16 ఏళ్లపాటు లా చదివి ఫ్యాక్టరీని కోర్టుకీడ్చిన నిరుపేద రైతు  

1

వేర్ దేర్ ఈజ్ ఏ విల్.. దేర్ ఈజ్ ఏ వే.. అంటారు. మనసుంటే కచ్చితంగా మార్గముంటుంది. ఆ మార్గంలో ముళ్లుంటాయి. రాళ్లుంటాయి. ఒక్కో అవరోధాన్ని దాటుకుంటూ వెళ్లడమే. అలాంటి క్లిష్టమైన దారిలో వెళ్లిన ఓ రైతు చివరికి లాయర్ గా మారి పెద్ద ఫ్యాక్టరీని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సంవత్సరాలు కష్టపడి లా చదివి తన ఊరికోసం, ఊరి రైతుల కోసం పాటుపడ్డాడు. కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముక్కుపిండి నష్టపరిహారం వసూలు చేసి న్యాయవ్యవస్థతో శెభాష్ అనిపించుకున్నాడు.

వాంగ్ అనే చైనాకు చెందిన రైతు హిలంగ్జియంగ్ లోని కికిహర్ శివారు ప్రాంతంలో ఉన్న యుజుటున్ అనే గ్రామంలో ఉండేవాడు. సమీపంలోని కిహువా అనే కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన రసాయన వ్యర్ధాలన్నీ ఊరిలోని పంటపొలాలను నాశనం చేస్తున్నాయి. భూసారం దెబ్బతింటోంది. ఈ విషయాన్ని స్థానిక వ్యవసాయ అధికారులకు తెలియజేశాడు. ఫ్యాక్టరీ వ్యర్ధాల మూలంగా పొలాలే కాదు.. గ్రామ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కంపెనీ మీద చర్యలు తీసుకోండని ప్రాధేయ పడ్డాడు. కానీ అధికారులు పట్టించుకోలేదు. నీ దగ్గర ఆధారాలున్నాయా అని ఎదురు ప్రశ్నించారు. ఫ్యాక్టరీ నుంచి విష రసాయనాలు వస్తున్నట్టు ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మని అన్నారు.

వాంగ్ తెల్లమొహం వేశాడు. చదువు సంధ్యలేని వాడిని, ఆ కాయితాలు, వివరాలు గట్రా నా దగ్గరెలా ఉంటాయి అని దీనంగా బదులిచ్చాడు. అలా అయితే కంపెనీ మీద కేసు వేయడం కుదరదు.. వెళ్లి పనిచూసుకో.. లేదంటే ఇల్లు పొలం వదిలి వేరే చోటికి వెళ్లిపో.. అన్నారు. వాంగ్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అధికారుల చేతకాని తనం మూలంగా అన్నం పెట్టే పొలాన్నీ, జన్మనిచ్చిన ఊరిని వదిలేసి పోవాలా? అలా జరిగే సవాలే లేదని మనసులో గట్టిగా అనుకున్నాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదు.. ఊరి ప్రజలందరి సమస్య. ఎలాగైనా ఫ్యాక్టరీని దోషిగా నిలబెట్టాలని సంకల్పించాడు.

కంపెనీ మీద కొట్లాడాలంటే న్యాయస్థానం ఒక్కటే మార్గం. కానీ ఎలా? పిటిషన్ వేయడం..న్యాయవాదిని మాట్లాడుకోవడం.. ఇదంతా డబ్బులతో అయ్యే వ్యవహారం. వాంగ్ స్తోమత లేనివాడు. నిరుపేద రైతు. పెద్దగా చదువుకోలేదు కూడా. అందుకే ఒక నిర్ణయానికొచ్చాడు.

న్యాయశాస్త్రం చదివి లాయర్ అయిపోతే.. ఆ కేసు తనే వాదిస్తే.. ఆలోచన బాగుంది. కానీ అతను చదవింది కేవలం మూడో తరగతి వరకే. ఆ పరిస్థితుల్లో వాంగ్ లా చదవాలంటే అయ్యే పనేనా? కనీసం పుస్తకాలు కొనేంత డబ్బు కూడా లేదు. వెంటనే ఒక ఐడియా వచ్చింది. లా బుక్స్ అమ్మే ఒక షాప్ దగ్గరికి వెళ్లాడు. యజమానితో విషయం చెప్పాడు. రోజూ షాపులోనే ఉండి చదువుతాను. కావాల్సిన సమచారాన్ని సేకరిస్తాను. ఊరికే కాదు. రోజూ సంచీనిండా మొక్కజొన్నలిస్తాను. దయచేసి సాయం చేయమని బతిమాలాడు. వాంగ్ ఆవేదన అర్ధం చేసుకున్న షాపతను సరే అన్నాడు. అలా మొదలైంది చదువు. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా 16 సంవత్సరాలు చదివాడు. మొత్తానికి న్యాయశాస్త్రం మీద పట్టుసాధించాడు.

ఈ విషయం అక్కడి ఒక న్యాయ సంస్థకు తెలిసింది. ఒకరైతు ఫ్యాక్టరీ మీద యుద్ధం ప్రకటించి కష్టపడి లా చదువుతున్నాడని తెలిసి వండరయ్యారు. వెళ్లి వాంగ్ ని కలుసుకుని వివరాలు తెలుసుకున్నారు. మరోమాట లేకుండా తమవంతు న్యాయం సహాయం చేస్తామని మాటిచ్చారు. అలా కంపెనీమీద కేసు ఫైల్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కేసు 8 ఏళ్లు పెండింగ్ లో పడింది. 2015లో ఎట్టకేలకు వాదనకొచ్చింది. ఫ్యాక్టరీ నుంచే వచ్చే విషరసాయనాలపై పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. మొదటి రౌండ్ లోనే కేసుని గెలిచారు. కోర్టు తీర్పు మేరకు ఆ కంపెనీ రైతులకు 8,20,000 యాన్స్ నష్టపరిహారం చెల్లించింది.

సో, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. బక్క రైతే కదా ఉఫ్ మని ఊదితే ఎగరిపోతాడని ఫ్యాక్టరీ అనుకుంది.. కానీ అదే బక్క రైతు తుఫాన్ లా ఎదురొస్తే చిగురుటాకులా వణికింది. దటీజ్ విల్ పవర్.  

Related Stories

Stories by team ys telugu