ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ మార్కెట్‌లో కామర్స్‌కు కేరాఫ్

కామర్స్ విద్యార్థులే లక్ష్యంగా ఆన్ లైన్ కోర్సులు

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్ మార్కెట్‌లో కామర్స్‌కు కేరాఫ్

Friday November 20, 2015,

4 min Read

కాస్త వినూత్నంగా ఆలోచించాలేగానీ.. ఏరంగంలోనైనా నిలదొక్కుకోవచ్చని నిరూపిస్తోంది సీఏకార్ట్. ఇప్పుడు మనదేశంలో వేగంగా విస్తరిస్తోన్న ఆన్ లైన్ ఇండస్ట్రీ ఎడ్యుటెక్‌. ఇప్పటికే ఇందులో ఎన్నో సంస్థలు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి. తాజాగా సీఏకార్ట్ కూడా ఈ లిస్ట్ లో చేరింది. అయితే పోటీని తట్టుకునేందుకు ఆ సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్రత్యేకంగా కామర్స్ విద్యార్థులే లక్ష్యంగా ఆన్ లైన్ కోర్సులు, ట్రైనింగ్ ఆఫర్ చేస్తోంది.

image


అలా మొదలైంది సీఏకార్ట్

ఎడ్యూటెక్ రంగం దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఏడాదికి 8 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ రంగంలో ట్యూటర్ విస్టా, కోర్సెరా, స్కిల్ అఫ్‌ ఇండియా, ఎడ్యురెకా అనే సంస్థలు నిలదొక్కుకున్నాయి. తాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది సీఏకార్ట్. సుఫలాం ఫౌండర్ అయిన పురు మిశ్రా ఆలోచనకు కార్యరూపమే సీఏకార్ట్. దాని ప్రారంభం కూడా ఆసక్తికరమైందే. 2011 నుంచి ఈ-లెర్నింగ్ టెక్నాలజీని దేశంలోని వివిధ విద్యాసంస్థలకు అందజేస్తోంది సుఫలాం. ఆ టెక్నాలజీ సాయంతో క్లైంట్లు వీడియో కోర్సెస్ ను సృష్టించి విద్యార్థులకు అమ్ముతున్నారు. 2013లోనూ ఇలాగే సుఫలాం టెక్నాలజీని కొనుగోలు చేసింది ముంబైలోని ఓ పేరున్న విద్యాసంస్థ. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన వీడియో కోర్సులను సృష్టించింది. కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా అమ్మలేదు. కారణమేంటా అని పురు మిశ్రాను కొందరు ఆరాతీశారు. కొత్త ఉత్పత్తులను అమ్మకానికి పెడితే ఇప్పటికే నడుస్తున్న తమ క్లాస్ రూమ్ బిజినెస్ దెబ్బతింటుందని సదరు విద్యాసంస్థ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పురు, అతని టీమ్ ఓ కొత్త ప్రతిపాదనతో వారిని సంప్రదించింది. వారు తయారుచేసిన వీడియో కోర్సులను దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమ్మిపెడతామని, వచ్చిన లాభాల్లో కొంత వాటా ఇస్తామని వారు ప్రతిపాదించారు. ముంబై మినహాయించి మిగతా ప్రాంతాల్లో తమకు అంతగా మార్కెట్ లేకపోవడంతో సదరు విద్యాసంస్థ కూడా దానికి అంగీకరించింది. అలా మొదలైందే ‘సీఏకార్ట్’.

