ఒకసారి ఇలా చేసి చూడండి..! ఎందుకు హ్యాపీగా ఉండరో చూద్దాం..!!

ఒకసారి ఇలా చేసి చూడండి..! ఎందుకు హ్యాపీగా ఉండరో చూద్దాం..!!

Friday January 22, 2016,

4 min Read

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేహము, మేథస్సు కంటే అంతరాత్మ గొప్పది. కానీ దానికి మనం ఇచ్చే ప్రియారిటీ చాలా తక్కువ. శరీరానికి ఆహారం కావాలి. మెదడుకు ఫజిల్స్, క్రాస్ వర్డ్స్ లాంటివి మేతగా పెట్టాలి. మరి ఆత్మంటూ ఒకటుంటుంది కదా. దానికేం కావాలి..? అంతర్లీనంగా మనం చేస్తున్న నిర్లక్ష్యం అదే. ఆత్మను అనుకున్నంత సంతోషంగా ఉంచడం లేదు. మరి అంతరాత్మ హాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

image


అర్థం కాని మనసు..

అబ్రహం మాస్లో విశ్లేషణను బట్టి -అవసరాల ప్రాధాన్యత ఆత్మను ఎలా సంతృప్తి పరుస్తుందో చక్కగా అర్థమవుతుంది. తొలి రెండు దశలు శరీర అవసరాల గురించి చెప్తాయి. ఆ తర్వాతి రెండు స్టెప్స్ మేథో, ఉద్వేగ సంబంధిత అంశాలను వివరిస్తాయి. చివరిది స్వీయ వాస్తవికత. అంటే.. మన గురించి - మనసు లేదా ఆత్మ గురించి చెప్తుంది . 

‘‘మానవ జీవితానికి సంబంధించిన పూర్తి ఆకాంక్షలను లెక్కలోకి తీసుకునేవరకు ఆత్మ అంటే ఏంటో పూర్తిగా అర్థం కాదు’’- మాస్లో 

ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే- వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులంతా సామాన్యులే. వాళ్లకు వాళ్లే ప్రేరణ. అలా మనం ఎందుకు కాకూడదు. అవొచ్చు. ఎప్పుడంటే.. మన ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండి, కెరీర్ అనుకున్న రీతిలో నడిచి, రిలేషన్స్ అన్నీ ఆబ్లిగేషన్స్ కాకండా ఉన్నప్పుడు- ఉన్నదాని కంటే గొప్ప స్థాయికి వెళ్లడం ఎలా అనేది ఆలోచిస్తాం. మనకు మనమే స్ఫూర్తితో అలా అనుకుంటాం. అయితే ఇక్కడొక చిన్న కండీషన్. ఇందాక చెప్పుకున్నదంతా ఆయా వ్యక్తులను, వ్యక్తిత్వాలను బట్టి వుంటుంది. రూల్ అందరికీ వర్తించాలని ఏమీ లేదు. 

కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం.

-ఉదాహరణకు మీకు రన్నింగ్ ఇష్టం అనుకోండి. మినీ మారథాన్‌లో పాల్గొనేందుకు ఏదో చిన్నపాటి ట్రైనింగ్ తీసుకోండి.

-సపోజ్.. మీకు బుక్ రీడింగ్ అంటే ఇష్టం అనుకుందాం. కానీ టైం లేదు. కనీసం రోజుకి ఒక పేజీ అయినా చదవాలని ప్రయత్నించండి.

-మీ కెరీర్ బాగానే ఉండొచ్చు. అయినా స్కిల్స్ సరిపోవడం లేదు. కేపబిలిటీ పెంచుకునేందుకు పార్ట్‌టైమ్ కోర్సుల్లో చేరండి.

-మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం. కానీ పూర్తిస్థాయిలో నిర్వహించలేరు. అప్పుడు ఒక్క చిన్న మొక్కను పెంచి చూడండి. మీలో ఆటోమేటిగ్గా మార్పు అదే వస్తుంది.

