మూడో విడత హరితహారం కోసం సిద్ధమవుతున్న ఊరూ వాడా

0

మూడో విడత హరితహారానికి తెలంగాణ సిద్దమౌతోంది. ఈసారి రాష్ర్ట వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటే భారీ లక్ష్యంతో పనులను వేగవంతం చేస్తోంది అధికార యంత్రాంగం. అటవీ శాఖతో పాటు, గ్రామీణాభివృద్ది, ఉద్యానవన, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 2,925 నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం జరుగుతోంది. ఈ యేడాది 31 జిల్లాల పరిధిలో మొత్తం 40 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటి కప్పుడు నివేదికలను తెప్పించుకుంటూ, హరితహారం ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్ని జిల్లాల్లో హరితహారం పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తూ, నర్సరీ లను పరిశీలిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతంగా ఉన్న పచ్చదనాన్ని మరో తొమ్మిది శాతం పెంచి 3కు చేర్చటమే తెలంగాణకు హరితహారం లక్ష్యమని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఈ స్ఫూర్తితోనే ఇప్పటికి రెండుసార్లు జరిగిన హరితంహారం మంచి ఫలితాలను ఇస్తోందని అటవీ శాఖ వెల్లడించింది. రెండు విడతల్లో నాటిన మొక్కలు ఎదుగుతూ పచ్చదనాన్ని పరుస్తున్నాయి. ఆ ఫలితాలే ఈయేడు హరితహారంలో పాల్గొనే ప్రతీ ఒక్కరికీ ఆదర్శమయ్యాయి. ఈ యేడు హరితహారం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలు చురుగ్గా పనిచేస్తున్నారు.

రుతుపవనాల రాక సరైన సమయానికే అని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేయటంతో హరితవారం విజయవంతానికి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. మండల స్థాయిలో ఏర్పాటైన కమిటీలు మొక్కలు నాటాల్సిన ప్రదేశాలను గుర్తించటంతో పాటు, ఎక్కడ ఏ రకం మొక్కల అవసరం ఉందో కమిటీలు నిర్దేశిస్తున్నాయి. ఈ సారి హరితహారంలో పండ్ల మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు, వాటిని పెద్ద సంఖ్యలో సిద్దం చేశారు. ఉసిరి, నేరేడు, మేడి, పనస, జామ పండ్ల మొక్కల సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక చెరువులు, కుంటలు, వాటి వెంట కట్టలపై తాటి, ఈత చెట్లను పెంచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్సయిజ్ శాఖ అధికారులు, సిబ్బంది సిద్దమౌతున్నారు. ఆయా నర్సరీల్లో సిద్దంగా ఉన్న మొక్కల రకాలు, వాటి సంఖ్యతో పాటు, గుర్తించిన గ్రామాలు, ప్రదేశాల పట్టికను గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధి నుంచి అందరికీ అందుబాటులో ఉంచేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. టేకు మొక్కలు పదిహేను కోట్లు, ఈత మొక్కలు రెండున్నర కోట్లు ప్రస్తుతం సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ మొక్కలు నాటించడంలో పాటు రక్షణ చర్యలూ వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

గ్రామం, మండలం, ఫారెస్ట్ జోన్, జిల్లా స్థాయిలో మొక్కల పంపణీ, నాటడం, సంరక్షణ చర్యలు చేపట్టేలా అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేందుకు, శాఖల మధ్య సమస్వయం కోసం జిల్లా స్థాయిలో అధికారుల కమిటీ పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులు, పురోగతిని అటవీ శాఖ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటోంది.

ఇక ఈసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని స్థాయిల్లో రోడ్ల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రధాన్యత ఇస్తున్నారు. జాతీయ, రాష్ర్ట రహదారులతో పాటు పంచాయతీ రాజ్ పరిధిలో ఉండే రోడ్ల వెంట కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటనున్నారు. సరాసరి జిల్లాకు వంద కిలో మీటర్ల చొప్పున మొత్తం 31 జిల్లాల్లో మూడు వేల కిలో మీటర్లకు పైగా రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలు కనీసం రెండు మీటర్ల ఎత్తులో ఉండటంతో పాటు, నీరు అందేలా చర్యలు, రక్షణ కోసం ట్రీ గార్డుల ఏర్పాటు తక్షణం జరిగేలా ప్రణాళికలు సిద్దమౌతున్నాయి. 

ఇక వీటితో పాటు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్న గుట్టలపైనా, వాలుల్లో చెట్లు పెంచేందుకు ఈ సారి వినూత్న ప్రయోగం చేస్తోంది. సీడ్ బాంబింగ్ పేరిట మట్టి, విత్తనాలు కలిపి తయారు చేసిన విత్తన బంతులను పెద్ద ఎత్తున గుట్ట ప్రాంతాల్లో చల్లాలని నిర్ణయించారు.                         

Related Stories