విజయవంతమైన ప్రణాళిక

సుఫలాం సాయంతో సీఏకార్ట్ బిజినెస్ టు బిజినెస్(బీ2బీ) కాన్సెప్ట్ నుంచి బిజినెస్ టు కస్టమర్(బీ2సీ)కు మారింది. దీనికోసం ఓ కన్సల్టెంట్ ను కూడా నియమించుకుంది. ఆన్ లైన్ వేదికగా నేరుగా కస్టమర్లతో బిజినెస్ ప్రారంభించింది. బీ2బీ మోడల్ తో పోలిస్తే బీ2సీ పూర్తిగా భిన్నం. ఆచరణలో పురు టీమ్ చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ‘సదరు విద్యాసంస్థ ఉత్పత్తులను మేము అమ్మడం ప్రారంభించిన తర్వాత చాలా సంస్థలు మమ్మల్ని గుర్తించి మాతో చేతులు కలుపడానికి ముందుకొచ్చాయి’ అని పురు మిశ్రా తెలిపారు. బీ2సీ కాన్సెప్ట్ తో తాముపడిన ఇబ్బందుల గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ‘మొదట్లో మా సేల్స్ టీమ్ ఒక్కో ఉత్పత్తిని అమ్మడానికి చాలా సమయం పట్టేది . బీ2బీ పద్ధతిలోనే కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నించాం. కానీ బీ2సీ మోడల్ లో అది ప్రతికూల ఫలితాన్ని చూపించింది’ అని పురు చెప్పారు. మెల్లగా సీఏకార్ట్ గురించి విద్యార్థులు ఆరాతీయడం ఎక్కువైంది. కానీ దానికి వారి టీమ్ మాత్రం సిద్ధంగా లేదు. దీంతో పాత పద్ధతికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు పురు మిశ్రా. కొత్త బిజినెస్ కు తగినట్లుగా కొత్త వ్యవస్థను ఏర్పాటుచేయాలని భావించారు. విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకొని అంతర్గతంగా ఒక ఇంక్వయిరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు. కొత్తగా ఆర్డర్ మేనేజ్ మెంట్ వ్యవస్థను కూడా నియమించారు. టీమ్ లోని సభ్యుల సంఖ్య పెరిగింది. కస్టమర్ సర్విస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. దీంతో మెల్లగా కస్టమర్లు ఆకర్షితులయ్యారు. అయితే తర్వాతి సవాల్‌.. వారి నమ్మకాన్ని సంపాదించడం. కొత్త సైట్ కావడంతో మొదట్లో చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ కోర్సులను ఆర్డర్ చేయడానికి వెనుకడుగు వేశారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ దిశగా కూడా ఆలోచించినా.. వచ్చే లాభాల్లో అంత వాటా కోల్పోయే పరిస్థితిలో పురు మిశ్రా లేరు. ప్రతి పైసా ముఖ్యమే. అందుకే పట్టువదలకుండా ప్రయత్నించారు. కస్టమర్లకు మంచి సర్వీస్ అందించడానికి ప్రయత్నించారు. తొలి 500 అమ్మకాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించారు. మేనేజ్ మెంటే నేరుగా కస్టమర్లతో మాట్లాడటం వల్ల వారి అవసరాలేంటో స్పష్టంగా తెలిసింది. దీనివల్ల విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించగలిగాం. మెల్లగా మాపై నమ్మకం కుదిరింది. విద్యార్థులు తమ స్నేహితులకు కూడా సీఏకార్ట్ గురించి చెప్పడం మొదలుపెట్టారు’ అని పురు మిశ్రా చెప్పుకొచ్చారు.

