తెల్లటి పాల వెనుక నల్లటి విషాదం..! చదివితే కన్నీళ్లొస్తాయి..!!

తెల్లటి పాల వెనుక నల్లటి విషాదం..! చదివితే కన్నీళ్లొస్తాయి..!!

Friday March 10, 2017,

2 min Read

పాల డెయిరీ. ఈ పేరు వినగానే కళ్లముందు కనిపించే సీన్ ఏంటి? ఒక రేకుల షెడ్డు.. అందులో నలుగురు పనివాళ్లు.. పదిపదిహేను గేదెలు.. చెంగుచెంగున ఎగిరే లేగదూడలు.. పాలక్యాన్లు.. పచ్చగడ్డి.. తౌడు.. పిండి.. వగైరా వగైరా.. ఇవే స్ఫురిస్తాయి కదా.

కానీ కొన్ని పాల డెయిరీలు మీరనుకున్నట్టు లేవు. అవి రుధిరశాలలను తలపిస్తున్నాయి. దయ, కరుణ లేని నరకపుశాలలుగా మారుతున్నాయి. మానవత్వమే లేని రాక్షసుల చేతిలో మూగజీవాలు వ్యధశాలలో బతుకు వెళ్లదీస్తున్నాయి. నెత్తురూ కన్నీళ్లూ కలిపి పొదుగులో దాచుకుంటే, మిషన్లు వేసి నిర్దాక్షిణ్యంగా తోడేస్తున్నారు. పచ్చినెత్తురు తాగే పులి కూడా కడుపు నిండాక జింకపిల్లను వదిలేస్తుంది. అందులో జంతుధర్మం ఉంది. అంతకంటే ఘోరమైన ఆటవికన్యాయం వికటాట్టహాసం చేస్తోందక్కడ. ఒక్కో దారుణాన్ని తెలుసుకుంటే కప్పు పాలు కూడా ముట్టుకోరు.

image


ఫెడరేషన్ ఆఫ్ ఆనిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వేలో దారుణమైన నిజాలు వెలుగు చూశాయి. అల్వార్, బికనీర్, జైపూర్, జోధ్ పూర్ నగరాల్లోని సుమారు 49 డెయిరీలపై రహస్య పరిశోధన చేస్తే, భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. సంస్థాగత క్రూరత్వం ఎలా వర్ధిల్లుతోందని తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నోరులేని మూగజీవాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో పాలిస్తున్నాయో చూస్తే- రాతిగుండెలు సైతం కన్నీరు పెడతాయి.

పాడిగేదెలంటే లాలించే అమ్మలాంటివి. అవి మనకు పాలివ్వడం ఎంత ముఖ్యమో, వాటి కడుపున పుట్టిన లేగదూడల కడుపు నింపడం కూడా అంతే ముఖ్యం. కానీ తబేళాల్లో అది జరగడం లేదు. పుట్టగానే పసిదూడ- తల్లి చనుబాలకు దూరమవుతోంది. ఒకవేళ పుట్టింది మగదూడ అయితే రెండుమూడు రోజులకే తల్లి నుంచి వేరుపడుతుంది. నోరులేని మూగజీవాలు అనుభవించే నరకంలో ఇది అత్యంత ఘోరమైంది. ఆ తర్వాత కృత్రిమ గర్భాధారణ మరో నరకం. వాటివల్ల పాడిగేదెల జీవితకాలం గణనీయంగా తగ్గిపోతోంది. సగటున 25 ఏళ్లు బతకాల్సిన గేదెలు 10 ఏళ్ల ఆయుష్షుని కోల్పోతున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం మూలంగా భయంకరమైన చర్మవ్యాధుల బారిన పడుతున్నాయి. అయినా సరే ఏడాదికోమారే వెటర్నరీ డాక్టరుని సంప్రదిస్తున్నారు డెయిరీ యజమానులు.

image


మగదూడ పుడితే దానికి చావేగతి. ఆడదూడను మాత్రమే చేరదీస్తారు. ఎందుకంటే అది భవిష్యత్ లో పాలిస్తుంది కాబట్టి. సో, ఆటోమేటిగ్గా మగదూడలు కనీసం పాలకు కూడా నోచుకోకుండా, డొక్కలు ఈడ్చుకుపోయి, కుంగి, కృశించి, శుష్కించి కబేళాలకు తరలిపోతుంటాయి. తోలు, మాంసం కోసం అవి అంగడి సరుకులైపోతాయి. మహా అయితే నాలుగు నెలలు. అంతకంటే మగ లేగదూడలు బతికుండవంటే మనసు చివుక్కుమంటుంది. ఒక్కోసారి పుట్టిన వారంరోజులకే కబేళాలకు పంపిస్తారట.

ఇంకో ఉదాహరణ వింటే షాకవుతారు. కొన్నిసార్లు లేగదూడలు కనిపించకుంటే గేదెలు పాలివ్వవు. మొండికేస్తాయి. అలాంటి వాటికి ఒక ఉపాయాన్ని కనిపెట్టారు. పుట్టగానే అమ్మేసిన మగదూడను ఎలాగూ తేలేరు కాబట్టి, మృతిచెందిన దూడ తలను ఒక గుంజకు వేలాడదీస్తారు. అది దూడ చర్మంతో కూడిన కపాలం. పాపం గెదెకు ఆ విషయం తెలియదు. దాన్ని చూసుకుంటూ తనబిడ్డే అనుకుని పాలిస్తుంది.

image


ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పశువులను మనం రెండు కోణాల్లో చూస్తాం. ఒకటి-పాలిచ్చే అంశం. రెండు- కోసుకుని తినే విషయం. అంటే బీఫ్. ఈ రెండు నాణేనికి బొమ్మాబొరుసు లాంటివి. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ నివేదిక ప్రకారం 2004-005 నుంచి 2011-12 మధ్య పాల ఉత్పత్తి మూడింతలైంది. పాలతోపాటు బీఫ్ ప్రొడక్షన్ కూడా 98శాతానికి పైగా పెరిగింది. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే గొడ్డుమాంసం ఉత్పత్తి చేయడంలో భారతదేశానిదే అగ్రభాగం. పాల ఉత్పత్తిలోనూ మనమే టాప్.

అమెరికా వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 2015లో 2.4 మిలియన్ టన్నుల గొడ్డుమాంసాన్ని, లేగదూడల్ని భారత్ ఎగుమతి చేసింది. ఈ సంఖ్య ఇంతగా ఉండటానికి కారణమేంటనే కోణంలో ఎవరూ మాట్లాడరు. దీనికి మూలకారణం ఎవరన్న ప్రశ్నకు దూరంగా ఉంటారు. పాలు, పాల ఉత్పత్తుల మీద అందమైన ప్రకటనలు ఇచ్చేందుకు క్యూ కడతారు, ఆరోగ్యం మీద అరగంట లెక్చర్లిస్తారు కానీ, పాల వెనుక ఇంతటి విషాదాన్ని ఎవరూ చర్చించరు. ఎందుకంటే అలాంటి టాపిక్ ఆరోగ్యానికి అంతమంచిది కాదు కాబట్టి.