టూరిజంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ' వి ఆర్ హాలిడేస్ '

టూరిజంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్న  ' వి ఆర్ హాలిడేస్ '

Friday September 18, 2015,

4 min Read

సెలవులొచ్చాయి. ఎక్కడికైనా టూరెళ్లాలనుకుంటున్నారా? మైమరిపించే ప్రదేశాల్లో చక్కర్లు కొట్టాలనుకుంటున్నారా? హాలిడే ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కావట్లేదా ? మీకు చక్కని హాలిడేని మేం ప్లాన్ చేసిస్తాం అంటోంది వీఆర్ హాలిడేస్. మంచి హాలిడే స్పాట్స్‌ని వెతకడం, ప్లాన్ చేసుకోవడం, బుకింగ్, వెళ్లొచ్చిన తర్వాత ఆ జ్ఞాపకాలను పంచుకోవడం లాంటివన్నీ వీరి దగ్గర సాధ్యం. అవసరమైతే హాలిడే ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడించి మరీ మీకు హాలిడేని ప్లాన్ చేయిస్తుంది ఈ సంస్థ. ఆన్ లైన్ ట్రావెల్ మార్కెట్ లో చక్కర్లు కొడుతున్న వీఆర్ హాలిడేస్ విశేషాలేంటో తెలుసుకుందాం.

అనుభవమే పెట్టుబడి

వీఆర్ హాలిడేస్ యంగ్ స్టార్టప్. ఆన్ లైన్ లీజర్ ట్రావెల్ స్పేస్‌లో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకొని ఈ స్టార్టప్ మొదలైంది. కంపెనీ కొత్తదే అయినా... నిర్వాహకులకు ఉన్న అనుభవం అంతా ఇంతా కాదు. ఈ స్టార్టప్ సృష్టికర్తలైన దీపక్ వాధ్వా, హర్కీరత్ సింగ్‌లకు భారతదేశంలోని ఆన్‌లైన్ ట్రావెల్ ట్రేడ్ గురించి లోతైన అవగాహన ఉంది. ఇండియాలో అతిపెద్ద ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్ అయిన MakeMyTrip.comలో పనిచేసిన అనుభవం వీరికుంది. ఇద్దరూ కలిసి ఇంజనీరింగ్ చదివినా మేక్ మై ట్రిప్‌లో ప్రొడక్ట్ మేనేజర్లుగా పనిచేశారు. ఇక్కడ పనిచెయ్యడం ద్వారా వీరెంతో నేర్చుకున్నారు. ఆన్‌లైన్ ట్రావెల్ ట్రేడ్‌కు మార్కెట్‌లో ఉన్న స్థానాన్ని, అవకాశాల్ని సునిశితంగా పరిశీలించారు.

"మేక్ మై ట్రిప్ లో పనిచేసే సమయంలో కస్టమర్లు ఎలా పెరుగుతున్నారో నేను దగ్గర్నుంచి చూశాను. వారికి సేవలందించేందుకు మేం చాలా కష్టపడాల్సివచ్చింది. అప్పుడే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ స్టార్టప్స్ కూడా ప్రారంభమయ్యాయి. రాబోయే సమస్యల్ని ముందుగానే అంచనా వేశాం. సరికొత్త ఆలోచనలతో, సరికొత్త విధానంతో ముందుకెళ్లాం" అంటారు దీపక్.
ప్రశాంత్, దీపక్, హర్కీరత్, మోహిత్

