మనుషుల్ని మంచివైపు మళ్ళించే శక్తి సంగీతానికే వుంది- అనుశ్రీ..

కొందరికి సంగీతం ఇష్టం, కొందరికి సంగీతం ప్రాణం.. చాలా కొద్ది మందికి సంగీతమే జీవితం. అనుశ్రీ గుప్తాకి కూడా అంతే.. సరిగమలే ఆమె శ్వాస, నిశ్వాస. సంగీతంతో ఈ ప్రపంచాన్ని కూడా ఎంతో కొంత మార్చొచ్చని అనుశ్రీ నమ్మకం. ఆమె శ్రుతికి లయలా తోడైన నేస్తం సుకాంతి. ఈ ఇద్దరు బెంగాలీ భామల జుగల్బందీ ఇప్పుడు చూద్దాం.

మనుషుల్ని మంచివైపు మళ్ళించే శక్తి సంగీతానికే వుంది- అనుశ్రీ..

Wednesday April 29, 2015,

4 min Read

అనుశ్రీ ముంబైలో మాస్ కమ్యూనికేషన్ చదివినా, ఆమె మనసు మాత్రం ఎప్పుడూ జర్నలిజం మీద లేదు. అందుకే మనసు పాటనే తన బాటగా మార్చుకుంది. సంగీతాన్ని తన జీవనమార్గంగా మార్చుకుంది.

అనుశ్రీ

అనుశ్రీ


తొలి జతులు

అనుశ్రీ ఆరేళ్ళ నుంచే హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, రవీంద్ర సంగీతాన్నీ నేర్చుకుంది. వీణా చౌదరి ఆమె గురువు. ‘‘నాకు ఉస్తాద్ అల్లారఖా కంపోజిషన్స్ అంటే ఇష్టం. చిన్నప్పుడంతా ఎక్కువగా 70ల నాటి రాక్ అండ్ రోల్ వినేదాన్ని. దాంతో పాటు, CSNY, యార్డ్ బర్డ్స్, బీటిల్స్ అన్నా ఇష్టం. అప్పట్లో మ్యూజిక్ అంటే, క్యాసెట్స్‌లోనే వినాలి. వాటి ఖరీదు ఎక్కువగానే వుండేది.’’ అని తన చిన్ననాటి సంగీతఅభిరుచుల గురించి వివరించారామె.

తర్వాత కాలంలో ఆమె అభిరుచి జానపదాల మీదకి మళ్ళింది. అసలు సంగీతం పుట్టిందే జానపదం నుంచి అని ఆమె అభిప్రాయం. అందుకే ఇప్పుడు జానపదాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు అనుశ్రీ. ‘‘ముందు బెంగాల్ జానపద సంగీతమైన బాల్‌తో మొదలుపెట్టి, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ జానపదాలను కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత సుకాంతితో కలిసి సుకాంతి, అనుశ్రీ బ్యాండ్‌ను మొదలుపెట్టాం.’’ అని చెప్పారు అనుశ్రీ.

అనుశ్రీ, సుకాంతి

అనుశ్రీ, సుకాంతి


అనుశ్రీ బ్రాండ్ మ్యూజిక్

జానపదాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల మీద శ్రుతి చేస్తూ తమదైన సంగీతాన్ని వినిపిస్తున్నారు.. ఈ జంట. ‘‘సంగీతంతో మత్తెక్కించడానికి మైమరిపింపజేయడానికి ఎలక్ట్రానికా ఉపయోగపడుతుంది. దీంతో యువతలో ఓ ఆధ్యాత్మిక మైకం కమ్ముకుంటుంది. మా రెండో ఆల్బమ్ స్టోన్డ్ కారవాన్ లక్ష్యం ఇదే.’’అని తన బ్రాండ్ మ్యూజిక్ గురించి చెప్తారామె..

