నేరచరితగల నాయకులకు భవిష్యత్తు లేకుండా చేసిన ఐఐఎం డీన్ త్రిలోచన్ శాస్త్రి

ఐఐఎం-బెంగుళూర్‌ డీన్‌గా బాధ్యతలుఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల చరిత్ర చెప్పే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్పేద రైతులను ఆదుకునేందుకు సెంటర్ ఫర్ కలెక్టివ్ డిపార్ట్‌మెంట్లాభాపేక్ష లేని బిజినెస్ స్కూల్ ప్రారంభించాలనే లక్ష్యంఎవరూ టచ్ చేయని టాపిక్స్‌పై పుస్తకాలు రచించేందుకు వ్యూహంఅన్నీ కలిపితే త్రిలోచన్ శాస్త్రి

0

ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి, ఢిల్లీ ఐఐటీలో సాంకేతిక పట్టా, అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ, అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ చేశారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఏడేళ్లపాటు ప్రొఫెసర్‌గా చేసిన ఆయన.. తర్వాత 2003లో ఐఐఎం- బెంగుళూరులో కీలక విధులు నిర్వహించారు. గతంలో ఐఐఎం-బీ డీన్‌గా ఉన్నా... ప్రస్తుతం ఫ్యాకల్టీగా కొనసాగుతున్నారు. భారత్, జపాన్, హాంకాంగ్, అమెరికాల్లోని యూనివర్సిటీల్లో గెస్ట్ లెక్చర్లు చాలా ఇచ్చారు త్రిలోచన్ శాస్త్రి. పరిశోధన, విద్యారంగాలకు సల్పిన విశేష కృషికి జాతీయ అవార్డ్ అందుకున్న శాస్త్రి... భారతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ఈయన విద్యావేత్త, సామాజిక వేత్త.. సామాజిక కార్యకర్త కూడా.

త్రిలోచన్ శాస్త్రి
త్రిలోచన్ శాస్త్రి

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్

20 ఏళ్ల కెరీర్‌లో విద్య, సామాజిక సేవారంగాల్లో త్రిలోచన్ శాస్త్రి ఎన్నో బిరుదులు పొందారు. ఆయన స్థాపించిన అనేక లాభాపేక్ష రహిత సంస్థల్లో ప్రజాస్వామ్య సంస్కరణ సమాఖ్య(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్) ముఖ్యమైనది. అద్భుతమైన విజన్ గల సామాజిక కార్యకర్త ఈయన. రాజకీయ నాయకుల జీవితాల్లో పారదర్శకత ఉండాలంటూ ఈయన ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏడీఆర్ .... దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మలుపు అని చెప్పాలి. నేతల జీవితాల్లో చీకటి కోణాలు బయటపెట్టేందుకు... అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ ఏర్పాటుకు ముందే... 1999లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులుఉన్న క్రిమినల్ కేసులు, ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు వెల్లడించాలంటూ పిల్ దాఖలు చేశారు శాస్త్రి. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం పోటీకి ముందే అభ్యర్ధులందరూ విధిగా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు 2003లో వచ్చింది. ఇది పార్లమెంట్, శాసనసభ, ప్రాంతీయ, స్థానిక ఎన్నికలన్నిటికీ వర్తిస్తుందని తెలిపింది సుప్రీం. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి అభ్యర్ధులు తమపై ఉన్న కేసులు, ఆస్తిపాస్తులు, చదువుసంధ్యల వివరాలు వెల్లడించడం తప్పనిసరైంది.

ఓటర్లు ఈ వివరాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే నేరస్తుల సంఖ్య క్రమేపీ తగ్గేందుకు ఏడీఆర్ ఉపయోగపడిందనే చెప్పాలి. 2007లో జరిగిన ఎన్నికల్లో 18శాతం అభ్యర్ధులకు నేర చరిత్ర ఉంటే... తర్వాతి పోలింగ్ సమయానికి ఈ సంఖ్య 9శాతానికి పడిపోవడం విశేషం.

సెంటర్ ఫర్ కలెక్టివ్ డిపార్ట్‌మెంట్

ఐఐఎం-బెంగుళూరులో చేరేంముదు సెంటర్ ఫర్ కలెక్టివ్ డిపార్ట్‌మెంట్ అనే సంస్థను స్థాపించారు త్రిలోచన్ శాస్త్రి. ఇది కూడా లాభాపేక్ష లేని వ్యవస్థే. పలు రకాల వస్తువుల విక్రయాల్లో సహకార సంస్థలు ఏర్పాటు చేయడమే సీసీడీ ప్రధానోద్దేశ్యం. ప్రారంభించిన ఏడేళ్లలో ఆదిలాబాద్, అనంతపూర్ జిల్లాల్లోని 50 గ్రామాల్లో కో-ఆపరేటివ్ సంస్థలను ఏర్పాటు చేయగలిగారు. వీటిలో 2,500కి మందికి పైగా సభ్యులుండడం విశేషం. ప్రస్తుతం జిల్లా స్థాయిలో నడుస్తున్న వీటి టర్నోవర్ కోట్లకు చేరుకుంది. "ఇది విపరీతమైన అభివృద్ధి కాకపోయినా... వేగం, విస్తరణ కంటే నిలబడ్డం ముఖ్య"మంటారు శాస్త్రి.

