కిచిడీ కావాలా నాయనా!

వెరైటీ కిచిడీల సమాహారం ‘కిచిడీవాలా’.. వంటకం రూపురేఖలనే మార్చిన నాగ్‌పూర్ రెస్టారెంట్..మామూలు కిచిడీకి కార్పొరేట్ లుక్..ఎగబడీ మరీ తింటున్న జనం..ఎంబిఏ చేసి ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన యువకులు..

కిచిడీ కావాలా నాయనా!

Saturday May 09, 2015,

2 min Read

కిచిడీవాలా.. ఇప్పుడీ పేరు నాగ్‌పూర్ వాసులకు సుపరిచితం. భారతీయ కుటుంబాల్లో ప్రాముఖ్యత ఉన్న కిచిడీకి కొత్త భాష్యం చెబుతోందీ రెస్టారెంట్. ఏకంగా 15 రకాల వెరైటీలతో భోజన ప్రియులకు పసందైన కిచిడీలను అందిస్తోంది. ఇద్దరు యువకులు మనీష్ ఖన్‌చందానీ, సాగర్ భజనీల కొత్త ఆలోచన కాస్తా వినయపూర్వక కిచిడీవాలాకు రూపమిచ్చింది.

చూడగానే నోరూరే  ఆ కిచిడీ ఇదే

చూడగానే నోరూరే ఆ కిచిడీ ఇదే


ఆరోగ్యవంతమైన కిచిడీ..

రుచి ఒక్కటే కాదు ఆరోగ్యానికి మేలు చేసే రీతిన కిచిడీని అందిస్తున్నామని చెబుతున్నారీ యువ వ్యాపారవేత్తలు. విభిన్న పదార్థాలతో తయారు చేయడం ద్వారా ఈ వంటకం రూపు రేఖలను మార్చేపనిలో నిమగ్నమయ్యారు. అదికూడా అందుబాటు ధరలోనే. ‘శతాబ్దాల నుంచి మన భోజనంలో కిచిడీ ఒక భాగమైపోయింది. బేసిక్ రెసిపీలో మార్పు చేయకుండానే వినూత్న రుచిని అందిస్తున్నాం. మా విధానం విజయవంతమైంది కూడా’ అని సాగర్ చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నాణ్యమైన కిచిడీలను అందిస్తున్నామని అంటున్నారు. రెస్టారెంట్‌లో శీతలపానీయాలకు స్థానం లేదు. కేవలం లస్సి, మజ్జిగ, నిమ్మరసం మాత్రమే అందుబాటులో ఉంటాయి.

సగ్గుబియ్యంతో తయారయ్యే మరో రకం కిచిడీ

సగ్గుబియ్యంతో తయారయ్యే మరో రకం కిచిడీ


తోడైన లొకేషన్

టేక్ అవే, హోమ్ డెలివరీ, డైన్-ఇన్ విధానంలో ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. అత్యధిక రెవెన్యూ డైన్-ఇన్ ద్వారా సమకూరుతోంది. హోం డెలివరీ ద్వారా 33 శాతం వస్తోంది. రెస్టారెంట్ ఉన్న ప్రాంతం కూడా కలిసొచ్చిందని ఈ యువ వ్యాపారవేత్తల అభిప్రాయం. నాగ్‌పూర్ ఐటీ పార్క్ ప్రాంతంలో కిచిడీవాలా కొలువుదీరింది. అత్యధిక కస్టమర్లు టెకీలే. సాధారణంగా రోజుకు 130కిపైగా ఆర్డర్లుంటున్నాయి. ధర రూ.45 మొదలుకుని రూ.120 వరకు ఉంది.


మనీష్ ఖన్‌చందానీ, సాగర్ భజనీ

మనీష్ ఖన్‌చందానీ, సాగర్ భజనీ


వర్క్‌షాప్ నుంచి

భోజనప్రియుడైన మనీష్ ఎంబీఏ పూర్తి అయ్యాక తన అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి రంగంలోకి దిగారు. ఉద్యోగం విషయంలో బోర్ కొట్టి మార్పు కోసం ఎదురు చూస్తున్న స్నేహితుడు సాగర్ ఈయనకు తోడయ్యారు. ఫాస్ట్ ఫుడ్‌గా కిచిడీని అందించాలన్నది వీరి ఆలోచన. ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహిస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన లెమన్ ఐడియాస్ నిర్వహించిన సీఈవోఎట్10కె వర్క్‌షాప్‌కు వీరిరువురు హాజరయ్యారు. ఔత్సాహికులు ఒక ఉత్తమ వ్యాపార ఆలోచనతో వచ్చి.. లాభాన్ని ఆర్జించే వ్యాపారంగా ఈ ఆలోచనను 21 రోజుల్లో మలచాలి. వర్క్‌షాప్‌లో భాగంగా మనీష్, సాగర్‌లు పాపులర్ లొకేషన్లలో కిచిడీని విక్రయించారు. కస్టమర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన వీరిరువురినీ ఉత్సాహ పరిచింది. ఒక రెస్టారెంట్ యజమాని కొంత స్థలాన్ని ఆఫర్ చేశారు కూడా. తమ ఆలోచనకు మంచి వ్యాపార అవకాశం ఉందన్నది వర్క్‌షాప్ ద్వారా తెలుసుకున్నామని సాగర్ అంటున్నారు.

image


గార్లిక్ కిచిడీ పాపులర్..

కిచిడీవాలా రెస్టారెంట్‌లో గార్లిక్ కిచిడీ పాపులర్ అయింది. స్పైసీ కోరుకునేవారు సావోజీ కిచ్‌డీకి సై అంటున్నారు. ఇందులో మసాలాలు అధికంగా వాడతారు. ఇక ఇటలీలో ప్రాచుర్యంలో ఉన్న రిసోటో వంటకానికి కొద్దిగా మార్పులు చేసి కిచిడీని తయారు చేశారీ యువకులు. చీస్, స్వీట్‌కార్న్, క్యాప్సికం తదితర పదార్థాలతో దీనిని వాడతారు. పుదీనా రకానికి చెందిన యూరోపియన్ మసాలా ఒరెగానో, థైమ్, తులసి ఈ కిచిడీకి కొత్త రుచిని అందించాయి. ఇక కిచిడీల తయారీలో మనీష్‌దే కీలక పాత్ర.


చిన్న పెట్టుబడితో..

సాగర్ పోగుచేసుకున్న డబ్బులు, కుటుంబం నుంచి ఆర్థిక సహాయం వీరి తొలి పెట్టుబడి. మార్చి 31తో ఏడాది పూర్తి చేసుకుందీ కిచిడీవాలా. ఏడాది కాలంలోనే మంచి మార్కెట్‌ను సంపాదించింది. మే చివరికల్లా నాగ్‌పూర్‌లోనే మరో రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఆ తర్వాత ఫ్రాంచైజీ విధానంలో విస్తరించాలన్నది ప్రణాళిక. ఇప్పటి వరకు ఏడుగురు ఔత్సాహికులు ఫ్రాంచైజీకి ముందుకు వచ్చారు. వీరిలో అయిదుగురు నాగ్‌పూర్ వెలుపలి నుంచి వచ్చినవారే. ఇతర ప్రాంతాలకూ బ్రాండ్‌ను తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంది. అది కూడా సెప్టెంబరు తర్వాతే అని సాగర్ తెలిపారు.