రైల్లో నీళ్లు అమ్మిన వీధిబాలుడు నేడు ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్

రైల్లో నీళ్లు అమ్మిన వీధిబాలుడు నేడు ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్

Thursday May 21, 2015,

7 min Read

పేద ఇంటిలోని ఏడుగురి సంతానంలో ఒకడు.

తాతయ్య కొట్టాడంటూ ఇంట్లోంచి పారిపోయిన వాడు.

బంధువు జేబులో దొంగతనం చేసి రైలెక్కాడు.

ప్లాట్‌ఫారాలపై పడుకున్నాడు, రోడ్లపై నిద్రించాడు.

ఇప్పుడు ప్రపంచం మొత్తం తనను గుర్తించేలా ఎదిగిన విక్కీరాయ్.


ఒక వ్యక్తి వీధి బాలుడి నుంచి ప్రపంచం ప్రశంసించే స్థాయికి ఎదగడం సాధ్యమేనా... దీన్ని సాధ్యం చేసి చూపారు విక్కీరాయ్. అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రాఫర్‌గా ఈయనను ఇపుడు ప్రపంచం మొత్తం పొగుడుతోంది. ఎప్పుడో 1980ల్లో వచ్చిన బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోదు విక్కీ లైఫ్. ఇప్పుడొచ్చే మాస్ మసాలా మూవీలకంటే విక్కీరాయ్ జీవితమే మన హృదయాలను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పౌలా కోహ్లో రాసినట్లు 'బాధ, ప్రేమ మాత్రమే జీవిత రహస్యాలను బైటపెట్టగలవు'. తన జీవితానికి సమాధానం చెప్పుకుని, ఈగోని సంతృప్తి పరచి, కళాకారుడిని కాపాడుకుని, పైకి తెచ్చే క్రమంలో రాయ్ జీవితం ఎవరికైనా రోల్ మోడలే. అయితే 26ఏళ్ల జీవితంలో ఎక్కడా త్యాగాలు లేవు, అలాగే తనమీద తాను జాలిపడే సంఘటనలూ లేవు. ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా.. చిన్నపుడు తనతోపాటు రోడ్లపై తిరుగాడిన తన డ్రీమ్‌గర్ల్‌నే వివాహం చేసుకోవడం ఈతని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. నాతోపాటే అనాథ శరణాలయంలో తాను కూడా పెరగడంతో... నేనెప్పుడూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాదుగా అంటూ నవ్వుతున్నారు విక్కీ రాయ్.

విక్కీ రాయ్, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్

విక్కీ రాయ్, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్


మర్చిపోవాల్సిన చిన్నతనం

"నేను చిన్నపుడే ఇంట్లోంచి పారిపోయా. పేదరికానికి అడ్రస్‌గా చెప్పదగిన ఇంట్లో పుట్టిన నేను... నా పేరెంట్స్‌కి ఏడుగురు పిల్లల్లో ఒకడిని. నా తండ్రి ఇంట్లో ఖర్చులకు అమ్మకి రోజుకు 20రూపాయలే ఇచ్చేవాడు. నాకు 2,3 ఏళ్లున్నపుడు మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర వదిలేశారు అమ్మానాన్నలు. నేను కనీసం చదువుకోడానికి అవకాశం ఉంటుందని వాళ్లు భావించారు. ఇంట్లో ఉన్న ఏడుగురు పిల్లలకు చదువు చెప్పించలేడని మా నాన్నకు తెలుసు. వాళ్లు కనీసం పదో తరగతి చదవాలని ఆయన కోరిక. దాని ప్రకారం నేను బాగానే చదువుతున్నా. ఆ సమయంలో ఏదో ఓ చిన్న గొడవ గురించి మా తాత నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నన్ను ఇతర పిల్లలతో ఆడుకోనిచ్చేవారు కాదు. స్కూల్ నుంచి నేరుగా ఇంటికే రావాలంటూ రూల్స్ ఉండేవి. సైకిల్‌పై స్కూల్ కెళ్లడం, ఇంటికి రావడం.. నా లైఫ్ ఇంతే అప్పట్లో. స్కూల్లో నా స్నేహితులు అక్కడికి వెళ్లామని ఇక్కడికి వెళ్లామని చెబ్తుంటే... ఆ ప్లేస్‌లన్నీ తిరగాలని నా మనసు తహతహలాడేది. కానీ నాకు స్కూల్ అయ్యాక కూడా చాలా పనులుండేవి. ఏ చిన్న తప్పు చేసినా.. చావగొట్టేవారు మా తాత. ఒక్క మాటలో చెప్పాలంటే జైల్లో పెట్టకపోయినా ఖైది జీవితంలా ఉండేది నాకు. అందుకే 11ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయా"నని చెప్పారు విక్కీ రాయ్.

