గ్రామీణ కళాకారులకు మంచి రోజులు తెచ్చిన గోకూప్‌

దళారీలు, దగాలు లేని ఆన్‌లైన్‌ అమ్మకాలుగో కోఆప్ పేరుతో వినూత్న వ్యాపార ఆలోచనకోఆపరేటివ్ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి కళాకారుల కష్టానికి తగిన ప్రతిఫలం

0

ఫ్లిప్‌కార్డ్‌, అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ స్టోర్లద్వారా ఆఫ్‌లైన్‌ రిటైలర్లు లాభం పొందుతున్నారు. ఎలాంటి ఆసరా లేనివాళ్లుగా గ్రామీణ హస్తకళాకారులు, చేతివృత్తులవారు మిగిలిపోతున్నారు. దేశంలోని మారుమూల గ్రామాలనుంచి అద్భుతమైన ప్రతిభ వెలికివస్తున్నా, వారికొక గుర్తింపు దక్కదు. తగిన మూల్యంకూడా అందదు. బేరసారాల్లో ఆరితేరిన తెలివితేటలు, అవకాశాలు వాళ్లకు ఉండవు. వారి నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దళారులు, మధ్యవర్తులు బాగుపడుతుంటారు. ఇదంతా స్వయంగా చూసిన వ్యక్తి శివ దేవిరెడ్డి. గోకోఆప్‌ స్థాపకులు. గ్రామీణ హస్తకళాకారులకు న్యాయం చేయాలని బాగా శ్రమిస్తున్నారు. గ్రామీణ సహకార సొసైటీలద్వారా వారి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్ముకునేలా సాయపడుతున్నారు. దళారులు, మధ్యవర్తుల ఆటలు సాగకుండా చూస్తున్నారు.

దేవిరెడ్డి శివ - గో కోఆప్‌ స్థాపకులు
దేవిరెడ్డి శివ - గో కోఆప్‌ స్థాపకులు

తమ ఉద్దేశాన్ని వివరిస్తూ, 'గ్రామీణ కళాకారుల జీవనోపాధికోసం ఏం చేయగలమనే అంశంపైనే ఎక్కువగా ఆలోచించాను. వారికి మార్కెట్టు అందుబాటులో లేకపోవడం, మార్కెట్‌ సంబంధిత సమాచారం తెలియకపోవడం ప్రధానమైన ఇబ్బందులు. వాళ్లు 10 రూ.ల ఖర్చుతో తయారు చేసింది, కస్టమర్ల చేతికి అందేసరికి 30-40 రూ.లకు ధర మారిపోతోంది. అంటే మూడు నుంచి అయిదు రెట్లు ధర పెరిగిపోతోంది. కష్టపడ్డవాళ్లకు మాత్రం అరకొరగా మిగులుతోంది. వ్యవసాయం, హస్తకళలు ఏమాత్రం గుర్తింపు లేని రంగాలుగా మారిపోయాయి. ఇది మున్ముందు మరీ సమస్యగా మారనుంది' అన్నారు శివ దేవిరెడ్డి.

ఆయన గో-కోఆప్‌ ఆరంభించడానికి ముందు యాక్సెంచర్‌ ఉద్యోగి. అక్కడుండగా అనేక కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్‌) పనులకు నేతృత్వం వహించారు. అప్పుడే ఆయనకు చేతివృత్తిదారులకు ఏదైనా చేయాలన్న ఆలోచన మొలకెత్తింది. రెండేళ్లపాటు బాగా అధ్యయనం చేశాక, ఉద్యోగాన్ని వదిలేశారు.

ఆదిలో అందరిలానే ఆయనకూడా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తన సొంత సవాళ్లను తట్టుకోవలసి వచ్చింది. కోఆపరేటివ్‌ సంఘాలతో, గ్రామీణ చేనేతవారితో మాట్లాడడమే పెద్ద సవాలుగా మారింది. వారి సమస్యలను అర్థం చేసుకుని, వారిని తన లక్ష్యం దిశగా మళ్లించడంలో శివ సతమతమయ్యారు. కంప్యూటర్‌ మొహమే ఎరుగనివారికి ఆన్‌లైన్‌ అమ్మకాల గురించి చెప్పాల్సి వచ్చింది. అయినాగానీ, నిరాశపడి కాడి వదిలేయలేదు.

'వారికి నచ్చజెప్పడం కోసం ఎన్నో అవగాహన తరగతులు నిర్వహించాం. ఇప్పుడు హస్తకళాకారులు, చేనేత కార్మికులు వారంతటవారే ఆన్‌లైన్‌ వ్యాపారంపై ఆసక్తి కనబరుస్తున్నారు' అని సంతృప్తి చెందుతున్నారు శివ.
గో కోఆప్ టీమ్ సభ్యులు
గో కోఆప్ టీమ్ సభ్యులు

'మరో సవాలు ఏమిటంటే, సామాజిక రంగంలో ఈావాణిజ్యం చేయడంపై ఆసక్తి కనబరిచే బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇది నిజంగానే తలనొప్పి పని. సరైనవాళ్లను ఎంచుకోవడం, వారితో టీమ్‌ని ఏర్పాటు చేసుకోవడం ఆషామాషీగా సాధ్యపడదు. రెండేళ్లు పట్టింది' అన్నారు.

దేశవ్యాప్తంగా ప్రాంతీయ క్లస్టర్లవారీగా వారి టీమ్‌ పనిచేస్తుంది. ఆయా క్లస్టర్లకు వెళ్లడం, అవగాహన తరగతులు నిర్వహించడం; ఈ-కామర్స్‌, కంప్యూటర్‌ వగైరాలపై ఆసక్తిని ఏర్పరచడం వారి బాధ్యత. మార్కెట్‌లోకి ఒక్కసారి హస్తకళాకారులు, సహకార సంఘాలవారు ప్రవేశించగానే, వారి వివరాలన్నీ సైట్‌లో పొందుపరుస్తారు. వారికంటూ ప్రత్యేక ప్రొఫైల్‌నికూడా తయారు చేస్తారు. ఈ వెబ్‌ సైట్‌కి ఆర్డర్‌ రాగానే, తయారీదారులకు అందజేస్తారు. వారి ఉత్పత్తులను స్వయంగా పరిశీలించాకనే కస్టమర్లకు చేరవేస్తారు.

ప్రస్తుతానికి, వారి కస్టమర్లలో 40 శాతం మంది దేశం బయటివారే కావడం విశేషం. రిటర్న్‌ సమస్యలు, డెలివరీ ఇబ్బందులు వంటివి కేవలం 1 శాతమే ఉండడాన్నిబట్టి ట్రాక్‌ రికార్డు ఎంత నిక్కచ్చిగా ఉందో ఊహించుకోవచ్చు. వెబ్‌సైట్‌లో సభ్యత్వ రుసుం, సైట్‌ద్వారా అమ్మినందుకు తీసుకునే కమిషన్‌ మాత్రమే గో కోఆప్‌ ప్రధాన ఆదాయం. ఈ సైట్‌లో 10,000 ఉత్పాదనలు, 170 మంది అమ్మకందారులు ఉన్నారు.

క్రాఫ్ట్స్‌ విల్లా వంటి ఈ-కామర్స్‌ వేదికలుకూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి బడా సంస్థలు ప్రవేశించడానికి అవకాశాలున్నాయి. ఏదేమైనా, గ్రామీణ భారతదేశంలోకి చొచ్చుకువెళ్లడం, హస్తకళాకారులను ఒప్పించడం కాస్త కష్టమైన పనే.

WEBSITE