ఏడాది వయసులోనే మౌస్ పట్టుకున్నాడు..! 16 ఏళ్లకే ఆంట్రప్రెన్యూర్ అయ్యాడు..!!

ఏడాది వయసులోనే మౌస్ పట్టుకున్నాడు..!                 16 ఏళ్లకే ఆంట్రప్రెన్యూర్ అయ్యాడు..!!

Sunday January 31, 2016,

3 min Read

నిజంగా- ఈ త‌రం కుర్రాళ్ల‌ను చూస్తే భలే ముచ్చటేస్తుంది! ఎవరికి వారే చురకత్తులు. ఒక్కోసారి వారివి మెద‌ళ్లా.. లేక గెగాహెర్ట్జ్ ప్రాసెస‌ర్లా అనిపిస్తుంది! బుర్ర నిండా కొత్త ఐడియాలే! నూతన ఆవిష్క‌ర‌ణ‌ల‌కు బాట‌లు వేసే ఆలోచ‌న‌లే! 16 ఏళ్ల‌ త‌న‌య్ కొఠారి ఆ తానులో ముక్కే! మరి ఆలస్యమెందుకు... టెక్నాల‌జీతో వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్న యువ ఆంట్రప్రెన్యూర్ కథేంటో మీరే చదవండి !!

image


పై ఫొటోలో తండ్రి ఒడిలో కూర్చున్న పాల‌బుగ్గ‌ల ప‌సివాడే త‌న‌య్ కొఠారి! అన్నప్రాసన రోజే ఆవకాయ తినేరకంలా లేడూ. అలాంటి ఘటికుడు కాబట్టే ఏడాది వ‌య‌సులోనే ఇదిగో ఇలా కంప్యూట‌ర్ పాఠాలు నేర్చేసుకున్నాడు! అందుకే 16 ఏళ్ల‌కే బిజినెస్ మేన్ గా అవ‌తార‌మెత్తాడు. ది యంగెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. 

ఢిల్లీలోని ఆర్కే పురం డీపీఎస్ లో టెన్త్ దాకా చ‌దివాడు. టెన్త్ క్లాస్ లో టెన్ కి టెన్ పాయింట్స్! ఇంట‌ర్ లో 94 ప‌ర్సంటేజీ! యాక్ట్ ఎంట్రెన్స్ (శాట్ లాంటిది) లో 36కు 36 మార్కులు! ఇదీ మ‌నోడి ట్రాక్ రికార్డ్! ఆల్ టైమ్ రికార్డు కూడా!!

కోడింగ్ కింగ్..!

ఏడో త‌ర‌గ‌తి నుంచే కంప్యూట‌ర్ కోడింగ్ ప్రారంభించాడు తనయ్. 12 ఏళ్లప్పుడు కోడింగ్ పై ప‌ట్టు సాధించాడు. 20 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కోడింగ్ రాయగల దిట్ట! మొద‌ట్లో విండోస్ అప్లికేష‌న్స్ డిజైన్ చేసేవాడు. కానీ వాటికి భ‌విష్య‌త్తులో పెద్దగా మార్కెట్ ఉండ‌ద‌ని భావించి, తొమ్మిదో త‌ర‌గ‌తిలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ త‌యారు చేశాడు. వాటిని చూసి టీచ‌ర్లు ముక్కున వేలేసుకున్నారు!

2013లో త‌న‌య్ కొఠారి మొద‌టిసారిగా హ్యాక‌థాన్ లో పాల్గొన్నాడు. 30 గంట‌ల పాటు కోడింగ్ రాయాలి. పోటీలో వంద మంది ఉన్నారు. అంద‌రూ మ‌హామ‌హా టెక్ మేథావులు. త‌న‌య్ చూస్తే చిన్న పిల్లాడు. మొద‌ట్లో కొంచెం కంగారు ప‌డ్డా, ఆ త‌ర్వాత తానేంటో నిరూపించుకున్నాడు. నేచుర‌ల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో వంద లైన్ల ఆల్గారిథ‌మ్ రాసి ఔరా అనిపించుకున్నాడు.

అది గ‌ణిత‌మైనా, ప్రోగ్రామింగ్ అయినా, జీవిత‌మైనా- ఏదైనా కానివ్వండి! క్రియేటివిటీ ఉంటే ఎంత క‌ష్ట‌మైనా ప‌నినైనా పూర్తి చేయొచ్చు. అంత మాత్రానికే దిగులు పడాల్సిన ప‌నిలేదు- త‌న‌య్
image


ఇమేజ్ స్కాన్స్ తో ఎర్లీ స్టేజ్ కేన్స‌ర్ కు చికిత్స చేయ‌డంపై రీసెర్చ్ పేప‌ర్ రాశాడు త‌న‌య్. దానికి సంబంధించిన సాఫ్ట్ వేర్ కూడా త‌యారు చేస్తున్నాడు. గ‌త ఏడాది నాసా నిర్వ‌హించిన ఒక ప్రాజెక్టుకు భార‌త్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించాడీ చిచ్చర పిడుగు! ఈ కాంపింటీష‌న్ లో ఐదు దేశాల‌కు చెందిన ఇంజనీరింగ్ బృందాల‌కు నేతృత్వం వ‌హించాడు. ఆసియా ప‌సిఫిక్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపియాడ్ (మే 2015)లో సిల్వ‌ర్ మెడ‌ల్ , ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపియాడ్ లో కాంస్య ప‌త‌కం సాధించాడు. 16 ఏళ్ల‌కే మైక్రోసాఫ్ట్ స‌ర్టిఫైడ్ సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్స్ లో ఒక‌డిగా స్థానం సంపాదించాడు.

