మనలోని వెలితే.. వేగంగా పరిగెత్తిస్తుంది..! వంద కోట్ల మందిలో ఒకడిగా గుర్తింపు తెస్తుంది.

మనలోని వెలితే.. వేగంగా పరిగెత్తిస్తుంది..! వంద కోట్ల మందిలో ఒకడిగా గుర్తింపు తెస్తుంది.

Saturday October 31, 2015,

4 min Read

టెక్ ఫర్ బిలియన్ అంటే ఏంటి ? ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఎలా చేరుకోవాలి ? ఇదీ శ్రద్ధా శర్మ ప్రశ్న. 

మూడు రోజుల పాటు బెంగళూరులో జరుగుతున్న టెక్ స్పార్క్స్ సమావేశాల్లో భాగంగా.. ఓ కార్యక్రమానికి హాజరైన ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ యువర్ స్టోరీ ఫౌండర్, చీఫ్ ఎడిటర్ శ్రద్ధా శర్మ అడిగిన ప్రశ్న.

ఈ లోపే హాల్ అంతా ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంత వరకూ ప్రశాంతంగా ఉన్న హాల్ అంతా ఈ ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు.

'మన చుట్టూ ఉన్న వందలు, వేల మందిని ఓ సారి జాగ్రత్తగా గమనిద్దాం. వాళ్లందరిలో ఏదో ఒకటి చేయాలనే తపన, ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కాంక్ష బలీయంగా ఉంటుంది. వాళ్ల కళ్లలో ఆ మెరుపును మనం చూడొచ్చు. కొంత మంది మల్టీ బిలియన్ డాలర్ కంపెనీని ఎలా నిర్మించాలా అని కలలు కంటూ ఉంటే.. మరికొందరు ఇన్వెస్టర్‌ దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడ్తూ ఉంటారు. కానీ అందరి లక్ష్యం ఒకటే.. విజయ తీరాలకు చేరుకోవాలని. ఇంత మంది జనం, ఇంత హడావుడిలో మనం పడిన కష్టాన్ని, చేస్తున్న కృషిని గుర్తుంచుకుని గర్వపడ్తున్నామా.. ? లేక మరిచిపోతున్నామా ?

image


''ఓ ఆంట్రప్రెన్యూర్‌గా మనం ఓ విషయాన్ని నమ్ముతాం, కానీ ఆశ్చర్యం ఏంటంటే.. మన దాని గురించి అసలు పట్టించుకోం. గమ్యాన్ని చేరుకోవడానికి చేసే సుదీర్ఘ ప్రయాణంలో మనకి మనమే ఓ సూపర్ స్టార్‌ అని గుర్తించడం మరిచిపోతాం. మన చుట్టూ నలుగురు ఉన్నప్పుడు, ఏ కష్టం వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్ల సావాసం అండగా ఉండగా.. ఎంత దూరం వెళ్లేందుకైనా ధైర్యం వస్తుంది. ఎవరి ఆసరా లేకుండా ఓ పెద్ద సమూహం మధ్యకి వెళ్లి ఒంటరిగా నిలబడి వాళ్లందరినీ ఎదుర్కోవడం మాత్రం అంత సులువైన పనేం కాదు'' అంటారు శ్రద్ధా.

మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే చుట్టుపక్కల ఉన్న వాళ్లను కూడా అభిమానిస్తామని శ్రద్ధా అంటారు. యువర్ స్టోరీ టీం కూడా అదే చేసింది. ''మమ్మల్ని మేం ప్రేమించుకున్నాం, మాపై మేము నమ్మకాన్ని పెంచుకున్నాం.. అలానే యువర్ స్టోరీని నిర్మించాం''.

అయితే విజయవంతం కావడానికి ఇదొక్కటే మార్గమా... ? ఈ మాత్రానికే సక్సెస్ సొంతమైపోతుందా ? ఇదే సందేహం ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్లందరికీ కలిగి ఉంటుంది. ఆంట్రప్రెన్యూర్లకే కాదు.. ఇన్వెస్టర్లకు కూడా. వాళ్ల గొప్పదనాన్ని వాళ్లకు చెప్పడం, వాళ్లు ఎంత ఎక్స్‌ట్రాఆర్డినరీయో వివరించడంలోనే సగం సక్సెస్ వస్తుందనేది శ్రద్ధ అభిప్రాయం. చిన్నపిల్ల మనస్తత్వంతో.. ఏ మాత్రం అనుభవం లేని రోజుల నుంచి ఇప్పుడు యువర్ స్టోరీని ఈ స్థాయికి తీసుకురావడం వరకూ.. ఎంత శ్రమపడ్డారో.. శ్రధ్ద వివరించారు.