చాలాసార్లు ఇంటి నుంచి పారిపోయే ఆలోచన వచ్చినా ఆ ధైర్యం చేయలేదు విక్కీ. ఓ సారి అంకుల్ వరసయ్యే వ్యక్తి ఇంటికొస్తే.. ఆయన జేబులోంచి 900 రూపాయలు దొంగతనం చేసి పారిపోయాడు. ఇది అతను చూసిన అతి పెద్ద మొత్తం. డైరెక్టుగా రైల్వే స్టేషన్‌కి వెళ్లిపోయి... ఓ హాఫ్ టికెట్ కొనుక్కుని, ఢిల్లీ వెళ్లే రైలెక్కేశానని చెప్పారు విక్కీ.

image


కొత్త ప్లేసులో బోలెడు కష్టాలు

ఢిల్లీలో దిగగానే అంతమంది జనాలను చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిందిట విక్కీ. ఎక్కడికెళ్లాలో తెలీని పరిస్థితి. భయపడిపోయి ప్లాట్‌ఫాంపైకొచ్చి ఏడవడం మొదలుపెట్టేసరికి... కొంతమంది పిల్లలు చుట్టుముట్టేశారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్లు చెప్పేసరికి... తమతో తీసుకెళ్లారు. స్కూల్‌కి వెళ్లే అవకాశమున్నచోటకే తీసుకెళ్లారు వాళ్లు. సలామ్ బాలక్ ట్రస్ట్ హోమ్‌కి చేరాడు విక్కీ. ఓ గూడుకి చేరుకున్నా భయం మాత్రం పోలేదట. చిన్నపుడు కిడ్నాపుల గురించి, కళ్లు పీకేసి ముష్టివాళ్లను చేయడం వంటి కథలు, వార్తలు గుర్తుకొచ్చి మరింతగా భయం వేసేది. దీంతో మళ్లీ అక్కడినుంచి పారిపోయి రైల్వే స్టేషన్ చేరిపోయాడు ఆ చిన్నారి విక్కీ.

రోడ్ల పైనే జీవనం

తిరిగి రైల్వే స్టేషన్‌కొచ్చాక అదే ఏజ్ గ్రూప్ పిల్లలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించి, వాటిని ఐదు రూపాయల చొప్పున జనరల్ బోగీల్లో అమ్మేవారు వారంతా. ఒకసారి జనరల్ బోగీల్లో ఎక్కినవారెవరూ మళ్లీ కిందకి దిగి నీళ్లు పట్టుకునే ఛాన్స్ ఉండదు. దీంతో మా వ్యాపారం తెగ స్పీడ్‌గా ఉండేది. ఇలా ఆరేడు నెలలు గడిచిపోయాయి. అచ్చం సినిమాల్లోలాగే ప్రతీ ప్లాట్‌ఫాంకి ఓ విలన్ ఉంటాడు. విక్కీకి తగిలిన విలన్ మరింత నీచుడు. వీళ్లని కాపాడినందుకుగానూ... సంపాదించినదాంట్లో చాలావరకూ అతనికే ఇచ్చేయాల్సి వచ్చేది. ఎంత ఎక్కువమంది పిల్లలు అతని కింద ఉంటే.. అంత శక్తిమంతుడన్నామాట. అప్పుడప్పుడూ దుండగులు దాడి చేసినపుడు... ఇతని పేరు మాకు ఉపయోగపడేది. అయితే.. ఎప్పుడైనా బాటిల్స్ అమ్మకపోయినా.. ఉచితంగా తినడానికి ఏదో ఒకటి పెట్టే ఫెసిలిటీ మాత్రం ఉండేది.

చిన్న గొడవలు ఎప్పుడైనా పెద్దవిగా మారినపుడు... వీళ్ల దాడులు, శిక్షలు చాలా పాశవికంగా ఉండేవి. తుప్పు పట్టిన బ్లే‌డ్లతో చిన్న పిల్లలని చూడకుండా గాట్లు పెట్టడం, శరీరంపై ఎక్కడపడితే అక్కడ కోసేయడం చేసేవారు. అలాంటి భయానక పరిస్థితుల్లో ఇమడలేకపోయానంటారు విక్కీ. స్టేషన్లో పగలు పని చేసి, రాత్రి పూట చెత్త కుండీల దగ్గర పడుకునేవారు వారంతా. కొన్నిసార్లు రామ్‌లీలా మైదానం కూడా వారి నిద్రకు వేదికైంది. ఇలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.

"నేను రోజూ ఆహారం తినడానికి వెళ్లే ఓ దాభా ఉండేది. అందులో పనికి కుదిరాను కొన్నాళ్లకు. అది నా జీవితంలో అత్యంత భయంకర పరిస్థితి సృష్టిస్తుందని తెలీదు నాకు అప్పట్లో. అది చలికాలం. గడ్డకట్టే చలిలోనూ అతి చల్లని నీటిలో రాత్రంతా గిన్నెలు కడగాల్సి వచ్చేది. చేతులంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి, కురుపులు వచ్చేవి. వాటి నుంచి విపరీతంగా రక్తం కారిపోయేది. తెల్లవారి ఐదింటికల్లా కూరగాయలు తరగడం కోసం నిద్ర లేపేసేవారు. ఆ హింస భరించలేకపోయినా నాకు వేరే ఛాయిస్ లేదు. అందుకే అక్కడే ఉన్నా కొన్ని నెలలు"-విక్కీరాయ్
విక్కీ రాయ్ ఫోటోగ్రఫీ

విక్కీ రాయ్ ఫోటోగ్రఫీ


బాధల్లో కలిసొచ్చిన ఓ చిన్న అదృష్టం

హోటల్లో పని చేస్తోన్న సమయంలో సలామ్ బాలక్ ట్రస్టుకు చెందిన వాలంటీర్ ఒకతను కనిపించాడు విక్కీకి. ఈ వయసులో చదువుకోవాలి గానీ పని చేయకూడదని చెప్పాడు. ట్రస్ట్ హోమ్‌కి మళ్లీ తీసుకెళ్లాడు. ఈసారి పారిపోయే ఆలోచన కూడా రాలేదు తనకంటారు విక్కీ. సలామ్ బాలక్‌కు చెందిన స్కూల్‌కి వెళ్లే పిల్లలుండే అప్నాఘర్‌లో నివాసం. ఏడో క్లాస్‌లో జాయిన్ అయి... మరోసారి విద్యార్ధి జీవితం మొదలైంది అతనికి. పదో క్లాసులో 48 శాతం మార్కులే రావడం చాలా నిరుత్సాహం కలిగించిందని చెప్తారాయన. అయితే చదువు కంటే సమాజంలో చుట్టూ కనిపిస్తున్న ప్రకృతిపైనే ఎక్కువ ధ్యాస ఉండేది విక్కీరాయ్‌కి. చిన్నక్లాసుల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా, టెన్త్ లాంటి ఇంపార్టెంట్ టైంలో ఈ విషయం బైట పడిపోయిందని చెప్తారు విక్కీ.

ఫోటోల ప్రపంచంలోకి ప్రవేశం

ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకునే అవకాశం కల్పించిన అప్నాఘర్ అదే సమయంలో ఏవైనా వృత్తి విద్యల్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాటు చేసింది. మెకానిక్, ఎలక్ట్రీషియన్ వంటివాటిని నేర్పేవారు. 2001 సమయంలో అప్నాఘర్‌లో ఫోటోగ్రఫీపై వర్క్‌షాప్ నిర్వహించేవారు. ఇదే విక్కీరాయ్ జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ లెక్చర్ ఇచ్చే ఒకాయన తాను ఇండోనేషియా, శ్రీలంకలు పర్యటించానని చెప్పాడు. అంతే అదే జీవితంగా ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు విక్కీ. ఓ బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ అప్నాఘర్‌పై డాక్యుమెంటరీ తీసే సమయంలో.. అతనికి అప్రెంటీస్‌గా విక్కీ పని చేశాడు. "నాకు అర్ధమయ్యేట్లు చెప్పడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా... అతను ఓపిగ్గా చెప్పేవాడు. ఆ చెప్పేవాటికన్నిటికి ఇంగ్లీష్‌లో నా దగ్గరున్న సమాధానాలు రెండే... యస్, ఓకే.."- విక్కీ రాయ్

image


అతను ఢిల్లీ వదిలి వెళ్లే సమయంలో విక్కీ ఓ ప్రశ్న అడిగాడు. తనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి... తాను గొప్ప ఫోటోగ్రాఫర్ అవ్వగలడా అన్నదే ప్రశ్న. దానికి అతనిచ్చిన సమాధానం ఇది. " ప్రపంచంలో అత్యుత్తమ ఫోటోగ్రాఫర్లు ఎక్కువగా జపాన్, చైనా, ఫ్రాన్స్ నుంచి వచ్చినవాళ్లే. వాళ్లెవరూ ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు. నువ్వు భారతీయుడివి. నీ భాష హిందీనే గర్వంగా మాట్లాడ్డం నేర్చుకో."

18 ఏళ్లు వచ్చేసరికి అప్నాఘర్ వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. చదువుతోపాటు జీవితంలో అన్నీ నేర్పిన అప్నాఘర్‌ని వదిలేసి వెళ్లేప్పుడు చాలా బాధ పడ్డానంటారు విక్కీ. కొన్ని నెలలు నిరుద్యోగిగానే ఉండిపోవాల్సొచ్చింది. ఓ ఫోటోగ్రాఫర్ దగ్గర అప్రెంటీస్‌గా జాయిల్ అవడంలోనూ వాళ్లు చాలా సహాయపడ్డారు. అనయ్‌మన్ దగ్గర చేరాక... సెల్‌ఫోన్ వచ్చింది, బైక్ వచ్చింది, నెలకు 3వేల రూపాయల జీతంగా కూడా ఇచ్చేవారు. ఫోటోగ్రఫీలో నైపుణ్యం పొందాలంటే మూడేళ్ల తన దగ్గర పనిచేయమని అనయ్‌మన్ చెప్పారు. విక్కీ దానికి ఒప్పుకున్నాను. సలామ్ బాలక్ నుంచి రూ.30 వేలు లోన్ తీసుకుని, ఓ కెమేరా కొనుక్కున్నాక... లైఫ్ మరో కోణంలోంచి కనపడ్డం ప్రారంభమైంది.

విక్కీరాయ్ ఫోటోగ్రఫీ

విక్కీరాయ్ ఫోటోగ్రఫీ


కలల తీరం చేరేందుకు వీధి బాలలే ఆధారం

గొప్ప గొప్ప వ్యక్తుల ఫోటోలపై పరిశోధించే సమయంలో.. సొంతంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే విక్కీ గురువు మాత్రం ఇంకా ప్రావీణ్యత సాధించాలని చెప్పి, ఏదైనా ఒక థీమ్‌పై పని చేయాల్సిందిగా సూచించారు. దీంతో వీధిబాలలను ఎంచుకున్నారు విక్కీ. దీనిపై ఇప్పటికే చాలామంది ఆయన పని చేశారని చెప్పడంతో.. తాను కొత్తగా ఏం చేయగలలని ఆలోచించారు విక్కీ. తానే ఓ వీధి బాలుడు కావడంతో... అవే దృశ్యాలను అంతర్గత కోణంనుంచి తీయగలనని నమ్మారు విక్కీ. తీశారు కూడా. బ్రిటిష్ హై కమీషన్ విక్కీ ప్రతిభను గుర్తించింది. సొంతగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు స్పాన్సర్‌షిప్ చేసింది కూడా. 2007లో హాబిటాట్ సెంటర్‌లో ప్రదర్శించిన స్ట్రీట్ డ్రీమ్స్ ఇదే. ఇది విజయవంతం కావడంతో లండన్, సౌత్ ఆఫ్రికా, వియత్నాంలలోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. గుర్తింపు రావడం, తగినంత ఆదాయం సమకూరడంతో నిర్లక్ష్యం పెరిగిపోసాగింది. ఫోటగ్రఫీ మెంటర్ అనయ్‌మన్‌తో మార్పులు రాసాగాయి. దీన్ని గుర్తించిన ఆయన ఓ రోజు కేఫ్‌లో కూర్చోబెట్టుకుని తప్పులను ఏకరువు పెట్టారు. ఒక మంచి మనిషి కాలేనివాడు, మంచి ఫోటోగ్రాఫర్ ఎప్పటికీ కాలేవని చెప్పాడాయన. విక్కీ కంట కన్నీరు రావడమే కాదు, అదే కేఫ్‌లో పెద్దగా ఏడ్చేశాడు కూడా. తనను తాను సరిదిద్దుకునేందుకు ఈ సంఘటన చాలా ఉపయోగపడందని చెబ్తారు విక్కీ. 2008లో ఓ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో గెలుపొందడంతో.. ఆరు నెలలపాటు అమెరికాలో ఉండే అవకాశం లభించింది. అంతే కాదు ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫోటగ్రఫీలో ట్రైనింగ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యత్తమ ఫోటోగ్రఫీ స్కూల్. మార్చ్ 2009లో ప్రారంభమైన ఈ కోర్స్ కోసం న్యూయార్క్ వచ్చారు విక్కీ. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పునర్ నిర్మాణ పనులను ఫోటోగ్రాఫ్ చేసేందుకు ఎంపికయ్యారు. ఈ ఫోటోలు 2010 జనవరిలో ప్రదర్శనకు వచ్చాయి.

నాపై నాకు నమ్మకం కుదిరింది అక్కడే !

అమెరికా వచ్చాక విక్కీలో నిజమైన నమ్మకం పెంపొందసాగింది. ఇండియాలో ఉన్నంతసేపు బ్యాక్‌గ్రౌండ్ గురించో... పని గురించో అలోచించాల్సి వచ్చేది. కానీ అమెరికాలో అంతా టాలెంట్ బేస్డ్ హంట్. చిన్నచిన్న భయాలు కూడా తొలగిపోయి గొంతు సర్దుకుని బిగ్గరగా మాట్లాడ్డం ఇక్కడే మొదలైంది. దీంతో ప్రతీ పనినీ కాన్ఫిడెన్స్‌తో చేయడం మొదలైంది. ఓసారి బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ప్రిన్స్ ఆండ్రూతో లంచ్ చేసేందుకు పిలుపొచ్చింది. ఆ ప్యాలెస్‌ను బయట నుంచి చూట్టానికి ఏటా కోట్ల కొద్దీ ప్రజలు వస్తూంటారు. కానీ తన కెమేరా, పనితనంతో ఆ ప్యాలెస్ లోపలికి వచ్చి, యువరాజుతో భోజనం చేసే అవకాశం చిక్కడాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు విక్కీ. ఆ తర్వాత బక్‌షాట్‌లోని యువరాజు సొంత ప్యాలెస్‌లో డిన్నర్ పార్టీకి కూడా ఆహ్వానం అందింది విక్కీకి.

