వాళ్ల టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట..!!   

0


జీవితమంటేనే సవాళ్లు. ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు. వాటన్నింటినీ అధిగమిస్తేనే విజయం చేరువవుతుంది. అలాంటి అడ్డంకులన్నింటినీ ఎదుర్కొని ఇండియన్‌ క్రికెట్‌ టీంలో స్థానం సంపాదించుకున్న స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌ సురేష్‌ రైనా. తాను మైదానంలో అడుగుపెట్టాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. తనదైన ఆటతీరుతో భారత్‌కు ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. టీ ట్వంటీలోనే కాక వన్‌డేలలోనూ సత్తా చాటిన రైనా.. ప్రతి రోజూ ఓ కొత్త సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమంటారు. తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న సురేష్‌ రైనా బాల్యంలో సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాడట. హాస్టల్ లో ఉండగా ఎదురైన దురదృష్టకర ఘటనల్ని గుర్తుచేసుకున్నాడు.

రైనాకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 13 ఏళ్ల వయసులో ఉత్తర్‌ప్రదేశ్‌ లక్నోలోని ఓ స్పోర్ట్స్‌ హాస్టల్‌లో చేరాడు. ఓ రోజు మ్యాచ్‌ ఆడేందుకు సహచరులతో కలిసి ట్రైన్ లో ఆగ్రా బయలుదేరిన రైనా... బెర్త్‌ పై న్యూస్ పేపర్ వేసుకుని పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉండగా గుండెలపై ఏదో బరువు పెట్టినట్లనిపించింది. కళ్లు తెరిచేలోపు ఎవరో తన రెండు చేతుల్ని బలంగా అదిమి పట్టుకున్నారు. ఛాతీపై కూర్చున్న అబ్బాయి రైనా ముఖంపై మూత్రం పోస్తున్నాడు. కాసేపు పెనుగులాడిన రైనా వాడి ముఖంపై ఒక్క గుద్దు గుద్ది ఇచ్చి తప్పించుకున్నాడట.

హస్టల్‌లో ఉన్నప్పుడు మిగతా అబ్బాయిలు సురేష్‌తో చాలా దారుణంగా వ్యవహరించేవారట. అందుకు కారణం క్రికెట్‌ కోచ్‌లు తనపట్ల ఎక్కువ శ్రద్ధచూపడమేనంటారు రైనా.

“నా సహచరుల్లో చాలా మంది సర్టిఫికేట్ల కోసం మాత్రమే హాస్టల్‌లో చేరారు. నాలుగేళ్లు హాస్టల్‌ లో ఉంటే ఇచ్చే సర్టిఫికేట్‌తో రైల్వే లేదా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం పొందొచ్చన్నది వారి ఆలోచన.” -సురేష్‌ రైనా

ఇదొక్కటే కాదు రోజులు గడిచేకొద్దీ హాస్టల్‌లో ఇలాంటి దారుణాలు ఇంకా చాలానే ఎదుర్కున్నాడు. రైనా అంటే గిట్టనివారు అతని పాల గ్లాసులో చెత్తా చెదారం వేసేవారు. దీంతో పాలను చున్నీతో వడగట్టి తాగాల్సి వచ్చేదట. చలికాలంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో చల్లని నీటిని బకెట్‌తో తెచ్చి నిద్రపోతున్న రైనాపై పోసేవారట. నీళ్లు పోసిన వాడిని కోపంతో కొట్టబోతే.. నలుగురైదుగురు మీదపడి దాడి చేసేవారట. ఈ బాధలు భరించలేక చివరకు హాస్టల్‌ వదిలి ఇంటికి వెళ్లికి వెళ్లిపోయాడు. చివరికి తన అన్నయ్య చెప్పిన మాటలతో మనసు మార్చుకుని రెండు నెలల తర్వాత మళ్లీ హాస్టల్‌లో అడుగుపెట్టాడు.

ఓ రోజు ఎయిర్‌ ఇండియా తరఫున క్రికెట్‌ ఆడేందుకు రమ్మంటూ రైనాకు ముంబై నుంచి పిలుపొచ్చింది. అది రైనా జీవితాన్నే మార్చేసింది. అక్కడ ప్రవీణ్‌ అమ్రే ప్రోత్సాహంతో తన ప్రతిభకు పదునుపెట్టుకున్నాడు. 1999లో రైనాకు ఎయిర్‌ ఇండియా నుంచి 10వేల రూపాయల స్కాలర్‌షిప్‌ అందేది. అందులో 8వేల రూపాయలు ఇంటికి పంపేవాడు. అప్పట్లో ఇంటికి ఎస్టీడీ కాల్‌ చేయాలంటే రెండు నిమిషాల కాల్‌కు 4 రూపాయలు ఖర్చయ్యేది. రెండు మూడు మాటలు మాట్లాడేలోపే రెండు నిమిషాలు గడిచిపోయేది. ఇలాంటి ఘటనలే తనకు డబ్బు విలువ నేర్పాయంటాడు సురేష్‌ రైనా.

తన జీవితాన్ని మార్చేసిన మరో ఘటన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటారు రైనా. ఒకరోజు క్రికెట్‌ ఆడుతుండగా గాయం కావడంతో మోకాలికి సర్జరీ అయింది. దాన్నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల సమయం పట్టింది. అత్యంత విలువైన సమయం వృథా అయింది. ఇది తన జీవితంలో అత్యంత కఠినమైన సమయం అంటాడు రైనా. ఆ సమయంలో తన కెరీర్‌ ముగిసిపోయిందన్న భావన తనను వేధించింది. అప్పటికి 80లక్షల రూపాయల హోం లోన్‌ బాకీ ఉంది. అయితే కాలం కలిసిరావడంతో క్రికెట్‌ మైదానంలో మళ్లీ సత్తా చాటాడు సురేష్‌ రైనా.

2015 ఏప్రిల్‌లో ప్రియాంక చౌదరీని పెళ్లాడాడు. ఆమె ఆమ్‌స్టర్‌డ్యాం బ్యాంకులో ఐటీ ప్రొఫెషనల్‌. పెళ్లయ్యాక తనలో స్థిరత్వం రావడంతో పాటు బాధ్యత కూడా పెరిగిందన్నది రైనా మాట. పెళ్లయ్యాక కాంట్రాక్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్యూచర్‌ ప్లానింగ్‌పైనే ఇప్పుడు తన దృష్టి ఉందంటున్నాడు. ఈ మధ్యే ఓ బిడ్డకు తండ్రైన సురేష్‌ రైనా.. పాప రాకతో జీవితంలో ఆనందం రెట్టింపైందని మురిసిపోతున్నాడు. 

Related Stories

Stories by team ys telugu