. కానీ సౌరభ్ టీంలో ఒక్క ఆల్ రౌండరూ లేడు.

తర్వాత ధోనీ రాకతో టీమిండియా మరో అడుగు ముందుకు వేసింది. ఆస్ట్రేలియా పతనం మొదలైన తర్వాత ధోనీ సేన బలంగా తయారైంది. అతను ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. ప్రతీసారీ టీంని ముందుండి నడిపించేవాడు. అందుకే మిస్టర్ కూల్ అని పేరొచ్చింది. టీ -20 ఫార్మాట్ అయినా, వన్డే అయినా జట్టుకు తిరుగులేదు. అందుకే ధోనీ సారధ్యంలో రెండు ఫార్మాట్లలో విశ్వవిజేతగా నిలిచింది. కానీ విషాదం ఏంటంటే ఆ సమయంలో మన బౌలింగ్ పరమ చెత్త. ఒక్క క్వాలిటీ ఆల్ రౌండర్ లేడు.

ఇక ధోనీలాగే కోహ్లీ కూడా బ్రహ్మాండమైన ఆటగాడు. డౌట్ లేదు. అతనిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. జట్టుని ముందుండి నడిపించగలడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ ఛాలెంజ్ అయినా ఎదుర్కోడానికి రెడీగా ఉంటాడు. అచ్చం గంగూలీలా దూకుడు మనిషి. బ్యాటింగే అతని ఆయుధం. ధోనీ, సౌరభ్ కంటే మెరుగైన ఆటగాడు కూడా. సచిన్, గవాస్కర్‌ అంతటి స్థాయి ఉన్న ప్లేయర్. ఒకే ఏడాదిలో మూడు డబుల్ సెంచరీ చేశాడు. ఛేజింగ్‌ లో విరాట్ ఎక్కడా వెన్నుచూపడు. ఈ విషయంలో సచిన్ ను పోల్చలేం. ఎలాంటి కండిషన్లో అయినా ఆడే సామర్ధ్యమున్నోడు కోహ్లీ. ఆ ప్లస్ పాయింట్ తోనే కెప్టెన్సీ పగ్గాలు చేతికొచ్చాయి.

అయితే, ఆనాడు గంగూలీ టీం ఎంత పక్కాగా ఉండేదో ఇవాళ కోహ్లీ సేన అంత పటిష్టంగా ఉంది. ఒకవేళ సచిన్ తో విరాట్ కోహ్లీని పోల్చాల్సి వస్తే.. పుజారాను రాహుల్ ద్రవిడ్‌ తో పోల్చవచ్చు. లక్ష్మణ్ లేని లోటుని రహానే తీరుస్తున్నాడు. విజయ్‌, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ బ్యాటింగులో రాటుదేలి -సెహ్వాగ్, గౌతం గంభీర్ లాంటి ఓపెనర్లుగా అవతారమెత్తారు.

ఇక బౌలింగ్ విభాగంలో చూసుకుంటే అశ్విన్, జడేజా ద్వయం- కుంబ్లే, హర్భన్ సింగ్‌ లను తలపిస్తున్నారు. పేసర్లు ఉమేశ్ యాదవ్, షమి, ఇషాంత్ శర్మ, బూమ్రా, భువనేశ్వర్ కుమార్ ఇంచుమించు 140 కి.మీ. వేగంతో బంతులు విసురుతున్నారు.

కోహ్లీ టీమ్ సౌరభ్, ధోనీ సేనల కంటే టాప్ టు బాటమ్ మెరుగ్గా ఉంది. ఇప్పటికైతే ఇదే బెస్ట్ అథ్లెటిక్ టీమ్. ఫీల్డింగ్ లోనూ ఎవరికీ తీసిపోలేదు. ఇంతకు ముందున్న రెండు జట్లు ఈ ఏరియాలో చాలా వీక్. మైదానంలో చురుగ్గా, వేగంగా కదిలే ఆటగాడే లేడంటే అతిశయోక్తికాదు.

విరాట్ అంబులపొదిలో రెండు తిరుగులేని అస్త్రాలున్నాయి. అందులో ఒకటి అశ్విన్. రెండోది జడేజా. ఇద్దరూ వరల్డ్ క్లాస్ బౌలర్స్. కొత్త ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ కూడా సెంచరీ కూడా చెప్పుకోదగిందే. దీన్నిబట్టి జట్టులో ఉన్న 9 మంది బ్యాట్స్ మెన్లూ సెంచరీ చేయగల సమర్ధులే అని గర్వంగా చెప్పొచ్చు. గతంలో టీం ఇంత గొప్పగా ఎప్పుడూ లేదు. వరల్డ్ క్రికెట్ లో కూడా ఇలాంటి టీం చాలా అరుదు. 

ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే.. బెంచ్ స్ట్రెంగ్త్. ప్రతీ ఆటగాడికి ఇద్దరు ముగ్గురు ప్రత్యామ్నాయ ప్లేయర్లున్నారు. శిఖర్ ధవన్ గాయపడితే కేఎల్ రాహుల్, పార్ధివ్ పటేల్. రహానే తప్పుకోవాల్సి వస్తే అవలీలగా ట్రిపుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్, రోహిత్ శర్మ. సాహా ఫిట్ గా లేకపోతే పార్ధివ్ పటేల్. ఇక బౌలింగ్ విభాగంలోనూ ఐదుగురు ఫాస్ట్ బౌలర్లకు అంతే కాలిబర్ ఉన్న ఐదుగురు ఆటగాళ్లు ఆల్టర్నేట్ ఉన్నారు. అశ్విన్, జడేజాకు తోడుగా జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా.

నేను తేనెతుట్టెను కదిపానని.. నా అభిప్రాయాల మీద రాద్ధాంతం చేస్తారని నాకు తెలుసు. కానీ ఒక్కటి అడుగుతా చెప్పండి. ఇంతకు ముందు టీమిండియా ఇంగ్లండ్ మీద ఇంత భారీ ఆధిక్యంలో సిరీస్ గెలిచిందా? పోనీ ప్రత్యర్ధి జట్టేం వీక్ కాదు కదా. వాళ్లలోనూ మంచిమంచి ఆటగాళ్లున్నారు. ఇంకో విషయం ఏంటంటే కోహ్లీ జట్టులో సీనియర్లంతా గాయాలబారిన పడ్డారు. ఆడినవాళ్లంతా కొత్తవాళ్లే. అయినా సీనియర్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. అందుకే విరాట్ సేనకు సెల్యూట్ చేస్తున్నా.. మరెన్నో మరపురాని విజయాలను అందించాలని కోరుకుంటున్నా..

రచయిత: అశుతోష్, ఆమ్ ఆద్మీ సీనియర్ నేత

(గమనిక: ఈ ఆర్టికల్ లో వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ రచయితవే. యువర్ స్టోరీ చెప్పినట్టుగా భావించవద్దని మనవి)