డెంటిస్ట్ నుంచి డిజైనర్ దాకా..  

0


మనసు మాట వినాలి.. మనసుకు ఏది చేయాలని పిస్తే అది చేయ్‌. మనసు చంపుకొని బతకొద్దు ఇలా ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. కానీ తమ అభిరుచులను కాదనుకుని, కుటుంబ గౌరవం కోసమో, తల్లిదండ్రుల కోరిక కోసమో తమ కెరీర్లతో కాంప్రమైజ్‌ అయిపోతుంటారు. అంతేనా.. ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడో మిగిలిన అసంతృప్తితో జీవితాన్ని నెట్టుకుపోతుంటారు కొందరు.

ఆ కొందరిలా మిగలొద్దనేదే అంచల్ పట్టుదల. వృత్తిరీత్యా ఆమె ఒక డెంటిస్ట్‌. ఎంతో వ్యయప్రయాసల కోర్చి డెంటల్‌ కోర్సు పూర్తి చేసింది. కానీ ఎక్కడో తెలియని అసంతృప్తి మనసును ఆవహించింది. ఏంటది..? తనను తాను ప్రశ్నించుకుంది. కొన్నాళ్లకి సమాధానం దొరికింది. వెంటనే డెంటిస్ట్‌ కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. తనకెంతో ఇష్టమైన కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, వ్యాపారం వైపు అడుగులు వేసింది. 

అవకాశమే అందలం ఎక్కించింది..

2014లో ఇండియాలో అప్పుడప్పుడే ఈ కామర్స్‌ రంగం వేళ్లూనుకుంటోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బిజినెస్‌లో దూసుకెళ్లాలని ఆంచల్‌ నిర్ణయం తీసుకుంది. వెంటనే "పెహ్‌నావా" పేరిట ఈ కామర్స్‌ ప్లాట్‌ ఫాం తయారు చేసింది. సంప్రదాయ డిజైన్లకు పెట్టింది పేరుగా తన స్టార్టప్ ను తీర్చిదిద్దాలనుకుంది. అంతే కాదు డిజైనర్‌ వేర్‌ అనే కాన్సెప్ట్‌ ను కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రతీ ఒక్కరూ మనీష్‌ మల్హోత్రా లాంటి టాప్‌ డిజైనర్లతో దుస్తులు డిజైన్‌ చేయించలేరు. మరి అలాంటి వారి కోసం తక్కువ ఖర్చుతో కొత్త డిజైనర్ల చేసిన దుస్తులను అందుబాటులోకి తెచ్చింది.

అంతేకాదు మార్కెట్‌ కు సంబంధించిన మెళకువలను అందిపుచ్చుకునే పనిలో పడింది. ఒక ఈ కామర్స్‌ పోర్టల్‌ ద్వారా వ్యాపారం ప్రారంభించాలని అంతా సెట్‌ చేసుకుంది ఆంచల్‌. ఒక ఐటీ కంపెనీని కూడా సంప్రదించింది. కానీ ఇంతలోనే మోసం జరిగిపోయింది. తను ఎంతో ఇన్వెస్ట్‌ చేసి రూపుదిద్దాలనుకున్న వెబ్‌సైట్ తయారుచేస్తున్న కంపెనీ ఫ్రాడ్‌ అని తేలింది. ఇది నిజంగా ఒక షాక్‌. అయినా భయపడలేదు. ఛాలెంజ్‌గా తీసుకొంది. ఐటీ రంగంతో సంబంధం లేకపోయినా ఒక టీంను ఏర్పాటు చేసుకొంది. పెహ్‌నావా వెబ్‌ పోర్టల్‌ ఈ కామర్స్‌ బిజినెస్‌ను స్టార్ట్‌ చేసింది. నెమ్మదిగా సేల్స్‌ పెరిగాయి. ఆర్డర్లు పెరుగుతూ పోయాయి.

కస్టమర్‌ ఫ్రెండ్లీగా పెహ్‌నావాను తీర్చిదిద్దడంలో ఆంచల్‌ సఫలం అయ్యింది. కస్టమర్లు కోరిన డిజైన్లను అందుబాటులో ఉంచింది. వినూత్నమైన ఆఫర్లతో పెహ్‌నావా దూసుకొచ్చింది. పెద్ద ఆన్‌లైన్‌ పోర్టల్స్ బిగ్‌ బిలియన్‌ సేల్‌ లాంటివి ఆఫర్లు ప్రకటించినప్పటికీ. పెహ్‌నావా ఎక్ల్సూజివ్‌ డిజైన్లతో కస్టమర్లను ఆకర్షించి సేల్స్‌ గ్రాఫ్‌ పడనివ్వలేదు. అమ్మకాలు పెరిగే కొద్దీ సైట్‌ ట్రాఫిక్ ను మరింత పెంచేలా సర్వర్‌ సామర్థ్యాన్ని పెంచింది. ఇప్పటి వరకూ పెహ్‌నావా సైట్‌ నుంచి 20వేల మంది కొనుగోళ్లు జరగగా, ఏటా లక్షన్నర డాలర్ల రెవెన్యూను ఆర్జించింది.


పోరాటమే విజయరహస్యం..

నిజానికి ఆంచల్‌ తీసుకున్న నిర్ణయం కుటుంబానికి నచ్చలేదు.  ప్రోత్సాహం పెద్దగా లభించలేదు. కానీ విజయమే అతి పెద్ద ప్రోత్సాహం ఇస్తుందని ఆంచల్‌ భావించింది. అనుకున్నట్టే కష్టపడింది. ఆంచల్‌కు ఎదురు దెబ్బలు తగిలినా, ఆమె తీసుకున్న నిర్ణయం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా, తండ్రి మాత్రం తనవైపే నిల్చున్నాడు. కూతురు ఇష్టాయిష్టాలను కాదనలేదు. 

ఆంచల్‌ ప్రస్తుతం తన తోటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు వారికి శిక్షణ ఇచ్చి మరీ పనిలో పెట్టుకొని సమాజిక బాధ్యతను తలకెత్తుకుంది. అలాగే కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద మహిళలకు ఆత్మరక్షణపై ఎనిమిది కాలేజీల్లోనూ, ఆఫీసుల్లోనూ అవగాహనా సదస్సులు, ఆత్మరక్షణ పరికరాలు అందజేసింది. అంతేకాదు త్వరలోనే ఆంచల్‌ జ్యువెల్లరీ, ఇతర ఆభరణాల వ్యాపారంలో కూడా ప్రవేశించబోతోంది.  

Related Stories