ఈ అమ్మాయి తయారు చేసిన ఏసీ ఖరీదు రూ. 1800 మాత్రమే

ఈ అమ్మాయి తయారు చేసిన ఏసీ ఖరీదు రూ. 1800 మాత్రమే

Saturday April 29, 2017,

2 min Read

కాలేజీ క్యాంపస్ నుంచి కాలు బయట పెట్టిన తర్వాతే కొత్త ఆలోచనలు రావాలని, డిగ్రీ పట్టా చేతికొచ్చిన తర్వాతనే సరికొత్త ఆవిష్కరణలు జరగాలని రూలేం లేదు. హైస్కూల్ స్థాయి విద్యార్ధుల్లో కూడా సృజనాత్మకత దాగుంటుంది. వారి ఆలోచనా విధానం అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. అలాంటి కోవలోకే వస్తుంది కల్యాణి శ్రీవాత్సవ. కేవలం రూ.1800లకే ఏసీ తయారు చేసి దేశవిదేశాల్లో శెభాష్ అనిపించింది.

image


యూపీలోని ఝాన్సీ నగరానికి చెందిన కల్యాణి స్థానిక లోకమాన్య తిలక్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ టీచర్లే. చదువులో చిన్నప్పటి నుంచీ ముందుండే కల్యాణి – ఆలోచనలు అంతే చురుగ్గా ఉండేవి. అమ్మాయిలో ఏదో సాధించాలనే తపనను తల్లిదండ్రులు గుర్తించారు. పేదప్రజలకు కూడా ఏసీ అందుబాటులో ఉండేలా ఒక ఆవిష్కరణ చేయాలన్న తన తపనని పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు.

థర్మోకోల్ తో తయారుచేసి ఒక బాక్సుకు 12 బోల్టుల డీసీ ఫ్యాన్ బిగించింది. దాన్ని గంటసేపు ఆన్ చేసి పెడితే రూం టెంపరేచర్ 4 నుంచి 5 డిగ్రీలు పడిపోతుంది. పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడిచే ఈ ఏసీ నుంచి ఎలాంటి పొల్యూషన్ ఉండదు.

కల్యాణి తయారుచేసిన ఈ ఏసీ- ఐఐటీ ఢిల్లీ నిర్వహించిన నేషనల్ లెవల్ మోడల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయింది. పొయిన ఏడాది యూపీ సర్కారు అమర్ ఉజాల అనే హిందీ దినపత్రిక సంయుక్తంగా ఏర్పాటు చేసిన నారీ సమ్మాన్ కు ఎంపికైంది. ఆమెతో పాటు ఆటల్లో, చదువుల్లో, కళలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించారు. కల్యాణి వినూత్న ఆలోచన నచ్చి జపాన్ గవర్నమెంట్ నుంచి సెమినార్ కోసం పిలుపు అందింది.

కల్యాణి సైన్సులోనే కాదు, పాటలు పాడటంలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తుంది. ఒకసారి ఇండియన్ ఐడల్ లో పాల్గొని మూడో రౌండ్ వరకు వెళ్లింది. లక్నో, ఆగ్రా, కాన్పూర్ లాంటి నగరాల్లో ప్రదర్శనలిచ్చి 50 దాకా బహుమతులు గెలుచుకుంది.

ఏసీ అంటేనే ఖరీదైన వస్తువు. దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇంకా అది అందని ద్రాక్షే. ఈ నేపథ్యంలో కల్యాణి తయారుచేసిన ఏసీ- ఒక ఫ్యాన్ ఖరీదులో రావడం సంతోషించాల్సిన విషయం. పూర్తిగా సోలార్ ఎనర్జీతో తయారైన ఈ ఏసీతో పర్యావరణానికీ ఎలాంటి ముప్పులేకపోవడం ఇంకా అభినందించాల్సిన విషయం.