-కుటుంబసభ్యులు, స్నేహితులతో గడిపేందుకు సమయాన్ని కేటాయించండి.

-కంప్యూటర్, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ని కాసేపు పక్కన పెట్టండి.

-నిద్రకు ఒక గంట ముందే బెడ్ మీదకు చేరుకోండి.

-మ్యూజిక్కో, పేయింటింగో. ఏదో ఒకటి. హాబీని కంటిన్యూ చేయండి.

-కొందరు ఆఫీసుకు, ఫంక్షన్లకు తప్ప- వేరే చోటికి వెళ్లేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలన్న దానిపై పెద్దగా ఆసక్తి కనబరచరు. అలాకాకుండా బట్టల మీద షోకు పెంచుకోండి. చూడగానే ఆకట్టుకునేలా కనిపించండి. మీకు తెలియకుండానే జనంలో గుర్తింపు వస్తుంది.

image


జాబితా సిద్ధం చేసుకోవాలి..

ముఖ్యంగా మహిళలు. వారికి గిల్టీ ఫీలింగ్ ఎక్కువ. వర్కింగ్ మదర్స్‌కైతే ఇంకా ఎక్కువ. పిల్లలతో టైం కేటాయించలేక పోతున్నామని, వారి చదువు పట్టించుకోవడం లేదని. ఇంటి పట్టున ఉండేవారిది మరో టైప్ యాతన. టైం వేస్ట్ చేస్తున్నామని, ఏమీ చేయలేకపోతున్నామని కుంగిపోతుంటారు. ఫీలవుతుంటారు. కొంతమంది ఇటు ఉద్యోగాన్ని, అటు పిల్లలను బ్యాలన్స్ చేసుకుంటారు. అయినా వాళ్లది మరొక రకం బాధ. వయసు మీరిన తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నమన్నది వారి ఆవేదన. .

ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంది. చేయాలనుకున్న పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు లిస్టు చేసి పెట్టుకోవాలి. కిరాణా సరుకుల కోసం ఎలా అయితే చీటీ రాసుకుంటామో అలా. చేయలేని పనులను- బాధపెట్టే అంశాలను కూడా లిస్టులో పొందుపరచండి. అందులో ప్రియారిటీ చూసుకోండి. పనుల్లో బిజీగా ఉండి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆ లిస్టులో ఉంటే, ఒక పని చేయండి. పిక్‌నిక్ కో లేదంటే వెకేషన్స్‌ కో ప్లాన్ చేయండి. అది ఇప్పుడప్పుడే కాదనుకుంటే- దానికోసం బుక్ చేసిన టికెట్లను తీసి ఒకసారి చూసుకోండి. రెండు నిమిషాలు ఊహల్లో తేలండి. ఫినిష్. మనసు కుదటపడుతుంది.

మరిచిపోలేని క్షణాలు

రోజంతా నిస్సారంగా గడిచిందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసుని పాడుచేస్తున్నాయా? రాత్రిపూట నిద్ర కరువైందా? దానికీ ఒక చిన్న చిట్కా వుంది . నిద్రపోవడానికి పది నిమిషాల ముందు- కాసేపు టెర్రస్ ఎక్కి శూన్యంలోకి తదేకంగా చూడండి. బాల్కనీలో నిలబడి అదేపనిగా ఆకాశం వైపు తల ఎత్తండి. అలా చీకట్లో నిలబడి- గతంలో హాపీగా ఉన్న మూమెంట్లను నెమరు వేసుకోండి. బాల్యంలో చేసిన అల్లరి, కాలేజీలో చిలిపి చేష్టలు, చంటిది చిన్నప్పడు ఎలా మాట్లాడేదో- మొహంపై చిన్నపాటి స్పార్క్ వచ్చేంత వరకు గుర్తు చేసుకోండి. ఆ హాపీ ఫేస్ తో వచ్చి అలా బెడ్ పై వాలిపోండి. పొద్దున లేచి అద్దంలో చూసుకోండి. సంతోషానికి సంతోషం. గ్లామర్ కి గ్లామర్.