ప్రశాంత్, దీపక్, హర్కీరత్, మోహిత్


మేక్ మై ట్రిప్ అనుభవాల నుంచి పుట్టిన ఆలోచనలతో వీఆర్ హాలిడేస్ జీవం పోసుకుంది. తొలి రోజుల్లో అంటే 2012-13 కాలంలో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి దిగారు. హాలిడే ప్యాకేజెస్ అమ్మడం మొదలుపెట్టారు. ఈ సారి వినియోగదారులు, మార్కెట్ పరిస్థితులపై మరింత అవగాహన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకొన్నారు. టెక్నాలజీ సాయంతో చక్కని ప్యాకేజెస్ తయారు చేశారు. వీరి టీమ్‌లో మరికొందరూ చేరారు. డొమెస్టిక్ మార్కెట్ హెడ్ మోహిత్ పిప్లానీ ఇండియాలోని సెల్లర్స్ వ్యవహారాల్ని చూస్తారు. మోహిత్‌కు చాలా అనుభవం ఉంది. గతంలో మైఖేల్ పేజ్ ఇంటర్నేషనల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లో పనిచేశారు. ఇక విదేశాల్లో ఉండే సెల్లర్స్‌కి హెడ్‌గా నిపుణ్ భండారీ పనిచేస్తున్నారు. వీరితో పాటు టెక్నాలజీ చీఫ్ ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్ IIT-BHU, IIM-B పూర్వ విద్యార్థి. ఇలా ఎక్స్‌పర్ట్ టీమ్‌తో ట్రావెల్ మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వీఆర్ హాలిడేస్. తక్కువ కాలంలోనే 2014లో మాట్రిక్స్ పార్ట్‌నర్స్ నుంచి సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్ లభించడం విశేషం. ఆ స్ఫూర్తితో ఇంకాస్త ధైర్యంగా స్టార్టప్ ని విస్తరిస్తున్నారు.

"దీర్ఘకాలికంగా పనిచేయడమే మా లక్ష్యం. పెద్ద పెద్ద వ్యాపారాలు పూర్తిగా రూపుదిద్దుకోవడానికి కనీసం పదేళ్ల సయమం పడుతుంది. అలాంటి సుదూర లక్ష్యంతోనే మేం రంగంలోకి దిగాం" అంటారు దీపక్. 

మాజీ బాస్, మేక్ మై ట్రిప్ ఫౌండర్ దీప్ కల్రా నుంచి చాలా నేర్చుకున్నామంటారు ఈ ఇద్దరు. హాలిడే ప్యాకేజెస్ రూపొందించే సెల్లర్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. సరికొత్తగా హాలిడే ఐటినరీస్ ఆవిష్కరించడంపైనే వీరి ప్రధాన దృష్టి. ట్రావెలోగ్స్, సెల్లర్ ఐటెనరీస్, ఆర్టికల్స్ సాయంతో మెరుగులు దిద్దుతున్నారు. బుకింగ్స్ అన్నీ హాలిడే సెల్లర్స్ ద్వారానే జరుగుతుంటాయి. ఈ మార్కెట్లో 50 శాతం వృద్ధి రేట్ కనిపిస్తోంది. మార్కెట్లో సుస్థిర స్థానం ఏర్పర్చుకోవాలంటే హార్డ్ వర్క్ తప్పనిసరి. దీనికి తోడు క్వాలిటీ వెండర్స్, సెల్లర్స్ అవసరం ఎక్కువ. ఇక కస్టమర్ల విషయానికొస్తే వ్యవహారాలన్నీ ఆన్‌లైన్ లోనే సాగిపోతాయి. పర్యాటక ప్రాంతాలు పర్యాటకుల్ని ఆకర్షించేలా కంటెంట్ రూపొందించడంలో వీఆర్ హాలిడేస్ చాలా ముందుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని కస్టమర్లకు దగ్గరవుతున్నారు. నలుగురిలో ఒక కస్టమర్ తిరిగి వస్తున్నారు. లేదా ఎవర్నైనా సిఫార్సు చేస్తున్నారు.

"విజయం నుంచే విజయం పుడుతుందన్నది మా నమ్మకం. కొలీగ్స్, ఇతర ఏజెంట్లు అభివృద్ధి చెందడమే మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మిగతా వాళ్లూ ఇదే స్ఫూర్తితో కష్టపడాలి. ఇదే ఫార్ములాతో మొదలైన ఓలా, ఉబర్ సంస్థలు క్యాబ్ డ్రైవర్ల జీవితాలను మార్చేశాయి. అందరం కలిసి విజయం వైపు అడుగులు వేసేలా మేము సెల్లర్స్ తో కలిసి పనిచేస్తున్నాం" అంటారు దీపక్.

