చిన్న కంపెనీల కోసం దుమ్మురేపే డిజిటల్ మార్కెటింగ్

చిన్న కంపెనీల కోసం దుమ్మురేపే డిజిటల్ మార్కెటింగ్

Tuesday March 08, 2016,

4 min Read


టెక్నాలజీ ప్రపంచాన్ని మరింత కుగ్రామం చేస్తోంది. ఎక్కడ తయారు చేసినా ప్రపంచంలో ఏ మూలైనా అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే అందుకు కావాల్సింది మార్కెటింగ్. సోషల్ మీడియాలో ప్రచారం చేసో... డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ని పెట్టుకుని కుస్తీలు పడితేనో తప్ప.. ప్రొడక్ట్ ని ప్రపంచం ముంగిటకు తీసుకెళ్లడం చాలా కష్టం. భారీస్థాయికి ఎదిగిన కంపెనీలు భారం భరించడం సులువే కానీ.. చిన్న, మధ్యతరహా సంస్థలు మాత్రం తట్టుకోలేవు. ఇంకా స్మార్ట్ గా ఆలోచించాలి. ఖర్చు పెరగకుండా గ్లోబ్ ను చుట్టేసి మార్కెట్ చేసేంత స్మార్ట్ గా ఆలోచించాలి. వారికి సాధ్యం కాకపోతే ఆ పని చేసి పెట్టేందుకు ఉన్నాడు భూషణ్ పాట్కర్. చిన్న కంపెనీలకు డిజిటల్ మార్కెటింగ్ చేసే విషయంలో మాస్టర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు.

చిన్న, మధ్య తరహా సంస్థలే టార్గెట్

"డిఫిజ్" అనే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని ఆరు నెలల కిందటే ప్రారంభించాడు భూషణ్ పాట్కర్. బడా ఈ కామర్స్ కంపెనీలు తమ ఆన్ లైన్ మార్కెటింగ్ వ్యవహారాలను పెద్ద పెద్ద సంస్థలకు అప్పగిస్తాయి. కానీ చిన్న కంపెనీలు, మధ్య తరహా సంస్థలు ఆ భారాన్ని భరించలేవు. కానీ వాటి నాణ్యమైన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లభిస్తే తిరుగే ఉండదు. ఇదే విషయాన్ని పట్టుకున్నాడు భూషణ్ పాట్కర్. "డిఫిజ్" కంపెనీ సేవలన్ని చిన్న, మధ్య తరహా సంస్థలకే పరిమితం చేశారు. మెట్రోలను వదిలేసి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న సంస్థలకు ఆన్ లైPreviewన్ మార్కెటింగ్ ను పరిచయం చేస్తున్నారు. ఆన్ లైన్ మార్కెటింగ్ పై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ వారిని ప్రపంచ మార్కెట్ తో అనుసంధానం చేసే ప్రయత్నంలో తొలి అడుగులు వేస్తున్నాడు భూషణ పాట్కర్.

మిత్రుడి రెస్టారెంట్ కు మహర్ధశ

ఏడాది క్రితం వరకు భూషణ్ పాట్కర్ ను టెక్నాలజీ రంగంలో ఏదైనా చేయాలని ఉండేది. కానీ ఏం చేయాలో స్పష్టత ఉండేది కాదు. అయితే ఓసారి కర్జాత్ పట్టణంలో ఉన్న తన మిత్రుడైన అమిత్ జుంజారావ్ రెస్టరెంట్ కు వెళ్లాడు. అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో అందంగా ఉండే ఆ రెస్టారెంట్ కు చుట్టుపక్కల మంచి పేరుంది. టూరిస్ట్ సర్కిల్స్ లోనూ ఆ రెస్టరెంట్ యమా క్రేజ్ ఉంది. అయితే రెస్టరెంట్ కు వచ్చే ఆదాయం మాత్రం పరిమితంగానే ఉండేది. పోస్టర్లు, లోకల్ పేపర్లలో యాడ్స్ వేసినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. రెస్టరెంట్ కు వచ్చిన సమయంలో భూషణ్ పాట్కర్ ఈ విషయాన్ని సులువుగానే అంచనా వేశాడు. వెంటనే తన మిత్రుని రెస్టరెంట్ " అజి చా ధాబా" కోసం ఆన్ లైన్ మార్కెటింగ్ టూల్స్ ఉన్న వెబ్ సైట్ క్రియేట్ చేశాడు. దీన్ని ఫేస్ బుక్ అకౌంట్ తో లింక్ చేశాడు. ఎవరైనా ఆ వెబ్ సైట్ కానీ, ఫేస్ బుక్ పేజీని కానీ చూస్తే వెంటనే వారికి "అజి చా ధాబా"కు సంబంధిచిన పూర్తి వివరాలతో మెయిల్ వెళ్లిపోతుంది. ఇది ప్రారంబించిన ఆరు నెలల్లోనే అరవై ఐదు శాతం రష్ పెరిగిందిధాబాకి. అంతే ..భూషణ్ పాట్కర్ కు తానేమీ చేయాలో డిసైడ్ చేసేసుకున్నారు. అలా ప్రారంభించిందే.. "డిఫిజ్" అనే స్టార్టప్.