విటమిన్ సన్‌షైన్..

ఎండ. వేడి. ఈ కాలంలో అస్సలు తట్టుకోలేనివి ఈ రెండే. ఎందుకంటే కారు ఏసీ. ఆఫీసు ఏసీ. ఇల్లు ఏసీ. బెడ్రూం ఏసీ. సినిమా థియేటర్ ఏసీ. ఆడిటోరియం ఏసీ. చివరికి ఊరెళ్లాలన్నా బస్సు ఏసీ. రైలు ఏసీ. ఇంత చిల్డ్ లైఫ్ లో ఎండపొడ మనకు తగులుతోందా? సూర్యారావు మన ఒంటిమీద పడి ఎన్నాళ్లయిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సమస్త జీవకోటి ఆధారమైన సూర్యుడిని మనం రోజులో ఒక్క క్షణమైనా చూస్తున్నామా? మరి అలాంటప్పుడు విటమిన్ డి రమ్మంటే ఎలా వస్తుంది? ప్రభాత కిరణాలు మన ఒంటిమీద నులివెచ్చగా గిచ్చుతుంటే అనుభూతి ఎంత హాయిగా వుంటుందని? మొహం కాస్త వేడిగా అయ్యేదాకా డాబామీద నిలబడండి. అలా పావుగంట ఎండలో నిలబడి- ఇంట్లోకొచ్చి గ్లాసుడు మంచినీళ్లు తాగండి. ఎంత రిలీఫ్. శరీరానికి ఎంత మంచిది.

గో గ్రీన్..

పర్యావరణం కోసం ఏం చేసినా మనసు ఉల్లాసంగానే ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలను నాటండి. చెత్తను శుభ్రం చేయండి. అలాంటి ఈవెంట్లో పాలుపంచుకోండి. లేదంటే వీకెండ్ చూసుకుని స్లమ్ ఏరియాలో పర్యటించండి. తోచిన విరాళామివ్వండి. లేదంటే వికలాంగుల స్కూల్లో కాసేపు వాలంటీర్‌గా గడపండి. ఈ చారిటీ ఈవెంట్ మనసును తేలిక చేస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడంలో వున్న ఆనందమే వేరు. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోండి. మనలో మనకు తెలియని పాజిటివ్‌ థింకింగ్ అలవడుతుంది. మానసిక సంతృప్తి కలుగుతుంది. దానికంటే మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి?

మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనలో విశ్వాసం తొణికిసలాడుతున్నప్పుడు మనల్ని చాలామంది ప్రశంసిస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం సాదాసీతా దుస్తుల్లోనే ఉండొచ్చు. కానీ మనలో ఆత్మవిశ్వాసం ఎదుటివారికి ఓ కాంతిలా కనిపిస్తుంది. మనల్ని దేదీప్యమానంగా వెలిగేలా చేస్తుంది. మన వ్యక్తిత్వానికే వన్నె తెస్తుంది. 

ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త రే చార్లెస్ ఇలా అంటారు.. 

‘‘మన మనసు విద్యుచ్ఛక్తి లాంటిది. అదేంటో మనకు తెలియకపోవచ్చు. కానీ ఓ గదికి వెలగునిచ్చే శక్తి మాత్రం దానికుంటుంది’’. 

నిజమే. మనస్సు వెలిగిపోతుంటే.. మనచుట్టూ ఉన్న ప్రపంచం కూడా కాంతివంతంగా కనిపిస్తుంటుంది. మనకే కాదు.. పక్కవారికి కూడా. అందుకే మనస్సును ఉల్లాసంగా ఉంచితే జీవితం ఆటోమెటిక్ గా సంతోషంగా ఉంటుంది.