తెలుగువారికి టెక్నాలజీ పాఠాలు చెబుతున్న శ్రీధర్ నల్లమోతు

0


టెక్నాలజీ ప్రాంతీయ భాషల్లోకి వచ్చినప్పుడే మనదేశంలో మరిన్ని అద్భుతాలు సాధ్యపడతాయని టెక్ గురూల సమావేశంలో ప్రధాని మోడీ అన్నారు. ఫేస్ బుక్, గూగుల్ కూడా.. దానికి కట్టుబడి ఉన్నామని భారతీయ అన్ని భాషల్లో సేవలు అందిస్తామని ప్రకటించాయి. దేశంమొత్తం ప్రాంతీయ భాషలపై చాలా స్టార్టప్ లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే, తెలుగు వారికోసం కంప్యూటర్ నాలెడ్జీని తెలుగులో అందిస్తోన్న తెలుగు టెక్ గురు గురించి మీకు తెలుసా? ఆయనే శ్రీధర్ నల్లమోతు. ఇరవై ఏళ్లుగా కంప్యూటర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను సామాన్యులకు అందించడమే ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు.

జీవితాన్ని మార్చేసిన అమ్మమ్మ మరణం

అమ్మమ్మ చనిపోయినప్పుడు సొంతూరు వెళ్లడానికి తను ఇష్టపడలేదట. అప్పటికే డ్రగ్స్, గుట్కాలకు బాగా ఎడిక్ట్ అయిన శ్రీధర్ తనని ఊర్లో చులకనగా చూస్తారని వెళ్లలేదట. అప్పటికే ఎడ్యుకేషన్ డిస్ కంటిన్యూ అయిన శ్రీధర్ ని ఊళ్లో బ్యాడ్ బాయ్ గా ట్రీట్ చేసేవారు. దాన్ని తప్పించుకోడానికి ఊరొదిలి వచ్చేశారు. ఇంతలో అమ్మమ్మ చనిపోయిన కబురు. విషయం తెలిసినా వెళ్లడానికి వెనుకడుగు వేశారు.. ఆ సంఘటన తర్వాత వ్యసనాలను దూరం పెట్టారు. అప్పుడే కర్నూల్ లో అకౌంటెంట్ ఉద్యోగం రావడం.. జాయిన్ కావడం చకచకా జరిగిపోయాయి.

చెన్నై నుంచి హైదారబాద్ కి

కర్నూల్ లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో చెన్నై కేంద్రంగా నడిచే సూపర్ హిట్ మ్యాగజైన్ నుంచి ఆఫర్ వచ్చింది. దీంతో చెన్నై వెళ్లి పోయారు. కొన్నేళ్లు అక్కడే పనిచేశారు. పెద్ద పెద్ద స్టార్ల తో ఇంటర్వ్యూలు.. జీవితం కలర్ ఫుల్ గా ఉండేదని శ్రీధర్ గుర్తు చేసుకున్నారు.

అలా టెక్నాలజీపై పెరిగిన మక్కువతో హైదరాబాద్ లో కంప్యూటర్ ఎరా పేరుతో ఒక మ్యాగజైన్ ప్రారంభించారు. ఇది 1998 మాట. ఆ తర్వాత తెలుగులో టెక్నాలజీకి ఈ మేగజైన్ కేరాఫ్ అడ్రస్ అయింది. 2009 నుంచి టీవీ షోలతో జనానికి టెక్ పాఠాలు చెబుతున్నారు. 2000 సంవత్సరంలోనే తనకు అమెరికా నుంచి ఆఫర్ వచ్చింది. కానీ టెక్ పాఠాలు చెప్పడంపై ఉన్న ప్యాషన్ తో ఇక్కడే ఉండిపోయారు.

పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీ

అప్పా లో ఎస్సై, సీఐలకు కంప్యూటర్ పాఠాలు చెబుతారు శ్రీధర్. సైబర్ క్రైం పై శ్రీధర్ రియల్ టైం సొల్యూషన్ అందిస్తున్నారు. ఇటీవల పెరిగిపోయిన సోషల్ సైట్ల వల్ల సైబర్ క్రైం పెరిగి మాట వాస్తవమే. దాన్ని సరైన పద్దతిలో తెలుసుకుంటే పరిష్కారం చూపించొచ్చని శ్రీధర్ అంటారు.

క్రైం చేయడం ఈజీ అయినట్లే, క్రైం చేసిన వాళ్లను పట్టుకోవడం కూడా అంతే తేలికనేది శ్రీధర్ అభిప్రాయం. పోలీసులతో కలసి పనిచేయడం వల్ల మరింతగా సమాజానికి మంచి చేయొచ్చని అంటారాయన. పోలీసులకు టెక్నాలజీ అందించడంలో తాను ఉపయోగపడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.  

పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు

మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉంటూ, అటు పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు కూడా చెప్తారు. ‘రిలేషన్స్’ పేరుతో ఒక బుక్ కూడా రాశారు. తెలుగు చానెళ్లలో టెక్నాలజీపై శ్రీధర్ ప్రత్యేక కార్యక్రమాలు వస్తుంటాయి. టెక్నాలజీ గురించి తెలుసుకోడానికి ఇప్పటికీ రోజుకి 15గంటలు కష్టపడతానని అంటున్నారు. చెప్పిన సొల్యూషన్లు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయంటే అంతకంటే ఇంకేం కావాలంటున్నారు. తెలుగులో టెక్నాలజీని గురించి చెప్పే ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా శ్రీధర్ నడుపుతున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు మెయిల్ చేస్తే వారికి పరిష్కారం చూపిస్తానంటున్నారు.

“కుటుంబ సమస్యల వల్ల మా అమ్మ మానసికంగా డిస్ట్రబ్ అయింది. ఇంటినుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లి పోయేది. అమ్మను వెతుక్కుంటూ వీధుల్లో పరుగులు పెట్టేవాడిని. నేనంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మకు నచ్చజెప్పి ఇంటికి తెచ్చేవాడిని. అప్పుడు మా దగ్గర మమకారాలు తప్పితే ఏమీ లేవు. ఇప్పుడు నా దగ్గర అన్ని ఉన్నాయి. ఈ సంతోషం చూడటానికి అమ్మ లేదు. జీవితంలో ఏదైనా కోల్పోయానంటే అది మా అమ్మే అని ముగించారు శ్రీధర్”

website


ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories