శతవసంతాల చదువులమ్మ చెట్టునీడ రెడ్డి హాస్టల్

శతవసంతాల చదువులమ్మ చెట్టునీడ రెడ్డి హాస్టల్

Sunday August 20, 2017,

5 min Read

నిజాంకాలం నుంచి నేటిదాకా విద్యాకేంద్రంగా భాసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి రెడ్డి హాస్టల్ మకుటాయమానం. వందేళ్ల చరిత్రను నిక్షిప్తం చేసుకున్న ఈ విద్యాశ్రమం ఎందరో ప్రముఖులకు చదువులమ్మ చెట్టునీడైంది. నాటి కొత్వాల్ రాజాబహదూర్ చేతుల మీదుగా మొదలైన సరస్వతీ నిలయం శతవసంతాలపాటు ప్రయాణం చేసింది. వందేళ్ల క్రితమే గ్రామీణ ప్రాంతాల్లోని ఆడపిల్లలు చదువుకోవాలన్న రాజాబహదూర్ ఆశయం నేటికీ చెక్కుచెదరకుండా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది.

image


హైదరాబాద్ విద్యారంగ చరిత్రలో 1917 సంవత్సరానికి విశిష్టమైన స్థానం ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917లోనే పురుడు పోసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీకి అంకురార్పణ జరిగిన మరుసటి యేడాదే.. అంటే 1918 లో రెడ్డి హాస్టల్ కు బీజం పడింది. కొత్వాల్ రాజబహద్దూర్ వేంకట రామారెడ్డి ఈ విద్యాశ్రమాన్ని స్థాపించడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఆనాడు గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద రెడ్డి కులస్థుల పిల్లలు హైదరాబాదులో చదువుకోవటానికి సరైన సౌకర్యాలు లేవు. ఈ విషయం నాటి కొత్వాల్ రాజబహద్దూర్ వేంకట రామారెడ్డిని తీవ్రంగా కలచివేసింది. సరిగ్గా అదేసమయంలో వనపర్తి మహారాజు రాజా రామేశ్వరరావు చిన్న కుమార్తె పెళ్లి.. సీర్నపల్లి రాజుతో జరుగుతోంది. ఆ వివాహ వేడకుకు రెడ్డిరాజులు, జమీందారులు పెద్ద సంఖ్యలో వచ్చారు.

ఆ సందర్భంగా వాళ్లలో ఒక టాపిక్ వచ్చింది. సాధారణంగా పెళ్లిల్లకు, శుభకార్యాలకు రెడ్లు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారని.. ఎంతో మంది రెడ్డి రాజులు, జమీందారులు ఉన్నా.. వారి పిల్లలు చదువుకోడానికి మాత్రం సరైన సౌకర్యాలు లేవని.. కొత్వాల్ వేంకట రామారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బహదూర్ నోట ఆ మాట రాగానే.. ఎవరైనా బాధ్యత తీసుకుంటే తామంతా సహాయం చేస్తామని సంస్థానాధీశులు, రెడ్డిరాజులు అన్నారు. అలా హైదరాబాదులో రెడ్డి విద్యాశ్రమానికి బీజం పడింది. నిమిషాల్లో విరాళాలు పోగయ్యాయి. ముందుగా పింగళి వేంకట రామారెడ్డి 10వేల రూపాయల చందా ప్రకటించారు. ఆ తరువాత వనపర్తి రాజావారు 25 వేలు ఇస్తామన్నారు. గద్వాల మహారాజు 30 వేలు చందా ప్రకటించారు. పింగిలి కోదండ రామారెడ్డి 4 వేలు ఇవ్వడానికి రెడీ అన్నారు. గోపాలపేట రాణి తనవంతుగా 4వేలు విరాళం ఇచ్చారు. దోమకొండ సంస్థానాధీశులు రాజారామేశ్వరరావు బహద్దూర్ 5 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. జటప్రోలు రాజు రాజా సురభి వేంకట లక్ష్మారావు 5వేల చందా ప్రకటించారు. వీరేకాక ఎంతోమంది దేశ్ ముఖ్ లు, జాగీర్దారులు, ధనికులైన పటేళ్లు కూడా తమవంతు విరాళాలు ఇచ్చారు.

మొదట రెడ్డి హాస్టల్ అద్దె ఇంట్లో ప్రారంభమైంది. అదే యేడాదిలో 54 మంది విద్యార్థులు చేరారు. ఆ ఉత్సాహంతో రెడ్డి హైస్కూల్ స్థాపించారు దాన్ని రెండేండ్లు నడిపారు. అయితే హైస్కూల్ వల్ల నష్టం రావటంతో దాన్ని మూసివేశారు. 1924లో 52 వేల రూపాయలతో 9 వేల చదరపు గజాల స్థలాన్ని కొని, రెడ్డిహాస్టల్ కోసం శాశ్వత భవన నిర్మాణాన్ని చేపట్టారు. 1925లో 28వేల రూపాయలతో వంటశాల, భోజనశాలతో పాటు పెద్ద హాల్ నిర్మించారు. కొత్వాల్ వేంకట రామారెడ్డికి పుస్తకాలంటే మక్కువ. ఆ అభిరుచితోనే 1926లో 48 వేల రూపాయల వ్యయంతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అప్పట్లోనే 11 వేల పుస్తకాలను సేకరించారు. అప్పుడు సెంట్రల్ లైబ్రరీలో 15వేల పుస్తకాలు ఉంటే.. రెడ్డి హాస్టల్ లైబ్రరీలో 11 వేల బుక్స్ ఉండేవి. ఒక ప్రజాసంస్థ ఏర్పాటు చేసిన లైబ్రరీలో ఇంతపెద్ద మొత్తంలో పుస్తకాలు ఉండటం ఆనాడు గొప్ప విషయంగా చెప్పుకునేవారు. ప్రస్తుతం ఉన్న మూడు విద్యాసంస్థల్లో 30 శాతం ఇతర కులాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఏటా 45 లక్షల స్కాలర్ షిప్స్ ఇస్తుంటారు. అవన్నీ కార్పస్ ఫండ్, ఇతర దాతల నుంచి సేకరించినవే. చలమారెడ్డి పేరుమీద గిరీష్ రెడ్డి, గద్వాల రాజావారు, వనపర్తిరాజావారు ఉపకారవేతనాల కోసం విరాళం ఇచ్చేవారు. ఇప్పటికీ చాలామంది తాను పూర్వ విద్యార్ధిని అని చెప్పి, డబ్బులు ఇచ్చిపోతుంటారు.

రెడ్డి హాస్టల్ స్థాపించినప్పటి నుంచి తాను చనిపోయేంత వరకు కొత్వాల్ వేంకట రామారెడ్డే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రెడ్డి హాస్టల్ అభివృద్ధి కోసం ఆయన తీసుకోని రిస్క్ లేదు. విద్యార్ధులకు వ్యవసాయ విద్యపై శ్రద్ద కల్పించారు. రెడ్డిహాస్టల్‌కు అవసరమయ్యే కూరగాయల కోసం హుస్సేన్ సాగర్ కింద 6వేల రూపాయలతో ఐదెకరాల తోటను, ఒక బంగ్లాను కొన్నారు. దాన్ని అప్పట్లో రెడ్డి బాగ్ అని పిలిచేవారు. ఆ తోట నుంచి వచ్చిన కూరగాయలతో సగం ఖర్చు మిగిలేది. ఆ రోజుల్లో కూరగాయలకు నెలకు వంద రూపాయలయ్యేవి. అందులో సగం కూరగాయలు రెడ్డి బాగ్ నుంచే వచ్చేవి. సెలవు రోజుల్లో విద్యార్ధులంతా తోట పనిచేసేవారు. వాక్చాతుర్యం, ప్రసంగ నైపుణ్యం పెంపొందించేందుకు యువజన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రతివారం విద్యార్ధులంతా చర్చలు, సభలు, సమావేశాలు జరిపేవారు.

image


అయితే రెడ్డి హాస్టల్ పేరు ప్రఖ్యాతుల్ని జీర్ణించుకోలేని కొందరు కట్టుకథలు సృష్టించారు. అందులో విద్యార్ధులకు చదువు చెప్పడం లేదు.. ఆయుధాలు తెప్పించి యుద్ధం నేర్పుతున్నారని ప్రచారం చేశారు. ఆ విషయం తెలుసుకున్న ఓ ముస్లిం మతపెద్ద స్వయంగా వచ్చి హాస్టల్ సందర్శించాడు. లైబ్రరీ నుంచి స్నానాలగదిదాకా పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఇంతగొప్ప విద్యాలయాన్ని తాను గతంలో చూడలేదని.. మహోన్నత ఆశయంతో నడుస్తున్న విద్యాసంస్థపై చెడుప్రచారం మంచిది కాదని అన్నారు.

బాయ్స్ హాస్టల్ స్థాపించిన 20 ఏళ్ల తర్వాత నారాయణగూడలో మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. అది కూడా రాజాబహదూర్ చేతుల మీదుగానే ప్రారంభమైంది. 1928లో దీన్ని స్థాపించారు. ఆరుగురు బాలికలతో మొదలైంది స్కూల్ ప్రయాణం. ఒకానొక టైంలో 4000 మంది విద్యార్ధుల దాకా ఇందులో చదువుకున్నారు. నిజాం కాలంలో తెలుగు మీడియంలో బోధించిన తొలి పాఠశాల ఇదే. ప్రస్తుతం 1300 మంది విద్యార్ధులు ఉన్నారీ స్కూల్లో.