ఒంటరితనం భరించలేక ఎవరో ఒకరి మీద ఆధారపడే మహిళలను ఉద్దేశించి ఈ మధ్య అనుశ్రీ ‘‘దుప(రెండు పాదాలు)’’ అనే పాటను రాసారు. ఒంటరితనం భయాన్ని పోగొట్టడానికే ఈ పాట అని చెప్తారామె. ‘‘ కష్టమే అయినా.. అదే నయం... చేతిలో మట్టి వుంటే, దాన్నిఅవతల పడేయ్. చీకట్లోకే అయినా.. ఒంటరిగా దూకేయ్.. ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం కంటే, ఒంటరి తనమే మంచిది. నీ చేతిలో కాఫీని ఆస్వాదించడానికి ఎవరో వచ్చి నీ వెన్ను తట్టాల్సిన అవసరం లేదు.’’

సుకాంతి, అనుశ్రీల మొదటి ఆల్బమ్.. ఆస్మాన్. ఇందులోని ఎనిమిది పాటలను అనుశ్రీ రాయగా, అనుశ్రీ, సుకాంతిలు కలిసి సంగీతం అందించారు. ఈ ఆల్బమ్ రేడియో మిర్చి 2014 ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కి కూడా నామినేట్ అయింది.

సవాల్ళు, స్వరాలు..

నేను ఎగువ మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చినా.. చిన్నప్పటి నుంచి నా కాళ్ల మీద నేను నిలబడాలని అనుకునే దాన్ని. స్కాలర్ షిప్ లతోనే చదువుకున్నాను. ఎప్పుడూ నా ఖర్చులకి ఇంట్లో డబ్బులు అడగలేదు. ముంబై సెయింట్ జేవియర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కూడా లోన్ తీసుకుని పూర్తి చేసాను. చివరి సంవత్సరంలో ఆ లోన్ నేనే తీర్చేసాను.’’ అని చెప్పుకొచ్చారు.. అనుశ్రీ

image


సంగీతం ఒక కెరీర్ గా ఇంట్లో ఒప్పించడం కష్టమే. కానీ, అనుశ్రీ మాత్రం తన ఆశ, ఆశయం సంగీతమేనని చెప్పేసింది. ఒక దశలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. సంగీతం తప్ప వేరే జీవితం తనకు వద్దని చెప్పేయడంతో, చివరికి ఆమె తల్లిదండ్రులకు ఒప్పుకోక తప్పలేదు. అప్పటికీ తను చదువులో బాగా రాణించేది కనుక, ఈ సంగీతం గోలేంటని ఆమె తండ్రి అనుకునేవారు. అయితే, ఒకసారి తనని స్టేజీ మీద చూసాక ఆయన మనసు పూర్తిగా మారిపోయింది. ‘నువ్వింకా బాగా సాధన చేయాలని ఆయన చెప్పారు. నేను అప్పటికే రోజుకు ఏడుగంటలు ప్రాక్టీస్ చేసి అలసిపోయి ఇంటికొచ్చే దాన్ని. అయినా, ఆయన ఆ మాట అన్నారంటే, నా సంగీతాన్ని ఆయన గౌరవిస్తున్నట్టు లెక్క. నేను ఆయన నుంచి ఆశించింది కూడా అదే’’ అని తన ఇంటి నేపథ్యం గురించి వివరించారు అనుశ్రీ.

అయితే, రోజులన్నీ ఒకేలా వుండవు. ఒకరోజు అనుశ్రీ బాల్(బెంగాలీ జానపదం) సంగీతాన్ని పాడడం చూసి.. ‘ఇవేం పాటలు, నువ్వు ఈ పాటలు పాడుతూ ఎన్నాళ్లు వుండగలవో నేను చూస్తాను’ అని మళ్లీ వాళ్ళ నాన్న మొదటికొచ్చారు. తన సంగీతంపై ఆయనకు గౌరవం తగ్గడం అనుశ్రీకి బాధ అనిపించింది. అయితే, ఆయనకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఆమె ఒక దారి ఎంచుకున్నారు. 4 పేజీల లేఖలో తన మనసులో వున్నదంతా పెట్టారు. ఆ లేఖలో చివరి వాక్యాలు ఆమె మనసుకు అద్దం పడతాయి. 