image


2011లో చందన్ గోమ్స్‌తో కలిసి రాంగ్ అనే ఛారిటీ సంస్థను ప్రారంభించారు విక్కీరాయ్. ఫోటోగ్రఫీ బుక్స్‌తో కూడిన ఫోటో లైబ్రరీని ప్రారంభించారు. ఇక్కడ అతి ఖరీదైన పుస్తకాలు ఉంటాయి. ఫోటోగ్రాఫర్లను పుస్తకాలు పంపగా ఆహ్వానిస్తే.. వారి దగ్గర నుంచి అనూహ్య స్థాయిలో స్పందన వచ్చింది. సలామ్ బాలక్‌లో పిల్లలకు మెంటార్స్‌గా ఉంటున్నారు వీరు.

అప్నా ఘర్‌లోని ఓ రూం దృశ్యాన్ని ఇలా బంధించిన విక్కీ

అప్నా ఘర్‌లోని ఓ రూం దృశ్యాన్ని ఇలా బంధించిన విక్కీ


మరో అప్నాఘర్

2012లో తాము పెరిగిన అప్నాఘర్‌నే థీమ్‌గా చేసుకుని ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సాధారణ ఇళ్లకు, అప్నాఘర్‌ వంటి అనాథల బతుకులకు తేడా చూపించడమే దాని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఫోటోలతో హోమ్ స్ట్రీట్ హోమ్ పేరుతో ఓ పుస్తకం రూపొందించి 2013 ఢిల్లీ ఫోటో ఫెస్టివల్‌లో ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేశారు. హోమ్ స్ట్రీట్ హోమ్ ఒక్కో కాపీ ధర రూ. 1000. 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ వారు మిషన్ కవర్ షాట్ పేరుతో ఓ రియాలిటీ షో ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా శ్రీలంక వెళ్లారు విక్కీ. పది వారాల ఈ షోలో... ప్రతీవారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అందులో 9 వీక్లీషోలలో భాగమయ్యారు విక్కీ.

image


అక్కడి నుంచి విక్కీ కంటే అతని ఫోటోలే మాట్లాడ్డం మొదలుపెట్టాయి. ప్రపంచమంతా ప్రయాణించడం ప్రారంభించాయి. లేటెస్ట్ టెక్నిక్స్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఫోటోగ్రఫీ కోర్స్ పూర్చి చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో.. ఇలా ప్రపంచం నలుమూలలా ప్రయాణిస్తూనే ఉన్నారు విక్కీరాయ్. ప్రపంచంలోని అత్యుత్తమ ఫోటోగ్రాఫర్ల జాబితాలో తన పేరూ ఉండాలన్నదే లక్ష్యంగా చెబ్తారాయన. ఎన్ని ఎక్కువ ఫోటోలు నువ్వు తీయగలగితే అంత గొప్ప ఫోటోగ్రాఫర్ అవుతావన్న గురువు అనయ్‌మన్ మాటలే తనకు జీవిత పాఠాలంటున్నారు విక్కీ. "ఎక్కడ స్వార్ధం ఉంటే అక్కడ అంత బాధ ఉంటుంది. నువ్వు చివరి వరకూ చేయగలిగేది నీ పనిని మాత్రమే. నువ్వు చేసే పనిని నిజాయితీగా, నిస్వార్ధంగా ప్రేమించు. అంకితభావంతో పూర్తి చెయ్. అంతే నువ్వు జీవితంలో ఊహించని తీరాలకు చేరుకుంటావం"టారు విక్కీరాయ్.