రూ.10వేలతో వ్యాపారం మొదలుపెట్టి.. వేలకోట్లు సంపాదించాడు

ఇండియాలోనే రెండో అత్యంత ధనవంతుడు దిలీప్ షంఘ్వీ విజయగాథ

రూ.10వేలతో వ్యాపారం మొదలుపెట్టి.. వేలకోట్లు సంపాదించాడు

Thursday January 19, 2017,

2 min Read

కొందరి విజయగాథలు వింటుంటే అచ్చం సినిమా స్టోరీని తలపిస్తాయి. నిజజీవితంలో సాధ్యమా అనిపిస్తాయి. కేవలం 10వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి.. వేల కోట్లు సంపాదించారంటే నమ్మశక్యం కాదు. ఇండియాలోని రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచిన ఆ ఫేమస్ బిజినెస్ టైకూన్ ఎవరో కాదు.. సన్ ఫార్మా కంపెకనీ అధినేత దిలీప్ షంఘ్వీ.

దిలీప్ స్వరాష్ట్రం గుజరాత్. తండ్రికి కోల్ కతాలో ఫార్మా హోల్ సేల్ బిజినెస్ వుండేది. అక్కడే చదువుతూ తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచేవారు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ముంబై షిఫ్టయ్యారు. అక్కడ సైకోథెరపీకి సంబంధించిన డ్రగ్స్ కోసం ప్రమోషన్ వర్క్ చేశారు.

కొంతకాలం గడచిన తర్వాత సొంతంగా ఫార్మా బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. తండ్రిని కలిసి విషయం చెప్పారు. ఆయన సరే అన్నారు. అలా రూ. పదివేలు తండ్రి నుంచి అప్పుగా తీసుకుని 1982లో సన్ ఫార్మా స్థాపించారు. గుజరాత్ లో మొదలైంది వ్యాపారం. స్నేహితుల సాయం కూడ తీసుకున్నారు. మొదట సైకియాట్రీకి సంబంధించిన ఐదు ప్రాడక్టులతో బిజినెస్ మొదలైంది. గుజరాత్ లోని ఐదు ప్రాంతాల్లో అమ్మేవారు.

image


అలా నాలుగేళ్లు తిరిగేసరికి.. ఫలానా మెడిసిన్ లేదు, దొరకదు అనకుండా.. వ్యాపారం శాఖోపశాఖలుగా విస్తరించింది. ఏ కంపెనీ పోటీ పడలేకపోయింది. ఆ క్రమంలోనే కొన్ని సంస్థలను టేకోవర్ చేశారు. 1997లో కరాకో ఫార్మాని కొనుగోలే చేశారు. ఆ కంపెనీని తీసుకునేటప్పుడు చాలామంది చాలారకాలుగా విమర్శించారు. అయినా ఎవరి మాటా వినలేదు. దిలీప్ అనుకున్నదే నిజమైంది. టేకోవర్ చేసిన కంపెనీని ఎవరూ ఊహించని విధంగా లాభాల బాటలో నడిపించారు. 1987లో మిల్మెంట్ లాబ్స్ కొనుగోలు చేసి ఆఫ్తల్మాలజీ వెంచర్ లోకి అడుగుపెట్టారు. అప్పటికి గ్లోబల్ గా మిల్మెంట్ లాబ్స్ ర్యాంక్ 108. దిలీప్ కొనుగోలు చేశాక కంపెనీ 6వ ర్యాంకులో నిలిచింది. అలా అనతికాలంలోనే సన్ ఫార్మా యూరప్, అమెరికా మార్కెట్లోకి ఎంటరైంది. 2012లో యూఆర్ఎల్ ఫార్మా చేజిక్కించుకున్నారు. తర్వాత డ్యూసా ఫార్మా కొనుగోలు చేయడం మేజర్ స్టెప్.

గజిట్ నివేదిక ప్రకారం దిలీప్ కంపెనీ విలువ 16.9 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 1,700 కోట్లు దాంతోపాటు రాన్ బాక్సీలో సింహభాగం షేర్ (63.4శాతం) సన్ ఫార్మాదే. దీంతో దిలీప్ కంపెనీ ఇండియాలోనే నెంబర్ వన్ అయింది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఫార్మాసూటికల్ కంపెనీగా అవతరించింది. 2015 సంవత్సరానికిగాను ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు.

అవకాశాలను అందిపుచ్చుకోవడం ఆంట్రప్రెన్యూర్లకు ఉండాల్సిన లక్షణం అంటారు దిలీప్. విజన్, అమలుచేసే టీం ఉన్నప్పుడే వ్యాపారం అనుకున్నట్టుగా అభివృద్ధి చెందుంతుందని అంటారు. వ్యాపారం అంటే నిరంతరం నేర్చుకోవడమే గానీ, అంతా తెలుసు అనుకుంటే తప్పులో కాలేసినట్టే అంటారు. నిజమే.. చిత్తశుద్ధి, కష్టించేతత్వం దిలీప్ షంఘ్వీని ఈ స్థాయిలో నిలబెట్టిందనడంలో సందేహం లేదు.