యాడ్లకు యానిమేషన్ రంగులద్దిన మై ప్రోమో వీడియోస్

ఇంజనీరింగ్ నుంచి అడ్వర్టైజింగ్ రంగంలోకి ఆ నలుగురువ్యాపార ప్రకటనల్లో వినూత్న శైలియానిమేషన్ తో యాడ్స్ రూపొందించాలనే ఆలోచనరెండు కంప్యూటర్లతో మొదలైన కంపెనీ టర్నోవర్ ఇప్పుడు కోటిమై ప్రోమో వీడియోస్ సక్సెస్ సీక్రెట్

యాడ్లకు యానిమేషన్ రంగులద్దిన మై ప్రోమో వీడియోస్

Sunday April 05, 2015,

7 min Read

కాలేజీ నుంచి ఆ నలుగురు అప్పుడే అడుగు బయట పెట్టారు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అనుభవం ఉందా అంటే అదీ లేదు. పోనీ చేయాలను కునే పనికి పనికొచ్చే చదువు, సర్టిఫికేట్లు ఉన్నాయా అంటే అబ్బే అవేవి లేవు. చదివింది ఇంజనీరింగ్, చేయాలను కుంటున్నదేమో.. సృజనాత్మక క్షేత్రంలో కాసుల వ్యవసాయం. ఇది సాధ్యమా? నిజంగా అయ్యే పనేనా? అంటే .. ఎందుకు కాదు అన్నదే ఆ నలుగురి సమాధానం. అవును. ఆ నలుగురిలో కొత్త అడుగు వేయడానికి కావలసిన ఏదీ లేక పోవచ్చును గానీ తాము చేసే పని పట్ల ఉన్న మక్కువ పుష్కలంగా ఉంది. వారు ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తారు. నైతిక విలువలు పాటిస్తారు, వ్యాపార ప్రకటనల 'కథ' రేపు ఏ మలుపు తిరుగుతుందో ముందే ఈ రోజే ఉహించగల ముందు చూపు వారి సొంతం ..వ్యాపారంలో పై పైకి పకేందుకు ఇవి చాలు, అని నిరూపించారు ఆ నలుగురు.

ఇంతకీ ఎవరా నలుగురు, ఏమా కథ అంటారా.. రండి వాళ్ళని కలుద్దాం. మై ప్రోమో వీడియోస్.కాం తో 'తొలి అడుగు' వేసి తమ కలలను నిజం చేసుకున్నది, ఈ నలుగురు మిత్రులే. సంతోష్ గోవింద స్వామి, గోపాల్ కృష్ణ,,ఉదయ కృష్ణ , అనిల్ కుమార్. ఇంతకీ వాళ్ళు చేసిన ఘన కార్యం ఏమిటి, అంటే ఏమీ లేదు. పెద్ద పనులేవీ వారు చేయ లేదు. చిన్న చిన్న కధలతో చక్కని చిన్ని చిత్రాలు తీసారు. ఆ చిత్రాల ద్వారా తమ క్లైంట్స్ బ్రాండ్ వ్యాపార ప్రకటనలను సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసు కెళ్ళారు. ఆ నలుగురు బాల్య మిత్రులలో గోపాల్ అందరి కంటే సీనియర్. కొంచెంగా పనిచేసిన అనుభవం ఉంది.మిగిలిన ముగ్గురు నేరుగా కాలేజి నుంచి కార్య క్షేతంలో పాదం మోపారు.

మై ప్రోమో వీడియోస్ టీమ్

మై ప్రోమో వీడియోస్ టీమ్


మనం ఇంతకూ ముందే అనుకున్నాం కదా.. ఆ నలుగురికి ఏమీలేదని కానీ వారికి ఒక విజన్ ఉంది. ఒక బలమైన సంకల్పం ఉంది. అంతే ఆ రెండు ఉంటే ఇంకేమి లేక పోయినా పర్వాలేదు అనుకున్నారు.అవును కదా, ఎవరైనా ఏదైనా చేయాలంటే ముందో కార్యాలయం ఉండాలి అనుకుంటాం. కూర్చోడానికి కుర్చీ లేదు ఇంకేం చేస్తాం అనుకునే పెద్దలు మన ముందే ఉన్నారు. కానీ వీళ్లు అలా అనుకోలేదు. గోపాల్ పడక గది నుంచే పని ప్రారంభించారు. ఆ నలుగురు వారు చదివిన చదువులను పక్కన పెట్టారు. కొత్త దారిలో చిట్టి పొట్టి అడుగులువేస్తూ .. యానిమేషన్ లాంటి కొత్త విద్యలో తప్పులు చేస్తూ .. దిద్దుకుంటూ .. చిన్న ప్రాజెక్టులు చేస్తూ .. అలా ముందు పోయారు. మెల్ల మెల్లగా పెద్ద పెద్ద క్లైంట్స్ ను సొంతం చేసుకున్నారు.ఇప్పుడు వారి వార్షిక టర్న్ ఓవర్ .. ఒక క్షణం ఉపిరి బిగ పట్టండి .. కోటి రూపాయల రేఖ దాటిపోయింది.