ఈ విజయాలకు సంబంధించి కేస్ స్టడీస్ కూడా వీరి దగ్గరున్నాయి. సహచరుల విజయగాథలు వీరికి స్ఫూర్తిగా నిలుస్తాయి.

1. ట్రిప్ సెయిలర్: ట్రిప్ సెయిలర్‌ని సౌరభ్ నిర్వహిస్తున్నాడు. Via.comలో మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటీవ్ గా పనిచేసిన సౌరభ్... కంపెనీని వదిలిపెట్టి ఢిల్లీలోని ద్వారకా సమీపంలోని ఓ చిన్న గ్రామంలో ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించాడు. కొంత మంది ఉద్యోగుల్ని నియమించి... జస్ట్ డయల్ ద్వారా కస్టమర్లకు చేరువయ్యాడు. విఆర్ హాలిడేస్‌తో ట్రిప్ సెయిలర్ అనుబంధం మొదలవడంతో ఆదాయం ఆరు లక్షలు దాటింది. టీమ్ సంఖ్య పదికి పెరిగింది. ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలో ఓ పెద్ద ఆఫీసులోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు సౌరభ్. ఎక్కువ రోజులు ఇక జస్ట్ డయల్ పై ఆధార పడాల్సిన అవసరం అతనికి రాలేదు.

2. వ్యూ హాలిడే ట్రిప్స్: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దినేష్ కుమార్ ఓ చిన్న ఏజెన్సీ నడిపిస్తున్నాడు. రోహిణిలో రద్దీగా ఉండే ఓ వీధిలో 125 స్క్వేర్ ఫీట్ ఆఫీసులో ఒక్కడే పనిచేసేవాడు. వీఆర్ హాలిడేస్‌తో అనుబంధం మొదలవగానే అతని దశ తిరిగిపోయింది. ఆ తర్వాత నలుగురికి ఉద్యోగాలిచ్చాడు. పెద్ద ఆఫీసులోకి మారాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే వీఆర్ హాలిడేస్ తో టై-అప్ పెట్టుకున్నవారి విజయగాథలెన్నో ఉన్నాయి. ఆన్ లైన్ ట్రావెల్ ఇండస్ట్రీలో చాలా పెద్దది. అవకాశాలు అలాగే ఉన్నాయి. కాంపిటీషన్ కూడా చాలా విస్తృతంగా ఉంది. ఆన్‌లైన్ ట్రావెల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా మూడు కేటగిరీలు ఉంటాయంటారు దీపక్.

1. ఆఫ్ లైన్ ప్రతినిధులు- Cox & Kings, Thomas Cook లాంటి సంస్థలు.

2. ఆన్ లైన్ ట్రావెల్ ఏజెంట్స్- MakeMyTrip, Yatra, GoIbibo లాంటి సంస్థలు.

3. స్టార్టప్స్-Travel Triangle, Tripoto, TripHobo లాంటి సంస్థలు.

image


లాంగ్ జర్నీకి రెడీ

గుర్గావ్ కు చెందిన విఆర్ హాలిడేస్ లో ప్రస్తుతం తొంభై మంది పనిచేస్తున్నారు. వీళ్లకి మున్ముందు లాంగ్ జర్నీ ఉంది. ప్రపంచంలోని హాలిడే ప్యాకేజ్ సెల్లర్స్ కి నమ్మకమైన మార్కెట్ తయారు చెయ్యడంపైనే దృష్టి పెట్టారు. ఆన్ లైన్ ద్వారా ఇండియాలోని ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సంస్థతో అనుబంధం కొనసాగిస్తున్న ప్రతినిధుల వ్యాపారం పెరుగుతోంది. వాళ్లూ ఆన్ లైన్ లో అడుగుపెడుతున్నారు. ఆఫ్ లైన్ ట్రావెల్ ఏజెంట్స్‌కి ఆన్ లైన్ సత్తా ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. వారికి కూడా వ్యాపార వ్యూహాలను తయారుచేస్తామంటోందీ సంస్థ. కస్టమర్ల అనుభవాల్ని వ్యాపారానికి జోడించడం ద్వారా మరికొంతమందిని ఆకర్షించొచ్చన్నది వీరి వ్యూహం.