image


కొత్త ఆలోచనతో ముందడుగు

సీఏకార్ట్ ప్రారంభమై ఇప్పటికి సుమారు రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు లక్షా 80 వేలకుపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 110 మందికిపైగా అధ్యాపకులు వారితో ఉన్నారు. వెయ్యికిపైగా కోర్సులు, మిగతా ఉత్పత్తులు సీఏకార్ట్ నుంచి ఆన్ లైన్ మార్కెట్ లోకి వచ్చాయి. ప్రస్తుతం సీఏకార్ట్ ను పురు మిశ్రాతోపాటు తిరుచ్చి ఎన్ఐటీ గోల్డ్ మెడలిస్ట్ అయిన సునీల్ జావాజీ నడిపిస్తున్నారు. ఆఫ్ లైన్‌లో అందుబాటులో ఉన్న మెటీరియల్ అసంపూర్తిగా ఉంటున్నాయని పురు మిశ్రా అభిప్రాయపడుతున్నారు. వివిధ సబ్టెక్టుల కోసం విద్యార్థులకు వివిధ అధ్యాపకుల అవసరం ఏర్పడుతోంది. ఒక్క సబ్జెక్ట్ కోసం ఎన్నో పుస్తకాలు కొనాల్సి వస్తోంది. సమగ్ర సమాచారం కోసం సీనియర్లు, స్నేహితులపై ఆధారపడాల్సి వస్తోంది. చాలావరకు విద్యార్థుల అవసరాలు తీర్చే పరిస్థితిలో ఆఫ్ లైన్ మార్కెట్ లేదు. ఇటు ఆన్ లైన్ మార్కెట్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏం లేదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొనే సీఏకార్ట్ ఓ కొత్త ఆలోచన చేసింది. కేవలం కామర్స్ విద్యార్థులకోసం ప్రత్యేకంగా, సమగ్రంగా కోర్సులను రూపొందించడం మొదలుపెట్టింది. విద్యార్థికి ప్రతి దశలో తోడ్పాటును అందించాలని సీఏకార్ట్ బృందం లక్ష్యంగా పెట్టుకుంది. పరీక్షలకు సంబంధించిన సాధారణ సమాచారం, నిపుణుల మార్గదర్శకం, అనుమానాలు నివృత్తి చేసుకొనే అవకాశం, అన్ని రకాల పుస్తకాలు, ఇంటర్న్ షిప్, ఉద్యోగాలు కల్పించే వేదికగా కూడా సీఏకార్ట్ ను మలిచారు. సీఏకార్ట్ నుంచి పుస్తకాలు, కోర్సులను విద్యార్థులు కొనుగోలు చేయొచ్చు. లాభాల్లో కొంత వాటాను పబ్లిషర్ కు అందజేస్తారు.

భవిష్యత్ ఆశాజనకం

ప్రస్తుతం ఎడ్యూటెక్ మార్కెట్ విలువ 300 కోట్ల డాలర్లు. ప్రతి ఏటా కోటి 40 లక్షల మంది విద్యార్థులు కొత్తగా వచ్చి చేరుతున్నారు. ఏడాదికి 18 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ‘ప్రస్తుతం మా దృష్టంతా భారత ఆన్ లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ లో అగ్రస్థానానికి చేరడం. మిగతా దేశాల్లోనూ మా ఉత్పత్తులు అమ్ముడవుతాయన్న నమ్మకం ఉన్నా.. ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచించడం లేదు’ అని పురు మిశ్రా చెప్పారు. అయితే భవిష్యత్ లో నాలుగు లక్ష్యాలను మాత్రం నిర్దేశించుకున్నారు.

1. భారత ఆన్ లైన్ ఎడ్యుకేషన్ మార్కెట్ లో కామర్స్ కు కేరాఫ్ గా మారడం. 40 లక్షలకుపైగా ఉన్న కామర్స్ విద్యార్థులకు సీఏకార్ట్ ను ప్రధాన వేదికగా నిలబెట్టడం

2. ప్రపంచంలోనే అత్యధిక మంది అధ్యాపకులు, సంస్థలు సీఏకార్ట్ వేదికగా వివిధ కోర్సులు ఆఫర్ చేయడం

3. విద్యార్థులు, అధ్యాపకులకు అత్యుత్తమైన, అత్యంత ప్రభావవంతమైన అకడమిక్ అనుభవాన్ని అందించేలా ఈ-లెర్నింగ్ టూల్స్ ను కొత్తగా ఆవిష్కరించడం

4. భారత కామర్స్ మార్కెట్ లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత మిగతా సబ్జెక్టులు, ప్రాంతాలపై కూడా దృష్టిసారించడం.