మొట్టమొదటి మహిళా ఉబర్ డ్రైవర్ షన్నూ బేగం

మొట్టమొదటి మహిళా ఉబర్ డ్రైవర్ షన్నూ బేగం

Wednesday March 15, 2017,

2 min Read

ఈ వయసులో నువ్వు డ్రైవరేంటి..?

ఆడదానికి నీకేం చేతనవుతుంది..?

నాలుగిళ్లలో పాచిపని చేసుకుని బతుకుపో...

పురుషాధిక్య ప్రపచంలో సూటిగా తాకిన మాటల్ని యాక్సిలరేటర్ కింద వేసి కసిగా తొక్కింది. క్లచ్ నొక్కి గేరు మారిస్తే బండి రోడ్డు మీద పరుగులు పెట్టింది. కష్టాలను, కన్నీళ్లను కొంగున మూటకట్టుకుని జీవితానికి ఎదురీదింది. అవహేళన చేసిన సమాజాన్ని ధిక్కరించి తానేంటో నిరూపించింది.

షన్నూబేగం. మొట్టమొదటి మహిళా క్యాబ్ డ్రైవర్. ఢిల్లీలో ఆమె పేరు తెలియని వాళ్లు లేరు. ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో ఆమె మాటల్లోనే.

image


చాలీచాలని భర్త సంపాదన. ముగ్గురు పిల్లలు. దానికితోడు కట్టుకున్నవాడి అరాచకత్వం. జీవితం నిత్య నరకంగా మారింది. రోజూ కొట్టేవాడు. భరించాను. తాగుడుకి బానిసై చిక్కి శల్యమయ్యాడు. ఆసుపత్రిలో చేరి కన్నుమూశాడు. ముగ్గురు పిల్లలు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. చేతిలో చిల్లిగవ్వా లేదు. అనేక చోట్ల చిన్నా చితకా పనుల చేశాను. చాలీచాలని సంపాదనతో సంసారాన్ని ఈదడం నావల్ల కాలేదు. మొదట కూరగాయల బండి పెట్టాను. దాన్నుంచి వచ్చింది అంతంత మాత్రమే. పిల్లలు చదువు సంగతి దేవుడెరుగు కడుపునిండా తిండిలేదు. అది వదిలేశాను. పేషెంట్ కేర్ గా ఒకచోట కుదిరాను. నర్సులాంటి ఉద్యోగం. కానీ నేను పెద్దగా చదువుకోలేదు. దానికీ న్యాయం చేయలేకపోయాను. ఇలా అయితే లాభం లేదని, కొన్ని ఇళ్లలో వంట చేయడానికి ఒప్పుకున్నాను. నెలకు ఆరువేలు వచ్చేవి. ఏ మూలకూ సరిపోయేవి కావు.

అప్పుడే తెలిసింది ఆజాద్ ఫౌండేషన్ గురించి. నాలాంటి మహిళలకు ఆర్ధికంగా చేయూతనిచ్చే ఎన్జీవో అది. వెళ్లి కలిశాను. ఆరు నెలలు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తామన్నారు. అయితే టెన్త్ పాసై ఉండాలనే కండీషన్ ఉంది. నాకు చదువు లేదు. ఎలాగా అని ఆవేదన చెందాను. ఆ సమయంలో నా పిల్లలు ఇచ్చిన స్ఫూర్తి మరువలేను. టెన్తే కదమ్మా.. చదువు పాసవుతావు అని ప్రోత్సహించారు. పదో తరగతి కోసం రెండేళ్లు కష్టపడ్డాను. ఒకవైపు చదువుతూనే మరోవైపు డ్రైవింగ్ లో మెళకువలు నేర్చుకున్నాను. అలా నలభై ఏళ్ల వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాను. అనుకున్న లక్ష్యం నెరవేరింది. ఆజాద్ ఫౌండేషన్ నుంచి సర్టిఫికెట్ వచ్చింది. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ లతో పాటు డ్రైవింగ్ లో పట్టుసాధించాను.

విమెన్ డ్రైవర్ గా మొదట ఆజ్ తక్ లో చేశాను. ఆ తర్వాత ఇండిగో ఎయిర్ లైన్స్ లో కొన్నాళ్లు. ఇప్పుడు ఉబర్ లో జాయిన్ అయ్యాను.. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. కూతురు ఇగ్నోలో చదువుతోంది. బాబు ఓ ప్రైవేటు స్కూల్లో టెన్త్ చదువుతున్నాడు. ఎంత లేదన్నా వారానికి రూ. 12,000 వస్తున్నాయి. వాటితో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్నాను. ప్రస్తుతానికి లైఫ్ హ్యాపీగా ఉంది.

కష్టాలు ముసురుకున్నప్పుడే మనిషి గుండె నిబ్బరమేంటో తెలుస్తుంది. షన్నూ బేగానికి మనోధైర్యం పాలు ఎక్కువే. లేకుంటే, మగవాడే అధికుడు అనే నేటి సమాజంలో ఎదురొడ్డి గెలవడమంటే మాటలు కాదు. అందునా డ్రైవింగ్ ఫీల్డులో ఎన్నో సూటపోటి మాటలు. ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో బతుకు బండిని విజయ తీరాలకు లాక్కుని వెళ్లిన షన్నూ బేగం పోరాటపటిమ పదిమందికీ ఆదర్శప్రాయం.