ఒకప్పుడు పోర్టులో కూలీ.. నేడు 2,500 కోట్ల వ్యాపారానికి అధిపతి..!  

ఎంజీ ముత్తు సక్సెస్ స్టోరీ..

0

మనసుంటే మార్గముంది. చాలామంది సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్స్ చెప్పే మాట ఇదే. ఏ రంగమైనా కానీయండి. పట్టుదల, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటే సక్సెస్ దానంతట అదే వస్తుంది. ఒకరోజు అటుఇటు లేటవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా. అలాంటి సక్సెస్ పొందిన వ్యక్తి కథే ఇది. ఒకప్పుడు చెన్నై ఓడరేవులో వందలాది కూలీల్లో ఒకడిగా ఉన్న మనిషి ఇవాళ వేల కోట్లకు అధిపతి అయ్యాడంటే గుండె కాసేపు ఆగి కొట్టుకుంటుంది. ఇంతకూ అతను ఏం చేశాడు.. ఎలా చేశాడు.. ఆలస్యమెందుకు చదవండి..

వ్యాపారం అంటే నిచ్చెన మెట్ల వైకుంఠపాళీ. పాములు మింగేస్తునే ఉంటాయి. మళ్లీ లాడర్ ఎక్కేస్తునే ఉంటాం. ఎన్నిసార్లు కిందపడ్డా పైకి ఎగబాకుతునే ఉంటారు. గేమ్ వదిలేస్తే చెప్పలేం కానీ, పట్టువదలకుండా ట్రై చేస్తుంటే మాత్రం లాస్ట్ స్టెప్ గ్యారెంటీ. జీవితాన్ని అన్వయించుకోడానికి, స్ఫూర్తి పొందడానికి ఇంతకంటే వేరే ఆట లేదు.

ఎంజీ ముత్తు. ఎంజీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత. అంతకంటే ముందు చెన్నయ్ పోర్టులో అతనొక రోజువారీ కూలీ. నిరుపేద కుటుంబం. చదువుకునే పరిస్థితి లేదు. చదువు కొనే స్తోమతా లేదు. 1957లో హార్బర్ లో జీవితం కూలీగా మొదలైంది. సరుకు లోడ్ చేయడం.. అన్ లోడ్ చేయడం డ్యూటీ. తండ్రి కూడా అదే పోర్టులో కూలీ. ఏనాడూ అతని కుటుంబం కడుపునిండా తినలేదు. ఒకపూట తింటే మరోపూట పస్తులు. నిత్యం ఆకలితో పోరాటం. పిల్లలను చదివించాలని ఉన్నా కనీసం పలకా బలపం కూడా కొనలేని దైన్యం. చేసేదేం లేక కొడుకుని తనతోపాటు పోర్టుకి తీసుకెళ్లాడు. అలా ముత్తు తండ్రి వారసత్వాన్ని తీసుకున్నాడు.

ఇద్దరూ రెక్కలు ముక్కలు చేసుకుని కొంత డబ్బు కూడబెట్టారు. దాంతో చిన్నతరహా లాజిస్టిక్ బిజినెస్ ప్లాన్ చేశాడు ముత్తు. అప్పటికే ఆ సెక్టారులో ఏర్పడ్డ కొన్ని పరిచయాలు ఆ తరహా బిజినెస్ వైపు పురికొల్పాయి. రోజులు గడిచేకొద్దీ బిజినెస్ పుంజుకుంది. ముఖ్యంగా ముత్తు మాటతీరు కస్టమర్లను ఆకట్టుకుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారుగా.. అదే టైపులో నైస్ పర్సన్ అని పేరు తెచ్చుకున్నాడు. చిన్న కంప్లైట్ కూడా లేదు.

అలా మంచిమాటతో అనుకున్నదాని కంటే ఎక్కువ గూడ్స్ డెలివరీ చేయగలిగాడు. ఆ నోటా ఈ నోటా ముత్తు పేరు మద్రాసు అంతా పాకింది. పెద్దపెద్ద కంపెనీల యజమానులు క్లయింట్లయ్యారు. అనతి కాలంలోనే వ్యాపారం విస్తరించింది. దాని పేరే ఎంజీఎం గ్రూప్ ఆఫ్ కంపెనీ.

చెన్నయ్ లో ఎంజీఎం గ్రూప్ లీడింగ్ లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటి. కార్పొరేట్ ప్రపంచంలో ముత్తు పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. వ్యాపారం లాభాల బాట పట్టడంతో లాజిస్టిక్ బిజినెస్ తో పాటు బొగ్గు, మినరల్ వ్యాపారంలోకీ అడుగుపెట్టాడు. దాంతపాటు హాస్పిటాలిటీ సెక్టారులోనూ కాలుమోపాడు.

ప్రస్తుతం ముత్తుకు దేశవిదేశాల్లో హోటల్స్ ఉన్నాయి. తమిళనాడు ఏపీల్లో లిక్కర్ కంపెనీలున్నాయి. ప్రస్తుతం కర్నాటకలోనూ పాగా వేయాలని చూస్తున్నాడు. అదిగాక మలేషియాలో ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ మ్యారీ బ్రౌన్ ఇండియన్ ఫ్రాంచైజీని ఇటీవలే సొంతం చేసుకున్నాడు. లాజిస్టిక్స్ తో మొదలైన ప్రస్థానం, హోటల్స్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్, హౌజింగ్, డిస్టిలరీ ఇలా వ్యాపార సామ్రాజాన్ని శాఖోపశాఖలుగా విస్తరించాడు.

హానెస్టీ, హార్డ్ వర్క్ చేసినవాడు ఎప్పటికీ నష్టపోడు. ఇతని జీవితమే అందుకు లైవ్ ఎగ్జాంపుల్. ఎంత ఎదిగినా ఒదిగే గుణమున్న ముత్తుని చూస్తే.. అతను 2,500 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అంటే నమ్మలేం. 

Related Stories