టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్

టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్

Friday January 13, 2017,

1 min Read

మిస్త్రీని తొలగించాక టాటా సన్స్ తర్వాతి బాస్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్ చంద్రశేఖరన్ పగ్గాలు చేపట్టారు. ఐదుగురు సభ్యుల బోర్డు మీటింగ్ అనంతరం చంద్ర పేరుని అధికారికంగా ప్రకటించారు. 54 ఏళ్ల టీసీఎస్ బాస్.. గత అక్టోబర్ 24 నుంచి మిస్త్రీ స్థానంలో తాత్కాలికంగా కొనసాగారు. ఇప్పుడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

2009 నుంచి టీసీఎస్ బాస్ గా ఉన్న చంద్రశేఖరన్ చేతికి పగ్గాలు ఇస్తేనే 103 బిలియన్ కోట్ల టాటా సంస్థ మనుపటి వేగంతో పయనిస్తుందని బోర్డు సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.

image


1963లో జన్మించిన చంద్రశేఖరన్.. టాటా గ్రూపులో యంగెస్ట్ సీఈవో. 1986లో త్రిచి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఎంసీఏ చేశారు. 1987లో టీసీఎస్ లో జాయిన్ అయ్యారు. 2009లో సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఐఈఈఈలో చంద్ర సీనియర్ సభ్యుడు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో యాక్టివ్ మెంబర్. 2012లో నాస్కాం ఛైర్మన్ గా నామినేట్ అయ్యారు.

2009లో టీసీఎస్ సీఈవోగా కంపెనీ లాభాల బాట పట్టింది. ఆయన సారధ్యంలో టీసీఎస్ ఎక్కువ మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్న కంపెనీగా అవతరించింది. చంద్ర నాయకత్వంలో టీసీఎస్- ఐటీ సర్వీసుల్లో గ్లోబల్ గా మంచి ఇమేజ్ సంపాదించింది. 24 దేశాల్లో సంస్థకు ఉద్యోగులున్నారు. 2015-16లో టీసీఎస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 16.5 బిలియన్ల అమెరికన్ డాలర్లు. 70 బిలియన్ డాలర్ల మార్కెట్ కేపిటల్ తో 2015-06 సంవత్సరానికి మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా నిలబడింది.

టీసీఎస్ ను అన్నింటా అగ్రగామిగా నిలబెట్టారు కాబట్టే చంద్ర పేరును బోర్డు సభ్యులు ఏకోన్ముఖంగా ఒప్పుకున్నారు. మిస్త్రీ స్థానంలో నియమించినప్పడే అతను టాటా సన్స్ ఛైర్మన్ పదవికి అన్నివిధాలా సమర్ధుడని భావించారు. ఆ క్రమంలోనే పేరును అధికారికంగా ఆమోదించారు.