స్కూల్ డ్రాపవుట్ అయినా చెరుకు సాగులో వినూత్న ఆవిష్కరణలు చేసిన రైతు రోషన్ లాల్ విశ్వకర్మ

0

రోషన్ లాల్ ను చూస్తే అమెరికన్ కవి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. "రైతులు ఊరికే వ్యవసాయం చేస్తారా? వ్యవసాయాన్ని ప్రేమించి వారా పనిచేస్తారు" అనిపిస్తుంది. మధ్య ప్రదేశ్ లోని నరసిమ్హాపూర్ జిల్లా మేఖ్ అనే పల్లెటూరుకు చెందిన వారు రోషన్ లాల్ విశ్వకర్మ. కుటుంబ పరిస్థితుల నేపధ్యం లో స్కూల్ చదువుని మధ్యలోనే ఆపేసి, తండ్రికి వ్యవసాయం లో సాయపడ్డారు. చెరుకు సాగులో ఉన్న వ్యయ ప్రయాసలను, కష్ట నష్టాలను చూసిన రోషన్ లాల్, సరికొత్త ఆవిష్కరణలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. రోషన్ లాల్ తెచ్చిన వినూత్న పద్ధతులతో అప్పటిదాకా ఉన్న ధనిక రైతుల గుత్తాధిపత్యానికి అడ్డుకట్టపడింది. రోషన్ లాల్ ప్రయోగాన్ని అనుసరించిన చిన్న రైతులు అతి తక్కువ ధరలో, సమయాన్ని, కష్టాన్ని ఆదాచేసుకుంటూ, ఎక్కువ పంటరాబడిని పొందారు. ఇక దీంతోపాటే, మరోసారి పంటకోసం ఉపయోగపడేలా చెరుకు గడలకు వచ్చే పిలకలను తీసి నాట్లు వేసే లో-కాస్ట్ మెషేన్ ను రూపొందించారాయన. ఇప్పుడు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చెరుకు రైతులు ఉపయోగిస్తున్నారు.

రోషన్ లాల్ విశ్వకర్మ

పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, ఇతరుల సహాయం తీసుకోకుండానే రోషన్ లాల్ సమస్యల్ని అధిగమించారు, వినూత్న పద్ధతుల్ని ఆవిష్కరించారు. చెరుకు సాగులో ఉన్న వ్యయ ప్రయాసల వల్ల చిన్న రైతులు ఎలా తమ పంటపొలాల్ని కోల్పోతున్నారో గమనించారు. పెద్ద రైతుల గుత్తాధిపత్యాన్ని అర్ధం చేసుకున్నారు. చెరుకు సాగు లాభసాటిగా ఉన్నప్పటికీ, చెరుకు పంట సాగులో అనుసరిస్తున్న పద్ధతుల్ని, అందుకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చుకోలేక ఎలా చిన్న రైతులు తమ పంట పొలాల్ని పెద్ద రైతులకు అమ్ముకుని, వారి వద్దే వ్యవసాయ కూలీలుగా చేరుతున్నారనే పరిస్థితిని చాలా దగ్గరనుంచి చూసారాయన. ధనిక రైతులు ఇంకా ధనవంతులుగా మారడం, చిన్న రైతులు మరింత పేదవారుగా మారడాన్ని గమనించారు.

వీటన్నింటినీ నిశితంగా గమనించిన రోషన్ లాల్ తన సమయాన్ని ప్రయోగాలకు వెచ్చించారు. "బంగాళాదుంపను సాగు చేసే పద్ధతుల్లోనే చెరుకును కూడా సాగు చేశాను. నాకున్న రెండెకరాల పొలంలోనే, రెండేళ్లపాటు ప్రయోగాలు చేసి ఎలా ముందుకెళ్ళాలో గ్రహించాను" అని అప్పటి సంగతుల్ని గుర్తుచేసుకుంటున్నారు రోషన్ లాల్. ఆయన ప్రయోగం విజయవంతం అయింది. తన పంటపొలంలో సాధారణంగా వచ్చే దానికంటె 20% ఎక్కువ దిగుబడి రావడాన్ని రోషన్ లాల్ గమనించారు. అంతకుముందు ఎకరానికి 35-40 క్వింటాళ్ల చెరుకును నాటాల్సి వచ్చేది, ఇది చిన్న రైతులకు తలకు మించిన భారంగా పరిణమించేది. అయితే రోషన్ లాల్ ప్రయోగం ద్వారా ఎకరానికి మూడు లేదా నాలుగు క్వింటాళ్ల చెరుకును నాటితే సరిపోతుంది. అలా రైతులు రవాణా ఖర్చుతో పాటు, వ్యవసాయ కూలీ ఖర్చును కూడ ఆదాచేసేవారు. ఇక దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చేది.