మంచి ఫ్రెండ్ లాంటి యాప్!

త‌న‌య్ ఇప్ప‌టికి ఐదు యాప్స్ త‌యారు చేశాడు. విండోస్, ప్లే స్టోర్, ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్టమ్ లో అవి ప‌ని చేస్తున్నాయి. తాజాగా అత‌డు డిజైన్ చేసిన ప్రాక్సిమిటీ యాప్ వండ‌ర్ అని చెప్పొచ్చు! కొత్త ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు కరదీపిక ప‌నిచేస్తుందీ యాప్! 

ఉదాహ‌ర‌ణ‌కు ఏదో ప‌ని మీద జైపూర్ వెళ్లారనుకుందాం. సిటీకి మీరు కొత్త‌. అక్క‌డ మీకెవ‌రూ తెలియ‌దు. తెలిసిన వాళ్లు ఉంటే బాగుండ‌నుకున్నారు. కానీ అదే సిటీలో మీకు తెలిసిన వాళ్లు ఉండొచ్చేమో! మీకు ద‌గ్గ‌ర్లోనే త‌చ్చాడుతున్నారేమో! మ‌రి ఆ విష‌యం మ‌న‌కెలా తెలుస్తుంది? ప్రాక్సిమిటీ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే క‌చ్చితంగా తెలుస్తుంది!

ఫేస్ బుక్ ఐడీతో యాప్ లోకి లాగిన్ అవ్వాలి. వెంట‌నే మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఒక‌టి క‌నిపిస్తుంది. మీరున్న లొకేష‌న్ ఆన్ చేస్తే, అదే ప్రాంతంలో ఉన్న ఫ్రెండ్, కామ‌న్ ఫ్రెండ్స్ ఎవ‌రో చూపిస్తుంది. ఇదంతా జీపీఎస్ ఆధారంగా ప‌నిచేస్తుంది. అంతేకాదు, మీ సొంతూరుకి ఫ్రెండ్స్ ఎవ‌రైనా వ‌చ్చినా యాప్ లో నోటిఫికేష‌న్ వ‌స్తుంది.

అలా మొద‌లైంది...!

త‌న‌య్ కొఠారి తండ్రి ఒక ట్రావెల‌ర్. త‌ర‌చూ ఏదో ఒక ప్రాంతాన్ని చుట్టి రావ‌డం ఆయ‌న హాబీ. ఓసారి ఇలాగే ఆయ‌న ఏదో ఊరు వెళ్లారు. అక్క‌డే ఓ ఆరు నెల‌ల పాటు ఉన్నారు. ఒక‌రోజు హ‌ఠాత్తుగా ఓ రెస్టారెంట్ లో చిన్న‌నాటి మిత్రుడొక‌రు ఎదురు ప‌డ్డారు! ఇదేంట్రా ఇక్క‌డున్నావ‌ని అడిగితే.. నేనుండేది ఇక్క‌డేగా అని జ‌వాబిచ్చాడు! ఈ ముక్క ముందే తెలిసి ఉంటే ఈ సిక్స్ మంథ్స్ ఎంజాయ్ చేసే వాళ్లం క‌దా అని ఫ్రెండ్స్ ఇద్ద‌రూ నిరాశ‌కు గుర‌య్యారు! సేమ్ టు సేమ్ సీన్ ఓసారి త‌న‌య్ ఫ్రెండ్ అర్జున్ మ‌ల్హోత్రాకి కూడా జ‌రిగింది! అప్పుడే త‌న‌య్, అర్జున్ కి ఈ ఆలోచ‌న వ‌చ్చింది. సోష‌ల్ ట్రావెల్ యాప్ ఒక‌టి క‌నిపెట్టి, దానికి ప్రాక్సిమిటీ అని పేరు పెట్టారు. మ‌రో ఫ్రెండ్ ఇషాన్ ప‌ర్వాండా కూడా వారికి స‌హ‌క‌రించాడు.

ప్రాక్సిమిటీ యాప్ ప్ర‌స్తుతం ఐఓఎస్ వెర్ష‌న్ లోనే ఉంది. ఇప్ప‌టికే 250 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ క‌ల్లా ఆండ్రాయిడ్ యాప్ కూడా తీసుకొచ్చే ప‌నిలో ఉన్నారు. ప్రాక్సిమిటీలో కొత్త‌గా ఉబ‌ర్ ఆన్ కాల్, యాప్ కాలింగ్ లాంటి ఫీచ‌ర్లు యాడ్ చేశారు.

ఇదీ ఫ్యూచర్ ప్లాన్..

అమెరికాలోని అగ్ర‌శ్రేణి విద్యా సంస్థ‌ల్లో ఇంజ‌నీరింగ్ చేయాల‌న్న‌దే త‌న‌య్ కొఠారి ఆలోచ‌న‌. ఇంజనీరింగ్ చేస్తూనే కొత్త ఆవిష్క‌ర‌ణలు చేస్తానంటున్నాడు త‌న‌య్. స్కూల్ ఏజ్ లోనే యాప్స్ త‌యారు చేశా, కాలేజీలో కూడా అది కంటిన్యూ చేస్తానంటూ ముగించాడు. ఆల్ ది బెస్ట్ త‌న‌య్!!

యాప్ లింక్: ఐఓస్