చివరికి జీఎస్టీ ఎఫెక్ట్ స్వర్ణదేవాలయం పైనా పడింది..!!

చివరికి జీఎస్టీ ఎఫెక్ట్ స్వర్ణదేవాలయం పైనా పడింది..!!

Wednesday July 12, 2017,

1 min Read

స్వర్ణదేవాలయం సామూహిక భోజనశాల గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద అన్నదాన సత్రం. రోజుకి ఎంతలేదన్నా 50వేల మంది భక్తులు వస్తుంటారు. శని, ఆదివారాలు, పండుగ రోజుల్లో అయితే లక్ష దాటుతారు. కులమతాలకు అతీతంగా ఎవరొచ్చినా కాదనకుండా కడుపు నింపుతారు.

image


రోజుకి కొన్ని వందల టన్నుల గోధుమ పిండి, నెయ్యి, పప్పులు, కూరగాయలు, పాలు, చక్కెర, బియ్యం కొని భక్తుల కోసం వండుతారు. అయితే ఈ సరుకుల విషయంలో ఇంతకాలం ఒకలెక్క, జీఎస్టీ వచ్చాక ఒక లెక్క కావడంతో అదనపు భారం పదికోట్ల రూపంలో గురుద్వార మీద పిడుగులా పడింది. మొన్నటిదాకా వీటికోసం రూ.75 కోట్లు ఖర్చయ్యేవి. తాజా జీఎస్టీ లెక్కల ప్రకారం సరుకులన్నీ18 శాతం స్లాబులోకి వచ్చాయి. ఆ లెక్కన సరుకు, సరంజామాకు అదనంగా రూ. 10 కోట్ల ఖర్చవుతోంది.

ఇంత భారాన్ని మోయలేమని స్వర్ణదేవాలయం ఖరాకండిగా చెప్తోంది. తాము చేస్తున్న సామాజిక సేవను దృష్టిలో పెట్టుకుని, జీఎస్టీ నంచి మినహాయించాలని సిక్కు మత పెద్దలు కేంద్రాన్ని కోరుతున్నారు. కేవలం భోజనాల కోసమే ఏడాదికి రూ. 1,100 కోట్లు ఖర్చుపెడుతున్న గోల్డెన్ టెంపుల్.. ఈ అదనపు బాదుడిని తట్టకోలేమని చెప్తోంది.

స్వర్ణదేవాలయం, ఇతర గురుద్వార సామూహిక భోజనశాలల్లో వేలాది మంది భక్తులు వలంటీర్ గా వచ్చి పనిచేస్తారు. భక్తులందరికీ ఓపిగ్గా వండి వడ్డిస్తారు. చిన్నపిల్లలు, మహిళలు కూడా ఈ సేవలో పాలుపంచుకుంటారు. విశాలమైన లంగార్ (భోజనశాల) లో ఒకేసారి వేలమంది నేలమీద కూర్చొని భోజనం చేస్తారు. ఏ సమయంలో వచ్చినా సరే, లేదనకుండా, కాదనకుండా వారి ఆకలి తీరుస్తారు. సిక్కుల సంస్కృతిలో భాగమైన ఈ సామాజిక సేవ పట్ల కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.