ఆరని జ్వాలల్లో ...ఆధునిక ప్రపంచం

0

మానవ జాతికి ‘పగ’ అనే పొగ చుట్టుకుంది. గుండెల్లో నిండిన కాలుష్యం నుంచి బయటపడగలదా, నేటి ఈ ప్రపంచం ! 

'' పగయగల్గెనేని, పామున్న ఇంటిలో'' వుంటున్న అనుభూతి కలుగుతుంది అంటాడు ధర్మరాజు. తన బావ శ్రీకృష్ణుని కౌరవ సభకు పంపుతూ ఈ మాటలు చెబుతాడు. ‘పగ’ ను పాముతో పోల్చాడు. అది మనలోనే బుసలు కొడుతూ, విషం కక్కుతూ ఉంటుంది.దాన్ని ఎలాగైనా నిర్మూలించాలి అని భావించి, “అర్థ భాగం యివ్వక పోతే, ఐదు గ్రామాలైనా సరే సర్దుకుపోతాం” అని శాంతి సందేశం పంపిస్తాడు. 

శ్రీకృష్ణ రాయభారం ఫలించకపోవడం, కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు సమూలంగా నాశనం కావడం అందరికీ తెలిసిన కథే.

నేటి ప్రపంచంలో పగ, ప్రతీకారం నిత్యకృత్యాలై మనిషి దైనందిన జీవితాన్ని ఆందోళన, అయోమయంతో నింపుతున్నాయి. ఎప్పుడు, ఎవరు, ఎక్కడ ఏమి చేస్తారో అర్థం కాని పరిస్థితి. పారిస్ నగరం, కాలిఫోర్నియా కాల్పులు ఇంకా ఆగని మంటల్లా రగులుతున్నాయి.

ఎక్కడో ఆకాశంలో హాయిగా ప్రయాణిస్తూ, తమకు తెలియకుండానే మరణం పాలైన రష్యన్‌ల ఆత్మలు ఘోషిస్తునే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ విమానాశ్రయంలో అనుకోకుండా దాడికి గురై అసువులు బాసిన వారి అశ్రువులు కనుకొలకుల్లో నిలిచిపోయి ఉన్నాయి. 

ఎందుకు ఈ మారణ కాండ ? 

ఎందుకు ఈ ఆగని జ్వాల ?

'' పూను స్పర్థలు విద్యలందే, 

వైరములు వాణిజ్యమందే,

వ్యర్థ కలహం పెంచబోకోయి

కత్తి వైరం కాల్చవోయి '' అంటారు మహాకవి గురజాడ. 

చదువుల్లో, వ్యాపారాల్లో పోటీ పడాలి. ఆరోగ్యమైన వాతావరణంలో తలపడాలి. గెలవాలి. కానీ, తలలు లేపేసి ‘గెలిచాం’ అని జబ్బలు చరుచుకోవడం తప్పు. మానవజాతి మనుగడకే అది పెనుముప్పు. అగ్ర దేశాలు, నేతలు దీని నివారణకు పూనుకోవాలి.

శోకంలేని లోకం కోసం ప్రార్ధిస్తున్నా, ప్రతివదనం చిరునవ్వుతో వెలిగే ఉదయం కోసం ఎదురు చూస్తున్నా. 

ఉగ్రవాదం, రక్తం పారించని రోజులు కోసం నిరీక్షిస్తున్నా. ఆశ్రయం ఇచ్చే చెట్టుకొమ్మలని నరికే వాళ్లకు అడ్డుపడి, ‘అన్యాయం ఇది’ అని అరవాలనుకుంటున్నా.

మరుభూమిలా మారి తగలబడిపోతున్న ప్రపంచంపై ‘కరుణ’ వర్షమై కురవాలని, నేటి పసిపాపలకు వసివాడని పసిడిలోకాన్ని కానుకగా ఇవ్వాలని కలలు కంటున్నా. 


ఇది అందరి హృదయాలలో నినదిస్తున్న శాంతి సందేశం.

- దేశం జగన్‌మోహన్ రెడ్డి