''నేను ట్విట్టర్‌లో ఆలస్యంగా చేరాను. 'ఎవరైనా ఓ బిగ్ షాట్.. నా ట్వీట్‌ను రీట్వీట్ చేయాలని నాకు ఓ పెద్ద కోరిక ఉండేది. అందుకే అందరినీ ట్యాగ్ చేయడం మొదలుపెట్టాను. ఇది ఓ రకంగా స్పామింగ్ లాంటిదే. కానీ జనాలు ఎందుకు అసలు రీట్వీట్ చేయరో నాకు అర్థమయ్యేదే కాదు. చిన్న రీట్వీట్‌తో ఒకరిని ఒకరు ఎందుకు ప్రశంసించుకోలేక పోతున్నారో తెలిసేది కాదు''.

అయితే తాను అనుకున్న కల అప్పుడు నెరవేరకపోయినా... శ్రద్ధా మాత్రం అదే పనిని మరింత ఇష్టంతో చేసుకుంటూ వెళ్లేవారు. '' ఏదో మ్యాజిక్‌లా.. నాకు తోచిన, నాకు తెలిసిన ప్రేమ, అభిమానాన్ని అలా పంచుకుంటూ వెళ్లాను. అది కూడా ఒకరితో సంబంధం లేకుండా''. బిగ్ షాట్స్ ఎవరూ నాకు సహకరించకపోతే ఏం ? నేను మాత్రం ఇతరులకు సహాయం చేయాలని, వాళ్లకు తోడ్పాటు అందించాలనే నిర్ణయించుకున్నా. ఈ రోజు మాతో ఇంత మంది జతకట్టడానికి కారణం ఒకప్పుడు మేం వాళ్లపై చూపించిన అభిమానం, ప్రేమే'' అంటారు శ్రద్ధా.

తీర్పులు చెప్పడంలో జనాలు పండిపోయారు. ఓ కంపెనీ మల్టీబిలియన్ డాలర్ సంస్థగా ఎదుగుతుందా లేదా... అని చెప్పడానికి మనం ఎవరు ? స్వార్థం లేకుండా మీరు ఇతరులకు సాయం చేసినప్పుడు, ఓ మంచి మాట చెప్పి వాళ్లను ప్రోత్సహించినప్పుడు మనకే కాదు.. మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా సంతోషం కలుగుతుంది. అలా మీకు కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నన్ను చూడండి..! అలాంటి ఆనందం వల్ల నేను ఎంతగా మెరిసిపోతున్నానో. ఇది మేకప్ మాత్రం కాదండోయ్ !

కాస్త విభిన్నంగా అనిపించినా.. ఆడియన్స్ అందరికీ శ్రద్ధా ఓ సలహా చెప్పారు. 'మీరు నిలదొక్కుకోవడం కష్టం, మీ ఆలోచన వర్కవుట్ కాదు'.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చే వాళ్లకు.. '' ఓ ముద్దు పెట్టండి. అదే వాళ్లకు ఓ పెద్ద గిఫ్ట్'' అని సూచించారు. ఆడియన్స్‌ అంతా చప్పట్లు కొట్టడమే కాదు... అందులో కొంత మంది లేచి 'మున్నాభాయ్ జాదూ కీ జప్పీ'..ని మరో మూడు అడుగులు ముందుకు తీసుకెళ్లారు అంటూ అభినందించారు.

తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న శ్రద్ధా ముంబైలో జరిగిన ఓ సంఘటను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'ఆంట్రప్రెన్యూర్స్ సక్సెస్ స్టోరీస్ రాయాలని అనుకుంటున్నాను' అని ఓ ఇండస్ట్రీ ప్రముఖుడికి వివరించాను. అప్పుడు ఆయన 'రాయ్.. ఏడు రోజులు కూడా నడవదు' (లిఖో.. సాథ్ దిన్ భీ నహీ చలేగా) అన్నారు. దీంతో బాధను తట్టుకోలేక ఇంటికి వచ్చి ఏడుస్తూ.. తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన సంఘటను చెప్పి కుమిలిపోయారు.

యువర్ స్టోరీ ఏడు రోజుల్లో మూతబడలేదు.. ఏడేళ్లుగా స్థిరంగా నిలబడింది. ఇప్పుడు 10 భాషల్లో ఆంట్రప్రెన్యూర్స్ విజయగాధలను ప్రపంచానికి వివరిస్తోంది. మరో ఏడేళ్లు కూడా ఇలా రాస్తూనే ఉంటాం.. అంటూ హామీనిచ్చారు శ్రద్ధా శర్మ.

టెక్ ఫర్ బిలియన్

మన దగ్గర లేనిది, మనకి దూరంగా ఉన్నదే మనల్ని ధృడంగా మారుస్తుంది. అవే మన ఆశల సౌధాలని నిర్మించి.. గమ్యాన్ని చేరుకుని వంద కోట్ల మందిలో ఒకడిగా గుర్తింపు తెచ్చిపెడ్తాయి.

అందని వాటి కోసం వేసే అడుగే.. అందలం ఎక్కిస్తుంది. మందలో ఒకడిలా కాకుండా.. మనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెస్తుంది.

చివరగా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరికీ ఆమె చెప్పిన మాట ఒక్కటే...

''మీ అందరి విజయంలోనే మా విజయమూ ఉంది''.