చిన్న బేకరీగా మొదలై 20 ఏళ్లుగా స్వీట్‌తో మ్యాజిక్

చిన్న బేకరీగా మొదలై 20 ఏళ్లుగా స్వీట్‌తో మ్యాజిక్

Saturday September 26, 2015,

4 min Read

స్వీట్ అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయాలి. చూడగానే ఎప్పుడెప్పుడు తినాయాలా.. అని నోట్లో నీళ్లు ఊరాలి. ఇక ఉలవచారు బిర్యానీ, ఆవకాయ్ బిర్యానీ.. గురించి వింటేనే ఆకలి పుట్టుకొస్తుంది. ఇలా ఓ వైపు స్వీట్లు.. మరోవైపు విభిన్న రుచులతో రెస్టారెంట్లను ప్రారంభించి రెండు దశాబ్దాలుగా తిరుగులేని ప్రయాణం సాగిస్తోంది స్వీట్ మ్యాజిక్. ఓ చిన్న వీడియో షాపుతో మొదలైన ప్రస్థానం ఆ తర్వాత బేకరీగా ఇప్పుడు.. చైన్ షాపుల స్థాయికి ఎదిగింది అంటే అంత సులువుగా జరిగిపోలేదు.

స్వీట్ మ్యాజిక్.. తెలుగు జనాలకు చిరపరిచితమైన పేరు. రకరకాల స్వీట్లకు, విభిన్నమైన బిర్యానీలకు కేరాఫ్ అడ్రస్. 1995లో మొదలైన వీళ్ల జర్నీ ఇప్పటివరకూ అలా కొనసాగుతూనే ఉంది. పోటీ పెరిగి.. ఎన్నో ఫుడ్ స్టార్టప్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. వీళ్లు మాత్రం అలా ఆ మార్కెట్లో పాతుకుపోయారనే చెప్పాలి.

image


వీడియో లైబ్రరీతో మొదలైన బిజినెస్

గుడివాడలోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఎవివి ప్రసాద్, ఎవిఎస్‌వి ప్రసాద్, ఎ.రవి, ఎ.సాయిప్రసాద్...నలుగురు అన్నాదమ్ములు. చదువులు పూరైన తర్వాత వీళ్లంతా విజయవాడకు వచ్చేశారు. వీళ్లలో ఏవివి ప్రసాద్... ఉన్నత చదువుల కోసం ఐఐటి ఢిల్లీ వెళ్లిపోయినా వ్యాపారంలో మాత్రం భాగస్వామిగానే కొనసాగారు. అంతా కలిసి 1989లో వీడియో లైబ్రరీని మొదలుపెట్టారు. అప్పట్లో వీడియో క్యాసెట్లు, విసిఆర్‌లను అద్దెకు తీసుకునే సంస్కృతి విపరీతంగా ఉండేది. రోజుకు 300-400 క్యాసెట్లను అద్దెకు తిప్పుతూ.. మంచి పేరును, ఆదాయాన్ని సంపాదించారు. మెల్లిమెల్లిగా కేబుల్ టీవీ ప్రభంజనం మొదలవుతోందని గుర్తించి, ఇందులోనే ఉండే మనుగడ ఉండదనే భావనతో మెల్లిగా ఫీల్డ్ మారారు. క్యాసెట్ షాపుతో వచ్చిన లాభాలతో 'సీజన్స్' పేరుతో బేకరీని ప్రారంభించారు. పదిహేనేళ్ల క్రితం అది కూడా ఓ ట్రెండ్. క్వాలిటీ, వినూత్నత కారణంగా అది కూడా క్లిక్ అయ్యింది. అంచలంచెలుగా ఎదుగుతూ.. 1995 ఆగస్టులో రూ. 5 లక్షల పెట్టుబడితో స్వీట్ మ్యాజిక్‌ పేరుతో స్వీట్ షాప్ మొదలైంది.

image


వెనుక నుండి నడిపిన ఐఐటి బ్రెయిన్

నలుగురు అన్నాదమ్ముల్లో ఒకరైన ఎవివి ప్రసాద్ ఐఐటి ఢిల్లీలో చదివిన వ్యక్తి. ఆయన సలహా, సూచనల మేరకే 'స్వీట్ మ్యాజిక్' పేరు ఖరారైంది. అప్పటి వరకూ విజయవాడలో స్వీట్లంటే.. మామూలు అట్టపెట్టెల్లో మాత్రం పెట్టి ఇచ్చే సంస్కృతి ఉండేది. ఓ పదిహేను, ఇరవై రకాల స్వీట్లతో వ్యాపారాలన్నీ ట్రెడిషనల్‌గా నడిచేవి.

వీళ్లు వ్యాపారంలోకి అడుగుపెట్టిన తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సిటీల్లో మాదిరి రకరకాల బాక్స్ ప్యాకింగ్‌లు మొదలుపెట్టారు. వివిధ రాష్ట్రాల్లో దొరికే స్వీట్లన్నింటినీ ఒక చోటికి తెచ్చారు. అప్పటివరకూ కొన్ని రకాల రుచులను మాత్రమే చూసిన జనాలు.. ఇన్ని వెరైటీలు వచ్చే సరికి మరింత ఆసక్తి చూపించారు. సాధారణంగా ఫుడ్ బిజినెస్‌లో సర్వీస్, క్వాలిటీ చాలా ముఖ్యం. ముందుగా ఈ రంగంలో ఆ అనుభవం లేకపోయినా.. అంతా కలిసి కష్టపడ్డారు. అన్ని విషయాలనూ మెల్లిగా తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకపోవడం వల్లే ఓ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.

