ఒకప్పుడు ఇంటికి కరెంట్ కనెక్షన్ లేదు.. ఇవాళ వెయ్యికోట్ల సంస్థకు అధిపతి

ఒకప్పుడు ఇంటికి కరెంట్ కనెక్షన్ లేదు.. ఇవాళ వెయ్యికోట్ల సంస్థకు అధిపతి

Saturday April 08, 2017,

3 min Read

దందా చేయాలంటే డబ్బులు దండిగా ఉండాల్సిన పనిలేదు. గుండెలో దమ్ము, సాధించాలన్న కసి ఉంటే చాలు. చేయాలనుకున్న బిజినెస్ బిందాస్ అవుతుంది. ఇదే మాటను అక్షరాలా రుజువు చేశాడు హన్మంత్ రాందాస్ గైక్వాడ్. ఒకపూట తింటే రెండో పూట పస్తులు పడుకోవాల్సిన స్థితి నుంచి- వెయ్యికోట్ల సంస్థకు అధిపతిగా ఎదిగాడు. ఇండియాలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ కంపెనీ అయిన బీవీజీ ఇండియా లిమిటెడ్ కంపెనీని స్థాపించి పదిలక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

హన్మంత్ సొంతూరు మహారాష్ట్రలోని రహిమత్ పుర. పేదరికంలోనే పుట్టిపెరిగాడు. ఒక చిన్నగది ఉన్న ఇల్లు. రాత్రయితే చిమ్మచీకట్లోనే గడిపేవాళ్లు. కరెంటు కనెక్షన్ పెట్టించుకునే స్తోమత లేదు. ఆకలి, పేదరికం ఎలా బతకాలో నేర్పిస్తుందంటారు. కష్టాలతో సావాసం చేస్తున్న హన్మంతు విలువైన జీవితపాఠాలు నేర్చుకున్నాడు. కష్టపడి చదివితే తప్ప, ఈ దరిద్రం పోదని అతని మనసులో బలంగా నాటుకుంది. నాలుగో తరగతిలో ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ వచ్చేది. అప్పట్లో నెలకు పది రూపాయలు ఇచ్చేవారు.

image


కొన్నాళ్లకు కుటుంబం ముంబైకి మారింది. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అక్కడికి వెళ్లగానే హన్మంత్ నాన్నకు తీవ్రంగా జబ్బు చేసింది. వాతావరణం ఒక్కసారిగా మారేసరికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. సంపాదించే ఒక్క మనిషి మంచాన పడటంతో పూటగడవడం కష్టంగా మారింది. చేసేదేంలేక హన్మంత్ స్కూల్ ముగిశాక రైల్వే స్టేషన్ దగ్గర పళ్లు అమ్మడం మొదలుపెట్టాడు. అమ్మ స్థానికంగా ఓ పాఠశాలలో టీచర్‌ గా చేరింది. స్కూల్ లేని సమయంలో కుట్టుమిషన్ మరో ఆధారమైంది.

రోజులు భారంగా గడుస్తున్నాయి. ఒక పూట తింటే మరోపూట పస్తులున్నారు. రోజులు ఎంత కఠినంగా ఉన్నా హన్మంతు చదువులో ఒక్క అడుగు కూడా వెనుకబడలేదు. 88శాతం మార్కులతో టెన్త్ పాసయ్యాడు. తర్వాత పాలిటెక్నిక్ లో చేరుదాం అనుకున్నాడు. అంతలోనే నాన్న జబ్బు అంతకంతకూ ముదిరిపోయింది. అతను కాలంచేశాడు. పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. చదువు వదిలేయడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అయినా హన్మంత్ ఆత్మవిశ్వాసం ఎక్కడా సడల్లేదు. ఎలాగైనా కాలేజీలో చేరాలనే పట్టుదలతో ఉన్నాడు. 

అప్పటికీ అమ్మ సంపాదన నెలకు రూ. 2,300 మాత్రమే. వాటితో కొడుకు చదువు ఎలా అని ఆమె ఆవేదన చెందింది. ఎలాగైనా వాడిని ప్రయోజకుడిని చేయాలనే తలంపుతో రూ. 15,000అప్పు తెచ్చింది. విశ్వకర్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేర్పించింది. ఒకపక్క కాలేజీకి వెళ్తూనే మరోపక్క అమ్మకు చేదోడు వాదోడుగా నిలిచాడు. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్తూ ఎంతోకొంత ఆసరాగా నిలిచాడు.

1994లో టాటా మోటార్స్ లో ట్రైనీ ఇంజినీర్ గా చేసే అవకాశం వచ్చింది హన్మంతుకి. అదే సమయంలో భారత్ వికాస్ ప్రతిస్థాన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి- స్వయం ఉపాధిపై తనకున్న ఐడియాను డెవలప్ చేశాడు. చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందుడి సూక్తులు పాటించే హన్మంత్.. ఎనిమిది మంది స్నేహితులతో కలిసి ఆ సంస్థను స్థాపించాడు. అదొక సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్. ముఖ్యంగా గ్రామీణ యువతకు చేయూత అందించడమే ఉద్దేశంగా దాన్ని నెలకొల్పాడు. 

మొదట హౌస్ కీపింగ్ కంపెనీగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆ కంపెనీ- దేశంలోనే అతిపెద్ద సమగ్ర సేవా సంస్థగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద ఎమర్జెన్సీ పోలీస్ సర్వీస్ సెంటర్ గా పేరుగాంచింది. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులోనూ తిరుగులేదు. పార్లమెంట్, ఢిల్లీ హైకోర్టు, ప్రధాని నివాసం మొదలుకొని రాష్ట్రపతి భవన్ వరకు హౌస్ కీపింగ్ నిర్వహణ కూడా వీరే చూసుకుంటారు. వందకు పైగా రైళ్ల మెయింటెనెన్స్ చేస్తారు.

6వేలకు పైగా ఉద్యోగులు, 800 సైట్లలో సర్వీస్, 70 నగరాల్లో 750కి పైగా కస్టమర్లు, దేశంలోని 20 రాష్ట్రాల్లో సర్వీసులు.. ఇదీ బీవీజీ ఇండియా లిమిటెడ్ కంపెనీ అధిపతిగా హన్మంత్ గైక్వాడ్ సాధించిన విజయం.

దేశవ్యాప్తంగా 2027 నాటికి సుమారు పది లక్షల మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు హన్మంత్. ప్రస్తుతానికి కంపెనీ టర్నోవర్ వెయ్యి కోట్లు దాటింది.

ఒకప్పుడు తిండి కూడా సరిగాలేని దీనస్థితి నుంచి నేడు వేల కోట్ల వ్యాపార సంస్థకు అధిపతిగా మారిన హన్మంత్ గైక్వాడ్ – పెట్టుబడినే నమ్ముకుని వ్యాపారం చేశాడు. ఈ సక్సెస్ స్టోరీలో నమ్మకమే మూలధనం. గుండెధైర్యమే సర్వస్వం.