దేశంలోనే తొలిసారి గర్భాశయ మార్పిడి.. అంటే ఇదీ ఒకరకంగా సరోగసినా..?  

0

ఇప్పటిదాకా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చూశాం. గుండె మార్పిడీ విన్నాం. కిడ్నీ అమర్చిన సంఘటలనూ కోకొల్లలు. ఊపిరితిత్తులనూ రిప్లేస్ చేశారు. కానీ కొత్తగా గర్భాశయ మార్పిడి గురించి విన్నారా. ఆశ్చర్యంగా ఉంది కదా! అవును. అవయవ మార్పిడిలో ఇదొక నూతన అధ్యాయం. మన డాక్టర్లు చేసిన అద్భుతం. 21 సంవత్సరాల అమ్మాయికి, తన తల్లి గర్భాన్ని అమర్చారు.

పుణెలోని గెలాక్సీ కేర్ లాప్రోస్కోపీ ఇన్ స్టిట్యూట్ కి చెందిన డాక్టర్ శైలేష్ నేతృత్వంలో 12 మంది డాక్టర్ల బృందం ఈ గర్భాశయ మార్పిడి సర్జరీ చేసింది. అయితే అప్పుడే సక్సెస్ అని చెప్పలేం అంటున్నారు డాక్టర్లు. ఒక నెల తర్వాత ఏదైందీ చెప్పొచ్చంటున్నారు. సోనోగ్రఫీ, ఇంకా ఇతర టెస్టులు చేసిన తర్వాత గర్భాశయం పనితీరు సాధారణంగా ఉంటే అప్పుడు సక్సెస్ అయినట్టు లెక్క.

అయితే ఇలాంటి సర్జరీ ఇండియాలో మొదటిదే కావొచ్చు కాదు ప్రపంచంలో కాదు. స్వీడన్ లో మొదటి ట్రాన్స్ ప్లాంట్ 2012లో జరిగింది. అది విజయవంతం కావడంతో ఆ మహిళ 2014లో గర్భం దాల్చి ప్రసవించింది. అప్పటి నుంచి అడపాదడపా సర్జరీలు జరుగుతున్నాయి. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయి, ప్రసవించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అయినప్పటికీ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసే ఇండియాలో ఈ గర్భాశయ మార్పిడికి నైతికంగా, సామాజికంగా మద్దతు దొరుకుతుందా? అంటే ఒకరకమైన మోరల్ డైలామా అనే చెప్పొచ్చు. అవన్నీ దాటుకుని రావాలంటే కొంచెం కష్టమే. మొదటి సర్జరీ జరిగినప్పటికీ ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి ఇంకా సమగ్రమైన ప్రొసీజర్, ప్రొటొకాల్ తయారు కాలేదు. చాలామంది మహిళలు అందుకు సిద్ధంగా ఉన్నా ప్రొసీజర్ విషయంలో డాక్టర్లు కాషియస్ గానే ఉంటున్నారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గర్భాశయ మార్పిడి వల్ల హెల్త్ పట్ల ఎలాంటి రిస్క్ ఉంటుందో పెద్దగా తెలియదు. అయినాగానీ మహిళలు ముందుకు వస్తున్నారు. దీనికి సమాధానం సింపుల్. పితృస్వామిక వ్యవస్థ వేళ్లూనుకున్న మన దేశంలో- ఆడవాళ్లు చచ్చీచెడీ పిల్లల్ని కనాల్సిందే అన్న భావన ఉంది. అందుకే వాళ్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకున్నా సర్జరీకి సరే అంటున్నారు.

గర్భాశయ మార్పిడి అంటే ఒకరకంగా సరోగసీ అన్నట్టే. కూతురి గర్భం కోసం తన గర్భాన్ని దానం చేసిన తల్లి- టెక్నికల్ గా సరోగసీ మదరే అవుతుందన్న వాదనలూ లేకపోలేదు.

ఏదేమైనా బలవంతంగా పిల్లల్ని కనాలని పట్టుపట్టడం నేటికీ కొనసాగుతున్న సాంఘిక దురాచారం అని మహిళా సంఘాలు అంటున్నాయి. లైఫ్ రిస్క్ తీసుకుని గర్భం దాల్చాల్సిన అవసరం ఏంటనేది వారి ప్రశ్న. పిల్లల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం ఆపేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.