ఆ నలుగురు ఉరికంభం ఎక్కక తప్పదు

ఆ నలుగురు ఉరికంభం ఎక్కక తప్పదు

Saturday May 06, 2017,

2 min Read

నిర్భయ కేసులో దోషుల పాపం పండింది. వాళ్లకు ఉరే సరైన శిక్ష అని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. కింది కోర్టులు ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తూ నలుగురికి మరణ దండన విధించింది. ఈ తీర్పు కేవలం నిర్భయ తల్లిదండ్రులు మాత్రమే సాధించిన విజయం కాదు.. ఆమె తరుపున గళం వినిపించిన ప్రతీ ఒక్కరి విజయం. మహిళా రక్షణ గాల్లో దీపమైన ఈ రోజుల్లో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన జడ్జిమెంట్ కిరాతకుల వెన్నుల్లో వణుకు పుట్టించాలి.

image


సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా సంచనలం రేపింది. ఆరుగురు రాక్షసులు ఒకమ్మాయిని కదిలే బస్సులో అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. ఆమెతో పాటు బస్సెక్కిన స్నేహితుడిని కొట్టి కిందకి దించి, నిర్భయను నిర్దయగా సామూహికంగా అత్యాచారం చేసి, పేగులు బయటకి వచ్చేలా ఇనుపరాడ్లతో దాడిచేశారు. తోడేళ్లలా మీద పడి చిత్రహింసలు పెడుతుంటే- అభాగ్యురాలు కనికరించమని కాళ్లావేళ్లా పడింది. అయినా వినని ఆ దుర్మార్గులు ప్రాణాలు పోయేదాకా వదల్లేదు. రక్తమోడుతున్న అమ్మాయిని నడుస్తున్న బస్సులోంచి తోసేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి రాజధాని వీధిలో బట్టల్లేకుండా నడిరోడ్డు మీద ఒకమ్మాయి విగతజీవిగా పడివున్న దృశ్యం బండరాయి చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. 13 రోజులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడి చివరికి సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూసింది.

నిర్భయ అత్యాచార ఘటన యావత్ దేశాన్నే కుదిపేసింది. యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నినదించారు. ఒక దశలో పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. వాదప్రతివాదాలు, సాక్ష్యులు, వాంగ్మూలాలతో సాగిన సుదీర్ఘ పోరాటంలో మొదట ట్రయల్ కోర్టు ఆరుగరికి మరణశిక్ష విధించింది. ఆ తీర్పుని హైకోర్టు సమర్ధించింది. ఆ సమయంలోనే రామ్ సింగ్ అనే దోషి చనిపోయాడు. అయితే అది హత్యా ఆత్మహత్యా అనేది తేలలేదు. మిగిలింది ఐదుగురు. అందులో ఒకరు బాలనేరస్తుడు. అతడు 2015లో విడుదలయ్యాడు. విచిత్రం ఏంటంటే రెండు రోజుల తర్వాత బాల నేరస్థుల వయసుని 18 నుంచి 16కి తగ్గిస్తూ రాజ్యసభలో జువైనల్ జస్టిస్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. ఇక మిగిలింది నలుగురు నేరస్తులు. ముఖేష్ సింగ్, వినయ్ గుప్తా, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్. వీళ్లు హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. అయితే అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ నలుగురు దుర్మార్గులను క్షమించలేదు. వాళ్లను ఉరితీయడంలో తప్పులేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. వాళ్లకు మరణదండనే సరైన శిక్ష అని తీర్పు చదువుతుంటే- కోర్టు హాల్ దద్దరిల్లిపోయింది. న్యాయస్థానం ఆవరణలోనే ఉన్న నిర్భయ తల్లి ఉద్వేగంతో కన్నీళ్ల పర్యంతమైంది.

మొత్తానికి నిర్భయ కేసులో సుప్రీం తీర్పు కూడా వచ్చింది. ఫైనల్ గా మిగిలింది రాష్ట్రపతి క్షమాభిక్ష. అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే, ఆ నలుగురు ఏదో ఒక తెల్లవారుజామున ఉరికంభం ఎక్కక తప్పదు.