రెడ్డి విమెన్స్ కాలేజీ స్థాపన వెనుక కూడా గొప్ప చరిత్ర ఉంది.1954లో దీన్ని స్థాపించారు. మొదట హైస్కూల్ వరకే అనుకున్నారు. ఆ తర్వాత కాలేజీ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదన్న సదుద్దేశంతో రాజాబహదూర్ స్వయంగా గ్రామగ్రామానికి వెళ్లి, మీ పిల్లలను చదివించడం నా బాధ్యత అని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించారు. వాళ్లకోసం ముందుగా హైస్కూల్ స్థాపించారు. అంతటితో వాళ్ల ఎడ్యుకేషన్ ఆగిపోకూడదని కాలేజీ కూడా స్థాపించారు. మళ్లీ హాస్టల్ కోసం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారని ఆలోచించి.. వసతి గృహం కూడాత ఏర్పాటు చేశారు. 15 మంది పిల్లలతో మొదలైన కాలేజీలో ఇప్పుడు 3వేల మంది ఉన్నారు. యూజీలో 20 కోర్సులు, పీజీలో 4 కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 60 శాతం గ్రామీణ విద్యార్ధులే ఉంటారు. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఇందులోనే ఇంటర్ చదివారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఈ కళాశాలలోనే బీఏ చేశారు. డీజీపీ సతీమణి మమతా అనురాగ్ శర్మ కూడా ఈ కాలేజీ స్టూడెంటే. ఏటా మూడు వేల మంది ఉత్తీర్ణులై పై చదువులకు వెళ్తుంటారు.

వీటితో పాటు కొత్తకోట-పెబ్బేరు మధ్యలో జాతీయ రహదారిపై విలియంకొండ రెసిడెన్షియల్ స్కూల్ కూడా రాజాబహదూర్ పేరుమీదనే ఏర్పాటు చేశారు. అది కొత్వాల్ జన్మస్థలం కావడంతో అక్కడ కూడా గురుకుల పాఠశాల స్థాపించారు. 24 ఏళ్ల క్రితం 30 ఎకరాల్లో నెలకొల్పిన ఆ స్కూల్లో 600 మంది విద్యార్ధులున్నారు. బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతి ఉంది. స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి.

ప్రస్తుతమున్న రెడ్డి హాస్టల్ క్యాంపస్ సరిపోవడం లేదు. ప్రత్యేకంగా కొంత స్థలాన్ని కేటాయించాలని రెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్టు ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. తెలంగాణలో విద్యావ్యాప్తి కోసం వెంకటరామారెడ్డి చేసిన సేవలను గుర్తించిన సీఎం.. బుద్వేల్‌లో రెడ్డి ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణానికి పదెకరాల స్థలం, రూ.10 కోట్లను మంజూరు చేశారు. ట్యాంక్‌బండ్ మీద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెడ్డి హాస్టల్ వందేళ్ల వేడుకను ఘనంగా జరపాలని సీఎం ఆదేశించారు. రాజాబహదూర్ మీదున్న అభిమానం .. హాస్టల్ చరిత్ర తెలిసిన వ్యక్తి కాబట్టి.. సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ముందుకు వచ్చారని ట్రస్టు సభ్యలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రెడ్డి హాస్టల్ పేరుకే రెడ్డి హాస్టల్. ఈ హాస్టల్ లో ఇతర కులాల, ఇతర మతాల విద్యార్ధులు కూడా ఉన్నారు. తరువాత కాలంలో అనాథాశ్రమం ఏర్పాటు చేశారు. వారికి ఉచిత భోజన వసతులు కల్పించారు. ఈ హాస్టల్ లో ఉండి చదువుకున్న విద్యార్థులు రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మాజీ ప్రధాని పీవి నరసింహారావు, జస్టిస్ జీవన్ రెడ్డితో పాటు ఎందరో ఐఏఎస్ , ఐపీఎస్ లు రెడ్డిహాస్టల్లో వసతి పొందిన వారే. రావినారాయణరెడ్డి ఈ హాస్టల్ మొదటి విద్యార్ధి. ఆరోజుల్లోనే హైదరాబాద్ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లిందంటే కారణం రెడ్డి హాస్టలే అని చెప్పుకోవచ్చు. రాజా బహదూర్ చేతుల మీదుగా చిన్న మొక్కగా మొదలైన రెడ్డి హాస్టల్ ప్రస్థానం- నేడు పెరిగి వృక్షమై, వటవృక్షమై ఎందరికో చదువుల నీడనిచ్చింది. శతవసంతాల విద్యాసంస్థ ప్రయాణంలో పూర్వవిద్యార్ధులంతా తమ మధురానుభూతుల్ని నెమరు వేసుకుంటున్నారు.