మహిళలకు డ్రైవింగ్ నేర్పించే 'షి క్యాన్ డ్రైవ్'

0

షి క్యాన్ డ్రైవ్... భారతదేశంలో ఓ మహిళ చేత మహిళల కోసం నడుస్తున్న ఏకైక డ్రైవింగ్ శిక్షణ సంస్థ. ఈ సంస్థ యజమాని స్నేహా కామత్. డ్రైవింగ్ నేర్చుకోవడంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని గుర్తించిన స్నేహ... వినూత్న ఆలోచనతో ఈ స్టార్టప్ కి శ్రీకారం చుట్టారు. భారతదేశంలో మహిళలకు మహిళ డ్రైవింగ్ నేర్పే ఏకైక సంస్థ తనదేనని గర్వంగా చెబుతారామె. ఎన్నో లాంగ్ డ్రైవ్ లను ఎంజాయ్ చేసిన స్నేహ జీవితం కూడా లాంగ్ డ్రైవ్ లాంటిదే. ఈ ప్రయాణంలో ఎన్నో స్పీడ్ బ్రేకర్లున్నాయి. మరెన్నో గతుకులున్నాయి. ఇంకెన్నో అడ్డంకులున్నాయి.

ఇలా మొదలైన ప్రయాణం

సంప్రదాయవాద మార్వాడీ కుటుంబంలో జన్మించారు స్నేహ. నలుగురు తోబుట్టువుల్లో చిన్నమ్మాయి. అందరు అమ్మాయిల్లా కాకుండా ఏదైనా విభిన్నంగా చేయాలని చిన్ననాటి నుంచి ఆలోచించేవారు. ముంబైలో పుట్టిపెరిగిన స్నేహ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత సోషియాలజీలో పీజీ చేశారు. ఎంత చదివినా పైచదువులు చదవాలన్న ఉత్సాహంతో ఉంటారామె. అదే స్ఫూర్తితో ఎంఎస్ సర్టిఫైడ్ సర్వీస్ ఇంజనీర్ కోర్స్ చేశారు. చదువుల సంగతి పక్కనపెడితే స్నేహ బాల్యంలో చేదు అనుభవాలెన్నో ఉన్నాయి. స్నేహ చిన్ననాటే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నానమ్మ దగ్గర పెరిగారు స్నేహ. చెప్పుకోవడానికి నలుగురు తోబుట్టువులే కానీ... అంతా ఒకచోట పెరిగిన సందర్భాలే లేవు.

"నేను, నా తోబుట్టువులు మా తల్లిదండ్రుల్లో ఒకరి దగ్గర్నుంచి మరొకరి దగ్గరకు వెళ్లడం, వాళ్ల ప్రేమానురాగాలు పొందడం, వారితో విలువైన సమయం గడపడం మాకు ఓ పోరాటంలా అనిపించేది. చిన్నప్పట్నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. నా చదువుల కోసం నా సోదరి ఏడో తరగతిలోనే చదువు మానేసింది. 17 ఏళ్ల వయస్సులో మా నాన్న చనిపోయారు" అంటూ బాల్యాన్ని గుర్తుచేస్తారు స్నేహ.

మలుపు తిప్పిన డ్రైవింగ్

చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో గ్రీటింగ్ కార్డులు అమ్మే ఆర్చీస్ లో సేల్స్ గాళ్ గా తొలి ఉద్యోగాన్ని సంపాదించారు స్నేహా. అప్పట్లో నెలకు వెయ్యి రూపాయల జీతం. ఆ డబ్బులతోనే పైచదువులు చదివారు. జీవితంలో పోరాట స్ఫూర్తి తల్లి ద్వారా తనకు వచ్చిందంటారామె. ఆ తర్వాత పదేళ్ల పాటు వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు చేశారు. కానీ ఒకరి ఆధీనంలో పనిచెయ్యడమంటే స్నేహకు అస్సలు ఇష్టముండేది కాదు. పెళ్లి తర్వాత ఉద్యోగానికి బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏం చెయ్యాలని ఆలోచిస్తుండగా తాను అందరికంటే డ్రైవింగ్ బాగా చేస్తానన్న విషయం గుర్తొచ్చింది. స్నేహ సోదరి కూడా డ్రైవింగ్ నేర్చుకుంది. కానీ సరిగ్గా డ్రైవ్ చెయ్యలేకపోయానని తరచూ స్నేహతో చెప్పేది. ఆ మాటలు స్నేహను ఆశ్చర్యపరిచాయి. అసలు ఈ సమస్యకు మూలం ఏంటా అని బాగా ఆలోచిస్తే సమాధానం దొరికింది.

"మహిళలు టైంపాస్ కోసమే డ్రైవింగ్ నేర్చుకుంటారన్న దురభిప్రాయం పురుష ట్రైనర్లలో ఉంటుంది. మహిళలు డ్రైవింగ్ విషయంలో సీరియస్ గా లేరని, సమయాన్ని వృథా చేస్తారని వారు అనుకుంటారు. నేను ఊహించగలను. బాసులుగా ఉన్న మగవాళ్ల దగ్గర సెక్రటరీగా, ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్ గా పనిచెయ్యడమే అసౌకర్యంగా ఉంటుంది. అలాంటిది ఓ మగాడి పక్క సీట్ లో కూర్చొని డ్రైవింగ్ నేర్చుకోవడమంటే అంతకంటే ఇబ్బందిగా ఉంటుంది" ఇదీ అసలు సమస్య అంటారు స్నేహా.

