పఠాన్ కోట్ దాడుల మాస్టర్ మైండ్.. జస్ట్ ఓ చాటింగ్ యాప్..!

స్మార్ట్ ఫోన్ లో యాప్ టెర్రరిస్టులు...!

పఠాన్ కోట్ దాడుల మాస్టర్ మైండ్.. జస్ట్ ఓ చాటింగ్ యాప్..!

Tuesday March 22, 2016,

2 min Read


పఠాన్ కోట్ లో ఉగ్రవాదలు అంత పకడ్బందీ ప్లాన్ తో ఎలా దాడి చేయగలిగారు..? చుట్టూ కమ్మేసి బలగాలు బుల్లెట్లతో విరుచుకుపడుతున్నా రోజుల తరబడి ఎలా దాక్కోగలిగారు...? ..భారత సైనికాధికారుల వ్యూహాలు ఎప్పటికప్పుడు వారికెలా తెలిసిపోయాయి...?

అన్నింటికీ ఒకటే సమాధానం...smeshapp....

సైబర్ టెర్రరిస్ట్ smeshapp....

smeshapp పైకి ఇదో చాటింగ్ యాప్... ఫ్రీగా టెక్ట్స్, వాయిస్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు... అంత వరకే మనకు తెలుస్తుంది. కానీ మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న మరుక్షణం నుంచి ఇది ఓ గూఢచారిగా మారిపోతుందని చాలా కొద్దిమందికే తెలుసు. ఇది చాలా ఖతర్నాక్ యాప్. కాంటాక్ట్స్, కాల్స్, మెసెజస్ అన్నింటినీ రికార్డు చేస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తున్నామో కూడా చెప్పేస్తుంది. పఠాన్ కోట్ లో సైనికులు ఎలాంటి వ్యూహాల్ని అమలు చేస్తున్నారో ఎప్పటికప్పుడు టెర్రరిస్టులు తెలుసుకోవడం వెనుక ఈ యాప్ ఉందని కొన్ని మీడియాసంస్థలు, నిఘాల వర్గాల పరిశోధనలో వెల్లడయింది. ఈ యాప్ కి సంబంధించిన సంచనల విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

ఇది అన్నింటిలాంటి చాటింగ్ యాపే. మరి దీన్నే ఎందుకు డౌన్ లోడ్ చేసుకోవాలనే డౌట్ మీకు వచ్చుండాలి. అక్కడికే వస్తున్నాం.. ముందుగా ఐఎస్ఐ ఉగ్రవాదులు ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా సైనికులకు టచ్ లో కి వచ్చారు. వారిని ఎలాగోలా ఎట్రాక్ట్ చేసి యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేలా చేశారు. ఆ తర్వాత పని పూర్తి చేశారు. ఈ యాప్ సైనికుల ఫోన్ల నుంచి దొంగించిన సమాచారాన్నంతా pbxmobiflex.com పేరుతో జర్మనీలో ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సర్వర్ పాకిస్థాన్ కు చెందిన సాజిద్ రానా అనే వ్యక్తికి చెందింది. సైనికుల్ని ఎట్రాక్ట్ చేసేందుకు పది ఫేస్ బుక్ అకౌంట్లను టెర్రరిస్టులు ఉపయోగించారు. దాదాపుగా పన్నెండు మంది మిలటరీ సిబ్బంది...యాడ్ డౌన్ లోడ్ చేసుకుని వారి ప్రమేయం లేకుండా ఆటోమేటిగ్గా టెర్రరిస్టుల అధీనంలోకి వెళ్లిపోయారు.

image


ప్లే స్టోర్ నుంచి తొలగింపు

యాప్ టెర్రరిస్టు గురించి పూర్తి సమాచారం బయటకు రావడంతో గూగుల్ వేగంగా స్పందించింది. smeshappను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. అయితే అప్పటికే ఆ యాప్ ను ఐదు వందల మందికిపైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. వీరిలో టెర్రరిస్టులు టార్గెట్ చేసినవారే ఎక్కువ. కేవలం సైనికులనే కాదు.. బీఎస్ఎఫ్ అధికారులు, సీఐఎస్ఎఫ్ జవాన్లను కూడా ఈ యాప్ టార్గెట్ చేసిందని ప్రాథమికంగా గుర్తించారు. ఇలాంటి యాప్ ల వల్ల ముప్పు పొంచి ఉందని భారత సైన్యం ఇప్పటికే అనేక రకాల అప్లికేషన్ల వాడకాన్ని నిషేధించింది. రెడ్ మీ ఫోన్ల ద్వారా ఆ యాప్ వాడుతున్న వ్యక్తుల సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు తరలిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే 2014 నుంచి భద్రతా బలగాల్లో జియోమి వాడకాన్ని నిషేధించారు.

అవగాహన పెంచుకోవాలి

యాప్ టెక్నాలజీని అర్థం చేసుకునే సామర్థ్యం... సైనికులకు, సైనికాధికారులకు తక్కువే. వీరే కాదు యాప్ లు డౌన్ లోడ్ చేసుకునే సమయంలో ఎక్కువ మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూంటారు. ఏదైనా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నప్పుడు మొబైల్ లోని ఫంక్షన్స్ ను ఉపయోగించుకునేందుకు పర్మిషన్ అడుగుతుంది. దీన్ని చాలా మంది పట్టించుకోరు. వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు. అక్కడే పప్పులో కాలేస్తారు. అసలు సమస్య ఆడనే మొదలవుతుంది. మన ఫోన్ ను తీసుకెళ్లి ఆ యాప్ చేతిలో పెట్టేస్తున్నామనే సంగతి తెలియదు.

smeshapp అనుభవంతో సైబర్ టెర్రరిస్టుల గండం ప్రారంభమైందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇలాంటి దాడుల్ని కాచుకోవడానికి ప్రపంచం అంతా వారికన్నా వేగంగా, అంతకుమించి స్మార్ట్ గా ఆలోచించాలి.