మాములుగా అందరూ ఆలోచించే దానికి కొంచెం చాల భిన్నగా ఆలోచిస్తే .. కొత్త మార్గంలో అడుగులు వేగంగా పడతాయి అంటారు, మై ప్రోమో వీడియోస్.సృష్టి కర్తల్లో ఒకరు,సి .ఇ. ఓ అనిల్. అయన ఏమన్నారో అయన మాటల్లోనే .."మార్కెటింగ్ అంటే మీరేం చేస్తారన్నది కాదు ..మేరు చెప్పే కథే మీ మార్కెట్ మంత్రం.మేము అదే చేస్తాం. మా క్లైంట్ ఏమి చెప్పదలుచు కున్నారో ఆ సందేశాన్ని కమ్మని యానిమేషన్ కథగా మలచడంలో సహాయం చేస్తాం. అలా వాళ్లు మార్కెట్ లీడర్స్ అయ్యేందుకు మేము ఓ చెయ్యి వేస్తాం"

మాకు మేమే ..

"మాకు వ్యాపార అనుభవం లేదు. యానిమేషన్ లో అయితే అసలే లేదు. కానీ, నేర్చుకున్నాం. మాకు మేముగా.. మాకు మేమే గురువుగా ఆన్ లైన్ లో ఉచిత గురువు దగ్గర ఉచితంగా నేర్చుకున్నాం. తప్పులు చేస్తూ చేసిన తప్పులు దిద్దుకుంటూ యానిమేషన్ నేర్చుకున్నాం" అంటారు ఉదయ్. అయితే, కాలేజీ లో ఉన్న రోజుల్లో ఈ మిత్రులు రోటరీ క్లబ్ వారికోసం యానిమేషన్ వీడియోలు తీసారు. అందులో ఒకటి అనుకోకుండా భలే పేలిపోయింది. అందరూ ఆహా ఓహో అన్నారు .అయితే ఆతర్వాత ఇంజనీరింగ్ చదువు చాకిరిలో పడి అది మరిచి పోయారు. కాలేజీలో ఉన్న రోజుల్లో మళ్లీ దాని జోలోకి పోలేదు. చదవు అయిపోయింది. అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మీద మాద్యం మేఘాలు కమ్ముకున్నాయి. ఉద్యోగాలు 'నో వేకెన్సీ' బోర్డు కట్టేసాయి. ఈ పరిస్థితిల్లో ఎవరో వస్తారని ఉద్యోగాలు ఇస్తారని అశగా ఎదురు చూడడం అనవసరం అనుకున్నారు, అంతే. జై యానిమేషన్ అంటూ సొంత వ్యాపారం స్టార్ట్ చేసారు.


మై ప్రోమో వీడియోస్ లోగో

మై ప్రోమో వీడియోస్ లోగో


అదే ..'యానిమేషన్ కథల వ్యాపారం'

అదే సమయంలో, కలిసోచ్చే రిజులోస్తే నడిచొచ్చే బిడ్డలు పుడతారన్నట్లు వ్యాపార ప్రకటనల్లో యానిమేషన్ వీడియో వినియోగానికి మాంచి ఊపు వచ్చింది. ఏ కంపెనీ ప్రచారం అయినా అందరిలా ఉంటే ఎవరు పట్టిచుకోరు .."శత కోటి లింగాల్లో వీడో బోడి లింగం" అనుకుంటారు. అలా కాకుండా కాస్త ఆగి చూడాలంటే అందరికంటే భినంగా సృజనాత్మకంగా ప్రచార ఉండాలి అనుకునే వారి సంఖ్య పెరిగింది. కథల బేహారులు పంట పండింది. యానిమేషన్ ప్రచార కథలకు గిరాకి పెరిగింది. ఎన్నో యానిమేషన్ కంపెనీలు బారులు తీరాయి.