బద్లాపూర్ టెకీ

పాతికేళ్లకు అటూ ఇటూగా ఉన్న భూషణ్ పాట్కర్ కు... మొదటినుంచి సాఫ్ట్ వేర్ రంగంపై ఆసక్తే. ముంబై శివారులో ఉన్న బద్లాపూర్ మున్సిపాలిటికి చెందిన భూషణ్ పాట్కర్ తండ్రి ఓ పొలిటీషియన్. భూషణ్ యూకేలో కంప్యూటింగ్ అండ్ సాప్ట్ వేర్ లో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసి, ఇండియాకొచ్చిన సమయంలోనే వాళ్ల నాన్న బద్లాపూర్ మున్సిపాలిటికి మేయర్ అయ్యారు. అప్పుడే ఈ -గవర్నెన్స్ పై దృష్టి పెట్టి "టాప్ ఎక్స్ఎస్ సొల్యూషన్స్" అనే సంస్థను స్థాపించాడు. బద్లాపూర్ మున్సిపాలిటికి సంబంధించి ఆస్తి పన్ను వ్యవహారాలను మొత్తం డిజిటైజ్ చేశాడు. మూడేళ్ల పాటు శ్రమించి బద్లాపూర్ ఇంటి పన్ను సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మ్యాపింగ్ చేసి పెట్టారు. భూషణ్ పాట్కర్ ప్రయత్నం కారణంగా వాళ్ల నాన్నకు ఈ -గవర్నెన్స్ లో జాతీయ అవార్డు కూడా వచ్చింది.

ఇక ఈ రంగంలోనే తనేంటో నిరూపించుకోవాలనుకున్న భూషణ్... ఎంబీఏ చేసేందుకు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల మార్కెటింగ్ అవసరాల కోసం అర్కాబెల్ ఇన్నోవేషన్స్ పేరుతో కంపెనీని ప్రారంభించాడు. తన మిత్రుని ధాబాకు వెళ్లడంతో భూషణ్ పాట్కర్ కు తనదైన దారి దొరికింది.

" సూక్ష్మ, మధ్య, చిన్న స్థాయి పరిశ్రమలకు ఆన్ లైన్ మార్కెటింగ్ తో ప్రయోజనాన్ని తెచ్చిపెట్టడమే మా లక్ష్యం. దీనికి డబ్బులే ప్రధానం కాదు. వారికి వాస్తవంగా ఉపయోగపడేలా చేయడమే మా ఆకాంక్ష. చాలా మంది చిన్న పరిశ్రమల యజమానులకు ఐఫోన్ సిక్స్ ఉంటుంది. కానీ దాంతో ఆన్ లైన్ మార్కెట్ చేసుకోవడంపై అవగాహన ఉండదు. మా సాఫ్ట్ వేర్ తో వారిని చైతన్యం చేస్తాం".. భూషణ్ పాట్కర్, డిఫిజ్ ఫౌండర్

ఢిఫిజ్ బృందం <br>

ఢిఫిజ్ బృందం


లాభం కాదు మానసిక తృప్తే ముఖ్యం

2014లో వెల్లడైన ఓ నివేదిక ప్రకారం MSME సంస్థలు ఆన్ లైన్ మార్కెటింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తమ ఉత్పత్తుల్ని ఆన్ లైన్ ద్వారా ప్రపంచానికి దగ్గర చేసే విషయంలో వారికి సరైన ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఆ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. చిన్న స్టార్టప్స్ లు, ఈ కామర్స్ సంస్థలు భారీగా పెరుగుతున్న సమయంలో ఆన్ లైన్ మార్కెటింగ్ రంగంలో చాలా అవకాశాలున్నాయి.

ద్వితీయ, తృతీయ శ్రేణి రంగాల్లోని MSMEలకే ప్రధానంగా సేవలు అందించేందుకు మొగ్గుచూపుతున్న భూషణ్ పాట్కర్ "డిఫిజ్" లో ప్రస్తుతం 12 మంది బృందం పనిచేస్తోంది. కేవలం ఆరు నెలల కిందటే మిషన్ ప్రారంభించిన వీరు ఇప్పటికే 30 దాకా చిన్న, మధ్య తరహా సంస్థలను ఖాతాదారులుగా పొందారు. MSME బాధ్యతలు చూసే కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రాను కలిసి తమ ఆలోచనలను వివరించారు భూషణ్ పాట్కర్ బృందం. కేంద్రం ప్రకటించిన డిజిటల్ ఇండియా స్లోగన్ తమ ప్రయత్నాలకు మరింత ఊతం ఇస్తుందని వీరు గట్టిగా నమ్ముతున్నారు.

ఆరు నెలల్లోనే ఆన్ లైన్ మార్కెటింగ్ లో మాస్టర్ గా పేరు తెచ్చుకున్న భూషణ్... ఆరేళ్లు తిరిగేలోపు ఎన్ని అద్భుతాలు చేస్తారో..?