మీ రైలు ప్రయాణాల్లో కొత్త ఫ్రెండ్ 'ఓ మిత్ర' యాప్

మీ రైలు ప్రయాణాల్లో కొత్త ఫ్రెండ్  'ఓ మిత్ర' యాప్

Wednesday September 02, 2015,

3 min Read

ట్రైన్ జర్నీలో ప్రయాణికులకు ఉపయోగపడే యాప్.

రైలు ప్రయాణీకుల మధ్య సామాజిక అనుసంధాన వేదిక ఇది.

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం రిస్తా పేరుతో మరో యాప్.


టెక్నాలజీతో ఇప్పుడు ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఎక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు ప్రజలు. ఒకే లొకాలిటీలో ఉన్న ప్రజలు, సోషల్ కనెక్టివిటీ యాప్స్, ట్రావెల్ పార్ట్ నర్ కనెక్టింగ్ ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు మార్కెట్ లో అనేకమైన యాప్ లున్నాయి. ఇదే వరుసలో ఓమిత్రా యాప్ కూడా మార్కెట్ లోకి వచ్చింది. రైలు ప్రయాణంలో ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైందీ ఈ సోషల్ యాప్.

నరకప్రాయమైన తన రైలు ప్రయాణం తర్వాత ట్రైన్ ప్రయాణికుల కోసం ఓ యాప్‌ను రూపొందించాలన్న ఆలోచనకు వచ్చారు వికాస్ జగతీయ. ఓ పనిమీద హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌కు రైల్లో వెళ్లాల్సి వచ్చింది. ఈ 30 గంటల ప్రయాణంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకోగలిగారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు వేర్వేరు ప్రదేశాల్లో సీట్లు దొరకడం, సరైన ఆహారం దొరకకపోవడం, ఏ స్టేషన్ ఎంత దూరంలో ఉందీ, ఎక్కడ ఎంత సేపు రైలు ఆగుతుంది.. తదితర సమాచారం ప్రయాణికులకు దొరికేది కాదు.

‘‘రైలు ప్రయాణంలోనే ఇతర ప్రయాణికులతో కనెక్ట్ అయ్యేందుకు వీలున్న యాప్ ను రూపొందించాలన్న ఆలోచన వచ్చింది’’ అని వికాస్ తెలిపారు. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్‌ను యాప్ గుర్తించి, అన్ని విషయాలను సెట్ చేస్తుంది. ఆ రైలులో ప్రయాణించే ప్రయాణికులందరినీ గుర్తిస్తుంది. రైల్ బయల్దేరే సమయానికి ముందు వారికి సమాచారమందిస్తుంది. అలాగే సీట్ కన్ఫర్మ్ అయిందో లేదో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రైల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది.. ప్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందో కూడా వివరాలను ఈ యాప్ అందజేస్తుంది.

అంతేకాదు సహ ప్రయాణికులతో ప్రయాణ అనుభవాలను కూడా పంచుకునేందుకు ఉపయోగపడుతుంది. పరస్పర సహకారంతో బెర్త్‌లను మార్చుకునే సౌలభ్యం కూడా ఈ యాప్‌లో ఉంది. ఇందులో ఉన్న మరో మంచి ఆప్షన్ ఎస్ఓఎస్. దీనిపై క్లిక్ చేసిన ఐదు నిమిషాల్లోనే సెక్యూరిటీ సిబ్బంది నుంచి స్పందన వస్తుంది.

వీటితో పాటు ఒక వేళ ఏదైనా సిటీలో దిగిన తర్వాత కలిసి ఎక్కడికైనా ప్రయాణించాలని అనుకుంటే ట్యాక్సీ షేర్ చేసుకోవడం వంటి సదుపాయమూ ఉంది. మెడికల్ అవసరాలు ఏవైనా ఉంటే.. ఇతర ప్యాసింజర్ల సాయం కూడా తీసుకోవచ్చు.

సవాళ్లు

ఐతే ఈ యాప్‌ను విజయవంతంగా కొనసాగించడంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. ఒకే ఆలోచనా ధోరణి కలిగిన ప్రయాణికులు దొరకడం చాలా కష్టమని వికాస్ చెప్తారు. సహజంగా కొత్త వ్యక్తులతో మాట్లాడేందుకు కొందరు జంకుతారు. అలాంటి సమస్యను ఈ యాప్ తీరుస్తుంది. కొత్తవారైనప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఈ సంస్థను వికాస్ ఒంటరిగానే ప్రారంభించారు. ఇందులో ముగ్గురు డెవలపర్స్ ఫుల్ టైమ్ బేసిస్‌లో పనిచేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు ఇంటర్న్స్ కూడా ఉన్నారు.

ఫుడ్ ట్రావెల్ వంటి ప్రాడక్ట్‌లను చేర్చడం ద్వారా యాడ్ రెవన్యూ పెంచుకోవాలన్నదే ఈ టీమ్ లక్ష్యం.

‘‘ప్రస్తుతానికైతే ప్రయాణాన్ని సులభతరం చేయడమే మా లక్ష్యం. ట్రైన్ జర్నీ ప్రాడక్ట్‌ను సులభంగా వాడుకునేలా చేయడమే మా ప్రస్తుత కర్తవ్యం’’ అని వికాస్ చెబ్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ను నాలుగువేల మందికిపై వీక్షించారు. ప్రతీ వారం పదిశాతం డౌన్ లోడ్స్ పెరుగుతున్నాయి.

ఓమిత్రా టీమ్

ఓమిత్రా టీమ్


లక్ష్యాలు, మార్కెట్ సైజ్

భారతీయ రైల్వే ప్రయాణికుల రంగంలోకి ఇప్పుడిప్పుడే యాప్ ప్రపంచం అడుగుపెడుతున్నది. 2013-14 సంవత్సర కాలంలో 84 కోట్ల మంది ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రయాణించారు. ప్రయాణికుల అంచనాలు, డిమాండ్లను తీర్చడం తాము ఎదుర్కొంటున్న సవాళ్లన్నింటిలోకి చాలా పెద్దదని ఇండియన్ రైల్వే తమ నివేదిక ద్వారా వెల్లడించింది.

అలాగే ఓమిత్రా టీమ్ ఎంఎంటీఎస్ ప్రయాణికుల భద్రత కోసం రిస్తా పేరుతో మరో యాప్ ను కూడా తీసుకొచ్చింది. ఈ యాప్ ఒక్క హైదరాబాద్ ఎంఎంటీస్ ప్రయాణికుల కోసమే రూపొందించారు. ఆర్పీఎఫ్ తో కలిసి పనిచేయాలని ఈ బృందం భావిస్తోంది. దక్షిణమధ్య రైల్వే, ఆర్పీఎఫ్ లతో కలిసి ఈ టీమ్ పనిచేస్తోంది.

ఓ మిత్రా యాప్ పేజ్

ఓ మిత్రా యాప్ పేజ్


రోజు రోజుకు ప్రపంచం మొత్తం డిజిటల్‌గా మారుతోంది. దీంతో యాప్‌ల సాయం తీసుకునే ప్రయాణికులు ఎక్కువయ్యారు. ఈ నేపథ్యంలో పలు రకాల యాప్‌లు రైల్వే ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్నాయి. రైల్ యాత్రి, ట్రైన్ మన్, కన్ఫర్మ్ టికెట్ వంటివి ప్యాసింజర్ల అవసరాలను తీరుస్తున్నాయి. ట్రావెలర్స్‌కు రైలు జర్నీలో కష్టం తెలియకుండా చేస్తున్న యాప్ లు మరిన్ని రావాలని ఆశిద్దాం.

website

app