బెడ్ రూం బిజినెస్ కు శ్రీకారం

మై ప్రోమోస్ వీడియోస్ ను 2009 లో ప్రారంభించారు . ఎక్కడను కుంటున్నారు.. ఎక్కడో ప్రారంభించాలంటే సొమ్ములు కావాలి అవి మనోళ్ల దగ్గర లేవు అందుకే గోపాల్ బెడ్ రూం లో టెంకాయ కొట్టి పని మొదలెట్టారు. అది కూడా చాల చౌకగా అంటే 50 డాలర్ల కంటే తక్కువ చార్జి చేసే టెంప్లేట్ వీడియోలు తయారు చేయడంతో తొలి అడుగు వేసారు. అలా చేతిలో కాసుల కదలిక మొదలైంది. మెల్ల మెల్లగా అడుగులు వేగం పెంచారు. ప్రాజెక్టులు కూడా వరసగా వస్తూనే ఉన్నాయి. కొంత కాలం ఒకే అనుకున్నారు. అయితే, ఆర్ధిక అగచాట్లు కొంత వరకు కుదురుకోవడంతో వారిలో కొత్త కోరికలు పుట్టు కొచ్చాయి. టెంప్లేట్ వీడియో మార్కెట్ చిన్నది ఇరుగ్గా ఇరుగ్గా ఉంది అనిపించడం మొదలైంది. రెక్కలు విప్పుకోవాలనే కోరిక పురివిప్పింది.. అదుగో అలా పురి విప్పినన కోరికలు మరో అడుగు ముందుకేసేలా చేసాయి. కథల వీడియో ఆలోచన పురుడు పోసుకుంది. తమతో పాటుగా మరి కొందరు ప్రొఫెషనల్స్ ను కలుపుకుని ప్రస్థాన వేగం పెంచారు.

ఓ .. పే...ద్ద ... మలుపు

అలా పెద్ద పెద్ద కోరికలున్నా చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్న మై ప్రోమో వీడియోస్ ప్రస్థానంలో ఓ పెద్ద మలుపు, వర్క్-ఫ్లోయి తో ఒప్పందం,," వర్క్ -ఫ్లోయి మా తొలి క్లైంట్. ఉచితంగా చేస్తాం ఒక ఛాన్స్ ఇవ్వడి అంటూ ఆ కంపెనీకి ఒక మెయిల్ పెట్టాం.. అందుకు వాళ్లు ఒకే అన్నారు. వర్క్-ఫ్లోవి బ్లాగ్ లో మై ప్రోమో వీడియోస్ కు ప్రచారం లభించింది.అలా ప్రస్థానం కొత్త మలుపు తిరిగింది" అంటూ జ్ఞాపకాలను పంచుకున్నారు ఆ నలుగురిలో ఒకరు అనీల్. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలున్న ఈ కంపెనీ ప్రాజెక్ట్ తో వారికి మంచి గుర్తింపు వచ్చింది.ఆ ఉత్సాహంతో ఆ నలుగురి బృందం 'ఫ్రెష్ డెస్క్" కు ఒక్క ఛాన్స్ ప్లీజ్ రిక్వెస్ట్ పంపింది. ఫ్రెష్ -డెస్క్ కూడా ఒకే అనేసింది. పని కానిచ్చేసారు. ఫ్రెష్ డెస్క్ ఎక్ష్ప్లైనెర్ వీడియో అందరిని ఆకట్టుకుంది. దాన్ని, డబ్ల్యు. డబ్ల్యు .డబ్ల్యు. స్టార్ట్ అప్ ప్లేస్.కం లో పెట్టారు అంతేకాదు .. అంతర్జాతీయ స్టార్ట్ అప్ కమ్యూనిటీ లో తొలి ఐదు ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక అక్కడి నుంచి అనేక గొప్ప పేరున్న బ్రాండ్స్ కు పనిచేసే అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చాయి.