‘నాన్నా.. నువ్వు నాతో వుంటే నా ఈ సంగీతప్రయాణం సంతోషంగా సాగిపోతుంది. నువ్వు నా సంగీతాన్ని మెచ్చుకుంటే, నువ్వు స్టేజిపై నాతోనే వున్నట్టుంటుంది. నువ్వు నా సంగీతాన్ని ప్రేమించకపోయినా.. సంగీతం నాతోనే వుంటుంది. నిన్ను మాత్రమే మిస్ అవుతాను. సంగీతం అంటే నాకంత ప్రేమ, ప్రాణం.. ’’ ఈ లేఖ ఆమె తండ్రి మనసును మార్చేసిందని వేరే చెప్పాలా?

చదువుల సరస్వతి

అనుశ్రీకి సంగీతం అంటే ఎంత ఇష్టమో చదువుల్లో కూడా అంతే చురుకుగా వుండేది. కాలేజీలో ఆమె గోల్డ్ మెడలిస్టు. అందుకే ‘నువ్వింత బాగా చదివి మళ్ళీ సంగీతం అంటావేంటి’ అని ఆమె కుటుంబ సభ్యలు ప్రశ్నించేవాళ్ళు. దానికి ఆమె సమాధానం ఒక్కటే. ‘చదువు సంధ్యలేని మ్యూజీషియన్ కావడం కంటే ఇదే మంచిది కదా..’’

ప్రస్తుతం బాలేగంజ్ శిక్ష సదన్‌లో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తున్న అనుశ్రీ, తాను బాగా చదువుకోగలగడం ఒక అదృష్టం అంటారు. చదువు నుంచి గ్రహించిన దాన్ని కళకు అన్వయించడంలోనే అసలు మేజిక్ వుంటుందంటారామె.

image


సంగీత శిక్షణ

సంగీతాన్ని ఎంత ఇష్టపడతారో... సంగీతాన్ని బోధించడాన్ని కూడా అంతే ప్రేమిస్తారు అనుశ్రీ. చాలా మంది చదువుకున్న వాళ్ళు నేర్చుకున్న విద్యను జీవితానికి అన్వయించడం లేదంటారు అనుశ్రీ. అలా అన్వయించగలిగినప్పుడే కళాకారులు తామెలాంటి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నారో.. అలాంటి ప్రపంచాన్ని స్రుష్టించగలుగుతారని ఆమె నమ్మకం.

అనుశ్రీకి బాగా ఇష్టమైన మరో వ్యాపకం, ప్రయాణాలు. ప్రయాణాల్లోనే మనం ఎదుగుతాం అని ఆమె అంటారు. ఎదగడం అంటే, వయసు కాదు.. మనసుతో ఎదుగుతారు అని ఆమె కొసమెరుపు ఇచ్చారు. జీవితంలో ఆశ్చర్యాలకు కొదువ లేదు. ఇవన్నీ చూడాలంటే, ప్రయాణాలకు మించిన దారిలేదు’’ అంటారు అనుశ్రీ.

సందేశం

చుట్టుపక్కల ఆడాళ్ళ గురించి గుసగుసలాడుకోవడం కంటే, మహిళలు ముందు తమను తాము గౌరవించుకోవాలంటారు అనుశ్రీ. ‘‘మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఎదుటి స్త్రీ తనని తాను గౌరవించుకోనివ్వండి. అందరితో మంచి సంబంధాలు పెంచుకోండి. సాటి ఆడవాళ్ళతో ఎలా వుంటారో.. మగాళ్ళతో కూడా అలాగే వుండండి. ఆడవాళ్ళయినా, మగాళ్లయినా.. సాటి మనుషుల్ని ప్రేమించండి. మీ జీవితాన్ని మీరు సంతోషంగా గడపండి. వీలైనంత పక్కవాళ్ళకు సాయం చేయండి.’’ ఇదే అనుశ్రీ జీవితపాఠం.