మిఠాయిల వ్యాపారంలో నిలదొక్కుకున్న తర్వాత రెస్టారెంట్ల వైపు చూడా అడుగులు వేసింది స్వీట్ మ్యాజిక్. 2000 సంవత్సరంలో ఒక్కో బ్రాంచ్‌నూ పెంచుకుంటూ.. ఆ రంగంలోనూ ఎదిగారు. వ్యాపారం విస్తృతం కావడంతో అన్నాదమ్ముల ఆలోచనలూ పెరిగాయి. షాపులను పంచుకుని.. ఎవరి స్థాయిలో వారు ఎదగడం మొదలుపెట్టారు. ఒకప్పుడు కేవలం విజయవాడకు మాత్రమే పరిమితమైన బ్రాండ్.. దీని వల్ల గుంటూరు, విశాఖపట్నానికి కూడా విస్తరించింది. ఒక మామూలు స్వీట్ షాపు.. ప్రధాన నగరాల్లో చైన్ షాప్స్ ఏర్పాటు చేసి ఓ బ్రాండ్ తెచ్చుకోగలిగింది అంటే... అంత సులువైన విషయం కాదు. దీని వెనుక వీళ్లందరి కష్టమూ ఉంది. అయితే ఈ ఆలోచన వెనుక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో సాయి ప్రసాద్ కూడా ఒకరు. ఆయన 20 ఏళ్లుగా నిలకడగా.. తన బిజినెస్‌ను వృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం 2 స్వీట్ షాపులు, రెండు ఫ్యామిలీ రెస్టారెంట్ బాధ్యతలను చూసుకుంటున్నారు. మిగిలిన అన్నాదమ్ముల్లో క్రాస్ రోడ్స్ రెస్టారెంట్స్‌ను రవి చూసుకుంటున్నారు. ఐఐటిలో చదివిన ఎవివి ప్రసాద్.. హైదరాబాద్‌లో 'చట్నీస్'ను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఎవిఎస్‌వి ప్రసాద్ నాలుగు బ్రాంచీలను నడిపిస్తున్నారు.

image


ఏంటి ప్రత్యేకత ?

సాధారణంగా బిర్యానీ అనగానే.. హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ జనాలకు వినూత్నమైన వాటిని పరిచయం చేసే క్రమంలో పుట్టుకొచ్చినవే.. ఆవకాయ్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ. వీటికి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏకంగా సినిమాలు కూడా వీటి పేర్లతో తీసేంత ప్రాచుర్యాన్ని ఇవి పొందాయి. బిజినెస్‌ను విస్తరించుకోవడానికి చాలాకాలం క్రితమే హోం డెలివరీని, విదేశాలకూ సరఫరా చేయడాన్ని మొదలుపెట్టారు. నగరాల్లో దొరికే వివిధ స్వీట్లకు స్థానిక రుచులు అద్ది తయారుచేశారు. ఏడాదికి ఒకసారి షాపులన్నింటినీ రెనోవేట్ చేయించడం వంటివే ఇతరులతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టాయి. కస్టమర్లు తమ షాపులకో, రెస్టారెంట్లకో నిత్యం వస్తూ ఉండాలంటే.. ఏదో ఒక కొత్తదనం ఉండాలని, లేకపోతే ఈ బిజినెస్‌లో రాణించలేమంటారు సాయిప్రసాద్. అందుకే ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి స్వీట్లు, రెస్టారెంట్లో ఒక కొత్త ఐటెం తీసుకువస్తామని వివరిస్తున్నారు.

50 కోట్ల టర్నోవర్ లక్ష్యం

ప్రస్తుతం సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపులే నెలకు 7000-8000 కేజీల వరకూ స్వీట్లను విక్రయిస్తూ ఉంటాయి. స్వీట్స్, రెస్టారెంట్స్ అన్నీ కలిపి ఏడాదికి వీళ్ల టర్నోవర్ కూడా సుమారు 12 కోట్లపైనే ఉంటోంది. రాబోయే ఐదేళ్లలో రూ.50 కోట్ల టర్నోవర్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సాయిప్రసాద్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి దగ్గర్లో రెస్టారెంట్లు, విజయవాడ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఓ హోటల్ కూడా నిర్మించబోతున్నట్టు ఆయన వివరించారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంపిటీషన్ విపరీతంగా పెరుగుతోందని.. రోజుకో కొత్త రెస్టారెంట్ పుట్టుకొస్తోందంటున్నారు ప్రసాద్. ఎవరైతే క్వాలిటీలో రాజీపడకుండా, ఆంధ్రా ఫుడ్‌లో ఇన్నోవేషన్ తీసుకువస్తారో.. వాళ్లు మాత్రమే సక్సెస్ అవుతారని వివరిస్తున్నారు. ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టే వాళ్లకు ఆయన ఇస్తున్న సలహా ఒక్కటే. ' ఇది 365 రోజుల పాటు పర్యవేక్షించాల్సిన వ్యాపారం. ప్రతీ రోజూ క్వాలిటీ చెక్ చేయాలి. ఏ రోజుకు ఆ రోజు.. కొత్తదనం చూపించాలి. నాణ్యత, టేస్ట్ విషయంలో కస్టమర్ల నుంచి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ప్యాకేజింగ్ వినూత్నంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నిలబడగలమని సూచిస్తున్నారు'.