ఇప్పుడు .. వారి క్లైంట్ జాబితాలో .. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ పేరు కనిపిస్తుంది. కస్టమర్ ఎంగేజిమేంట్ టూల్ వెబ్ -ఎంగేజి పేరుంటుంది. అమెరికా కు చెందిన ఆర్గనైజింగ్ టూల్ ప్రొవైడర్ వర్క్ ఫ్లో వీ, సాఫ్ట్ వేర్ దిగ్గజం హెచ్ సీఎల్ .. ఇలా ఎన్నో దిగ్గజ సంస్థలు ఇప్పుడు మనకు ఆ జాబితాలో కనిపిస్తాయి చాలా వరకు క్లైంట్స్ సిలికాన్ వ్యాలి నుంచి వచ్చిన వారే. వారి వీడియోలలో కళ ఉంటున్తుంది, కలర్స్ ఉంటాయి.. కూసింత హస్యం ఉంటుంది .. వేప కాయంత వెర్రి కూడా ఉంటుంది. మొత్తానికి ఒక సారి చూస్తే చాలదనిపిస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.


image


బూట్ స్ట్రాప్ _హీరోస్ -మై ప్రోమో 1

అందుకే వారి ప్రయత్నం అంతగా లేక పోయినప్పటికి మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది. . కొత్త కొత్త క్లైంట్స్ వచ్చి చేరుతున్నారు. మై ప్రోమో వీడియోస్ మూడు పూలు ఆరు కాయలుగా కాకపోయినా విస్తరిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కోటి రూపాయల టర్నోవర్ రేఖను దాటేసింది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే అనేక దేశాలకు చెందిన 70కి పైగా స్టార్ట్ అప్ కంపెనీలకు సంబందించిన 100 కు పైగా వీడియోలను రూపొందించారు.

స్టార్ట్ అప్ లెర్నింగ్

నలుగురితో ప్రారంభమైన ప్రస్థానం ముందుకుసాగే కొద్ది మానవ వనరుల అవసరం ఏర్పడింది. ఇబ్బందులు ఎదురయ్యాయి. అదే విషయాన్ని చెబుతూ, గోపాల్, " మా నలుగురితో ప్రారంభమైనప్పుడు మానవ వనరుల పరంగా పెద్దగా సమస్యలు లేవు. అదే ఎదిగే కొద్ది సమస్యలు మొదలయ్యాయి. మంచి టాలెంట్ ఉన్న కోర్ టీం ఏర్పాటు చేసుకోవడం కొంచెం చాలా కష్టమైంది. అనుభవము, టాలెంట్ ఉన్న వారు ఊరూ - పేరు లేని కంపెనీ లో పనిచేసేందుకు సహజంగానే అంతగా ముందుకు రారు. అలాగే అంతేసి అనుభవం, టాలెంట్ ఉన్నవారిని అప్పుడప్పుడే అడుగులువేస్తున్న కంపెనీలు సహజంగానే భరించ లేవు.అందుకే ఎదిగే కొద్ది సమస్యలు కూడా ఎదుగుతి వచ్చాయి" అంటూ కష్టాల కథ వినిపించారు. అయితే మనసుంటే మార్గం ఉంటుంది. అనుభవజ్ఞులు కాకపోతే కొత్తవాళ్ళు. అప్పుడు కాలేజీల నుంచి వచ్చిన తాజా టాలెంట్ ను రిక్రూట్ చేసుకున్నారు.అలాంటి వారిలోని ఉత్సహాన్ని పెట్టుబడి చేసుకుని ముందుకు సాగారు ఇప్పుడు ఆ యువ బృందమే వారికి గొప్ప వరంగా మారింది,అంటారు ఉదయ్.

అ తర్వాత?

"ఇప్పటికే మాకు ప్రపచ దేశాలలో ఎంతో కొంత గుర్తిపు ఉంది. ప్రపంచ మార్కెట్లో మరిత్న విస్తరించాలనేది మా ముందున్న లక్ష్యం. అలాగే, పిల్లల కోసం యానిమేషన్ చిత్రాలు రూపొందించి ఎంటర్టైన్మెంట్ (వినోద) రంగంలోకి ఎంటర్ కావాలనేది మా ఆలోచన,.." అంటూ తనమన్సులోని మాటను పంచుకున్నారు ఉదయ్.అదే విధంగా వాణిజ్యేతర వీడియోలు తీయలనుకున్తున్నాము. నిజానికి అలాంటి లఘు చిత్రాలు కొన్ని తయారయ్యాయి. వాటిని పేస్ బుక్, యూ ట్యూబ్ లో ప్రచారంలో ఉన్నాయి. ఇవి వారి ప్రస్తుత వ్యాపారాన్ని మార్కెట్ చేసుకునేందుకు కూడా పని కొస్తున్నాయట.