అలా రోషన్ లాల్ ఒంటి చేత్తో చెరుకు సాగులో ధనిక రైతుల గుత్తాధిపత్యాన్ని అడ్డుకున్నారు. రోషన్ లాల్ ప్రయోగం మెల్లిగా బయటి వారికి కూడా తెలియడంతో, ఇతర రైతులు కూడా అదే పద్ధతిని అనుసరించి, లాభాల్ని పొందడం ప్రారంభించారు. తన ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు రోషన్ లాల్. తొందరలోనే రోషన్ లాల్ చెరుకు సాగులో తీసుకొచ్చిన మార్పుల్ని పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్ గఢ్ రైతులు అనుసరించడం మొదలుపెట్టారు. అలా వారు కూడా అధిక దిగుబడుల్ని సొంతంచేసుకున్నారు. సమస్యకు పరిష్కారం కనుగొనడం మాత్రమే సరిపోదని భావించారు రోషన్ లాల్. సాగు పద్ధతుల్ని ఇంకా సరళతరం చేస్తూ మెషీన్ రూపొందిచాలని అనుకున్నారు. చెరుకు గడలకు వచ్చే పిలకల్ను తీసి తిరిగి నాట్లు వేయడానికి గాను తక్కువ ధరలో మెషీన్ ను రూపొందించాలన్న ఆలోచన చేశారు. దీంతో రైతుల కష్టం మరింత తగ్గుతుందని భావించారు. ఇందుకోసం ఆయన వ్యవసాయ రంగ నిపుణులను, శాస్త్రవేత్తలను కలుసుకున్నారు. మెషీన్ ను ఎలా తయారుచేయవచ్చో తెలుసుకునేందుకు వర్క్ షాప్ కు కూడా హాజరయ్యారు.

అతి తొందరలోనే "షుగర్ కేన్ నడ్ చిప్పర్" ను తయారుచేశారు రోషన్ లాల్. మొదట్లో అది మూడూన్నర కిలోల బరువుతో, గంటకు 400 చెరుకు గడల పిలకల్ని సేకరించేది. ఆ తర్వాత తన ఐడియాకు మరింత మెరుగులు పెట్టడం ప్రారంభించారు. ఇప్పుడు తీసుకొచ్చిన లేటెస్స్ట్ వెర్షన్ మెషీన్ ను చేతులతో కాకుండా, కాళ్లతోనే ఆపరేట్ చేయవచ్చు. గంటకు 800 పిలకల్ని సేకరిస్తూ, పనిని మరింత సులభతరం చేసింది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఫర్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ అవ్వర్డ్ ను ఆ పరికరం సొంతంచేసుకుంది. ఇప్పుడా మెషీన్ భారత్ తో పాటుగా, ఆఫ్రికాలోను అమ్ముడవుతోంది. 1,500 కే ఆ మెషిన్ అందుబాటులో ఉంది.

రోషన్ లాల్ కరెంట్ ను ఉపయోగించుకుని నడిచే మరో మెషీన్ ను కూడా రూపొందించారు. అది గంటకు 2,000 కు పైగా పిలకల్ని సేకరిస్తుంది. ఫాం హౌస్ యజమానులు, షుగర్ మిల్స్, నర్సరీల నుంచి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక శూగర్ కేన్ ప్లాంటేషన్ కోసం కూడా రోషన్ లాల్ మరో మెషీన్ తయారుచేశారు. దీన్ని ట్రాక్టర్ కు తగిలిస్తే, అది ఒక ఎకరంలో మూడు గంటలకంటె తక్కువ సమయంలో పిలకల్ని నాటుతుంది. పిలకల మధ్య దూరం, లోతును ముందుగానే మేషీన్ లో సెట్ చేసుకోవాలి. ఇక పంటకు అవసరమైన ఎరువును కూడా దీని ద్వారా వేసుకోవచ్చు. ఈ పరికరం ధరను 1,20,000 గా నిర్ణయించారు. ఎన్నో అగ్రికల్చర్ సైన్స్ సెంటర్లు ఈ పరికరం వాడడానికి ఉత్సాహం చూపించాయని అంటున్నారు రోషన్ లాల్.

చెరుకు సాగులో ఇన్ని విప్లవాత్మక మార్పుల్ని రోషన్ లాల్ ఒంటి చేత్తోనే తీసుకొచ్చారు. ఆయన చేసిన కృషి వల్ల చెరుకు సాగులో 90% వ్యయ ప్రయాసలు తగ్గాయి.