డ్రైవింగ్ వచ్చిన పురుషులందరూ డ్రైవింగ్ నేర్పిస్తారనుకోవడం తప్పంటారామె. అలాంటి అభిప్రాయాన్ని మార్చుకోవాలంటారు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిన ప్రతీకారమే ఆమెను ట్రైనర్ ని చేసింది. తనకు తెలిసిన డ్రైవింగ్ స్కిల్స్ ని మహిళలకు నేర్పించాలని సంకల్పించారు. కానీ కుటుంబం నుంచి ప్రోత్సాహం లభించలేదు. చిన్ననాటి నుంచి సాహసోపేత మనస్తత్వం గల స్నేహ వెనక్కి తగ్గలేదు. అందర్నీ ఒప్పించి ముందుకెళ్లారు. అలా 2012లో 'షి క్యాన్ డ్రైవ్' స్టార్టప్ మొదలైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకు స్నేహ సుమారు 400 మందికి డ్రైవింగ్ నేర్పించారు. ఇప్పటి వరకు డ్రైవింగ్ స్కూల్ లేదు. అయినా స్నేహకు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వినూత్నపద్ధతుల్లో స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇవ్వడం, వారితో వ్యవహరించే తీరుతో స్నేహకు గొప్ప ఆదరణ లభించింది.

"కారులో అడుగుపెట్టగానే అసలు డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నారని వాళ్లను నేను అడుగుతాను. ఒక్కొక్కరి సమాధానం వేర్వేరుగా ఉండేది. నా దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్న తొలి విద్యార్థిని ఇప్పటికీ గుర్తున్నారు. రెండో రోజే కారును యాక్సిడెంట్ చేసింది. దాంతో అందరూ నన్ను కోపగించుకున్నారు. జరిగిన నష్టానికి నేను డబ్బులు చెల్లించడంతో అంతా సద్దుమణిగిపోయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు తనే నా 'ఉత్తమ' విద్యార్థి" అంటూ గత అనుభవాలను చెబుతారు స్నేహ.

స్నేహ విద్యార్థుల్లో ఒకరు లీలా దేశ్ పాండే. వయస్సు 58 ఏళ్లు. డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఆమెకు ఎక్కువ. కానీ ఆమె భర్త తీవ్రంగా వ్యతిరేకించేవారు. యూఎస్ లో ఉన్న ఆమె కొడుకు డ్రైవర్ ను పంపిస్తానన్నాడు. అయినా లీలా వినలేదు. మొండిగా పట్టుపట్టిన లీలా... చివరకు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆమె సొంతగా డ్రైవింగ్ చెయ్యడం తనకెంతో సంతోషాన్నిస్తుంది అంటారు స్నేహ. రోజంతా డ్రైవింగ్ తో బిజీగా ఉంటారు స్నేహ. ఉదయం ఏడున్నర గంటలకు మొదలు పెడితే అర్థరాత్రి వరకు డ్రైవింగ్ నేర్పిస్తారు. ఉద్యోగులు చాలామంది సాయంత్రం తర్వాతే డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తుంటారు. అందుకే అర్థరాత్రి వరకు నేర్పించక తప్పట్లేదు. తన ఏడేళ్ల కూతురికి వండివడ్డించడం, ఆలనాపాలనా చూసుకోవడం కోసం మధ్యాహ్నం సమయాల్లోనే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత మళ్లీ డ్రైవింగ్ నేర్పడానికి వెళ్తారు. షి క్యాన్ డ్రైవ్ లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పదిరోజుల్లో డ్రైవింగ్ రాకపోతే డబ్బులు వాపస్ అన్న పాలసీ ఉంది. ఈ పాలసీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ నయా పైసా తిరిగి వెనక్కి ఇవ్వలేదు స్నేహ. మహిళల ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసానికి ఇదే ఉదాహరణ అంటారామె. నైపుణ్యం సాధించేందుకు వారికున్న అంకితభావం చాలా ఎక్కువ అంటారు.

"మహిళలు గొప్పగొప్ప పనులు చేయాలనుకుంటారు. కానీ వారి దృక్కోణం పరిమితంగా ఉంటుంది. వారిని ఆ చట్రంలోంచి బయటకు తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నించేదాన్ని. సొంతగా ఏదైనా చేసేందుకు వారిని చైతన్యపరిచేందుకు ప్రయత్నించేదాన్ని" అంటారు స్నేహ.

భవిష్యత్ ప్రయాణం

బీబీసీతో పాటు పలు ప్రముఖ దినపత్రికలు స్నేహాను ఇంటర్వ్యూ చేశాయి. ఇప్పుడు సమాజానికి ఏమైనా చేయాలనుకుంటున్నారు స్నేహా. త్వరలో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించి గ్రామీణ మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి కంపెనీల్లో అఫిషియల్ క్యాబ్ డ్రైవర్స్ గా ఉద్యోగాలు ఇప్పించాలనుకుంటున్నారు. గ్రామీణ మహిళలు కేవలం గృహిణులుగా మిగిలిపోకూడదు, వారి సాధికారతే తన లక్ష్యం అంటారు స్నేహా. తన సేవలను భారతదేశమంతా విస్తరించాలన్నది స్నేహ ఆలోచన. ఈ సెల్ఫ్ మేడ్ ఆంట్రప్రెన్యూర్ ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతారు. "మహిళలకు ఆత్మవిశ్వాసాన్నిచ్చి చూడండి వాళ్లు అద్భుతాలు చేస్తారు" ఇదీ స్నేహ నమ్మకం.