బూట్ స్ట్రాప్ రూట్ ఎందుకు?

నిజానికి మేము మా వ్యాపారానికి పెట్టిన పెట్టుబడి అంటూ ఏదైనా ఉందంటే అది మా పీసీలు .. మా సమయం మాత్రమే. అంతకు మించి మరేమీ లేదు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ గా ఎదిగేందుకు అవసరమైన నిధులను మెల్ల మెల్లగా మా మిగులు ఆదాయాల నుంచి సమకూర్చు కుంటున్నాము.ఈ వ్యాపారానికి నిజానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు.అందుకే మేము బూట్ స్ట్రాప్ గా అడుగులు వేస్తున్నాము.

"మేము మా వ్యాపారం ప్రారంభించడానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని నిధుల కోసం ఎదురు చూడలేదు. అసలు మాకు అలాంటి వాటిలో విశ్వాసమే లేదు. ఒక వ్యాపారం ప్రారంభించాలంటే ఒక ఆఫీసు బిల్డింగ్ కావాలి, టెలిఫోన్ ఉండాలి, ఇంకా చాల మౌలిక సదుపాయాలు ఉండాలి అనే మాటలు చాలా విన్నాం. అయితే,ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసాము. నిజానికి అవేవి అవసరం కాదు అనే విషయం మాకు తెలుసు, అందుకే ఒకటొకటిగా ఆ జాబితాలోని అన్నింటిని చెరి పేసాము. 2009 సెప్టెంబర్ 09 వ తేదిన గోపాల్ రూం లో మూడు కంపూటర్లు, ఒక లాప్-టాప్ తో పని ప్రారంభించాము. కంప్యూటర్ తో పనిచేసే ఏ వ్యాపారానికి అయిన బూట్ స్ట్రాప్ రూటే సరైనది." ఇది ఆ నలుగురి బృందం ఏకాభిప్రాయం. బెడ్ రూంలో కొబ్బరి కాయ కొట్టిన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఈ తొలి అడుగు ( స్టార్ట్ -అప్) ప్రయత్నం చాలా దూరం ప్రయాణం చేసింది. అన్నిటి కంటే ముఖ్యంగా ఇంకా ముందుకు వెళ్లగల మన్న విశ్వాసం ఏర్పడింది అంటారు ఆ నలుగురు. అంతే కాదండోయ్, వాళ్ళు ఆఫీసును ఆఫీసులా చూడరు. అది రెండో ఇల్లు అనుకుంటారు.అలాగే తాము ఒక ఆఫీసులో పని చేస్తున్నామనే భావం వారిలో ఏ కోశానా ఉండదు. అదేమంటే, అదంతే. ఎందుకంటే అది అందాలూ పూయించే అందమైన పొదరిల్లు. ఆ కుటుంబంలో నేనున్నాను అనే భావనే ఉంటుంది అంటారు, సీనియర్ యానిమేటర్ శ్రవణ్.. అతనే ఆ కంపెనీ ప్రధమ ఉద్యోగి.

నిజానికి ఇదొక కొత్త బంగారు లోకం. ఇక్కడ అందరిని నడిపించే మంత్రం ఒకే ఒక్కటి అదే సక్సెస్. విజయమే విజయ రహస్యం, ఒక విజయం మరో విజయానికి చోదకం .. ఒక క్లైంట్ వచ్చి మీరు మా బ్రాండ్ ఇమేజినే మార్చేశారు అంటే చాలు ఇక అక్కడ పండగే పండగ .. అందుకే ప్రతి రోజు కొత్త ఉత్సాహంతో ఆఫీసుకు వస్తామని అంటారు,మార్కెటింగ్ డైరెక్టర్ సంతోష్.

ఆ నలుగురు కోయంబత్తూరు కుర్రాళ్ళ కథ నిజంగా నిజమైంది. మరి మీ సంగతి ఏమిటి మీరు కూడా బూట్ స్ట్రాప్ రూటే లోనే ముందుకు సాగుతారా? వ్యాపారానికి నిజంగా పెట్టుబడి, నిధులు అవసరమా ? మీరేమనుకుంటున్నారు. మీ అభిప్రాయం వెంటనే తెలియచేయండి.