అమూల్ మోడల్ ఆదర్శవంతం

"నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, అమూల్ సంస్థల వ్యాపార మోడల్ ప్రశంసనీయం. మా సహకార సంస్థలకు ఈ సంస్థల వ్యాపార విధానాలు జత చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం కమాడిటీ కోఆపరేటివ్స్.. ధాన్యపు మిల్లులను స్వయంగా నిర్వహించుకుంటున్నాయి. వీటిని మరింతంగా తీర్చిదిద్ది అమూల్ లాంటి ఒక అంతర్జాతీయ బ్రాండ్‌ తయారు చేయడమే లక్ష్య"మంటారు శాస్త్రి. స్నాక్స్ తరహా రెడీమేడ్ ఫుడ్స్ తయారు చేసి దేశవ్యాప్తంగా విక్రయించే లక్ష్యముంది సీసీడీ సంస్థకు. ఈ కార్యకలాపాల కోసం ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా నిధులు సమీకరించారు కూడా. మిల్లుల ఏర్పాటుకు ఈ నిధులను రుణంగా మంజూరు చేసి, అభివృద్ధి పథంలో నడిచేందుకు ప్రయత్నిస్తోందీ సంస్థ. దీంతో ఆయా సభ్యులకు ఆర్థిక స్థిరత్వం, బాధ్యత అలవాడతాయన్నది సంస్థ ప్రధానోద్దేశ్యం. అలాగే అభివృద్ధి కోసం తగినంతగా నిధుల సేకరణకూ ఇది ఉపయోగపడుతుందంటారు త్రిలోచన్ శాస్త్రి. అయితే అమూల్ సంస్థ చేసే వ్యాపార విధానానికి అదనంగా మరో కాన్సెప్ట్ కూడా ఉంది వీళ్ల దగ్గర. సభ్యులు పూర్తిగా ఆయా ఉత్పత్తులను కోఆపరేటివ్స్‌కే అమ్మనవసరం లేదు. కొంత ఓపెన్ మార్కెట్‌లోన విక్రయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. దీంతో తక్కువ ఆదాయం ఉండే రైతులు చిన్న చిన్న అప్పులనుంచి బయటపడొచ్చని చెబ్తారాయన.

కమాడిటీ కోఆఫరేటివ్స్ బాధ్యతలు పరిశీలిస్తూ త్రిలోచన్
కమాడిటీ కోఆఫరేటివ్స్ బాధ్యతలు పరిశీలిస్తూ త్రిలోచన్

సామాజికవేత్తగా మారిన విద్యావేత్త

"ఈ సమాజం కోసం నాకు నేనుగా ఏదైనా చేయడం నా బాధ్యత. ప్రారంభానికే చాలా సమయం పట్టిందని తెలుసం"టారు శాస్త్రి. రైతు సహకార సంఘాలను ఆయన అమితంగా ఇష్టపడతారు. పేద రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు వర్ఘీస్ కురియన్ కోఆపరేటివ్ మోడల్‌నే ఎంచుకున్నానని చెబ్తారు శాస్త్రి. గ్రామాలను పేదరికం నుంచి బయటకు తెచ్చే శక్తి ఈ సంఘాలకుందని నమ్ముతారాయన.

కొత్త తరహా బిజినెస్ స్కూల్ ప్రారంభించే యత్నం

ఓ వ్యాపార సంస్థతో కలిసి కొత్త తరహా బిజినెస్ స్కూల్ ప్రారంభించేందుకు శాస్త్రి ప్రయత్నిస్తున్నారు. దీన్ని కూడా భారీ లాభాపేక్ష లేకుండా నిర్వహించాలన్నది ఆయన ఉద్దేశ్యం. అలాగే ఈ స్కూల్ ద్వారా లాభాన్ని సామాజిక కార్యకలాపాలకే ఉపయోగిస్తానంటారు త్రిలోచన్. ఈ బిజినెస్ స్కూల్‌లో 5-10శాతం ప్రతిభావంతులకు ట్యూషన్ ఫీజులో భారీ రాయితీ ఇవ్వడం కానీ, పూర్తిగా రద్దు చేయడం కానీ చేయాలనే ఆలోచన కూడా ఉంది త్రిలోచన్‌కు.

మంచి మనుషుల కోసం ఎదురుచూపులు

డీన్ గా బాధ్యతలు, సెంటర్ ఫర్ కలెక్టివ్ డిపార్ట్‌మెంట్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్, బిజినెస్ స్కూల్.... ఇన్ని కార్యకలాపాలు ఒకేసారి నిర్వహించేందుకు మీకు సమయం సరిపోతుందా అని ప్రశ్నిస్తే.. ఆయన సమాధానం ఇది. "ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. అన్నింటినీ ఒకేసారి ప్రారంభించలేదు నేను. ఒకదాని తర్వాత ఒకటిగా నా ఆలోచనలు అమలు చేస్తున్నాను. ఏడీఆర్‌లో ఇప్పటికీ చురుగ్గానే ఉన్నా.. ఇతర ట్రస్టీలు, జాతీయ సమన్వయకర్త పూర్తి స్థాయి బాధ్యతలు చూసుకుంటున్నారు. బిజినెస్ స్కూల్ ఆలోచన ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉంది. అయితే వీటన్నిటిలో నాకిష్టమైనది సీసీడీ" అంటారు త్రిలోచన్ శాస్త్రి. దీనికోసం కొంతమంది మంచి వ్యక్తులను తీసుకోవాల్సి ఉంది. సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు తమంతట తాముగా ముందుకు రావాలంటారు శాస్త్రి. ప్రస్తుతం ఆయన ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని రెండు టాపిక్స్‌పై పుస్తకాలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.