కార్పొరేట్ స్కూలుకి దీటుగా రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల

0

అది పక్కా ప్రభుత్వ పాఠశాల. అయితేనేం. ఎన్ని రికమండేషన్లు చేసినా అడ్మిషన్ దొరకడం కష్టం. ప్రైవేటు స్కూళ్ల నుంచి కూడా విద్యార్థులు వచ్చి అందులో చేరుతున్నారు. కార్పొరేట్ కు దీటుగా విద్యా బోధన చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాఠశాల ముఖచిత్రమే మారిపోయింది.

మా ఫ్రెండ్ కొడుక్కి మీ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించండి- ఓ ఐఏఎస్ సిఫార్సు లేఖ. మాకు తెలిసిన వాళ్ల అమ్మాయికి ఒక్క సీటు కేటాయించండి- ఒక ప్రజాప్రతినిధి రికమెండేషన్. మా పిల్లాడిని వేరే ఎక్కడికీ పంపించం, మీ బడిలోనే చేరుస్తాం.. ప్లీజ్ అడ్మిషన్ ఇవ్వండి- ఒక పేరెంట్ విన్నపం. ఈ విజ్ఞప్తులన్నీ ఏ కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్ కోసమో కాదు. ఒక ప్రభుత్వ పాఠశాలకున్న డిమాండ్ ఇది. ఆ స్కూల్ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు ఖైరతాబాదులోని రాజ్ భవన్ ప్రాథమిక పాఠశాలలో సీటు దొరకాలంటే మాటలు కాదు.

సోమాజిగూడ రాజ్ భవన్ క్వార్టర్స్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఒకప్పుడు శిథిలావస్థలో ఉండేది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో భవనాన్ని ఖాళీ చేసి బడిని మక్తాకు తరలించారు. తర్వాత రూ.4.5 కోట్లు ఖర్చు పెట్టి 30 గదులతో మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు. గవర్నర్ నరసింహన్ ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా కృషిచేశారు. గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జూన్ 14న కొత్త భవనాలను ప్రారంభించారు. 

అప్పట్లో రాజ్ భవన్ లో స్కూల్లో 196 మంది విద్యార్థులు ఉండేవారు. స్కూల్ కొత్త బిల్డింగ్‌లోకి మారిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే 525 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. ప్రస్తుతం 721 మంది విద్యార్థులతో రాజ్ భవన్ స్కూల్ కళకళలాడుతోంది. ఇదే కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాలలోనూ అడ్మిషన్లు రెట్టింపయ్యాయి. గతంలో 200 మంది విద్యార్థులు ఉంటే.. ఇప్పుడా సంఖ్య 450 దాటింది.

పాఠశాలకు కొత్త భవనాన్ని నిర్మించడం, అధునాతన వసతులు కల్పించడం, గవర్నర్ నిత్యం పర్యవేక్షిస్తుండడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం ఏర్పడింది. దాంతో అడ్మిషన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్లు తీసుకున్న వాళ్లు కూడా క్యాన్సిల్ చేసుకొని ఇందులో చేరారు. బిల్డింగ్ కెపాసిటీ దాటిపోవడంతో చేసేదిలేక అడ్మిషన్లు నిలిపివేశారు. ఒక్కో తరగతిని మూడు సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్లో 50 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ అడ్మిషన్ల కోసం విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు.

రాజ్ భవన్ స్కూల్ కాంప్లెక్స్ లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా డిజిటల్ క్లాసులు, ఈ-లైబ్రరీలు, విశాలమైన తరగతి గదులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం 45 కంప్యూటర్లను సమకూర్చారు. ప్రస్తుతం ఆరుగురు ఉపాధ్యాయులు, 10 మంది విద్యా వలంటీర్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇది పూర్తిగా ఇంగ్లిష్ మీడియం స్కూల్. కొత్తగా చేరిన 525 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చినవారే కావడం విశేషం. సోమాజిగూడ, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తాలోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి భారీగా విద్యార్థులు రాజ్ భవన్ స్కూల్లో చేరారు. బర్కత్ పుర, కాచిగూడ, నారాయణగూడ, కవాడిగూడ లాంటి సుదూర ప్రాంతాల నుంచి సైతం విద్యార్థులు వస్తున్నారని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు.

ఇటు తల్లిదండ్రులు కూడా రాజ్ భవన్ స్కూల్ అద్భుతంగా ఉందంటున్నారు. స్కూల్లో విద్యా బోధనపై పేరెంట్స్ సంతృప్తిగా ఉన్నారు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తున్నారని తెలిపారు. రాజ్ భవన్ స్కూల్లో చేర్చిన తర్వాత తమ పిల్లల్లోచాలా మార్పు వచ్చిందంటున్నారు తల్లిదండ్రులు.

మొత్తానికి రాజ్ భవన్ పాఠశాల ఇతర ప్రభుత్వ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నది. మిగతా ప్రభుత్వ బడుల్లో కూడా మెరుగైన వసతులు కల్పించి, పర్యవేక్షణ పెంచడానికి సర్కార్ చర్యలు తీసుకుంటున్నది.

Related Stories

Stories by team ys telugu